కులం కాలకూట విషం కక్కిన కథలు
సాహిత్యం తొలుత మౌఖికంగా చాలా సుదీర్ఘమైన కాలం జీవించిన తర్వాతనే లిఖిత
సాహిత్యం అయింది. ఇది అన్ని భాషలకు వర్తిస్తుంది. కథ అనేది మనిషి భాష నేర్చిన
తొలినాళ్ళలో సృష్టించుకున్న వాగ్రూప కళలలో (వెర్బల్ ఆర్ట్స్) చాలా మంచి కళ. ఈ కళ
ఇప్పటికీ కొనసాగి వస్తూ ఉంది. భారత దేశంలో 1650 దాకా భాషలు వాటి వివిధ స్వతంత్ర మాండలికాలున్నట్లు
లెక్కలబట్టి తెలుస్తూ ఉంది. కాని ఇందులో సంపూర్ణమైన లిపి ఉండి పరివర్థితమైన
సాహిత్యం ఉండి కేవలం 25 భాషలకు లోపునే. అంటే ఒక భారత
దేశంలోనే దాదాపు 1600 లకు పైగా భాషలకు ఇంకా లిపి లేదు ఇంకా
ఇవి మౌఖిక స్థితిలోనే ఉన్నాయి. కాని లిఖిత సాహిత్యం ఉన్న భాషలలో ఉన్నా చాలా
సాహిత్య ప్రక్రియలు ఈ మౌఖిక భాషలలో కూడా ఉన్నాయి. అంతే కాదు వీటిలో కూడా రామాయణ
భారతాలు ఇతర పురాణేతిహాస సాహిత్య ఉంది. ఇక్కడ మనకు కథా సాహిత్యం ప్రసక్తాంశం.
పరివర్థితమైన లిపి పరివర్థితమైన సాహిత్యం ఉన్న భాషలలో కూడా మౌఖిక మాధ్యమంలో ఇంకా
చాలా కథా సాహిత్యం ఉంది. వీటిలో చాలా కథలు ఇంకా పుస్తకాలకు కూడా ఎక్కలేదు. ఏవో
కొన్ని కథలు మాత్రమే ఎక్కాయి. అలా పుస్తకాలకు ఎక్కి అయినా ఇంకా మౌఖిక మాధ్యమంలో
బాగా ప్రచారంలో న్న తెలుగు కథా సాహిత్యంలో బాగా చెప్పుకోవాల్సిన కథలు మర్యాదరామన్న
కథలు, పరమానందయ్య శిష్యులు కథలు, తెనాలి రామలింగని కథలు, కాశీ మజిలీ కథలు
ముఖ్యమైనవి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మౌఖిక మాధ్యమంలో ఉన్న కథలలో మన సంస్కృతి
బాగా నిబిడీకృతమై ఉంది. పైకి వినోదాత్మకంగా కనిపించే కథలలో అత్యంత లోతైన సాంఘిక
విమర్శ ఉంది. కొన్ని కులాలపైన విషం కక్కడం కూడా ఈ కథా సాహిత్యంలో కనిపిస్తుంది.
ఇలాంటి కథలు విషం చిమ్ముతూ నేటికీ ఇంకా చాలా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒక కథను
ఇక్కడ ప్రస్తావించి ఇలాంటి కథలను ఏం చేయాలి అనే చర్చను పాఠకలోకానికి విడిచి
పెట్టడం ఇక్కడి లక్ష్యం. తెనాలి రామలింగడి కథల పేరుతో చాలా కథలున్నాయి. వాటిలో ఒక
కథను నేను ఇటీవల సేకరించిన దానిని ఇక్కడ రాస్తున్నాను. కథను వివరంగా చూడనిదే
దీనిపైన విశ్లేషణ రాయడం కుదరదు. కథను క్లుప్తంగానైనా దాని నిర్మాణం చెడకుండా విషయం
పోకుండా కింద చర్చ కోసం ఇస్తున్నాను.
