Saturday, April 20, 2013

my new article on dalit other caste relations


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం
చరవాణి. 9440493604

విలోమవివాహాలు - విధ్వంసమయ్యే కులాలు
పెద్దమ్మ కథ సామాజిక దురన్యాయం

సూరుల జన్మంబు సురల జన్మంబు ఏఱుల జన్మంబు ఎరుగనగునె అని ఒక చాటు పద్య శకలం మనకు చాలా సందర్భాలలో ఎదురవుతుంది. దీనికి రెండర్థాలు చెప్పవచ్చు. సూరులుఅంటే పండితులు (కవులు కూడా అని సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు) సురలు అంటే దేవతలు  ఇంకా ఏఱుల జన్మాలని తెలుసుకోలేము అని ఒక అర్థం వస్తుంది. అంతే కాదు. ఎఱుగనగునె అనే ప్రశ్నార్థక పదానికి ఎరుగవచ్చునా అంటే తెలుసుకోవాలని ప్రయత్నించవచ్చునా అని మరొక అర్థం వస్తుంది. కులం గురించి అడగ వద్దు అని చెప్పే ఇలాంటి మాటలు ఇంకా మనకు చాలా కనిపిస్తాయి. కాని వర్ణసంకరం గురించి కుల సంకరం గురించి గగ్గోలు పెట్టే కథలు పురాణ కాలం నుండి కనిపిస్తాయి. విలోమ వివాహాల గురించి అనులోమ వివాహాల గురించి మనుస్మృతి బాగా చెబుతుంది. ఏ ఏ కులాలు సంకరం అయినప్పుడు దాని ఫలితంగా మరే కులాలు పుడతాయి అని వివరంగా చెబుతుంది మనుస్మృతి. ఈ వర్గీకరణంలో నేడు కనిపించే చాలా కులాలు తీవ్రమైన అవమానానికి గురి కావలసి వస్తుంది కూడా వాటి ఉదాహరణలు కూడా ఇక్కడ ఇవ్వడం భావ్యం కాదు. అందుకే మనుస్మృతిని తగల బెట్టే ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది.
అనులోమ వివాహం అంటే పురుషుడు పెద్దకులానికి చెందిన వాడై ఉండి లేదావర్ణక్రమంలో పైవర్ణానికి చెంది ఉండి కింది వర్ణం స్త్రీని కాని కింది కులం స్త్రీని కాని పెండ్లాడితే అది అనులోమవివాహం అవుతుంది. అంటే బ్రాహ్మణ వర్ణం పురుషడు తనకు కింది వర్ణాలైన, క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను వివాహం ఆడితే అది అనులోమ వివాహం అవుతుంది. అలా కాక కింది వర్ణం నుండి కాని కింది కులాలనుండి కాని పురుషుడు పై వర్ణం నుండి లేదా పై కులం నుండి స్త్రీని వివాహం ఆడితే అది విలోమ వివాహం అని అంటారు. దీన్నే ప్రతిలోమ వివాహం అనికూడా అనడం ఉంది. ఈ పేరును బట్టే దీనికి వ్యతిరేక గుణాన్ని లేదా నీచలక్షణాన్ని ఆపాదించడాన్ని చూడవచ్చు. అంటే విలోమ వివాహాలను అంగీకరించక ఈసడించిన సమాజం పురాణ కాలంనుండి ఉండడాన్ని పురాణ కథల్లోను దేవత కథల్లోను చూడవచ్చు. దీనివల్ల వచ్చే అనర్థాలను కూడా మనుస్మృతి పేర్కొంది. విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు నవలలో ధర్మారావు తండ్రి బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు కింది మూడు వర్ణాల స్త్రీలను పెండ్లిచేసుకోవడం పెద్దకథా విస్తృతిలో వర్ణించాడు. దీన్ని ఆనందంగా అంగీకరించే ఆయన విలోమ వివాహాలను ఎక్కడా ఆయన సానుకూలంగా వర్ణించడు.
విలోమ వివాహాల్లో వచ్చే సామాజిక సమస్యను గురించి ఆధునిక సాహిత్యంలో  కూడా చాలా విస్తృతంగానే వివరించి చిత్రించారు. రంగనాయకమ్మగారి బలిపీఠం నవలలో (సినిమాలోను) దళిత కులానికి చెందిన వ్యక్తి అగ్రకులానికి చెందిన (బ్రాహ్మణ) స్త్రీని పెండ్లి చేసుకుంటే వచ్చే సమస్య ఎలా ఉంటుంది అని చాలా విస్తృతంగా చెప్పింది. ఈ సమస్యలను సినిమాలు కూడా వివరంగా చూపాయి. ఇదే సామాజిక సమస్యను అంటే కింది కులాలకు చెందిన పురుషులు పైకులాల వారి స్త్రీలను విశేషించి బ్రాహ్మణ వర్ణానికి చెందిన స్త్రీలను పెండ్లి చేసుకుంటే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి. ముఖ్యంగా దళిత కులం పురుషులు బ్రాహ్మణ స్త్రీలను పెండ్లి చేసుకుంటే పరిస్థితులు ఎక్కడకు దారితీస్తాయి. అనే సమస్యను వర్ణించిన జానపద కథలు చాలా దొరుకుతాయి. మౌఖిక సాహిత్యం అంటే జానపద సాహిత్యం దీన్ని బాగా విస్తృతంగానే వర్ణించింది. ఇది గ్రామదేవతల కథల్లో కూడా వస్తుంది. పెద్దమ్మ అనే గ్రామ దేవత ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల్లో ఉన్న గ్రామ దేవతలలో బాగా వ్యాప్తిలో ఉన్న గ్రామదేవత.  ఈ పెద్దమ్మ కథని  ఈ దేవతకి కొలుపులు కొలిచే టప్పుడు చెబుతారు. దళిత కులాకు చెందిన బైండ్లవారు, ఆసాది వారు, కొమ్ముల వారు, పంబలవారు వారి జానపద కళారూపాలైన బైండ్లకథ ఆసాదికథ, పంకథల్లో ఈ కథలను చాలా సుదీర్ఘంగా చెబుతారు. పెద్దమ్మ కథ వీరి కళారూపాల్లో బాగా విస్తృతంగా ఉంది. అంతే కాదు పెద్దమ్మ కథని చాలా కులాలవారు విడిగా కథగా చెప్పుకోవడం కూడా ఉంది. పెద్దమ్మకథని బ్రాహ్మణ కుటుంబాలలో కూడా అందునా స్త్రీలలో కూడా పిల్లలకి చెప్పే కథల్లాగా చెప్పుకోవడం ఉంది.  ఈ కథని నేను మూడు తావుల్లో సేకరించాను. ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఈ కథను చెప్పగా విన్నాను. ఈ కథలో ఒక క్లిష్టమైన సామాజిక సమస్యను వర్ణించడం చూడవచ్చు. ముందు కథను చదివి తర్వాత దాని విశ్లేషణలోనికి పోదాం.
పెద్దమ్మ కథ: అనగనగా ఒక ఊళ్ళొ ఒక బ్రామ్మణాయన ఉన్నడు. ఆయనకి పొలం యగసాయం కూడా ఉంది. ఆ సంవత్సరం పొలంలో  జొన్న పంట వేశిండు బాపనాయన. ఆయన పొలాన్ని పాలికిచ్చినా ఆ ఇంటి వాళ్లే దానికి కాపలా కాసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పాలు మూడొంతులు. పాలి రైతు కూడా అప్పుడప్పుడు కాపలాకి వత్తడు.
ఆయనకి ఈడుకు వచ్చిన కూతురు ఉంది. ఈ కూతురునే పగటి పూట చేను కాపలాకి పంపిస్తూ ఉంటడు. చేనుకి తూర్పు  నడాన ఒక మంచె ఉంది.  ఆ మంచె మీద కూసోని బాపనాయన కూతురు వడిసాల తిప్పి తిప్పి రాళ్ళు కొడతా పిచికలు వాల కుండా కాపలా కాస్తది.
ఒక నాడు. అట్ల కాపలా కాస్త ఉండగా ఆ పొలం పక్కన దారెమ్మడి ఒక ఈడు కొచ్చిన కుర్రవాడు పోతుంటడు. అక్కడ ఈ అమ్మాయి కేకలు పెట్టుకుంటా వడిశాల తిప్పుకుంటా ఉంటే చూస్తడు ఆ కుర్రవాడు. ఈ బాపనాయన కూతురు బాగా ఎర్రగా బుర్రగా ఉండటాన ఆ పిల్లగాడు చూపు తిప్పుకోలేక అట్లనే చూశి చూశి దారిలో పోతడు. తిరిగి మాపిటేలకి ఆ దారి గుంటా వత్తా వత్తా ఆ యమ్మాయిని మళ్ళీ చూశిండు. ఈ అమ్మాయి కూడా ఆ పిల్లగాడిని చూశింది. పిల్లగాడు కూడా బాగా ఎర్రగా బుర్రగా ఉన్నడు. ఎవురా మన ఊరి అబ్బాయేనా అని అనుకుంది.
ఆ పిల్లగాడు ఇంటికి పోయినంక కూడా ఆ పిల్లని మరిశి పోలేక పోయిండు. కళ్ళలోనే కనపడతది. మళ్ళీ ఆ దారిలోకే వచ్చి ఆ పొలం కాడికి వచ్చి  చూశిండు. ఆ యమ్మాయి మంచె మీదే ఉండి పిచికలని తోలతా ఉంది. ఈ పిల్లగాడు ఆ దారి దాకా వచ్చి. అక్కడక్కడే తిరుగుతా ఈ పిల్లని చూస్తా ఉన్నడు. కాసేపటికి ఆ యమ్మాయి ఈ పిల్లగాడిని చూచి నిన్నకనపడిన అతను ఇతనే కదా అని అనుకుంది.  అట్ల రెండు మూడు రోజులు చూశిండు. ఆ పిల్లగాడు అట్ల చూడడాన్ని ఈ పిల్ల గమనించి తననే చూడడానికి వస్తన్నడు అని తెలుసుకుంది.  అయిన తనను ఏమీ అన లేదు కదా అని ఊరుకుంది.
అట్ల అయినంక ఒక రోజున ఆ పిల్లగాడు మంచె దగ్గరికి వచ్చి ఆ యమ్మాయి దగ్గిరి కి వచ్చి కాస్త మంచినీళ్ళు పోస్తావా దప్పికగా ఉంది అని అంటడు. ఆ యమ్మాయి కూడా మంచె దిగి బుర్రకాయ తీసింది. ఆ పిల్లగాడు గొంతుగా కూర్చోని దోసిలి పట్టిండు. ఆయమ్మాయి. బుర్రకాయ ఎత్తి అతనికి మంచి నీళ్లు పోసింది. కాసేపు అక్కడే కూర్చున్నాడు. ఆయమ్మాయిని చూసుకుంటా. ఆయమ్మాయి కాసేపు చూచి తిరిగి మంచె ఎక్కింది.
ఇక ఆయమ్మాయి ఇంటికి పోయి. పిల్లగాడు బాగా ఉన్నడు. బాగా ఎర్రగా బుర్రగా ఉన్నడు. బాగా మాట్లాడతన్నడు బ్రామ్మల పిలగాడే గావచ్చు అని అనుకుంది. మళ్ళీ తెల్లారి రోజున పొలానికి పోయింది. మద్యానం వేళకి మంచి రెండు జాముల ఎండలోకూడా ఆ పిల్లగాడు మళ్లీ వచ్చి కాసేపు దూరంనుండే చూశి. తర్వాత దగ్గరికి వచ్చి మంచి నీళ్ళు అడిగిండు. ఆయమ్మాయి మంచె దిగి బుర్రకాయతో మంచినీళ్ళు పోసింది. అతను తాగిన తర్వాత వెళ్ళి పోయిండు.
అట్ల నాలుగైదు సార్లు ఆ పిల్లగాడు మంచినీళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు కాసేపు మాట్లాడు కుంటరు.  అట్లా నాలుగైదు సార్లు మాట్లాడు కున్నంక వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా నచ్చుకుంటరు. ఇక కొద్ది రోజులకే పెళ్ళి చేసుకుందామని అనుకుంటారు. ఇక ఒక నాడు పొద్దు పోయినంక ఆళ్ళిద్దరు ఇంటికి పోకుండా మూట ముల్లెతో రాత్రి పూట వేరే ఊరికి ఎవురికి చెప్పకుండా లేచి పోతారు.
ఆ బ్రామ్మణాయన కూతురు ఇంటికి రాలేదేమా అని పోలానికి వచ్చి చూచి ఊరంతా తిరిగి తిరిగి ఏడుసుకుంట ఇంటికి పోతాడు.
ఇక వీళ్ళు ఇద్దరూ వేరే ఊరికి పోయి. కాపురం పెట్టుకుంటారు. ఆ పిల్లగాడు కూలీనాలి చేసుకుని ఏదో సంపాదించుకొని వస్తుంటడు. ఈమె వండి పెటతాఉంటది.  అట్ల కాలం గడుస్తా ఉంటది. ఐదేళ్ళు గడిసినయ్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
ఇట్లా ఉండంగ ఉండంగ. ఆ ఊళ్ళో ఆ బాపనాయనని కూతురు ఎక్కడికో లేచి పోయిందని పిల్ల తల్లి బాయిలో దూకి చచ్చిపోద్ది. తండ్రిని కుటుంబాన్ని ఆ ఊరి బ్రామ్మలు కులంనుండి ఎలేస్తారు. 
అయితే ఒక నాడు ఈ పిల్లగాడి తల్లి దండ్రులు ఊరు ఊరు వాళ్ళ కొడుకు కోసం తిరిగి తిరిగి ఆ ఊరికి వచ్చి తమ పిలగాడు అక్కడున్నాడని తెలుసుకుంటారు. పిలగాడి తండ్రి పిలగాడిలాగే ఎర్రగా ఉన్నాడు. కాని చాలా మోటుగా ఉండడాన్ని వాళ్ళ కోడలు చూచింది. ఆతని తల్లి అంటే ఆమె అత్త అయితే బాగా నల్లగా ఉంది. ఆ మాట తీరు బట్టి కూడా వాళ్ళది ఏకులం అని తెలుసుకోలేక పోయింది. అయిన అంతా అయినాంక ఇప్పుడు తెలిసి ఏం లాభం అనిఅనుకుంటది.
అయితే ఒకనాడు. ఆయమ్మాయి అప్పాలుచేసింది.  అంటే బొబ్బట్లు చేసింది అన్నమాట. చేసి అత్తకి వడ్డించింది. ఇదేంటి బర్రె నాలికలాగా ఉంది. అని అడిగింది. అప్పడు ఆయమ్మాయికి బాగా తెలిసి వచ్చింది. తాను చేసుకున్నది ఒక మాదిగ వాళ్ళ అబ్బాయిని అని, బాగా తెలిసింది. తాను మోసపోయానని అనుకున్నది. అయినా తప్పు నాదే అని తాను ఏనాడు అతని కులం గురించి అడగలేదని మనిషిని చూచి తనకులమే అని అనుకున్నా కాబట్టి  తప్పు తనదే అని తెలుసుకుంది. తన భర్త ఇంటికి రాగానే అతడిని చూచింది. పిల్లలని బాగా చూచుకో మని చెప్పింది. బాయికాడికి నీళ్ళకి పోతానని చెప్పి ఇంట్లో చెప్పకుండా తన ఊరికి పోతది. తన తండ్రి ఇంటికి పోతది. తన తల్లి చచ్చిపోయిందని తెలిసి ఏడుస్తది. ఇంటికి రాగానే తండ్రి తన మొకం చూడలేదు. ఇంటిలోనికి రానియ్యలేదు. దూరంగా నిలబడ్డాడు. అప్పుడు ఆయమ్మాయి. తండ్రిని ఒక మాట అడిగింది. నానా నానా కుక్కు ముట్టిన కుండని ఏమి చేయాలి అనిఅడుగుతది.
అప్పుడా తండ్రి అయితే పగల కొట్టు లేకుంటా తగల పెట్టు అని అంటాడు. ఇక ఇంట్లోకి ఏమాత్రం పోవాలనే ఆలోచన చేయకుండా తాను  వెనుదిరిగి తన ఊరికి పోయింది.  అప్పటికి తన అత్త మామలు వాళ్ళ ఊరికి పోయారు.
ఇక ఆమె తన ఇంట్లోకి పోయింది. భర్త వచ్చిన దాకా ఆగింది. తన ఇద్దరు పిల్లలు కూడా ఇంటికి వచ్చిందాకా ఆగింది. మాపిటేలకి పిల్లలు వస్తారు. పిల్లలని భర్తని ఇంట్లో ఉంచుకుంది. కాసేపు పిల్లలని చూచుకింది. ముద్దాడింది. ఆమెకు ఒళ్ళంతా మంటలు పుట్టినట్టు అప్పుడు అనిపించింది. ఇంటికి అన్ని వైపులా గడులు పెట్టి. పోయిలోంచి కొరకాసు తీసుకొని ఇంటికి నిప్పు పెట్టింది. తాను తన భర్త ఇద్దరు మగపిల్లలు మంటల్లో కాలి చచ్చి పోతారు.
పొద్దుగూకే వేళకి ఇల్లు తగలబడి పోవడం చూచి ఊళ్ళోవాళ్ళు అందరూ అక్కడికి వస్తారు. ఇల్లు తగల బడి పోవడం చూచి ఆర్పడానికి చూస్తారు. కాని అప్పటికే పూర్తిగా కాలింది. లోపల నాలుగు శవాలు మాడిపోయి కనిపించినాయి.
చచ్చి పోయినతర్వాత ఆ బ్రామ్మణ ఆమే ఆ ఇంటి దగ్గరే దేవతలా ఆకాశంలో కనిపించింది. తాను దేవతనని తనను పెద్దమ్మ దేవత అని పిలిచి గుడి కట్టండి అని ఊరి వాళ్ళని కోరుతుంది. ఊరి జనం అంతా ఆమె మహిమ చూచి భయపడి గుడికడతాం అని అంటారు. నా భర్త నన్ను మోసం చేసి పెళ్ళి చేసుకున్నాడు. నాతో పిల్లల్ని కన్నాడు.  వాడు దున్నపోతై పుడతాడు. నా  ఇద్దరు కొడుకులు గావు గొర్రెలై పుడతారు. అందుకని ఏడాదికి ఒక సారి కొలుపు చేయండి. నాకు ఒక దున్నపోతును బలి  ఇవ్వాలి రెండు గావు గొర్రెలని  బలి ఇవ్వాలి. ఏడాదికి ఒక సారి ఇట్లా కొలుపు కొలిస్తే నేను మిమ్మల్ని సల్లంగా చూస్తా. లేకుంటే మీ ఊరికి అరిష్టం జరుగుద్ది అనిచెబుతుంది. అక్కడనుండి ఆమె అక్కడే పెద్దమ్మ తల్లై వెలిసింది. ఊరి వారు అక్కడే గుడి కట్టి కొలుపులు చేస్తున్నారు.

