Friday, November 15, 2013

ఖమ్మం వీధుల్లో పరిమళం - హృదయ వైద్యునితో ఓ గంట.
ఖమ్మం వెళ్ళడం అంటే అక్కడి వీధుల్లో నడుస్తుండడం అంటే నాకెంతో ఇష్టం. ఏడాదికి ఒక్కసారైనా అలా ఖమ్మం వెళ్ళికి రాకపోతే ఏదో పోగొట్టుకున్నవాడిలా అయిపోతాను. ఖమ్మం వీధుల్లో నడుస్తుంటే అది వీధుల్లో నడవడం కాదు, నేను నా బాల్యంలో, కౌమారంలో, తొలియౌవనంలోనికి, తొలి ప్రేమసందడుల్లోనికి నడుచుకుంటూ వెళ్ళడమే. ఆమె కళ్ళు ఏవీధుల్లో జీవితాల్ని కొలుస్తూ తిరుగుతుంటాయో అనుకుంటూ నా కళ్ళు ఆ వీధులన్నీ ఆమె కళ్ళ కోసం గాలిస్తూ వెదికిన గుర్తులు అక్కడ ఇంకా చెదరకుండా ఉంటాయి. పగలంతా చెమటోడ్చి (దారు శిల్పం – అన్ని దారు పరికరాలు) అదే చెమటతోని ఈవెనింగ్ కాలేజికి అలా సైకిల్ పైన వెళ్తూ వెళ్ళిన రోజులు ఆ స్వేదపరిమళాన్ని మనసుముక్కుకు అందిస్తాయి.

బాబూ మియా టీ అంటే అదొక అనుభూతి. బాబూమియా అనే వ్యక్తి స్టేషన్ కి ఎదురుగా ఉన్న  అప్పటికి సన్నగా ఉన్న వీధిలో టీకొట్టు. అంటే మామూలు టీ కొట్టు కాదు. అతని చేతిలో ఏదో మాయ ఉంది. బొగ్గుల కుంపటి మీద  టీచేస్తాడు. అందులో అల్లం వేస్తాడు ఇంకేదో వేస్తాడు అతని మాయని. వేడివేడిగా అక్కడ బాబూమియా టీతాగడం ఖమ్మం వాసులకు అదొక అనుభూతి ఆ రుచిని ఎవరూ మరవలేరు. చాలా పెద్దవాళ్ళు అక్కడికి వచ్చి టీ తాగుతారు. కార్లు ఆపి బాబూ మియా టీ తాగి అక్కడినుండి ఆ ఉత్తేజంతో నిష్క్రమించడం అదొక భావన. అంతే కాదు ఈనాటికి బాబూమియా వారసులెవరో దాన్ని నడుపుతున్నారు. కాని ఆ పరిమళం లేదు. నేను అఫ్సర్ కబుర్లాడుకున్న ఆ ప్రభాత్ టాకీస్ కూలి పోయింది. ఏదో ఎక్కడో గాయం తగిలినట్లనిపించింది. ఆ వీధులన్నీ మారిపోయినయ్ పాతవాటిని కూల్చినయ్. తమను తాము వెడల్పు చేసుకున్నయ్ . జనసమ్మర్ధం బాగా పెరిగింది.

డా. ఎం.ఎఫ్ గోపీనాథ్ తో సంవాదం
నాకొక ఖమ్మం మిత్రుడు హృదయ వైద్యుడు  ఎం.ఎఫ్ గోపీనాథ్. భారత దేశంలో తొలి దళిత సామాజిక వర్గపు హృదయ వైద్యుడు. ఈయన హృదయాలను శోధించే హృదయ వేదనలకు స్పందించే భావుకుడు. నారచనలు ఆయన చదువుతుంటాడు. ఆయన రచనల్ని నేను చదువుతుంటాను. కలిసి ఒక దశాబ్దం పైగానే అయిందనుకుంటా. ఇటీవలి కాలంలో కలవలేదు. అయినా మేము మాట్లాడుకుంటూంటే రోజూ కలుస్తున్న వాళ్లం మాట్లాడుకున్నట్లే ఉంది. అదే వేవ్ లెంక్త్ అంటే... ఈసారి ఖమ్మంలో తప్పనిసరిగా కలవాలని ముందే అనుకున్నాం. 14 వ తేదీ ఆయనతో దాదాపు ఒక గంటపైగా గడపడం చాలా ఆలోచనలకు దారి తీసింది. ఇటీవలి ఆయన పుస్తకం "నాపొగరు మిమ్మల్ని గాయపరిచిందా అయితే చాలా సంతోషం". అనేది చాలామందిని బాగా ఆలోచింపజేసింది. మేము మాట్లాడుకున్న గంటసేపూ ఈ సామాజిక వేదనలగురించే.. మిత్ ని విశ్లేషించి సామాజిక వేదన తిరుగుబాటు వాటిలో ఎలా ఉందో తెలుసుకోవడం గురించి మాట్లాడుతూ మత రహిత సమాజం, జీవితం గురించ చాలా చర్చ చేశాము. జానపద శాస్త్రంలో పరసనల్ ఎక్స్ పీరియన్స్ నేరేటివ్స్ పైన పరిశోధన చేయడం ఈనాడు చాలా విస్తృతంగా జరుగూతూ ఉంది. దళితులకు సంబంధించిన ఇలాంటి నేరేటివ్స్ ని చాలా సేకరించాను. కాని ఇటీవలి కాలంలో ఒక దళిత ఎక్స్ పీరియన్స్ గోపీనాథ్ రాసినంత విస్తృతంగా ప్రభావవంతంగా రాలేదు. దీనిపైన మరింత అధ్యయనం అవసరమని ఇద్దరం గుర్తించాము.

మళ్ళీ ఖమ్మం పరిమళం గురించే మనసంతా భావనామయం అయింది. కవిత్వం చివ్వున లేస్తుంది ఖమ్మాన్నితలచుకుంటే. నేను, అఫ్సర్, సీతారాం, యాకూబ్ అందరం ఖమ్మం పరిళానికి తలవంచిన వారిమే..
పులికొండ సుబ్బాచారి.