Sunday, December 29, 2013

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి నేటికి ఏడాది దాటింది

ద్రావిడ విశ్వవిద్యాలయం

ఏవి తల్లీ నిరుడు మెరిసిన తెలుగు కిరణములు
నాలుగవ తెలుగు ప్రపంచ మహాసభలు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక పునరాలోకన

తెలుగు తల్లీ ఎక్కడమ్మా నీదు మల్లియలు

ఏవి తల్లీ నిరుడు కురిసిన సుమ సమూహములు

ఎచట తల్లీ నిరుడు పాడిన మెచ్చుగీతికలు

ఏల తల్లీ తెలుగు భాషకు ఈ దురదృష్టం

ఏవీ తల్లీ నిరుడు మెరిసిన తెలుగు కిరణములు

సరిగ్గా పోయిన ఏడాది ఇదేరోజు అంటే డిసెంబరు  29 న నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసాయి. డిసెంబరు 27 నుండి 29 దాకా మూడు రోజుల పాటు జరిగాయి. సాక్షాత్తు మహా మహిమ్ భారత రాష్ట్రపతి తిరుపతికి విచ్చేసి  ఈ మహా సభల్లో పాల్గొన్నారు. ఎన్నో కోట్ల రూపాయిల ప్రజాధనం ఖర్చు అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలోఉన్న తెలుగు వారు ఒక చోట చేరడానికి మంచి అవకాశం లభించింది. చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నారు. ఎన్నో తెలుగు ప్రదర్శన కళలు లలిత కళలు ప్రదర్శితమైనాయి. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమలు మూడు రోజుల పాటు చాలా అట్టహాసంగా చాలా ఆనందకరంగా జరిగాయి. సరే కొంత మంది అలగడం. మాకు తగిన ప్రాధాన్యం రాలేదని బాధపడడం ఇలాంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు ఎలాగూ ఉంటాయి. అలగే ఉండినాయి. అంత మాత్రమే కాదు. ఇలాంటివి జరిగినప్పుడు ఏలినవారి పక్షాన మనామనిగా ఎంపికలు జరగడం కూడా తోసివేయరాని విషయం.
సరే ఈ వేడుకలన్నీ ఆనంద కరమైనవే. వీటిని గురించి పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ దేన్ని గురించి ఆలోచించాలి. తెలుగు భాష సాహిత్యం సంస్కృతుల అభృద్ధికి, తెలుగు అధికారభాషఅమలు గురించి చేసిన వాగ్దానాలు ఎన్ని. వాటికి పట్టిన గతి ఏమిటి అనే ఆలోచించవలసిఉంటుంది. ఇది ప్రభుత్వాన్ని కాని లేదా కొందరు ప్రభుత్వాధికారులు కానీ విమర్శించడానికి చేసే ప్రయత్నం కాదు. తెలుగుకు పట్టిన ఈ దౌర్భాగ్యస్థితికి ప్రగాఢమైన బాధను వ్యక్తం చేయడానికి చేసే ప్రయత్నమే. ప్రభుత్వ ప్రతినిధిగా మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు కూడా చాలా వాగ్దానాలు చేశారు. ఆయన నిజంగా భాష పట్ల సాహిత్యం పట్ల మంచి నిబద్ధత ఉన్నవారు. మంచి పని చేయాలని తలపెట్టినవారు. కాని ఆయన ఒక అనుకోని తీరులో రాజీనామా కూడా చేశారు. సభల్లో చేసిన వాగ్దానాలు చేసిన పథకాలు ఏవీ అమలు కాక పోవడానికి కారణాలు ఏమిటి అని ఆలోచించవలసి ఉంది.