పైన చెప్పిన  పెద్దమ్మ కథ చాలా ప్రచారం ఉన్న గ్రామదేవతల కథలలో ఒకటి. దీన్ని ఇతర పరిశోధకులు కూడా సేకరించారు. అయితే వారి సామాజిక నేపథ్యం కారణంగా వారి పద్ధతిలో వారు విశ్లేషించారు. ఈ కథ అటు దళిత కుటుంబాలలో కనిపిస్తుంది. అంతే కాదు విపరీతంగా ఇటు బ్రాహ్మణ కుటుంబాలలో కూడా ఈ కథ తెలిసిన వారు చాలా మంది ఉన్నారు.  నేను కలిసి మాట్లాడిన వారిలో కూడా చాలామంది ఈ కథ గురించి వివరించి చెప్పారు. ఈ కథను ఎక్కువ సందర్భాలలో అమ్మాయిలకు చెప్పే నీతికథలాగా చెబుతారు. అంటే అమ్మాయిలు కులం తప్పి పెళ్ళి చేసుకుంటే లేదా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా స్వతంత్రించి పెళ్ళి చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఉదాహరణగా కూడా  ఈ కథను చెబుతారు.
ఈ పెద్దమ్మ గ్రామదేవత కథ లాగే పెద్దమ్మ దేవాలయాలు ఆంధ్రదేశంలో చాలా చోట్ల ఉన్నాయి. పెద్దమ్మకి ఏడాదికి ఒకసారి జాతరలు జరిగే టప్పుడు బైండ్లవారు పంబాల వారు కొమ్ముల వారు ఈ కథని ప్రదర్శించి చెబుతారు.  పెద్దమ్మ గుడులు కొన్ని చోట్ల చిన్నగా ఉంటాయి. మరికొన్ని చోట్ల రాతి కట్టడంతో చాలా పెద్దగా ఉన్న గుడులు కూడా ఉన్నాయి.
పైన చెప్పినకథలో జరిగింది ఒక అసాధారణమైన విలోమ వివాహం. అంటే కింది వర్ణం వాడు అసలు వర్ణమే లేని పంచముడైన పురుషుడు అన్నింటికన్నా పై వరుసలో ఉన్న వర్ణంలోని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అతను తన కులాన్ని చెప్పలేదు. ఆమె అడగలేదు. కాని ఇద్దరి ఇష్టంతో పెళ్ళి జరిగింది. పిల్లలూ పుట్టారు. కాని అతని అసలు కులం తెలుసుకున్నంతనే అప్పటిదాకా తనువుకు తనువు అయిన భర్త స్పర్శ అగ్నితో సమానం అయింది. తనను తాను తగల బెట్టుకోవడమే కాకుండా భర్తని చివరికి కన్నపిల్లల్ని కూడా తగులబెట్టి నిలువునా చంపేసింది. అంతే కాదు ఈ పగ ఎంత దూరం పోయిందంటే తరతరాల పాటు ఆమె భర్తని పిల్లలని బలిపశువుల్లా బలిచేయమని కోరింది.  పెళ్ళి చేసుకోవడం వర్ణాంతరంగా చేసుకోవడం ఒక వేళ తప్పు అని భావిస్తే ఆ తప్పు చేసి ఆత్మ బలిదానం జరిగినప్పుడు అగ్రవర్ణానికి చెందిన ఆమె దేవతగా వెలసి పూజలు అందుకుంటూ ఉంది. కాని అదే తప్పు కారణంగా ఆ దళితకులానికి చెందిన భర్త పిల్లలు తరతరాలుగా బలిపశువులుగా బలి ఇవ్వబడుతున్నారు.
భార్య భర్తల సంబంధంలో భర్త భార్య కన్నా ఎత్తుగా ఉండాలి. భార్యకన్నా ఎక్కువ చదువుకున్నవాడు అయి ఉండాలి. అన్ని విషయాలలోను భార్యకన్నా అధికంగానే ఉండాలి. ఇవన్నీ పురుష ప్రపంచం నిర్ణయించి తరాలుగా శతాబ్దాలుగా అమలు చేస్తున్నవే. అలాగే కులాంతర వివాహాలు జరిగినప్పుడు, వర్ణాంతర వివాహాలు జరిగినప్పుడు కూడా భర్త ఉన్నత కులానికి ఉన్నత వర్ణానికి చెందిన వాడుగానే ఉండాలి. అందుకే అది అనులోమ వివాహం అని సానుకూలంగా వర్గీకరించి చెప్పినది కూడా పితృస్వామ్యవిలువలను స్థిరంగా ఉంచే ప్రయత్నంలో జరిగిన పనే. విశ్వనాథవారి వేయి పడగలలో కథానాయకుడి తండ్రి బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాడు మిగతా క్షత్రియ, వైశ్య, శూద్ర కాంతలను పెళ్ళి చేసుకున్న తీరును  ఆ ఉపాఖ్యానాలను చెప్పి నతీరు ఈ అనులోమ వివాహాలను ఆమోదించి ఉన్నతలక్షణంగా తీర్చి చెప్పడం. పై వర్ణాలకు కింది వర్ణాలపై ఉన్న అధికార స్వామ్యాన్ని చెప్పే విషయమే.  వేయిపడగలలో క్షత్రియకాంత సంతానం, వైశ్యాకాంత సంతానం, చివరికి శూద్రకాంత సంతానం సంగతి ఏమైందో చదివిన వారికి అంతా తెలిసిన విషయమే. మనుస్మృతిలోన అమరకోశంలోను ఉన్న వర్ణసంకర సంతానాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారో చదివితే వివిధ కులాల పైన అవి కక్కే విషం గురించి తెలుస్తుంది. 
పెద్దమ్మకథలో మరొక భరించలేని విషాదం ఏమంటే విలోమ వివాహంలో బలిపశువు అయిన దళితుడు అతని పిల్లలు ప్రతి సంవత్సరం దున్నపోతు రూపంలో గావు గొర్రెల రూపంలో బలి అవుతున్నారు. ఈ బలులు ఎందుకు చేస్తున్నారో తెలియక ప్రజలందరూ చూస్తునే ఉంటారు. దేవతను ఎందుకు సంతోష పెట్టడానికి బలులు ఇస్తున్నారో ఇచ్చే వారికి చాలామందికి తెలియక పోవచ్చు. ఇంకా తెలుసుకోవలసిన మరొక విషయం ఏమంటే ఈ బలులను సంప్రదాయికంగా బలి ఇవ్వవలసినవారు, కత్తితో నరికి బలి ఇచ్చేది దళిత కులాలకు చెందినవారే. గొర్రె పిల్లల్ని మాత్రం కొన్ని గ్రామదేవతల గుడులలో గావు పట్టేది కొన్ని వెనుక బడిన కులాల వారు చేస్తారు. కాని దున్నలను నరికేది కొన్ని చోట్ల గొర్రెలను డొక్కచీల్చేది మాత్రం దళిత కులాలవారే.
అనులోమ వివాహాలు పితృస్వామిక విలువలు చిరస్థాయిగా కొనసాగేలా చేసే తీరులోనే ఇంకా ఉన్నాయి. విలోమ వివాహాలు చేసుకుంటే కింది కులాలవారు కింది వర్ణాల వారు ఏవిధమైన సాంఘిక దురన్యాయానికి గురవుతారో పెద్దమ్మకథలోనే కాక నేటికీ నిజజీవితంలో చాలా సందర్భాలలో ఈనాటికి ఎదురౌతున్న విషయం. పితృస్వామిక విలువలు ఒకవైపున కుల వర్ణ అసమానతల దురన్యాయం మరొక వైపున దాడిచేసే చట్రంలో విలోమ వివాహాలలో దళిత బహుజనులు ఎలా బలౌతారో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం పెద్దమ్మకథ. ఇది మన గ్రామ దేవత కథ కూడా.  మన సమాజంలో వర్ణధర్మాలు కుల ధర్మాలను నిరంతరం కొనసాగించేలా చేస్తున్న ఆచారాలను మనకు తెలియకుండానే కొన సాగిస్తున్నాం. విలువలను నమ్ముతున్నాం. ఇదే ఇంకా కొన్ని శతాబ్దాలదాకా సాగబోయే విషాదం.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.

