Friday, August 31, 2012

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో దళిత సాహిత్యంపై సదస్సు


తెలుగులో దళిత సాహిత్యం – జాతీయ సదస్సు

శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మైసూరులోని భారతీయ భాషల సంస్థ సహకారంతో మూడురోజుల జాతీయ సదస్సును తెలుగులో దళితసాహిత్యం అనే అంశంపైన నిర్వహించింది. ఆచార్య మధుజ్యోతి తెలుగు శాఖ అధ్యక్షురాలు దీనికి సంచాలకులుగా ఉండి ఈ సదస్సును నిర్వహించారు. సిఐఐఎల్ నుండి డా. పరంధమ రెడ్డి గారు ప్రతినిధిగా వచ్చి ఆర్థిక వ్యవహారాలు చూస్తూ సదస్సునిర్వహణాభారాన్ని వహించారు.
మూడు రోజుల సదస్సు చాలా ఫలవంతంగా సాగింది. మొదటి ప్రారంభోత్సవానికి ఆచాహర్య మంజువాణి గారి శుభాకాంక్షల సందేశాన్నిచ్చారు. వ్యావహారిక భాషోద్యమ పితామహుడైన గిడుగు వేంకట రామమూర్తి గారి పుట్టిన రోజు అందునా తెలుగు భాషాదినోత్సవం రోజున ఈ సదస్సు ప్రారంభం కావడం విశేషం.
సదస్సులో మూడురోజుల్లో 62 పరిశోధన పత్రాలు వివిధ విశ్వవిద్యాలయాలనుండి కళాశాలలనుండి వచ్చిన పరిశోధకులు సమర్పించారు. దీని పైన చర్చ జరిగింది. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలైన, వచన కవిత, పద్యకవిత, నవల, కథ, నాటకం వంటి వాటిని వాహికగా చేసుకొని దళిత సాహిత్యం గడచిన మూడు దశాబ్దాలలో ఎలా సృజించబడింది అనే విషయాన్ని వివిధ పరిశోధన పత్రాలలో పరిశోధకులు చర్చించారు. ఇన్నిసాహిత్య ప్రక్రియలలో దళితుల జీవనాన్ని వర్ణించడం చాలా విశేషం. దళిత సాహిత్యం అనే ప్రత్యేక అస్తిత్వ సృహతో వచ్చిన ఇటీవలి సాహిత్యం మాత్రమే కాకుండా అంతకు ముందు కూడా అంటే జాషువ గారి వద్దనుండి వచ్చిన అప్పటి సాహిత్యాన్ని కూడా ఈనాటి దళిత దృష్టితో పునర్ మూల్యాంకనం చేయడం జరిగింది.
దళిత సాహిత్యానికి సమకాలీన సమాజంతో పూర్తి సంబంధం ఉంది. యదార్థంగా జరిగిన అకృత్యాలు దళితులపైని హింసాకాండ దళిత సాహిత్యం బాగా పదునెక్కడానికి కారణం అయింది. ఇది ఆక్రోశంతో రాసిన సాహిత్యంగా ప్రజల ముందుకు వచ్చింది. ఈ దళిత సాహిత్య సృజనం వల్ల దళితులలో ఆత్మగౌరవ స్థాయి పెరిగింది, ఆత్మన్యూనత తగ్గింది. ప్రశ్నించడం మొదలైంది. తిరుగుబాటు తప్పని సరి అని దళితులు గుర్తించారు. కులవృత్తి జీవన విధానం, ఆహారం, ఆహార్యం వంటి సాంస్కృతిక విషయాలు ఆత్మగౌరవ చిహ్నాలైనాయి. దళిత కళల ఆత్మగౌరవం పెరిగింది. ఈ అన్ని విషయాలను దళిత సాహిత్యం ఒడిసిపట్టి దానిలో ప్రతిబింబించింది.
దళిత జీవితాన్ని అక్షరబద్ధం చేసి చూసిన సాహిత్యం చాలా పరిమితంగా ఉంది. 59 కులాల జీవితాలలో రెండు కులాలు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించాయి. మరి పదిహేను కులాలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటే మిగిలిన దళిత కులాలు ఇంకా సాహిత్యప్రపంచంలోనికి ఎక్కనే లేదు. వారి జీవితాన్ని గురించి వర్ణించే సాహిత్యం ఏది ప్రజలకు చేరలేదు.
ఈ బ్లాగు కర్త పులికొండ సుబ్బాచారి మాదిగ కవిత్వం అస్తిత్వ గళం అనే పత్రాన్ని చదివి దానిలో మాదిగల వృత్తి జీవితం వారి సామాజిక అస్తిత్వాన్ని మాదిగలకోసం ప్రత్యేకించి రాసిన మాదిగ కవులు కవిత్వంలో ఎలా వ్యక్తం అయిందో ఏ సామాజిక పరిస్థితులు ఈ మాదిగ కవిత్వం రావడానికి కారణం అయిందీ వివరించాడు. మూడో రోజు తొలి సదస్సుకు అధ్యక్షత వహించి అధ్యక్షోపన్యాసం కూడా చేసాడు.
మూడు దశాబ్దాల దళిత సాహిత్యాన్ని ఒక్క సారి మూల్యాంకనం చేసిన ఈ సదస్సు మూడో రోజు 31 ఆగస్టున సాయంత్రం సమాపనోత్సవం చేసుకొని ముగిసింది. దీనిలో ఆచార్య కుసుమకుమారి (ఎస్కే యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి) ప్రధాన ప్రంసంగం చేశారు. దళిత సాహిత్యం పట్ల చక్కని అవగాహన కలిగేలా ప్రసంగించారు. దీనికి ఆచార్య మూలె విజయలక్ష్మి అధ్యక్షత వహించగా ఆచార్య మధుజ్యోతి సదస్సు నివేదికను సమర్పించారు. ఈ ఫలవంతమైన సదస్సులోని పత్రాలు అన్నింటినీ గ్రంథరూపంలో వెలువరిస్తామని కూడా ప్రకటన చేశారు.