ఒక పక్క రాష్ట్ర విభజన ఉద్యమం జరుగుతుంది. తెలుగు జాతి తెలుగు భాష అని ఒక ఏకీకరణ భావంతో జరిగే ఈ మహాసభలు రాష్ట్రవిభజనకు అడ్డుపడతాయని తెలంగాణా వారు భావించారు. అక్కడనుండి చాలామంది కవులు కళాకారులు ఈ మహాసభలకు హాజరు కాలేదు. ఇది రాజకీయ కారణం. అయినా కొంత మంది హాజరయినారు. కొన్ని తెలంగాణా ప్రాంత జానపద కళారూపాలు కూడా ప్రదర్శితమైనాయి. ఇది సంతోషించ దగిన విషయమే.  ఈ మహాసభల్లో ముఖ్యమైన పథకాలు వాగ్దానాలు బయటికి వచ్చాయి. ముఖ్యమైనవి ఏమంటే అన్ని స్థాయిల్లోను తెలుగు అధికార భాషగా అమలు కావాలి. అవసరమైన చోట ఉర్దూ రెండవ అధికార భాషగా ఉంటుంది. ఈ ప్రయత్నం కొంత జరిగింది. న్యాయస్థానాలలో కూడా పూర్తి స్థాయిలో తెలుగు అమలు జరగాలని మరికొన్ని సభల్లో కూడా నిర్ణయాలు జరిగాయి. కాని దీని పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రభుత్వ పీఠమైన రాష్ట్ర సచివాలయంలోనే తెలుగు అమలు చాలా నిరాశాజనకంగా ఉంది. ప్రభుత్వ
ఉత్తర్వులు ఎన్ని తెలుగులో వస్తున్నాయి అనే విషయం వారే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇక రెండో ముఖ్యమైన విషయం పాఠశాల స్థాయిలో తెలుగు తప్పనిసరిగా ఒక అంశంగా ఉండాలి. ఈ నిర్ణయం ఆనాడే నిరాశను కలిగించింది. కారణం ఇంటర్ విద్య వరకు తెలుగు ఉండాలని తలపెట్టారు. కాని పది వరకైనా ఎన్ని పాఠశాలల్లో ఇది అమలు జరుగుతూ ఉందని ఏ విచారణైనా జరిగిందా. దీని అమలుకు పకడ్బందీ ప్రణాళిక విధానం రచితమైందా లేదు. అంతే కాదు ప్రైవేటు పాఠశాలల ఆగడాలను నిరోధించి తెలుగును తప్పని సరి భాషగా పెట్టేందుకు ఏదైనా కచ్చితమైన అదేశాలు వారికి చేరాయా అవి అమలు అవుతున్నాయా ఫలితం ఏమి జరిగింది.
నగరాలలో అన్ని పట్టణాలలో దుకాణాల ముందు అన్ని సంస్థల ముందు నామ ఫలకాలన్నీ తెలుగులో ఉండేలా ఆదేశాలు చేస్తామన్నారు. నాటి అధి కార భాషాసంఘం అధ్యక్షులు దీని అమలును గురించి చాలా శ్రద్ధగా చెప్పారు. చేశారు కూడా. కాని హైదరాబాదులో నగరంలోని ఏ దుకాణం ముందూ బోర్డులు తెలుగులోనికి మారలేదు. అదే కర్ణాటకలో అయితే స్వచ్ఛంద సంస్థలవారే ఇంగ్లీషులో ఉన్న బోర్డులు అన్నింటిపైన నల్లరంగుపూస్తారు. కన్నడంలో రాసినదాకా ప్రభుత్వం వారు కూడా ఊరుకోరు. ఈ అదృష్టం తెలుగుకు రావడానికి ఇంకా ఎన్నిదశాబ్దాలు ఎదురు చూడాలి. ఈ ఏడాది మొత్తం తెలుగు భాష సాంస్కృతిక  సంవత్సరంగా పాటించి విశేషకార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. కాని ఏమి జరిగింది. మూడు కళా వేదికలు అంటే ఆడిటోరియంల నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఆ దిశగాపని ఏమి జరుగుతూ ఉందో తెలియదు. ఇది యాదృచ్ఛికంగా తెలుగు వైతాళికుడు తెలుగు మహాకవి గురజాడ అప్పారావు నూటాఏభై యవ జయంతి. ప్రభుత్వం ఆయన కోసం కొన్ని మంచిసభలను నిర్వహించింది. మంచి కార్యక్రమాలు చేపట్టింది. కాని ఆయన కట్టుకున్న సొంత ఇల్లు ఆకుటుంబానికి దారిలేక అమ్ముకోవలసి వచ్చింది. దాన్ని కొనుకున్న వారు దాన్ని కూలగొట్టారు. ఇది తెలుగు వారు అందరినీ కలచివేసే అత్యంత దురదృష్ట ఘటన. ఏ భాషా రాష్ట్రంలోను ఇది జరిగి ఉండేది కాదు. ఏ మహాకవికీ ఇంతటి క్షోభకలిగేది కాదు. ఇది తెలుగు వాడైనందుకు గురజాడకు పట్టిన గతి.