Tuesday, March 12, 2013

నా సరికొత్త వ్యాసం


కులం కాలకూట విషం కక్కిన కథలు
సాహిత్యం తొలుత మౌఖికంగా చాలా సుదీర్ఘమైన కాలం జీవించిన తర్వాతనే లిఖిత సాహిత్యం అయింది. ఇది అన్ని భాషలకు వర్తిస్తుంది. కథ అనేది మనిషి భాష నేర్చిన తొలినాళ్ళలో సృష్టించుకున్న వాగ్రూప కళలలో (వెర్బల్ ఆర్ట్స్) చాలా మంచి కళ. ఈ కళ ఇప్పటికీ కొనసాగి వస్తూ ఉంది. భారత దేశంలో 1650 దాకా భాషలు వాటి వివిధ స్వతంత్ర మాండలికాలున్నట్లు లెక్కలబట్టి తెలుస్తూ ఉంది. కాని ఇందులో సంపూర్ణమైన లిపి ఉండి పరివర్థితమైన సాహిత్యం ఉండి కేవలం 25 భాషలకు లోపునే. అంటే ఒక భారత దేశంలోనే దాదాపు 1600 లకు పైగా భాషలకు ఇంకా లిపి లేదు ఇంకా ఇవి మౌఖిక స్థితిలోనే ఉన్నాయి. కాని లిఖిత సాహిత్యం ఉన్న భాషలలో ఉన్నా చాలా సాహిత్య ప్రక్రియలు ఈ మౌఖిక భాషలలో కూడా ఉన్నాయి. అంతే కాదు వీటిలో కూడా రామాయణ భారతాలు ఇతర పురాణేతిహాస సాహిత్య ఉంది. ఇక్కడ మనకు కథా సాహిత్యం ప్రసక్తాంశం. పరివర్థితమైన లిపి పరివర్థితమైన సాహిత్యం ఉన్న భాషలలో కూడా మౌఖిక మాధ్యమంలో ఇంకా చాలా కథా సాహిత్యం ఉంది. వీటిలో చాలా కథలు ఇంకా పుస్తకాలకు కూడా ఎక్కలేదు. ఏవో కొన్ని కథలు మాత్రమే ఎక్కాయి. అలా పుస్తకాలకు ఎక్కి అయినా ఇంకా మౌఖిక మాధ్యమంలో బాగా ప్రచారంలో న్న తెలుగు కథా సాహిత్యంలో బాగా చెప్పుకోవాల్సిన కథలు మర్యాదరామన్న కథలు, పరమానందయ్య శిష్యులు కథలు, తెనాలి రామలింగని కథలు, కాశీ మజిలీ కథలు ముఖ్యమైనవి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మౌఖిక మాధ్యమంలో ఉన్న కథలలో మన సంస్కృతి బాగా నిబిడీకృతమై ఉంది. పైకి వినోదాత్మకంగా కనిపించే కథలలో అత్యంత లోతైన సాంఘిక విమర్శ ఉంది. కొన్ని కులాలపైన విషం కక్కడం కూడా ఈ కథా సాహిత్యంలో కనిపిస్తుంది. ఇలాంటి కథలు విషం చిమ్ముతూ నేటికీ ఇంకా చాలా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒక కథను ఇక్కడ ప్రస్తావించి ఇలాంటి కథలను ఏం చేయాలి అనే చర్చను పాఠకలోకానికి విడిచి పెట్టడం ఇక్కడి లక్ష్యం. తెనాలి రామలింగడి కథల పేరుతో చాలా కథలున్నాయి. వాటిలో ఒక కథను నేను ఇటీవల సేకరించిన దానిని ఇక్కడ రాస్తున్నాను. కథను వివరంగా చూడనిదే దీనిపైన విశ్లేషణ రాయడం కుదరదు. కథను క్లుప్తంగానైనా దాని నిర్మాణం చెడకుండా విషయం పోకుండా కింద చర్చ కోసం ఇస్తున్నాను.
కృష్ణ దేవరాయలు వారు పరిపాలించే కాలంలో కళకలకే కాక వృత్తి నైపుణ్యాలు ప్రదర్శించిన వారికీ ఎంతో గౌరవం కీర్తి లభిస్తుండేది. ఒకానొక రోజు కృష్ణదేవరాయలవారు పొద్దున్నే చేసే వ్యాయామాలు అన్నీ పూర్తి చేసుకొని కాస్త విశ్రాంతిగా కూర్చొని తనకు గడ్డం చేసే రాచమంగలి (నాయీ బ్రాహ్మణుడి) కోసం అంటే రాజుగారికే సేవచేసే వాని కోసం ఎదురుచూస్తున్నాడు. ఉన్నతాసనం పైన సేదతీరి ఎదురు చూసే రాజుకు జరిగిన ఆలస్యం తెలియిరాలేదు. కాస్తంత అలసిపోయి ఉన్నాడేమో సన్నగా కునుకు పట్టింది. ఆసనంలో జారగిలబడి కునుకుతీసారు రాజుగారు. మంగలి కొండోజి (ఇతను చారిత్రక పురుషుడుగా కృష్ణరాయల ఆస్థానంలో ఉన్నట్టుగా చాలా చారిత్రక ఆధారాలు దొరికాయి) అయిన ఆలస్యానికి ఆదుర్దా పడుతూ రాజుగారి సేవకు వచ్చాడు. భటులు కూడా ఆందోళనగా అతనికోసం చూస్తున్నారు. రాజుగారికి ఎక్కడ కోపం వస్తుందో అని. కొండోజి రావడం తోనే భటులు లోనికి అనుమతించారు. కాని కొండోజి రాజుగారిని చూసే సరికే నిద్రించి ఉన్నారు. కాని కొండోజి తన వృత్తి నైపుణ్యాన్ని అత్యంత ఉన్నత స్థాయిలో ప్రదర్శించాడు. నిద్రించే రాజుకు ఏమాత్రం నిద్రాభంగం కలగకుండా అతని గడ్డానికి జుట్టుకు రాసే తైలాలు రాసి, పూతలు పూసి గడ్డం చేసి మీసాలు సవరించి తిరిగి వెళ్ళిపోయాడు.
ఒక గంట తర్వాత రాజుగారికి మెలకువ వచ్చింది. ఎవరక్కడా అని పిలిచి కొండోజిని రప్పించండి ఎందుకు ఆలస్యం చేశాడు అని అడిగాడు. భటులు మహారాజా మంగలి కొండోజి వచ్చి తమరికి గడ్డం చేసి వెళ్ళాడు. అని చెప్పారు. రాజుగారు అద్దాన్ని తెప్పించాడు. ఇద్దరు యువతులు ఆయన ముఖం ఎదుట అద్దాన్ని తెచ్చి చూపారు. తనకు అత్యంత సుందరంగా గడ్డం చేసి మీసాలు కత్తిరించి సరిచేసి ఉన్నాయి. చేయి పెట్టి తడిమి చూసుకున్నాడు రాజుగారు. ఆశ్చర్య పోయారు. మంగలి కొండోజి నైపుణ్యాన్ని శ్లాఘించడానికి అతనికి మాటలు రాలేదు. వెంటనే కొండోజిని పిలిపించారు రాజుగారు.
కొండోజీ నీ నైపుణ్యాన్ని కళను మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని ఆజ్ఞ వేశారు. మహారాజా నన్ను బ్రాహ్మణుడుగా మార్చండి కవిగా చేయిండి మీ ఆస్థానంలో అష్టదిగ్గజాలలో చోటు కల్పించండిఅని వినయ పూర్వకంగా కోరిక కోరాడు కొండోజి. ఈ కోరిక విని నిర్ఘాంత పోయాడు రాజు. ఇతను మడి మాన్యాలు కావాలని ఊళ్ళు కావాలని ధన ధాన్యాలు కావాలని కోరతాడని ఆశించాడు రాజుగారు. కాని ఇలాంటి కోరిక కోరడం చకితుడిని చేసింది రాజును. కాని మాట ఇచ్చిన తర్వాత తప్పేవాడు కాదు కదా రాజు. వెంటనే పది మంది వేద మంత్రాలలో సకల శాస్త్రాలలో దిట్టలైన బ్రాహ్మణులను రప్పించి. ఇతనికి అన్ని విద్యలు నేర్పించండి మంత్ర తంత్రాలు నేర్పించండి బాగా పుణ్యనదులలో నీరు తెచ్చి స్నానాలు చేయించండి అన్నీ చేసి ఇతన్ని బ్రాహ్మణుడుగా మహాకవిగా మార్చండి అని ఆజ్ఞవేశాడు రాజుగారు.
ఇక రాజుతలచుకుంటే దెబ్బలకు కొదవే ముంది అన్నట్టు పది పదిహేను మంది బ్రాహ్మణులు మంగలి కొండోజికి సకల శాస్త్రాలు పురాణాలు నేర్పుతున్నారు. పద్య విద్యనునేర్పుతున్నారు. అన్ని పుణ్యనదులలోని నీరు తెచ్చి యజ్ఞాలు చేసి అతనికి పుణ్యస్నానాలు చేయిస్తున్నారు. కొండోజి కూడా చాలా కుశాగ్రబుద్ధితో అన్ని శాస్త్రాలు అవలీలగా నేర్చుకుంటున్నాడు. నెల రోజులు గడిచే సరికేనే ఆశువుగా పద్యాలు అల్లడం నేర్చుకున్నాడు.
మంగలి కొండోజి అన్ని విద్యలు నేర్చుకొని కవిగా మారుతున్నాడని రాజుగారి కొలువులో చేరి కవుల సరసన కూర్చుంటాడనే వార్త దావానలంలా అన్ని చోట్ల వ్యాపించింది. బ్రాహ్మణులలో ఆందోళన మొదలైంది. మన మధ్య ఇతను  కూర్చుని కవిత్వం చెబుతాడా  పవిత్రమైన రాజ సభలో ఇతను వచ్చి మా సరసన కూర్చుంటాడా అనే ఊహే వారికి భరించరానిది అయింది. దీనిపైన ఏం చేయాలన్నా వారికి తోచలేదు. రాజు దగ్గరికి పోయి ఆయనకు వేడుకుని బాధను చెప్పుకునే ధైర్యం ఎవరికీ రాలేదు. చివరికి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.
బ్రాహ్మణలు కవులు, పండితులు అందరూ కలిసి తెనాలి రామలింగడి దగ్గిరికి పోయారు. జరుగుతున్న అపచారాన్ని ఘోరాన్ని రామలింగ కవికి వినిపించారు. రాజుగారికి దగ్గరిగా ఉండేది మీరే కాబట్టి ఈ అనాచారం జరగకుండా మంగలి కొండోజి రాజ సభకు రాకుండా మీరే అడ్డుకోవాలి అని చెప్పుకున్నారు. సరే నాకూ తెలుసు. నేను ఏం చేయాలో అది చేస్తాను అని రామలింగ కవి అన్నాడు, బ్రాహ్మణ పండితులు వెళ్ళి పోయారు.
తర్వాత ఒక రోజున తెనాలి రామలింగడు తన ఇంట్లో ఉన్న నల్ల కుక్కను తీసుకొని తుంగభద్ర నది ఒడ్డుకు చేరాడు. దానికి నదిలోనికి తీసుకుపోయి స్నానం చేయించాడు. తర్వాత బయటికి తీసుకు వచ్చి కాసిని మంత్రాలు చదివి దానికి సబ్బు రాసి తిరిగి నదిలోకి తీసుకుపోయాడు. మళ్ళీ స్నానం చేయించాడు. బయటికి తీసుకువచ్చాడు. తిరిగి మంత్రాలు చదువుతూ నదిలోనికి తీసుకుపోయి స్నానం చేయించి బయటికి తీసుకువచ్చాడు. తిరిగి తిరిగి ఇట్లనే రోజంతా కుక్కకు స్నానం చేయిస్తూనే ఉన్నడు. దీన్ని అంతా చుట్టూ ఉన్న ప్రజలు రాజభటులు చూశారు. రాజుగారి దగ్గరికి పోయి తెనాలి రామలింగడు ఇలా రోజంతా కుక్కకు స్నానాలు చేయించాడు అని చెప్పారు. రాజుగారు విస్తుపోయి. ఎందుకు చేయిస్తున్నాడబ్బా అని అనుకున్నాడు.
