Wednesday, May 8, 2013


తెలుగు జాతి కవులను గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటుంది. ఎందుకీ వివక్ష 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే జ్ఞానపీఠ పురస్కారం పొందిన రావూరి భరద్వాజను సముచితంగా గౌరవించింది. పదిలక్షల రూపాయిలను బహూకరించింది. అంతే కాదు సాంస్కృతిక శాఖ తన తరఫున రెండు లక్షల రూపాయిలను అందజేసింది. 
ఇంత వరకు ప్రభుత్వాన్ని అభినందించవలసిందే. కాని ఇది వివక్షాపూరితం అని చెప్పాలి. అంతే కాదు కవులను, రచయితలను గౌరవించే పద్ధతి కూడా ఇది కాదు అని చెప్పువలసి ఉంది. మిగతా రంగాల వారి ముందు కవులను అక్షర సేద్యంచేసే సృజన శీలురు అందరినీ తక్కువ చేయడం గా భావించ వలసి ఉంది. ఎందుకంటే బాడ్ మింటన్ ఆడే కళాకారిణికి ఒక అంతర్జాతీయ స్థాయి ఆటలో గెలిస్తే 50 లక్షల రూపాయిల బహుమతిని ప్రకటించింది ఈ ప్రభుత్వం. మరొక కబడీ కళాకారుడికి పాతిక లక్షల రూపాయిల బహుమతిని ప్రకటించింది. ఇంతకుముందు కూడా క్రీడాకారులకు ఇంత మొత్తంగా బహుమతులను ప్రకటించడం ఇండ్ల స్థలాలను అందించడం చేస్తూ ఉంది ప్రభుత్వం. కేంద్రప్రభుత్వం జ్ఞానపీఠ పురస్కారం పొందినవారికి పాతిక లక్షల ఇస్తున్నారనే వార్త ఆనందం కలిగించేదే. కాని క్రికెట్ క్రీడలో గెలిచిన క్రీడాకారులకు కోట్ల రూపాయిలు ఇచ్చి విదేశీ కార్లు ఇచ్చి రాజధానిలో ఇళ్ళ స్థలాలిచ్చి ఇన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. ఒక కవి ఒక రచయిత అత్యంత సృజనశీలుడై ప్రతిభావంతుడై జీవితాంతం చేసిన అక్షర శ్రమకు అత్యంత విలువైన అక్షర కళకు ఇచ్చే బహుమతి జ్ఞానపీఠ పురస్కారం అలాంటి వ్యక్తిని సాహిత్య స్రష్టను ప్రభుత్వాలు ప్రోత్సహించవలసింది ఇంతేనా. ఏం వాళ్ళు చేసే కృషి క్రీడాకారులు చేసే కృషికన్నా తక్కువా. నిజానికి క్రీడాకారులు సమాజనికి ఇచ్చేది ఎంత వారి వల్ల కలిగేది ప్రజలకు తాత్కాలిక మైన ఆనందం మాత్రమే. క్రీడాకారుల కృషి అప్పటికప్పుడే ముగిసి పోతుంది. కాని ఒక కవి చేసిన సాహిత్య కృషి తరాలు శతాబ్దాల పాటు ప్రజలను చైతన్యవంతులను చేస్తుంది. పఠనానందాన్ని కలిగిస్తుంది. క్రీడాకారులకు 50 లక్షలు కోట్ల రూపాయిలు ఇచ్చే కేంద్ర రాష్ట్ర్రప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి సాహిత్య కారులను జ్ఞానపీఠ వంటి అత్యంత ఉన్నత పురస్కారాలు పొందిన వారిని క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు తగ్గకుండా అంతకు ఎక్కువగా ఇచ్చి గౌరవించాలి. అలా కాకుండే ఒక బాడ్ మింటన్ క్రిడాకారిణికి 50 లక్షలు ఇచ్చి ఒక క్రికెట్ క్రీడాకారుడికి కోటి రూపాయలు ఇచ్చి జ్ఞానపీఠ పురస్కారం పొందిన వారికి పది లక్షలు ఇవ్వడం అనేది నిస్సందేహంగా సాహిత్యకారులను అవమానించడమే. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం, కేంద్రప్రభుత్వం కూడా మేల్కొనాలి కవులకు సాహిత్యకారులకు తగిన గౌరవాన్ని ఇవ్వాలి. కనీసం మన పొరుగు రాష్ట్రం కన్నడిగులు జ్ఞానపీఠ పురస్కారం పొందిన కువెంపు అనే కవికి ఎంత గౌరవం ఇచ్చిందో గ్రహించాలి. సుమారు పది కోట్ల విలువైన భవనాన్ని కట్టి అందులో ఆయన పేరిట సాహిత్య పరిశోధన కేంద్రం పెట్టారు. కోటి రూపాయిలతో ఆయన ఇంటిని నవీకరించారు. ఆయన పేరిట ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. తెలుగు జాతి కవులను సాహిత్యకారులను గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటుంది. ఇంకా ఎంత కాలం కావాలి. 
పులికొండ సుబ్బాచారి.