ప్రపంచ మహా సభలు నిర్వహించి ఎన్నో ఊసులు చెప్పుకున్నాము. కాని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఏడాది గడిచి పోయింది. ఈ దురదృష్టానికి కారయణం ముఖ్యమైంది, తెలుగు జాతి ఎన్నడూ లేని రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడమే. రాష్ట్రం చీలి పోయే స్థితిలో అటు వారు కాని ఇటు వారు కాని చివరికి ప్రభుత్వం కాని భాషను గురించి పట్టించుకునే స్థితిలో లేదు. తెలంగాణా వారికి ముందున్న పెద్ద సమస్యవారికి రాష్ట్రం ఏర్పడడం ఆ సమస్య ముందు భాషకు సంబంధించినది వారికి చాలా చిన్న సమస్య అయింది. రాష్ట్రం వచ్చిన తర్వాత వారిదైన భాషా విధానాన్ని వారు ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక సర్కారాంధ్ర వారికి కాని రాయలసీమ వారికి కాని ముందున్న సమస్య రాష్ట్ర విభజనను అడ్డుకోవడం. ఈ సంకులసమరంలో తెలుగు భాషకోసం చేసుకున్న బాసలన్నీ నీటిలో కలిసినయ్. తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ కు చెందిన కేంద్ర సంస్థ ఇప్పుడు ఎక్కడికి రావాలనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. అది రెండు రాష్ట్రాలలో పని చేయవలసి వస్తుంది. తెలంగాణా వాడిగానే తెలంగాణా వాదిగానే నేను ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను.  రాజకీయంగా అధికార పరంగా పాలనా పరంగా తెలుగు వారు రెండు రాష్ట్రాలలో ఉండవచ్చు. ఇది వేరే విషయం కాని భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన విషయాలలో మనం ఇద్దరం అన్నదమ్ములం కొంత సంయమనం పాటించాలి రెండు రాష్ట్రాలలో ఉన్నంత మాత్రాన మాండలికాలు మారినంత మాత్రాన తెలుగు భాష రెండుగా చీలదు. అప్పుడు కూడా రాజమండ్రి నన్నయను, వరంగల్లు పోతన్నను రాయలసీమ పెద్దన్నను ఒకే భాషాసాహిత్య విమర్శ విధానాలతో చూడవలసి ఉంటుంది. అప్పుడూ తెలుగు సాహిత్యం ఒకటే అవుతుంది. తెలుగు తల్లికూడా రెండుగా చీలి తెలంగాణా తల్లి, ఆంధ్రమాతగా రెండుగా అవతారాలెత్తవలసిన అవసరం లేదు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడి ప్రణాళికలు వేసుకోవచ్చు. ఉమ్మడి విధానాలు అవలంబించవచ్చు. రాష్ట్రం ఎలాగూ పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానినికలిగి ఉంటుంది కాబట్టి తెలుగు క్లాసికల్ సంస్థ రాజధానిలోనే పెట్టుకొని ఇరు ప్రాంతాల వారు కలిసి ఉమ్మడి ప్రణాళికలు వేసుకోవచ్చు. అదే సమయంలో తెలంగాణా మాండలికాలకు రాయలసీమ మాండలికానికి కళింగాంధ్ర మాండంలికానికి తగిన విధంగా పెద్ద పీట వేసుకొని పరిశోధనలు చేయవచ్చు.
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి ఏడాది గడిచిపోయింది. అయినాఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది.  ఎవరినీ నిందించకుండా రెండు ప్రాంతాల వారు భాషాసాహిత్యాలకు సంబంధించి అధికార భాష అమలుకు సంబంధించి ఉమ్మడి ప్రణాళికలు వేసుకోవలసిన సమయం ఇది. ఇది ఎవరినో తప్పుపట్టడానికి కాకుండా తెలుగు భాషకు పట్టిన దురదృష్టానికి బాధపడుతూ రాసేది. భాషా సాహిత్యాల విషయంలో ఇద్దరు అన్నదమ్ములు మరింత సహనంతో సంయమనంతో పని చేయవలసిఉంది. చేసిన బాసలను తిరిగి ఆలోచించుకోవలసిన సమయం కూడా ఇదే.

