Saturday, January 25, 2014

PADMASRI TO KOLAKALURI ENOCH

కొలకలూరి ఇనాక్ గారికి పద్మశ్రీ తెలుగు సాహిత్యానికి సరికొత్త కిరీటం

తెలుగు సాహిత్యకారులు  సాహిత్య ప్రేమికులు అందరూ చాలా ఆనందించవలసిన రోజు. భారత ప్రభుత్వం కొలకలూరి ఇనాక్ గారికి పద్మశ్రీని ప్రకటించడం ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక మణికిరీటాన్ని పెట్టినట్లు అయింది. ఇది ఒక వ్యక్తికి కాక అణగారిన వర్గాలకోసం కన్నీరు చిందించిన, సామాజిక దురన్యాయాలను ఎదిరించిన ఒక మహా శక్తికి ఇది ఒక సన్మానం అని మాత్రమే నేను చెప్పడం లేదు. ఇంత ఆలస్యంగా నైనా ఇంతటి మహాశక్తిని గుర్తించడంలో చేసిన లోపాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసిందిని చెప్పదలచుకున్నాను. అంతేకాదు తెలుగు సాహిత్యానికి పద్మశ్రీ రాక ఎన్నో దశాబ్దాలయింది. ఇనాక్ గారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా చేసిన అక్షర సేవకు ఇది చాలా ఆలస్యంగా లభించిన గౌరవంగా దీన్ని చెప్పాలి. నిజానికి పద్మశ్రీ ఆయనకు చాలా చిన్నది పద్మ పురస్కారాల క్రమంగా అన్నింటికి ఉన్నతమైనదాన్ని ఈయనకు ఇవ్వవచ్చు. ఇనాక్ గారు సృష్టించిన కథలు నవలలు వాటిలోని దగా పడ్డ పాత్రలు సమాజంలో చిరకాలం చిరంజీవిగా ఉంటాయి. తెలుగు కథకు అందునా వ్యథాభరిత దగాజీవితాలసజీవ చిత్రణకు చిరకాల చిరునామా గా అవి ఉంటాయి. ఇనాక్ ఆధునిక తెలుగు సాహిత్య శిఖరాలలో ఒకరు.
తెలుగులో మరొక దారుణమైన క్రమం ఉంది. తెలుగులో సాహిత్య పైరవీకారులకు చాలా బలం ఉంది.  పది పైసల ప్రతిభతో పది రూపాయిల పైరవీ చేసి వందరూపాయిల అవార్డులు కొట్టేసే వారున్నారు. వారి పైరవీ బ్రతుకు అందరికీ తెలిసిందే. కాని ఇనాక్ గారికి ఇంత ఆలస్యంగా  ఈ పురస్కారాన్ని ఇస్తున్నందుకు రెండు ప్రభుత్వాలు కాస్తంత గిల్టీగా భావిస్తున్నాయని నేను భావిస్తున్నాను. వచ్చే సంవత్సరం వారికి పద్మవిభూషణ్ వస్తే వారికి న్యాయం జరిగినట్లుగా భావించవచ్చు. వారి రచనలు అన్నింటిని ప్రభుత్వంవారు ప్రచురించాలి. ఇనాక్ పేరిట ఆయన చేసిన సామాజిక చింతన కోసం ఒక అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేయాలి. దీనితోనే ఏ సామాజిక వేదనను తీర్చడానికి ఇనాక్ నాలుగు దశాబ్దాలు అక్షర యజ్ఞం చేశారో దాని విలువను ఈ పీఠం కొనసాగిస్తుందని భావిస్తాను.

పులికొండ సుబ్బాచారి.