తర్వాత రోజుకూడా మళ్ళీ  తెనాలి రామలింగడు కుక్కును తెచ్చి మంత్రాలు చదువుతూ స్నానాలు చేయిస్తూనే ఉన్నాడు. రాజుగారికి భటులు పోయి ఈ సమాచారం అందించారు. రామలింగడు ఊరికినే ఏ పనీ చేయడే పోయి చూద్దాం అనుకొని రాజుగారు తన పటాలంతో తుంగభద్రా నది ఒడ్డుకు చేరాడు. అక్కడ రామలింగడు ఇంకా నల్ల కుక్కకి స్నానం చేయిస్తూనే కనిపించాడు. కృష్ణదేవరాయలు అతని దగ్గరికి పోయి రామకృష్ణా  ఏమిటీ పని ఇంత అమాయకంగా కుక్కకు ఇన్ని సార్లు స్నానం చేయిసున్నావెందుకు అని అడిగాడు. రామలింగడు ముభావంగా మహారాజా ఈ నల్లకుక్కును తెల్లటి ఆవుగా మారుద్దామని ఇలా మంత్రాలు చదివి దీనికి స్నానం చేయిస్తున్నాను అని అంటాడు. రామకృష్ణా ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత సబ్బురుద్దినా ఎన్ని మంత్రాలు చదివినా ఈ నల్ల కుక్క తెల్లటి ఆవుగా ఎలా మారుతుందయ్యా నీకేమన్నా మతి పోయిందాఅని కాస్తా మందలించే ధోరణిలో చెప్పాడు రాజుగారు.
అప్పుడు తెనాలి రామలింగడు చిన్నగా నవ్వి మహారాజా తమరు మంగలి కొండోజిని చదువు చెప్పించి శాస్త్రాలు నేర్పించి బ్రాహ్మణుడుగా, కవిగా మార్పించగా లేనిది ఈ నల్ల కుక్క తెల్లని ఆవుగా మారక పోతుందాఅని వికటంగా నవ్వుతూ చెప్పాడు.
అప్పుడు రాజుగారు తన తప్పును తెలుసుకున్నాడు. రామకష్ణయ్యా నా కళ్ళు తెరిపించావయ్యా. ఇందుకేనా రెండురోజులనుండి ఇక్కడ ఉన్నావు. సరే…” అని చెప్పి రాజమహలుకు వెళ్ళి పోయాడు.
తర్వాత రెండో రోజు మంగలి కొండోజిని ఇతర బ్రాహ్మణులను రప్పించి ఆ బ్రాహ్మణులకు తగిన సంభావనలు ఇప్పించి వారిని పంపించి కోండోజి నేను ఏం చేసినా నిన్ను బ్రాహ్మడుగా మార్చలేను. నీకు వంద ఎకరాల పొలం ఒక గ్రామం రాసిస్తున్నా వెళ్ళి తీసుకొని సుఖపడు అని చెప్పి పంపించివేశాడు.” 
ఇది మంగలి కొండోజి కథ. ఈ కథ ఆనాడు ఎంత సామాజిక ఆందోళనను ఎవరి పక్షాన రగిలించిందో పైన కథలోనే చూశాము. కాని ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా ఈ కథ నేటికి సామాజిక ప్రకంపనాలను కలిగిస్తూనే ఉంది. కులం ఎలా ఇతర కులాల మీద విషం కక్కుతుందో చెప్పడానికి మంచి ఉదాహరణగా ఈ కథ పనికి వచ్చేలా ఉంది. పొలాలు పుట్రలు కోరకుండా తనను బ్రాహ్మడిగా మార్చమని కొండోజి కోరడమే రాజుగారికి  ఆందోళనకు కారణం అయింది. కాని తన మాట పోకుండా అనృత దోషం రాకుండా అతడిని బ్రాహ్మడిగా కవిగా మార్చే ప్రయత్నం చేశాడు రాజు. కాని ఇది  ఒక సామాజికి ఆందోళనకు దారితీస్తుందని రాజు ఊహించలేదు. కులం మార్చడం సాధ్యం కాదని కింది కులాల వారు ఎంతటి ప్రజ్ఞావంతులైనా ఎంతటి కళాకారులు అయినా విజ్ఞానులు అయినా బ్రాహ్మణ కవులు కూర్చునే రాజసభలో కూర్చోవడానికి అర్హులు కారని రాజు గ్రహించలేకపోయాడు. తాను రాజు అయినా కూడా ఈ పనిచేయలేని అశక్తుడిని అని ఆ సామాజిక వర్గానికి రాజుకన్నా కూడా బలం ఉందని కృష్ణదేవరాయలు గ్రహించలేకపోయాడు. గొంతెత్తి ఆందోళన చేసిన వారికన్నా నోరు విప్పకుండా తెనాలి రామలింగడు చేసిన పని మరింత క్రూరంగా కింది కులాల పట్ల విషం కక్కేలాగా ఉంది. మంగలి (నాయాబ్రాహ్మణుడు) కొండోజి నల్ల కుక్కతో సమానం అని నల్ల కుక్కను తెల్లటి ఆవుగా మార్చడం ఎలా సాధ్యం కాదో మంగలి కొండోజిని బ్రాహ్మణుడగా మార్చడం కాని సభలోనికి తేవడం కాని సాధ్యం కాదు అని రాజుగారికి సూటిగా అత్యంత బలంగా చెప్పగలిగాడు తెనాలి రామలింగడు. ఈ జానపద కథ నేటికీ దానికున్న సామాజిక కర్తవ్యాన్ని బలంగా నెరవేరుస్తూ కింది కులాల వారు వారి పనులు వారు చేసుకోవాలే కాని మరొక సామాజిక హోదాను ఊహించ కూడదు అనే బలమైన సందేశాన్ని ఇస్తూ ఉంది. తెనాలి రామలింగడి కథల్లో ఒక కథగా నేటికీ ఇది చాలా ప్రచారంలో ఉంది. నేను నా చిన్న తనం నుండి ఈ కథను వింటూ వస్తున్నాను. ఇది ఇటీవలే వచ్చిన తెనాలి రామలింగడి కథల పుస్తకాలలో కూడా ఇదే విధంగా అచ్చయి వచ్చింది. అంతే కాదు ఇటీవల నేను చేపట్టిన యుజిసి వారి పరిశోధన పథకంలో వివిధ జిల్లాలలో సేకరించిన కథలలో ఇది కూడా వినిపించింది. తెనాలి రామలింగడి పేరుతో ఉన్న కథలలో దీనికి కూడా బాగా వ్యాప్తి ఉంది.
రాజు చాతుర్వర్ణ వ్యవస్థను కాపాడతానని పట్టాభిషేకం చేసే సమయంలో అతనికి అభిషేకం చేసే బ్రాహ్మణ పురోహితులు అతనితో ప్రమాణం చేయిస్తారు. వర్ణసంకరం కాకుండా జరగకుండా చూడవలసిన బాధ్యత అలా రాజుకు ఉంటుంది. ఇక్కడ కృష్ణదేవరాయలు తన కళాభిమానం ఉద్వేగంలో ఈ వాస్తవాన్ని మర్చి పోయాడు. మగంలి కొండోజిని బ్రాహ్మణుల సరసన కూర్చో బెట్టాలని ప్రయత్నించాడు. అతని కులాన్ని కూడా మార్చాలని ప్రయత్నించాడు. ఇది సార్వభౌముడైన తనకు కూడా చేతకాని పని అని ఆలస్యంగా గ్రహించాడు. తెనాలి రామలింగడు చెప్పిన పద్ధతి కూడా మాములుగా చెప్పినట్లు లేదు. పైకి చాలా సున్నితంగా ఉన్నా కుక్కను చూపించి చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు రామలింగడు అనే రామకృష్ణుడు.
నిజానికి ఈ కథ జరిగింది అని చెప్పే ఆధారాలు లేవు. ఇది అచ్చమైన జానద కథ. దీనిలో ఉన్న ఒక మోటిఫ్ (కథా నమూనాను)ను అంటే నిద్రపోయే మనిషికి నిద్రలేవకుండా గడ్డం చేయడం అనే కథాంశాన్ని ఎమ్మల్యే ఏడుకొండలు సినిమాలు దర్శకుడు చాలా ప్రతిభావంతంగా వాడుకున్నాడు. అసలు కృష్ణ దేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగడు లేడని వీరిద్దరూ ఒక కాలానికి చెందిన వారు కారు అనేది చారిత్రక సత్యం. కాని జానపద కథాసంచయంలో మాత్రం వీరిద్దరూ మంచి మిత్రులు. అతను వికటకవి. రాజును అలరించేవాడు. ఇలా ఎంతో కథా చక్రం సృష్టించబడింది. ఇది చారిత్రక సత్యం. కాని మంగలి కొండోజి చారిత్రక పురుషుడు అని రాయలవారు అతనికి మాన్యాలు ఇచ్చాడు అనే శాసనం ఉన్నట్లు ఆరుద్రగారు కూడా ఆధారాలు చూపారు. కాని ఇక్కడ ఇది నిజంగా జరిగిందా లేదా అని కాదు చూడవలసింది. ఈ కథ ఎలా పుట్టింది.  ఎందుకు పుట్టింది అన్నవే చాలా కీలకమైన ప్రశ్నలు. ఈ కథను ఎవరు పుట్టించి తెనాలి రామలింగడి కథలలో చేర్చారు ఎలా ప్రచారంలోనికి వచ్చింది అన్నది మరింత కీలకమైన ప్రశ్న. కథను ఎవరు పుట్టించారు అని సమాధానం చెప్పడం చాలా తేలిక పని. వర్ణసంకరం కాకుండా ఉండాలని కింది కులం వాడు పైకి రాకూడదు అని సాంఘికంగా కాని మరే విధంగా కాని తన స్థాయిని మరచి సభా ప్రవేశం చేయరాదని భావించే సామాజిక వర్గమే ఈ కథా సృష్టికి మూలం అని గ్రహించడం కష్టం కాదు. కాని ఇక్కడ గమనించ వలసిన మరొక విషయం ఏమంటే ఈ కథ నేటికి మంచి వ్యాప్తి పొంది ప్రజలకు మంచి వినోదాన్ని కలిగిస్తూ ఉంది. వినోదం అనే తియ్యని పదం వెనుక విషాన్ని కక్కుతూ ఉంది ఈ కథ. కులం విషాన్ని కక్కుతూ ఉంది. ఈ కథను ఇలాంటి సామాజిక సందేశాన్నిచ్చే ఇలాంటి ఇతర జానపద కథా సంచయాలను ఏంచేయాలి. కులం విషం కక్కకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఈ కథలను ఏంచేయాలి. అనే విషయాన్ని విజ్ఞులందరూ చర్చించడానికి ఇక్కడ ముందుకు తెచ్చి వదులుతున్నాను. పులికొండ సుబ్బాచారి. 9440493604.