Monday, December 16, 2013

Telugu Poetry in Internet Medium

పులికొండ సుబ్బాచారి

తెలుగు కవిత్వం మాధ్యమ పరిణామం, గుణాత్మక పరిణామం

కవిసంగమం ప్రయోగం కవిసంగమం ప్రగతి చారిత్రకం అవుతుంది

కవిసంగమం చిన్ని ప్రయత్నంతో ప్రారంభం అయింది. నా తమ్ముడు యాకూబ్ దీనికి నాంది పలికాడు. ఇంటర్ నెట్లో ఉన్న సౌకర్యన్ని వినియోగించుకొని ఫేస్ బుక్ చేస్తున్న వివిధమైన సామాజిక చాలనాలను (సోషల్ డైనమిక్స్) గమనించి తెలుగు కవులకు ఒక మంచి వేదికగా దీన్ని మలచుకోవచ్చు అనే ఆలోచన ఇతనికి కలిగింది. ఒక ప్రయత్నం చేశాడు. అతనికి వ్యక్తిగతంగా గడచిన పాతిక ఏండ్లుగా పరిచయమైన కవి ప్రపంచాన్ని ముఖ్యంగా ఇప్పుడిప్పుడే గొంతువిప్పుతున్న వారు ఆధునిక నెట్ ప్రపంచాన్ని తెలుసుకున్నవారు అయిన యువతీ యువకులైన కవులను ఒకచోటికి తేగలిగాడు. ఈ రెండు సంవత్సరాలలో ఇది బాగా వ్యాప్తి చెందినది. నాకు తెలిసిన వివరాల ప్రకారం 200 మందికి పైగా కవులు ఈ వేదికలో పాలుపంచుకుంటున్నారు. కవిసంగమం ముఖపుస్తకం ఇప్పటికే సాధించిన ప్రగతి (విజయం అని అనడం లేదు)ని తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు. ఇది చాలా ప్రముఖమైనది చారిత్రకమైనది అవుతుంది.
తెలుగులో ఒక కవి సుమారు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు కవిత్వం రాసి లేదా ఒక ఏడాదిలో రాసిన కవితలను అన్నింటిన ఒక కవితా సంకలనంగా తెచ్చి, మరికాస్త కష్టపడి దానికి డబ్బుఖర్చూ పెట్టి పుస్తకావిష్కరణ చేయిస్తాడు. ఎవరో ఒక మంచి అనుభవజ్ఞుడో పేరున్నవాడో వచ్చి దాన్ని ఆవిష్కరిస్తాడు. రెండో రోజు పేపర్లో వార్త వస్తుంది. కాని ఆ పుస్తకాన్ని ఎవరు చదువుతారు. సదరు కవే ఒక వంద కాని రెండు వందల కాపీలు కాని తనకు తెలిసనవారికి పోస్టులో, ఆఖర్చులూ ఆయనే పెట్టుకొని పంపిస్తాడు. ఆ వందమందిలో కనీసం ఒక పాతిక మంది దాన్ని చదువుతారో లేదో. అందులో ఒక నలుగురు ఆయిదుగురు కాస్త వ్యక్తిగత క్రమశిక్షణ, మంచి బుద్ధీ ఉన్నవారు. మీ కవితలు బాగున్నాయని ఒక నెలకో ఏడాదికో ఉత్తరం రాస్తారు. దానికి ఈ అల్పసంతోషి అయిన కవి ఎంతో సంతోషిస్తాడు.