“కృష్ణ దేవరాయలు వారు పరిపాలించే కాలంలో కళకలకే కాక వృత్తి
నైపుణ్యాలు ప్రదర్శించిన వారికీ ఎంతో గౌరవం కీర్తి లభిస్తుండేది. ఒకానొక రోజు
కృష్ణదేవరాయలవారు పొద్దున్నే చేసే వ్యాయామాలు అన్నీ పూర్తి చేసుకొని కాస్త
విశ్రాంతిగా కూర్చొని తనకు గడ్డం చేసే రాచమంగలి (నాయీ బ్రాహ్మణుడి) కోసం అంటే
రాజుగారికే సేవచేసే వాని కోసం ఎదురుచూస్తున్నాడు. ఉన్నతాసనం పైన సేదతీరి ఎదురు
చూసే రాజుకు జరిగిన ఆలస్యం తెలియిరాలేదు. కాస్తంత అలసిపోయి ఉన్నాడేమో సన్నగా
కునుకు పట్టింది. ఆసనంలో జారగిలబడి కునుకుతీసారు రాజుగారు. మంగలి కొండోజి (ఇతను
చారిత్రక పురుషుడుగా కృష్ణరాయల ఆస్థానంలో ఉన్నట్టుగా చాలా చారిత్రక ఆధారాలు
దొరికాయి) అయిన ఆలస్యానికి ఆదుర్దా పడుతూ రాజుగారి సేవకు వచ్చాడు. భటులు కూడా
ఆందోళనగా అతనికోసం చూస్తున్నారు. రాజుగారికి ఎక్కడ కోపం వస్తుందో అని. కొండోజి
రావడం తోనే భటులు లోనికి అనుమతించారు. కాని కొండోజి రాజుగారిని చూసే సరికే
నిద్రించి ఉన్నారు. కాని కొండోజి తన వృత్తి నైపుణ్యాన్ని అత్యంత ఉన్నత స్థాయిలో
ప్రదర్శించాడు. నిద్రించే రాజుకు ఏమాత్రం నిద్రాభంగం కలగకుండా అతని గడ్డానికి
జుట్టుకు రాసే తైలాలు రాసి, పూతలు పూసి గడ్డం చేసి మీసాలు సవరించి తిరిగి
వెళ్ళిపోయాడు.
ఒక గంట తర్వాత రాజుగారికి మెలకువ వచ్చింది. ఎవరక్కడా అని పిలిచి కొండోజిని
రప్పించండి ఎందుకు ఆలస్యం చేశాడు అని అడిగాడు. భటులు ‘మహారాజా మంగలి కొండోజి
వచ్చి తమరికి గడ్డం చేసి వెళ్ళాడు’. అని చెప్పారు. రాజుగారు
అద్దాన్ని తెప్పించాడు. ఇద్దరు యువతులు ఆయన ముఖం ఎదుట అద్దాన్ని తెచ్చి చూపారు.
తనకు అత్యంత సుందరంగా గడ్డం చేసి మీసాలు కత్తిరించి సరిచేసి ఉన్నాయి. చేయి పెట్టి
తడిమి చూసుకున్నాడు రాజుగారు. ఆశ్చర్య పోయారు. మంగలి కొండోజి నైపుణ్యాన్ని
శ్లాఘించడానికి అతనికి మాటలు రాలేదు. వెంటనే కొండోజిని పిలిపించారు రాజుగారు.
కొండోజీ నీ నైపుణ్యాన్ని కళను మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని ఆజ్ఞ వేశారు.
“మహారాజా నన్ను బ్రాహ్మణుడుగా మార్చండి కవిగా చేయిండి మీ ఆస్థానంలో
అష్టదిగ్గజాలలో చోటు కల్పించండి” అని వినయ పూర్వకంగా కోరిక
కోరాడు కొండోజి. ఈ కోరిక విని నిర్ఘాంత పోయాడు రాజు. ఇతను మడి మాన్యాలు కావాలని ఊళ్ళు
కావాలని ధన ధాన్యాలు కావాలని కోరతాడని ఆశించాడు రాజుగారు. కాని ఇలాంటి కోరిక కోరడం
చకితుడిని చేసింది రాజును. కాని మాట ఇచ్చిన తర్వాత తప్పేవాడు కాదు కదా రాజు.