Friday, August 31, 2012

పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో దళిత సాహిత్యంపై సదస్సు


తెలుగులో దళిత సాహిత్యం – జాతీయ సదస్సు

శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మైసూరులోని భారతీయ భాషల సంస్థ సహకారంతో మూడురోజుల జాతీయ సదస్సును తెలుగులో దళితసాహిత్యం అనే అంశంపైన నిర్వహించింది. ఆచార్య మధుజ్యోతి తెలుగు శాఖ అధ్యక్షురాలు దీనికి సంచాలకులుగా ఉండి ఈ సదస్సును నిర్వహించారు. సిఐఐఎల్ నుండి డా. పరంధమ రెడ్డి గారు ప్రతినిధిగా వచ్చి ఆర్థిక వ్యవహారాలు చూస్తూ సదస్సునిర్వహణాభారాన్ని వహించారు.
మూడు రోజుల సదస్సు చాలా ఫలవంతంగా సాగింది. మొదటి ప్రారంభోత్సవానికి ఆచాహర్య మంజువాణి గారి శుభాకాంక్షల సందేశాన్నిచ్చారు. వ్యావహారిక భాషోద్యమ పితామహుడైన గిడుగు వేంకట రామమూర్తి గారి పుట్టిన రోజు అందునా తెలుగు భాషాదినోత్సవం రోజున ఈ సదస్సు ప్రారంభం కావడం విశేషం.
సదస్సులో మూడురోజుల్లో 62 పరిశోధన పత్రాలు వివిధ విశ్వవిద్యాలయాలనుండి కళాశాలలనుండి వచ్చిన పరిశోధకులు సమర్పించారు. దీని పైన చర్చ జరిగింది. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలైన, వచన కవిత, పద్యకవిత, నవల, కథ, నాటకం వంటి వాటిని వాహికగా చేసుకొని దళిత సాహిత్యం గడచిన మూడు దశాబ్దాలలో ఎలా సృజించబడింది అనే విషయాన్ని వివిధ పరిశోధన పత్రాలలో పరిశోధకులు చర్చించారు. ఇన్నిసాహిత్య ప్రక్రియలలో దళితుల జీవనాన్ని వర్ణించడం చాలా విశేషం. దళిత సాహిత్యం అనే ప్రత్యేక అస్తిత్వ సృహతో వచ్చిన ఇటీవలి సాహిత్యం మాత్రమే కాకుండా అంతకు ముందు కూడా అంటే జాషువ గారి వద్దనుండి వచ్చిన అప్పటి సాహిత్యాన్ని కూడా ఈనాటి దళిత దృష్టితో పునర్ మూల్యాంకనం చేయడం జరిగింది.
దళిత సాహిత్యానికి సమకాలీన సమాజంతో పూర్తి సంబంధం ఉంది. యదార్థంగా జరిగిన అకృత్యాలు దళితులపైని హింసాకాండ దళిత సాహిత్యం బాగా పదునెక్కడానికి కారణం అయింది. ఇది ఆక్రోశంతో రాసిన సాహిత్యంగా ప్రజల ముందుకు వచ్చింది. ఈ దళిత సాహిత్య సృజనం వల్ల దళితులలో ఆత్మగౌరవ స్థాయి పెరిగింది, ఆత్మన్యూనత తగ్గింది. ప్రశ్నించడం మొదలైంది. తిరుగుబాటు తప్పని సరి అని దళితులు గుర్తించారు. కులవృత్తి జీవన విధానం, ఆహారం, ఆహార్యం వంటి సాంస్కృతిక విషయాలు ఆత్మగౌరవ చిహ్నాలైనాయి. దళిత కళల ఆత్మగౌరవం పెరిగింది. ఈ అన్ని విషయాలను దళిత సాహిత్యం ఒడిసిపట్టి దానిలో ప్రతిబింబించింది.
దళిత జీవితాన్ని అక్షరబద్ధం చేసి చూసిన సాహిత్యం చాలా పరిమితంగా ఉంది. 59 కులాల జీవితాలలో రెండు కులాలు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించాయి. మరి పదిహేను కులాలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటే మిగిలిన దళిత కులాలు ఇంకా సాహిత్యప్రపంచంలోనికి ఎక్కనే లేదు. వారి జీవితాన్ని గురించి వర్ణించే సాహిత్యం ఏది ప్రజలకు చేరలేదు.
ఈ బ్లాగు కర్త పులికొండ సుబ్బాచారి మాదిగ కవిత్వం అస్తిత్వ గళం అనే పత్రాన్ని చదివి దానిలో మాదిగల వృత్తి జీవితం వారి సామాజిక అస్తిత్వాన్ని మాదిగలకోసం ప్రత్యేకించి రాసిన మాదిగ కవులు కవిత్వంలో ఎలా వ్యక్తం అయిందో ఏ సామాజిక పరిస్థితులు ఈ మాదిగ కవిత్వం రావడానికి కారణం అయిందీ వివరించాడు. మూడో రోజు తొలి సదస్సుకు అధ్యక్షత వహించి అధ్యక్షోపన్యాసం కూడా చేసాడు.
మూడు దశాబ్దాల దళిత సాహిత్యాన్ని ఒక్క సారి మూల్యాంకనం చేసిన ఈ సదస్సు మూడో రోజు 31 ఆగస్టున సాయంత్రం సమాపనోత్సవం చేసుకొని ముగిసింది. దీనిలో ఆచార్య కుసుమకుమారి (ఎస్కే యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి) ప్రధాన ప్రంసంగం చేశారు. దళిత సాహిత్యం పట్ల చక్కని అవగాహన కలిగేలా ప్రసంగించారు. దీనికి ఆచార్య మూలె విజయలక్ష్మి అధ్యక్షత వహించగా ఆచార్య మధుజ్యోతి సదస్సు నివేదికను సమర్పించారు. ఈ ఫలవంతమైన సదస్సులోని పత్రాలు అన్నింటినీ గ్రంథరూపంలో వెలువరిస్తామని కూడా ప్రకటన చేశారు. 