తెలుగు కవులకు నిన్న మొన్నటిదాకా ఉన్న పరిస్థితి ఇది. కాని కవి సంగమం ఈ పరిస్థితిన బద్దలు కొట్టింది. ఈ పరిస్థితిని బద్దలు కొట్టింది నిజానికి ఫేస్ బుక్ అంటే అంతర్జాల పరిజ్ఞానం. ఈ పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టి ఆధునిక తెలుగు కవిత్వానికి దీన్ని ఒక వేదికగా మలచిన ఘనత నిస్సందేహంగా యాకూబ్ కు దక్కుతుంది. దీనితర్వాత కవిసంగమంలో భాగం కాని వారు కూడా ఫేస్ బుక్ లో తమ కవిత్వన్ని పెడుతున్నారు. బ్లాగుల్లో పెడుతున్నారు. ఈ కవితలు కూడా భాగస్వామ్యం రీత్యా కవిసంగమంలోనికి వస్తున్నాయి. అంతే కాదు గూగులమ్మ ను అడిగి తెలుగు కవిత్వాన్ని గురించి తెలుసుకోవలనుకున్నవారికి కూడా కవిసంగమంలోని కవుల వివరాలు కవితలు అందుబాటులోనికి వస్తున్నాయి.
ఒక కవి తన కవితను రాసిన తర్వాత ఏ మాత్రం ఎడం లేకుండా అంటే రాత్రి కవితను రాస్తే తెల్లవారి పాటికి తన బృందంలోని సుమారు 200 మంది కవిత్వంపైన ప్రేమ ఉన్న పాఠకులకు అందేలా చేస్తున్నాడు. ఇది ఫేస్ బుక్ వేదిక మీద సాధ్యం అవుతూ ఉంది. అంతే కాదు దీని విజయం ఏమంటే ఆకవికి చాలా విలువైన అభిప్రాయ మాల మరుసటి రోజు సాయంత్రానికి తెలిసి పోతూఉంది. ఒక కవితకు సుమారు వందకు పైగా అభిప్రాయ ప్రకటనలు ఒక్కరోజులో రావడం ఒక్కరోజులో కొన్ని వందలమంది సాధారణ పాఠకులు కాక కవిత్వం కోసం ఉన్న ప్రత్యేకమైన పాఠకులు ఆ కవితను చదవడం మామూలు విషయం కాదు. ఆ కవికి వచ్చే ప్రోత్సాహం కాని సంతోషం కాని ఇంతకు ముందు సంప్రదాయ పద్ధతుల్లో అచ్చుపుస్తకం ద్వారా రావడం అన్నది కలలో కూడా ఊహించడానికి సాధ్యం కానిది. కవికి వచ్చే స్థితిని కాస్సేపు పక్కకు పెట్టి కవిత్వానికి వచ్చే స్థితిని గురించి ఆలోచిస్తే మరింత సంతోషకరంగా కనిపిస్తూ ఉంది. కవిత్వ వ్యాప్తి ఇబ్బడి ముబ్బడిగా మునుపెన్నడూ లేని వేగంతో వ్యాప్తి చెందుతూ ఉంది. ఇది తెలుగు సాహిత్య కారులు అందరూ సంతోషంగా గర్వించదగిన విషయం.
మరొక ముఖ్యమైన తెలుసుకోవలసిన విషయం ఏమంటే.. తెలుగు కవిత్వం ఒక కొత్త శకంలోనికి ప్రవేశించింది అని చెప్పాలి. తెలుగు కవిత్వం ఇప్పటిదాకా రెండు మాధ్యమాలలో ప్రవర్తిస్తూ ఉంది. అది ఒకటి మౌఖిక మాధ్యమం రెండోది లిఖిత మాధ్యమం. ఈ రెండు కలిసిన మిశ్రమాధ్యమంలో కొన్ని కవితా ప్రక్రియలు ప్రవర్తించాయి. అవి శతకాలు, తత్త్వాలు వాగ్గేయకారుల పాటలు. కాని అంతర్జాలం కారణంగా మరొక మాధ్యమం వచ్చింది అది ఎలక్ర్టానిక్ మాధ్యమం దీన్నే విద్యున్మాధ్యమం అని అనాలి. ఇది ఎలా ప్రత్యేక మాధ్యమం అయిందో చెప్పవచ్చు. ఒక కవి తన కవితను బ్లాగులో కాని ఫేస్ బుక్ లో కాని రాస్తున్నాడు అంటే ప్రచురిస్తున్నాడు. అతని పాఠకులు కూడా ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే చదువుతున్నారు. దానిపైని అభిప్రాయాలు కూడా అదే మాధ్యమంలో విస్తరిస్తున్నాయి. అదే మాధ్యమంలో కల కాలం నిలబడుతున్నాయి. అంటే ఇక్కడ కవిత్వం పుట్టుక, వ్యాప్తి నిలకడ అనేవి మొత్తం ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానే జరుగుతూ ఉన్నాయి. ఈ కారణంగా తెలుగు కవిత్వం పూర్తిగా నూతన ప్రసార మాధ్యమంలోనికి చేరిందని చెప్పవచ్చు. ఇది నూతన మాధ్యమంగా నూతన యుగంగా చెప్పుచ్చు. అంతే కాదు ఈ ఆధునిక అంతర్జాల సాంకేతిక కారణంలో తెలుగుకవిత్వంలో గుణాత్మక పరిణామం కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఇటీవలికాలంలో కవిసంగమం సభ్యుడైన వంశీధర రెడ్డి రాసిన కవితలు, అఫ్సర్, యాకూబ్ రాసిన కొన్ని కవితలు, దెంచనాల శ్రీనివాస్ మరీ ఇటీవల ప్రకటించిన భస్మసారంగి కవితలు చూస్తుంటే ఆధునిక సాంకేతికత ఆధునికత ఎంతగా తెలుగు కవిత్వాన్ని ప్రభావితం చేస్తూ ఉందో తెలిసి సంతోషం కలుగుతూ ఉంది. ఇందువల్ల తెలుగు కవిత్వం మూడో మాధ్యమంలోనికి ప్రవేశించినదని చెప్పవచ్చు.  తెలుగు కవిత గుణాత్మక పరిణామాన్ని, మాధ్యమ పరిణామాన్ని పొందినదని మూడో మాధ్యమంలోనిక ప్రవేశించినదని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది.
అయితే కవి సంగమం కన్నా ముందే కొన్ని బ్లాగు పత్రికలు తెలుగు కవిత్వాన్ని అంతర్జాల ప్రపంచంలోనికి తీసుకుపోయాయి. పన్నెండు సంవత్సరాలుగా వస్తున్న తెలుగు బ్లాగు పత్రికలు మనకు ఉన్నాయి. ఈమాట, అనే పత్రిక వీటిలో చాలా పాతదిగా కనిపిస్తూ ఉంది. బ్లాగుల హారాలు జల్లెడ, కూడలి కూడా తెలుగు కవిత్వానికి మంచి వ్యాప్తిని తీసుకువచ్చాయి. వీటి ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేము. ఇటీవల వచ్చిన సారంగ,  వాకిలి, విహంగ వంటి పత్రికలు కూడా మంచి వ్యాప్తికి కారణం అవుతున్నాయి. కాని బ్లాగుకు కొన్ని పరిమితులున్నాయి. అవేమంటే నాకు ఒక బ్లాగు ఉందన్న సంగతి తెలిసిన వారు నా గురించి తెలిసినవారు మాత్రమే నా బ్లాగులో ఉన్న కవితలను చదువుతారు. అక్కడ ఒక సమాజం అనేది ఉండదు. మూకుమ్మడిగా ఒకే సారి ఒక గుంపుగా అందరికీ చేర్చే వీలు ఉండదు. కాని ఫేస్ బుక్ గ్రూపులో ఈ సౌకర్యం ఉంది. తెలుగు పదం అనే ఒక గూగుల్ మెయిల్ గ్రూపు ఒకటి తెలుగు పదాల నూత్న కల్పనలను గూర్చిన ప్రయోగం చేసింది. అది ఇంకా జరుగూతూనే ఉంది. కాని మెయిల్ గ్రూపు కవిత్వ వ్యాప్తికి అంతగా అనువైనది కాదు. కాని