వెంటనే పది మంది వేద మంత్రాలలో సకల శాస్త్రాలలో దిట్టలైన బ్రాహ్మణులను రప్పించి.
ఇతనికి అన్ని విద్యలు నేర్పించండి మంత్ర తంత్రాలు నేర్పించండి బాగా పుణ్యనదులలో
నీరు తెచ్చి స్నానాలు చేయించండి అన్నీ చేసి ఇతన్ని బ్రాహ్మణుడుగా మహాకవిగా
మార్చండి అని ఆజ్ఞవేశాడు రాజుగారు.
ఇక రాజుతలచుకుంటే దెబ్బలకు కొదవే ముంది అన్నట్టు పది పదిహేను మంది బ్రాహ్మణులు
మంగలి కొండోజికి సకల శాస్త్రాలు పురాణాలు నేర్పుతున్నారు. పద్య
విద్యనునేర్పుతున్నారు. అన్ని పుణ్యనదులలోని నీరు తెచ్చి యజ్ఞాలు చేసి అతనికి
పుణ్యస్నానాలు చేయిస్తున్నారు. కొండోజి కూడా చాలా కుశాగ్రబుద్ధితో అన్ని
శాస్త్రాలు అవలీలగా నేర్చుకుంటున్నాడు. నెల రోజులు గడిచే సరికేనే ఆశువుగా పద్యాలు
అల్లడం నేర్చుకున్నాడు.
మంగలి కొండోజి అన్ని విద్యలు నేర్చుకొని కవిగా మారుతున్నాడని రాజుగారి
కొలువులో చేరి కవుల సరసన కూర్చుంటాడనే వార్త దావానలంలా అన్ని చోట్ల వ్యాపించింది.
బ్రాహ్మణులలో ఆందోళన మొదలైంది. మన మధ్య ఇతను
కూర్చుని కవిత్వం చెబుతాడా
పవిత్రమైన రాజ సభలో ఇతను వచ్చి మా సరసన కూర్చుంటాడా అనే ఊహే వారికి
భరించరానిది అయింది. దీనిపైన ఏం చేయాలన్నా వారికి తోచలేదు. రాజు దగ్గరికి పోయి
ఆయనకు వేడుకుని బాధను చెప్పుకునే ధైర్యం ఎవరికీ రాలేదు. చివరికి అందరూ కలిసి ఒక
నిర్ణయానికి వచ్చారు.
బ్రాహ్మణలు కవులు, పండితులు అందరూ కలిసి తెనాలి రామలింగడి దగ్గిరికి పోయారు. జరుగుతున్న
అపచారాన్ని ఘోరాన్ని రామలింగ కవికి వినిపించారు. రాజుగారికి దగ్గరిగా ఉండేది మీరే
కాబట్టి ఈ అనాచారం జరగకుండా మంగలి కొండోజి రాజ సభకు రాకుండా మీరే అడ్డుకోవాలి అని
చెప్పుకున్నారు. సరే నాకూ తెలుసు. నేను ఏం చేయాలో అది చేస్తాను అని రామలింగ కవి
అన్నాడు, బ్రాహ్మణ పండితులు వెళ్ళి పోయారు.
తర్వాత ఒక రోజున తెనాలి రామలింగడు తన ఇంట్లో ఉన్న నల్ల కుక్కను తీసుకొని
తుంగభద్ర నది ఒడ్డుకు చేరాడు. దానికి నదిలోనికి తీసుకుపోయి స్నానం చేయించాడు.
తర్వాత బయటికి తీసుకు వచ్చి కాసిని మంత్రాలు చదివి దానికి సబ్బు రాసి తిరిగి
నదిలోకి తీసుకుపోయాడు. మళ్ళీ స్నానం చేయించాడు. బయటికి తీసుకువచ్చాడు. తిరిగి
మంత్రాలు చదువుతూ నదిలోనికి తీసుకుపోయి స్నానం చేయించి బయటికి తీసుకువచ్చాడు.