Saturday, July 28, 2012

My new poem on Agriculturalist life


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం 9440493604

ఆ శవం ఈ దారిలోనే పోవాలి...
అనే రైతుగీతం

గడ్డపలుగు చెలకపార మాట్లాడుకుంటున్నాయి
తమను పట్టుకునే చేతుల కేమైందని
వరి దుబ్బులు అనుకుంటున్నాయి
కలుపు తీసి ప్రేమతో  తమ వేళ్ళు చక్కవొత్తిన చేతుల కేమైందని 
నాగలి మేడి కన్నీరు పెట్టుకుంటూంది
తన సోగను పట్టుకున్న చేతుల కేమైందని
ఇంటి వసారాలో మూలకున్న తలపగ్గం ముల్లుగర్రా
గుసగుసలాడుతున్నాయి
ఆ చేతులు తమను ప్రేమతో పొదువుకోవడం లేదేమని
మెట్ట చేలో కోండ్ర తిరిగిన దుక్కి సాళ్ళు
తమ వెంట నడిచిన పాదాల కేమైందని బుగులుకున్నాయి
ఇంటిదారి అరక, కోటేరు వెనుక గీసిన ఏడికర్ర గీత
తనను ప్రేమతో తొక్కిన పాదాల కేమైందని దిక్కులు చూస్తూంది
ఎండిన మబ్బులు చూస్తున్నాయి అతని కళ్ళకేసి
నుదిటి చేత్తో తల పైకెత్తే ఆ నింగిచూపులెక్కడా అని
దమ్ము చేయని వరి మడి..
తన బురద గంధాన్ని అలదుకునే ఆ దేహం ఎక్కడా అనీ...
ఎండిన కృష్ణా గోదావరులు నిండుగా ఎడ్ల జత కళ్ళల్లో.....
బి.టి, మొన్ సాంటో ఏదైతేనేం
ఇక్కడ వేసిన గ్లోబల్ పత్తి విత్తనం
ఏదేశంలో డబ్బుకురిసిందో ఇక్కడ కళ్ళల్లో నీళ్లు విత్తింది
రెండు వేల అడుగులు దిగిన బోరుబావి
గొడ్డు గేదైంది, వడ్డీ సేటయింది
ఇంట్లో నగలను కంట్లో నీళ్ళనీ కాజేసింది
అది ఏరువాక పున్నమి కాదు
నిండు అమాస.. ఎవరు దోచారు ఇక్కడి వెలుగు వసంతాలను
గొర్రుకు పెట్టిన నొగలు పాడెకట్టె లయినాయి
అరకకు కట్టే పగ్గం పాడెకు దేహాన్ని కట్టింది.
ఓ స్వతంత్ర భారత దేశమా ఒక రోజు సెలవు పెడతావా
నీ వెన్నెముకని ఆర్ధో పెడిక్ హాస్పిటల్ లో చూపించాలి
యువతరమా నీ క్రికెట్ ఛానల్ కాసేపు ఆపుతావా
రైతు  శవం దగ్గరి పెళ్ళాం బిడ్డల ఏడుపులు
నేను కాసేపు గుండె నిండా వినాలి
ఓ పార్టీల నాయకులారా మీ రోడ్ షో కాస్త ఆపుతారా
ఒక రైతు శవం ఈ దారిలోనే పోవాలి....

Prof. Pulikonda Subbachary
Director, Internal Quality Assurance Cell
Dravidian University
Kuppam 517426

Wednesday, July 11, 2012

Article on Telugu Desham at Cross Roads


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం 9440493604

తెలుగు దేశం (19822014) ఒక అంతశ్శోధనం
ఉపఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ మునుపు ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను చూస్తూ ఉంది.  ఎన్నడూ లేని విధంగా ఎన్నికలలో నిలబడిన అన్ని స్థానాలలో ఓడిపోయి చేదు అనుభవాన్ని మూటకట్టుకుంది. అంతే కాదు తెలుగు దేశం పార్టీ నేడు ఒక సంక్లిష్ట పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ గడ్డుకాలాన్ని చవి చూస్తూ ఉంది. ఈ పరిస్థితిని చారిత్రక నేపథ్యంలో విశ్లేషించడమే ఇక్కడి ఉద్దేశం.
 ప్రజా స్వామ్య ప్రక్రియ భారత దేశంలో ఒక ప్రత్యేకమైన రూపం పొందింది. 65 సంవత్సరాల చరిత్రలో మన ప్రజాస్వామ్యం నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్నట్లుందే కాని దాని మౌలిక ప్రజాస్వామిక విలువలను పెంచుకోకపోగా భారత దేశంలో అధికారం అంటే మధ్య యుగాలనాటి రాచరిక వ్యవస్థ క్రమంగా నయారూపంలోనికి తీసుకు వచ్చి నయా రూలింగ్ డైనాస్టీస్ ను ఏర్పాటు చేస్తూంది. మన మార్కు ప్రజాస్వామ్యంలో అంటే బహుపార్టీల విధానంలో అధికారంలో ఉన్న పార్టీలు భ్రష్టు పట్టి ఒక రకమైన స్తబ్ధతకు దారితీయడం మనం గమనించాం. 1975 లో వచ్చిన ఎమర్జెన్సీ నాటి చీకటి రోజుల తర్వాత జనతా పార్టీ అధికారంలోనికి వచ్చే నాటి రోజులలో అఖిలభారత స్థాయిలో ఈ పరిస్థితి వచ్చింది. లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ చేసిన ఉద్యమం దీని వెనుక ఉంది. ఈస్థితిలో ప్రజలు తీవ్రమైన మార్పు కోరుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో 1979 – 82 మధ్య వచ్చింది. అప్పటి కాంగ్రెస్ పరిస్థితి  చాలా దారుణంగా తయారైంది. అధిష్ఠానం చేతిలో కీలుబొ మ్మలు ఇక్కడ రాష్ట్రంలో పార్టీలో చాలా ఎక్కువ కావడం గిల్లికజ్జాలు పెట్టుకోవటం  ఏడాదికొక ముఖ్యమంత్రి మారడం, రాష్ట్ర నాయకులకు నాయకత్వానికి ఒక స్వతంత్ర వ్యక్తిత్వం లేదు అనే స్థితి ఏర్పడింది,  అభివృద్ధి నీరుగారి పోయి ప్రజలు పూర్తిగా విసిగి పోయి ఒక శూన్యం ఏర్పడింది. దీన్ని శూన్యం అనడం కన్నా ఒక రాజకీయ దివాళా స్థితి అని అనవచ్చు. దీన్ని నింపే చారిత్రక అవసరంగా ఆనాడు మార్చి 29, 1982న తెలుగు దేశం పార్టీ ఏర్పడింది. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు బహుముఖీన ప్రతిభతో తెలుగు చిత్ర సీమను ఏలిన రారాజు ఎన్టీ రామారావు అంతటి మహానటుడు రాజకీయాలలోనికి రావడం పార్టీ పెట్టడం అనేవి తెలుగు వారికి నూతన చరిత్ర. సినిమా నటుడు ఎం.జి ఆర్ అప్పటికే రాజకీయాలలో విశేష ఆదరణ పొంది ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం అక్కడ ద్రావిడ కఝగం, ద్రావిడ మున్నీట్ర కఝగం, తర్వాత ఎం.జి. ఆర్ పార్టీ అఖిల భారత ద్రావిడ మున్నీట్ర కఝగం ప్రజలలో కలిగించిన స్ఫూర్తి, సాధించిన విజయాలు ఎన్టీఆర్ కి వెనుక స్ఫూర్తిగా నిలిచాయి. పార్టీ పేరు పెట్టడం ప్రచారం చేయడం ఈ శైలి అంతా అక్కడ నుండి తెచ్చుకున్నవే. తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అనే నినాదాలు ప్రజల్లో తారక మంత్రంలా మోగినాయి. అద్దాల మేడల్లో, దంతభవనాలలో ప్రజల కలలో మాత్రమే నివసించే ఎన్టీ ఆర్ ప్రజల మధ్యకు రావడం ఒక పెద్ద సంచలనం. అతని ఆకృతి వాచికం ప్రజల గుండెల్లో ఎల్లప్పడూ మారుమోగుతుంటాయా. అలాంటిది అతన్ని బహిరంగంగా బయట చూడడం అతని గొంతును సజీవంగా వినడం. ప్రజలకు సరికొత్త అనుభూతి. దేశ రాజకీయాలలో ఒక చైతన్య రథం అనే భావన అలా కూడా ప్రచారం చేయవచ్చు అనే రీతి దేశ రాజకీయాలలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలో పార్టీని అఖండ విజయం వైపు నడిపాడు. ప్రమాణ స్వీకారాన్ని అప్పటిదాకా జరిగే రాజభవనాలలో కాక ప్రజల మధ్య చేయడం మరొక సంచలనం. ఆయన చేసినవి అన్నీ వినూత్న ప్రయోగాలే సంచలనాలే. ఇవి రాజకీయాలకు కొత్త ఒరవడి తెచ్చాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో 204 సీట్లు సంపాదించి అనూహ్యమైన అఖండమైన విజయాన్ని పార్టీ సాధించింది. తెలుగు వారు ఆంధ్రప్రదేశ్ అనే మాటలు అంతర్జాతీయ మీడియాలోనికి వెళ్ళాయి. బిబిసి ప్రత్యేక వార్తాకథనాలు ప్రకటించింది.