ఫేస్ బుక్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న గూగుల్ ప్లస్ లో కూడా కవిసంగమంలాంటి ప్రయోగం చేయవచ్చు. నేను కూడా బ్లాగు తయారు చేసి దానిలో వ్యాసాలని కవితలను ప్రచురించడం దాదాపు ఆయిదు సంవత్సరాల క్రితమే చేసాను. దాదాపు రెండు వేలమందికి పైగా పాఠకులు నా బ్లాగును చదినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పైన చెప్పినట్లుగా బ్లాగుకు, ఫేస్ బుక్ కు ఉన్నంత చాలన గుణం (డైనమిజమ్) ఉండదు. కవిత్వ వేదికగా ఫేస్ బుక్ ప్రయోగం చాలా విజయవంతం అయినదని చెప్పవచ్చు. ముఖ్యంగా కవిసంగమం ప్రయోగం తెలుగు కవిత్వానికి కొత్త ఒరవడిని సృష్టించింది.
అంతర్జాలాన్ని ఈసడించేవారు. ఆఁ దాన్ని ఎవరు చూస్తున్నారు అనేవారు, దాన్ని అసహ్యించుకునేవారు మనకున్నారు. పెద్దతరం వారిని తప్పు పట్టడం కాదు కాని వారి కాలానికే అందు బాటులో ఉన్న సాంకేతికను ఆహ్వానించ లేకపోవడం వల్ల వారిని వారు వెనుకటి కాలానికి పోయిన వారుగా ప్రకటించుకుంటున్నట్లు లెక్క. ఇక సమక్షంలో పొగడి వెనుకనుండి తెగడే గోడమీది పిల్లులు కూడా మనకున్నాయి. వారిని ఉజ్జగించడంమంచిది. కాని పెద్దతరంలో కూడా కొందరు ఇంటర్ నెట్ ప్రభావాన్ని ఫేస్ బుక్ సామాజిక పరిణామ శక్తిని గ్రహించిన వారున్నారు. తెలుగు కవిత్వానికి కూడా ఒక కొత్త మాధ్యమం కొత్త యుగం వచ్చినదని గ్రహించినవారున్నారు. మొదట ఫేస్ బుక్ ప్రయత్నాన్ని కవిసంగమిన్ని నిరసించిన వారు కూడా క్రమంగా దీని శక్తిని గ్రహిస్తున్నారు. ఇది ఒక కొత్త ఒరవడి అని తెలుసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. నిన్నగాక మొన్న జరిగిన కవిసంగమం కవిత్వపు పండుగ చాలా ఆనందాన్ని కలిగించింది. కొత్త తరం సంగతి అలా ఉంచి పాత తరానికి కూడా అంతర్జాల మాధ్యమానికి ఉన్న శక్తిని గురించి తెలుగు కవిత్వపు కొత్త ఉనికిని గురించి తెలియజెప్పడంలో ఈ పండుగ సఫలం అయిందని భావించవచ్చు. కవిసంగమం రూపకర్త యాకూబ్ ని దీనికోసం నిరంతరం పనిచేస్తున్న ఇతర కార్యకర్తలను ఈసందర్భంగా నేను అభినందిస్తున్నాను. తెలుగు కవిత్వం మూడో మాధ్యమంలోనికి కొత్త యుగంలోనికి ప్రవేశించినదని ఎలక్ట్రానికి మాధ్యమాన్ని అంటే విద్యున్మాధ్యమాన్ని ప్రత్యేక మాధ్యమంగా గుర్తించి, తెలుగు కవిత్వంలో విద్యున్మాధ్యమ కవిత్వాన్ని ప్రత్యేకంగా గుర్తించి పరిశీలించాలని ఇక్కడ నేను ప్రతిపాదిస్తున్నాను.

పులికొండ సుబ్బాచారి.