తిరిగి తిరిగి ఇట్లనే రోజంతా కుక్కకు స్నానం చేయిస్తూనే ఉన్నడు. దీన్ని అంతా
చుట్టూ ఉన్న ప్రజలు రాజభటులు చూశారు. రాజుగారి దగ్గరికి పోయి తెనాలి రామలింగడు ఇలా
రోజంతా కుక్కకు స్నానాలు చేయించాడు అని చెప్పారు. రాజుగారు విస్తుపోయి. ఎందుకు
చేయిస్తున్నాడబ్బా అని అనుకున్నాడు.
తర్వాత రోజుకూడా మళ్ళీ తెనాలి
రామలింగడు కుక్కును తెచ్చి మంత్రాలు చదువుతూ స్నానాలు చేయిస్తూనే ఉన్నాడు.
రాజుగారికి భటులు పోయి ఈ సమాచారం అందించారు. రామలింగడు ఊరికినే ఏ పనీ చేయడే పోయి
చూద్దాం అనుకొని రాజుగారు తన పటాలంతో తుంగభద్రా నది ఒడ్డుకు చేరాడు. అక్కడ
రామలింగడు ఇంకా నల్ల కుక్కకి స్నానం చేయిస్తూనే కనిపించాడు. కృష్ణదేవరాయలు అతని
దగ్గరికి పోయి రామకృష్ణా ఏమిటీ పని ఇంత
అమాయకంగా కుక్కకు ఇన్ని సార్లు స్నానం చేయిసున్నావెందుకు అని అడిగాడు. రామలింగడు
ముభావంగా మహారాజా ఈ నల్లకుక్కును తెల్లటి ఆవుగా మారుద్దామని ఇలా మంత్రాలు చదివి
దీనికి స్నానం చేయిస్తున్నాను అని అంటాడు. “రామకృష్ణా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు.
నువ్వు ఎంత సబ్బురుద్దినా ఎన్ని మంత్రాలు చదివినా ఈ నల్ల కుక్క తెల్లటి ఆవుగా ఎలా
మారుతుందయ్యా నీకేమన్నా మతి పోయిందా” అని కాస్తా మందలించే
ధోరణిలో చెప్పాడు రాజుగారు.
అప్పుడు తెనాలి రామలింగడు చిన్నగా నవ్వి “మహారాజా తమరు మంగలి కొండోజిని చదువు
చెప్పించి శాస్త్రాలు నేర్పించి బ్రాహ్మణుడుగా, కవిగా మార్పించగా లేనిది ఈ నల్ల
కుక్క తెల్లని ఆవుగా మారక పోతుందా” అని వికటంగా నవ్వుతూ
చెప్పాడు.
అప్పుడు రాజుగారు తన ‘తప్పును’ తెలుసుకున్నాడు. “రామకష్ణయ్యా నా కళ్ళు తెరిపించావయ్యా. ఇందుకేనా రెండురోజులనుండి ఇక్కడ
ఉన్నావు. సరే…” అని చెప్పి రాజమహలుకు వెళ్ళి పోయాడు.
తర్వాత రెండో రోజు మంగలి కొండోజిని ఇతర బ్రాహ్మణులను రప్పించి ఆ బ్రాహ్మణులకు
తగిన సంభావనలు ఇప్పించి వారిని పంపించి కోండోజి నేను ఏం చేసినా నిన్ను బ్రాహ్మడుగా
మార్చలేను. నీకు వంద ఎకరాల పొలం ఒక గ్రామం రాసిస్తున్నా వెళ్ళి తీసుకొని సుఖపడు
అని చెప్పి పంపించివేశాడు.”