ఎన్టీ ఆర్ ఏ ముహుర్తాన పార్టీ పెట్టాడో (ఇది పలుకుబడి, వ్యాసకర్తకు ముహుర్తాల మీద నమ్మకం లేదు) కాని ఆయన ఎదుర్కున్నవి సామాన్యమైన సమస్యలు కావు చాలా తీవ్రమైన ఆటుపోట్లు. అంత అఖండమైన మెజార్టీ సాధించి అధికారంలో ఉన్న పార్టీ ఐదు సంవత్సరాలు అవలీలగా పాలించి మళ్లీ విజయం దిశగా వెళ్లవలసి ఉంది. కాని అలా జరగలేదు. ఎన్టీఆర్ స్వభావతః రాజకీయ నాయకుడు కాడు. అతను ఆవేశ పూరితుడైన కళాకారుడు. దీనివల్ల ఆయన ప్రజల వద్దకు పోగలిగాడు ఓట్లు సంపాదించాడు. సీట్లు సంపాదించాడు, ప్రభుత్వాన్ని సాధించాడు కాని రాజకీయాలు ఆడలేకపోయాడు. అధికారాన్ని సాఫీగా నిలుపుకోలేకపోయాడు. అధికారానికి వచ్చిన సంవత్సరానికే 1984 ఆగస్టులో నాదెండ్లభాస్కరరావు అతనికి సన్నిహితంగా ఉన్న నాయకుడే పార్టీకి వెన్నుపోటు పొడిచి రామారావు ప్రభుత్వాన్ని కూలదోసాడు. ఇందిరాగాంధి కేంద్రంలో ప్రధానిగా అధినాయకత్వం ఉండడం. ఇక్కడ కాంగ్రెస్ తాబేదారు గవర్నర్ గా ఉండడంతో అల్పసంఖ్యాక ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం నాదెండ్ల భాస్కరరావుకు వచ్చింది. అమెరికా నుండి తిరిగి వచ్చిన ఎన్టీ ఆర్ కి వెంటనే ఉద్యమం చేయవలసి వచ్చింది. ఎమ్మెల్యేలని అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్ సమక్షంలో పరేడ్ చేయించి మెజారిటీ తన వద్ద ఉందని రుజువు చేయడం ఆనాడు అదొక కొత్త చరిత్ర. ఇందిరాగాంధికి ఎన్టీ ఆర్ ని తిరిగి అధికారంలోనికి తీసుకు రాక తప్పదు అనే ఇంటిలిజన్స్ నివేదికలు చాలా బలంగా వెళ్లాయి. దీనితో గవర్నర్ ని మార్చి రామ్ లాల్ స్థానంలో శంకర్ దయాళ్ శర్మను తీసుకురావడం ఎన్టీఆర్ కి ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం కల్పించడం వడివడిగా జరిగాయి. 31 రోజులు అధికారంలో ఉన్న నాదెండ్ల నెలరాజు అని కొత్త పేరు సంపాదించాడు. తిరిగి 1984లో సాధారణ ఎన్నికలు జరిగే సందర్భంలో ప్రభుత్వాన్ని రద్దు చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లాడు ఎన్టీ ఆర్. ఇది సాహసోపేతమైన చర్య అని అందరూ అప్పుడు కీర్తించారు. 1984 ఏడవ అసెంబ్లీలో తెలుగు దేశం 205  స్థానాలు గెలిచి తిరిగి చరిత్ర సృష్టించింది.
ఎన్టీఆర్ ప్రజాపాలనలోను ప్రజాసంక్షేమంలోను ఎన్నో కీలకమైన విజయాలు సాధించాడు. అన్నింటికంటే చెప్పవలసినవి పాలనా సంస్కరణలు. అడ్మినిస్ట్రేటివి రిఫార్మ్ అనేవి ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం నిజాంల పాలనలో జరిగాయి. తర్వాత జరగలేదని చరిత్ర చెబుతూంది. ఎన్టీ ఆర్ తాలూకాల వ్యవస్థను తొలగించి మండలాల వ్యవస్థని తెచ్చాడు. ప్రజలు ఆనాటి నుండి ఈనాటి వరకూ దీని సత్ఫలితాలను ఆనందిస్తున్నారు. తాలూకా వ్యవస్థలో అతి పెద్ద పరిమాణంలో తాలూకాలు ఉండడం వల్ల ప్రజలు పాలనా పరంగా సంక్షేమ కార్యక్రమాల అమలు పరంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కునే స్థితిలో మండలాల ఏర్పాటు ప్రజలకు వరంగా మారింది. దీని కన్నా ముఖ్యమైంది గ్రామాధికారుల వ్యవస్థను తొలగించడం. పటేల్, కరణం పద్ధతుల్ని తొలగించడం గ్రామస్థాయిలో ప్రజలకు మరొక వరంగా మారింది. రాచరిక వ్యవస్థ చిహ్నంగా మిగిలి ఈ దుష్ట వ్యవస్థని తొలగించే ధైర్యం అంతకు ముందెవరూ చేయలేదు. ఈ రెండు పాలనా సంస్కరణలు ఆనాటి తెలుగు దేశం వరంగా ఈనాటికీ ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. రెండు రూపాయలకు కిలోబియ్యం వంటి ఎన్నో విజయాలతో పాటు ఎన్టీ ఆర్ కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకొని ప్రజాగ్రహానికి కూడా గురయ్యాడు. ఉద్యోగుల వయోపరిమితి తగ్గించడం ఇందులో ఒకటి. తిరిగి కాంగ్రెస్ అధికారంలోనికి రావడానికి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఇదే కారణం అయింది. 1989 ఎన్నికల్లో తెలుగు దేశం 78 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైనా  తిరిగి 1994లో వచ్చిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించి మునుపెన్నడూ లేని విధంగా 218 స్థానాలు సాధించి మళ్ళీ చరిత్ర సృష్టించింది. ఇన్ని స్థానాల్ని ఏ పార్టీ ఇంతవరకు సాధించలేదు.