ఇది మంగలి కొండోజి కథ. ఈ కథ ఆనాడు ఎంత సామాజిక ఆందోళనను ఎవరి పక్షాన
రగిలించిందో పైన కథలోనే చూశాము. కాని ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ కథ నేటికి
సామాజిక ప్రకంపనాలను కలిగిస్తూనే ఉంది. కులం ఎలా ఇతర కులాల మీద విషం కక్కుతుందో
చెప్పడానికి మంచి ఉదాహరణగా ఈ కథ పనికి వచ్చేలా ఉంది. పొలాలు పుట్రలు కోరకుండా తనను
బ్రాహ్మడిగా మార్చమని కొండోజి కోరడమే రాజుగారికి
ఆందోళనకు కారణం అయింది. కాని తన మాట పోకుండా అనృత దోషం రాకుండా అతడిని
బ్రాహ్మడిగా కవిగా మార్చే ప్రయత్నం చేశాడు రాజు. కాని ఇది ఒక సామాజికి ఆందోళనకు దారితీస్తుందని రాజు
ఊహించలేదు. కులం మార్చడం సాధ్యం కాదని కింది కులాల వారు ఎంతటి ప్రజ్ఞావంతులైనా ఎంతటి
కళాకారులు అయినా విజ్ఞానులు అయినా బ్రాహ్మణ కవులు కూర్చునే రాజసభలో కూర్చోవడానికి
అర్హులు కారని రాజు గ్రహించలేకపోయాడు. తాను రాజు అయినా కూడా ఈ పనిచేయలేని
అశక్తుడిని అని ఆ సామాజిక వర్గానికి రాజుకన్నా కూడా బలం ఉందని కృష్ణదేవరాయలు
గ్రహించలేకపోయాడు. గొంతెత్తి ఆందోళన చేసిన వారికన్నా నోరు విప్పకుండా తెనాలి
రామలింగడు చేసిన పని మరింత క్రూరంగా కింది కులాల పట్ల విషం కక్కేలాగా ఉంది. మంగలి
(నాయాబ్రాహ్మణుడు) కొండోజి నల్ల కుక్కతో సమానం అని నల్ల కుక్కను తెల్లటి ఆవుగా
మార్చడం ఎలా సాధ్యం కాదో మంగలి కొండోజిని బ్రాహ్మణుడగా మార్చడం కాని సభలోనికి
తేవడం కాని సాధ్యం కాదు అని రాజుగారికి సూటిగా అత్యంత బలంగా చెప్పగలిగాడు తెనాలి
రామలింగడు. ఈ జానపద కథ నేటికీ దానికున్న సామాజిక కర్తవ్యాన్ని బలంగా నెరవేరుస్తూ
కింది కులాల వారు వారి పనులు వారు చేసుకోవాలే కాని మరొక సామాజిక హోదాను ఊహించ కూడదు
అనే బలమైన సందేశాన్ని ఇస్తూ ఉంది. తెనాలి రామలింగడి కథల్లో ఒక కథగా నేటికీ ఇది
చాలా ప్రచారంలో ఉంది. నేను నా చిన్న తనం నుండి ఈ కథను వింటూ వస్తున్నాను. ఇది
ఇటీవలే వచ్చిన తెనాలి రామలింగడి కథల పుస్తకాలలో కూడా ఇదే విధంగా అచ్చయి వచ్చింది.
అంతే కాదు ఇటీవల నేను చేపట్టిన యుజిసి వారి పరిశోధన పథకంలో వివిధ జిల్లాలలో
సేకరించిన కథలలో ఇది కూడా వినిపించింది. తెనాలి రామలింగడి పేరుతో ఉన్న కథలలో
దీనికి కూడా బాగా వ్యాప్తి ఉంది.
రాజు చాతుర్వర్ణ వ్యవస్థను కాపాడతానని పట్టాభిషేకం చేసే సమయంలో అతనికి అభిషేకం
చేసే బ్రాహ్మణ పురోహితులు అతనితో ప్రమాణం చేయిస్తారు. వర్ణసంకరం కాకుండా జరగకుండా
చూడవలసిన బాధ్యత అలా రాజుకు ఉంటుంది. ఇక్కడ కృష్ణదేవరాయలు తన కళాభిమానం ఉద్వేగంలో
ఈ వాస్తవాన్ని మర్చి పోయాడు. మగంలి కొండోజిని బ్రాహ్మణుల సరసన కూర్చో బెట్టాలని
ప్రయత్నించాడు. అతని కులాన్ని కూడా మార్చాలని ప్రయత్నించాడు. ఇది సార్వభౌముడైన
తనకు కూడా చేతకాని పని అని ఆలస్యంగా గ్రహించాడు. తెనాలి రామలింగడు చెప్పిన పద్ధతి
కూడా మాములుగా చెప్పినట్లు లేదు. పైకి చాలా సున్నితంగా ఉన్నా కుక్కను చూపించి
చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు రామలింగడు అనే రామకృష్ణుడు.
నిజానికి ఈ కథ జరిగింది అని చెప్పే ఆధారాలు లేవు. ఇది అచ్చమైన జానద కథ. దీనిలో
ఉన్న ఒక మోటిఫ్ (కథా నమూనాను)ను అంటే నిద్రపోయే మనిషికి నిద్రలేవకుండా గడ్డం చేయడం
అనే కథాంశాన్ని ఎమ్మల్యే ఏడుకొండలు సినిమాలు దర్శకుడు చాలా ప్రతిభావంతంగా
వాడుకున్నాడు. అసలు కృష్ణ దేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగడు లేడని వీరిద్దరూ ఒక
కాలానికి చెందిన వారు కారు అనేది చారిత్రక సత్యం. కాని జానపద కథాసంచయంలో మాత్రం
వీరిద్దరూ మంచి మిత్రులు. అతను వికటకవి. రాజును అలరించేవాడు. ఇలా ఎంతో కథా చక్రం
సృష్టించబడింది. ఇది చారిత్రక సత్యం. కాని మంగలి కొండోజి చారిత్రక పురుషుడు అని
రాయలవారు అతనికి మాన్యాలు ఇచ్చాడు అనే శాసనం ఉన్నట్లు ఆరుద్రగారు కూడా ఆధారాలు
చూపారు. కాని ఇక్కడ ఇది నిజంగా జరిగిందా లేదా అని కాదు చూడవలసింది. ఈ కథ ఎలా
పుట్టింది. ఎందుకు పుట్టింది అన్నవే చాలా
కీలకమైన ప్రశ్నలు. ఈ కథను ఎవరు పుట్టించి తెనాలి రామలింగడి కథలలో చేర్చారు ఎలా
ప్రచారంలోనికి వచ్చింది అన్నది మరింత కీలకమైన ప్రశ్న. కథను ఎవరు పుట్టించారు అని
సమాధానం చెప్పడం చాలా తేలిక పని. వర్ణసంకరం కాకుండా ఉండాలని కింది కులం వాడు పైకి
రాకూడదు అని సాంఘికంగా కాని మరే విధంగా కాని తన స్థాయిని మరచి సభా ప్రవేశం
చేయరాదని భావించే సామాజిక వర్గమే ఈ కథా సృష్టికి మూలం అని గ్రహించడం కష్టం కాదు.
కాని ఇక్కడ గమనించ వలసిన మరొక విషయం ఏమంటే ఈ కథ నేటికి మంచి వ్యాప్తి పొంది
ప్రజలకు మంచి వినోదాన్ని కలిగిస్తూ ఉంది. వినోదం అనే తియ్యని పదం వెనుక విషాన్ని
కక్కుతూ ఉంది ఈ కథ. కులం విషాన్ని కక్కుతూ ఉంది. ఈ కథను ఇలాంటి సామాజిక
సందేశాన్నిచ్చే ఇలాంటి ఇతర జానపద కథా సంచయాలను ఏంచేయాలి. కులం విషం కక్కకుండా
ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఈ కథలను ఏంచేయాలి. అనే విషయాన్ని విజ్ఞులందరూ
చర్చించడానికి ఇక్కడ ముందుకు తెచ్చి వదులుతున్నాను. పులికొండ సుబ్బాచారి. 9440493604.