ఆ తర్వాత  పార్టీకి అతి గడ్డు సమస్య లక్ష్మీ పార్వతిరూపంలో ఎదురైంది. ఎన్టీ ఆర్ జీవితంలోనికి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి రాజకీయ పాత్ర పోషించి రాజ్యాంగేతర శక్తిగా మారింది. ముఖ్యమంత్రి ఎన్టీ ఆర్ అయితే పాలించేది లక్ష్మీ పార్వతి ఆమె చుట్టూ చేరిన వందిమాగధ గణం అనే స్థితి ఏర్పడింది.  ఎన్టీ ఆర్ కుటుంబసభ్యులు ఏకమై తమ తండ్రిని తమ  పార్టీని రక్షించుకోవాలనుకున్నారు. చంద్రబాబు నాయకుడుగా ఆయన కుటుంబ సభ్యులు అందరు చేసిన ప్రయత్నాల కారణంగా కుటుంబ సభ్యుల చేతనే ఎన్టీ ఆర్ అధికారాన్ని కోల్పోయి అతని అల్లుడైన చంద్రబాబే అగస్టు సంక్షోభంలో ముఖ్యమంత్రిగా అవతరించాడు. ప్రజల్లో దీనికి మిశ్రమ స్పందన వచ్చినా ప్రజలు చంద్రబాబును పార్టీ నాయకుడుగా వారసుడుగా అంగీకరించారు. తర్వాతి తర్వాతి ఎన్నికల్లో ఇదే రుజువు అయింది. 1994లో 218 స్థానాలలో అఖండ విజయం సాధించిన ఎన్టీఆర్ 1995లో నే అధికారాన్ని కోల్పోవడం అతను నిజమైన రాజకీయ నాయకుడు కాలేకపోయాడని రుజువు చేసింది. మంచి పరిపాలన అందించడం చేయగలిగాడు కాని రాజకీయాలు నడపలేకపోయాడు.
ఈ స్థాయి తర్వాతి నుండే తెలుగు దేశం పార్టీ ఎన్టీ ఆర్ కుటుంబంతో సంబంధాలు దోబూచులు మొదలయ్యాయి. ప్రభుత్వాన్ని లక్ష్మీ పార్వతి కబంధ హస్తాలలోనుండి తప్పించడానికి చంద్రబాబుకు వెనుక ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ నిలిచారు. తర్వాత 1995 నుండి 2004 నాలుగు వరకు చంద్రబాబు నిరాఘాటంగా పరిపాలించి కొత్త ఒరవడి సృష్టించాడు. అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నంత సేపు రాజకీయాలు మాట్లాడకపోవడం. ముఖ్యమంత్రి పదవిని పరిపాలించి ఒక సిఇఓ లాగా మార్చిన మార్కును సాధించాడు బాబు. కాని ఎన్టీ ఆర్ కుటుంబ సభ్యలనుండి చాలా ఆటుపోట్లను ఎదుర్కోవాల్సివచ్చింది. హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, ఇలా వారి కుటుంబ సభ్యులను ఎవరినీ అధికారంలోనికి పదవులలోనికి రానివ్వక పోవడం చంద్రబాబుపై వారిలో తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. మేము అతని వెనుక ఉండి అధికారంలోనికి తెస్తే అతను అధికారంలోనికి వచ్చి మమ్మల్ని దూరంగా నెట్టాడు అనే భావం వారిలో వచ్చింది. విసిగి పోయిన దగ్గుబాటి వేంకటేశ్వరరావు ముందు బి.జె.పిలో చేరాడు. తర్వాత చివరికి కాంగ్రెస్ వాదిగా అతను పురందేశ్వరి మారవలసి వచ్చింది. కాంగ్రెస్ మీద తన తండ్రి ఎన్టీఆర్ అలుపెరుగని పోరాటం చేసాడన్న విషయాన్ని కూడా పురందేశ్వరి మర్చిపోయేలా చేసింది వారికి అవసరమైన రాజకీయ బలం అధికార వాంఛ. ఇక హరికృష్ణ సొంత పార్టీ యే పెట్టుకున్నాడు. అన్నా డిం ఎంకె లాగా అన్న తెలుగుదేశం అని పార్టీ పెట్టాడు. కాని పూర్తిగా విఫలమై తిరిగి చంద్రబాబు వద్దకే చేరి పార్టీలో ప్రజలలో బాబుకు ఉన్న పట్టును అంగీకరించవలసి వచ్చింది. ఇక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడి ఒక్క సీటుకూడా గెలుచుకోలేకపోయింది. ఏతావాతా ఎన్టీ ఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీకి అసలైన వారసుడు చంద్రబాబుగా దానికి ఇప్పటిదాకా అధ్యక్షుడుగా బాబు ప్రజాంగీకారం పొందాడు, స్థిరపడిపోయాడు.
కాని ఎన్టీ ఆర్ కుటుంబ సభ్యులతో ఇతని సంబంధాలు అటు ఇటు, ఇటు అటు చెదిరి పోతూనే వచ్చాయి. హరికృష్ణకు మిగతా వారికి అధికార వాంఛ అలా తీరకుండానే వచ్చింది. పార్టీ పెద్దలు చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలే ఉన్నాయి అనే సన్నాయి నొక్కులు నొక్కుతూ ప్రజల మధ్య చెప్పుకునే స్థితి అప్పుడప్పుడూ వస్తూనే ఉంది. రాజుల కాలంలో రాజ్యాల మధ్య సత్సంబంధాలు ఏర్పడడానికి శత్రువుల పిల్లల్ని వివాహం చేసుకునే వారని చదివాం. బాలకృష్ణ తన కూతురిని చంద్రబాబు కొడుకు లోకేష్ కు ఇవ్వడంతో కుటుంబసంబంధాలలో కొత్త రాజకీయ కోణం వచ్చింది. బాలకృష్ణ బాబుకు దూరంగా పోలేని పరిస్థితి వచ్చింది. ఇక పురందేశ్వరి ఎలాగూ దూరం అయింది. కాగా ఇక హరికృష్ణ ఒంటరిగా నిలబడ్డాడు. జూనియర్ ఎన్టీ ఆర్ కొత్త శక్తిగా రూపుదాల్చడం ప్రజాభిమానం చాలా విస్తృతంగా ఉన్న నటుడు కావడం ఎన్టీఆర్ ని ప్రజలు అతనిలో చూడడం అన్నవి తిరిగి కొత్త సంబంధాలకు దారితీసింది. ఈ ఇద్దరు తండ్రీ కొడుకులు బాబుకు దూరం అవుతారని కొత్త పార్టీ పెట్టవచ్చుననే సంకేతాలు అప్పుడప్పుడూ వెలువడుతూ రావడం. సయోధ్యలు కుదుర్చుకోవడం ఇలా తెగూతూ ముడిపడుతూ రావడం జరుగుతూ వచ్చింది. 2009 ఎన్నికల నాటికి చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు పూర్తిగా సయోధ్య కుదరడం జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యతో పాటు ఎన్నికల ప్రచారంలో వీర విహారం చేయడం. తెలుగు దేశం పార్టీకి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల అండ పూర్తిగా ఉందనే సంకేతాలు పంపింది. హరికృష్ణ రాజ్యసభ సభ్యుడు కావడం దరిమిలా జరిగిన పరిణామం. అయినా ఈ సంబంధాలు ఇటీవల కూడా కొంత అపోహలకు అపార్థాలకు దారి తీసాయి. అనుమానాలు ఇంకా ఉన్నా సంబంధం స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే అది ఎన్టీ ఆర్ కుటుంబసభ్యులకు తప్పుడు సంకేతాలు పంపుతుంది. హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తో పార్టీ సంబంధాలు చెడి దీనివల్ల బెడిసి కొట్టవచ్చు. పార్టీ ఎన్టీ ఆర్ కుటుంబం నుండి చంద్రబాబు కుటుంబానికి శాశ్వతంగా పోతుందనే అర్థాలు వస్తాయి. దీనివల్ల పార్టీకి వచ్చే మేలు కన్నా కీడు ఎక్కువగా ఉంటుంది. పార్టీలో వీరవిధేయలు అధినాయకుడికి దగ్గర కావాలనుకునే వారు ఈ స్లోగన్లు తెస్తుంటారు. రాహుల్ ప్రధాని కావాలని వాదించిన రాజశేఖర్ చాలా బలవంతుడయ్యాడు. కాని  ఆ పార్టీ అప్పుడే అలా రాహుల్ ప్రధానిని చేసే ఆలోచన చేయక ఇప్పటి దాకా తొక్కి పట్టింది. ఈ స్థితి తెలుగు దేశానికి కూడా ఉంది. ఇక్కడే పార్టీ ఆచి తూచి వ్యవహరించక పోతే అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.
ఈ పరిణామాలు చెప్పే సంకేతాలు ఏమంటే కేంద్రంలో నెహ్రూ కుటుంబంలాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీ స్థాయిలో ఎన్టీ ఆర్ కుటుంబం అలా  ఏర్పడి అధికార కేంద్రంగా మారింది. ఈ వారసత్వపు ధోరణి మన ప్రజాస్వామ్యానికి అడ్డు కాదని ఇది అవసరం అయితే లాభిస్తుందని మన రాజకీయాలలో రుజువు అయింది. దీనికి దూరంగా పార్టీని బలోపేతం చేయాలనుకునే చంద్రబాబు సంకల్పం గండిపడుతూనే వచ్చింది.
1999లో తెలుగు దేశం పరాజయం పొంది ఓడి పోయి 184 సీట్లకు పరిమితమై కాంగ్రెస్ కు అధికార పగ్గాలను అందించింది. దీని కారణాలను విశ్లేషించుకుంటే ప్రజలు మార్పు కోరుకున్నారనే మొదటి విషయమే కాక అప్పటి చంద్రబాబు పాలనా శైలి కూడా దీనికి కారణం అయింది. హైటెక్ ముఖ్య మంత్రి అని పేరు తెచ్చుకోవడం. రైతులు ఎన్నో కడగండ్లు పాలు కావడం అతి వృష్టి అనావృష్టి. రైతులలో నిస్సహాయ స్థితి కలిగి ప్రభుత్వ వ్యతిరేక ధోరణి పెరగడం. ఇవే కాక బాబు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరులో ప్రజల మధ్యకు పాలనలో ప్రజల ఎదురుగా ప్రభుత్వాధికారులను నిలిపి వారిని తీవ్రంగా విమర్శించి దోషులుగా నిలబెట్టిన తీరు ఆరోజున ప్రజలు చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు. కాని ఈ ధోరణి ప్రభుత్వాధికారులలో తీవ్రమైన అసంతృప్తిని అలజడిని వ్యతిరేకతను సృష్టించింది అనే విషయాన్ని పార్టి గుర్తించలేకపోయింది. 1999 ఎన్నికల్లో ఉద్యోగ వర్గం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసి వ్యతిరేకంగా ఓటు వెయ్యడానికి కారణం అయింది. రాజశేఖర్ రెడ్డి తిరుగులేని నాయకత్వం, పాదయాత్ర ఉచిత విద్యుత్తు వంటి రైతులకిచ్చిన వరాలు ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోనికి రాగలిగింది. అప్పటి నుండి చంద్రబాబుకు తన పాలనా లోపాలను సరిదిద్దుకునే అవకాశం కాని పార్టీ తన తప్పిదాలను సరిచేసుకునే అవకాశం కాని రాలేదు. 2004 లో జరిగిన ఎన్నికల్లో అతి దీనంగా 47 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది.
తెలంగాణా విషయం 1999 నాటికే గడ్డుసమస్యగా తెలుగు దేశానికి పరిణమించింది. కాంగ్రెస్ తెరాసతో పొత్తు పెట్టుకోవడం ఆనాటికే కాంగ్రెస్ లాభించింది. తెరాస ఉనికి వల్ల అది బలపడడం వల్ల కాంగ్రెస్ కు వచ్చిన నష్టం కన్నా తెలుగు దేశానికి వచ్చిన నష్టమే అధికం. చిరంజీవి కొత్త పార్టీ పెట్టడం అనే కొత్త పరిణామం కాంగ్రెస్ కే లాభించి తెలుగు దేశం అధికారంలోనికి వచ్చే అవకాశానికి గండి కొట్టింది. చిరంజీవి కాంగ్రెస్ ఓట్లు చీలుస్తాడనుకున్న దేశం అంచనా తలక్రిందులైంది. దరిమిలా చిరంజీవి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం వేరే విషయం.
2009 ఎన్నికల్లో తెలుగు దేశం పుంజుకొని 94 స్థానాలు దాకా పొంద గలిగినా తెలంగాణా సమస్య తెరాస ఉనికి పార్టీకి తీవ్రమైన సమస్యని సృష్టించింది. తెలంగాణా వాదాన్ని అక్కడి పార్టీల నైజాన్ని ఎదుర్కోవడంలో  తెలుగు దేశం అప్పటినుండి ఇప్పటికీ సరిగ్గా వ్యవహరించలేక పోతూ ఉంది. మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని చెప్పిందే కాని అంతకు ముందుకు పోలేకపోయింది. కాంగ్రెస్ ఆడే రాజకీయ క్రీడను ఎదుర్కోవడమే దీని వెనుక ఉన్న వ్యూహం. కాంగ్రెస్ మేము తెలంగాణాను కచ్చితంగా ఇస్తాం అని అధిష్ఠానం చెప్పలేక రెండు పడవల్లో కాళ్ళు పెట్టి కూర్చొంది. అలాంటప్పుడు మేము తెలంగాణా రాష్ట్రాన్ని కోరుతున్నామని ఎందుకు చెప్పాలి అది అధికారంలోఉన్న కాంగ్రెస్సే చెప్పాలి కదా అనేది తెలుగు దేశం వ్యూహం.
ఈ ఆలోచనను దేవేందర్ గౌడు రాజ్యసభలో చాలా స్పష్టంగా చెప్పాడు. "చిదరంబరం ఇతర పార్టీలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఏముంది. పార్లమెంటు లో వారు తీసుకునే నిర్ణయాలు అన్నీ మమ్మల్ని సంప్రదించి తీసుకుంటున్నారా. బిల్లులన్నీ తమ అభిప్రాయాన్ని తీసుకొని పెడుతున్నారా. ఇప్పుడు మా అభిప్రాయం దేనికి తెలంగాణా పూర్తిగా ఇస్తాం అని మీరే చెప్పండి". అని వాదించాడు. దీనితో తెలంగాణా బంతిని కాంగ్రెస్ కోర్టులోనికి తెలుగుదేశం బాగా బలంగా తోయగలిగింది. వ్యూహం బాగానే ఉంది కాని దీని వల్ల తెలంగాణా ప్రజలకు కాంగ్రెస్ ఎలా దూరం అవుతూ ఉందో తెలుగు దేశం కూడా అలాగే దూరం అవుతూ వస్తూ ఉంది. ఈ నిజాన్ని పార్టీ గ్రహించాలి. తెలుగు దేశం రైతు చైతన్య యాత్రలు నిర్వహించి ఇతర కారణాలతోను చంద్రబాబు తెలంగాణాలో విస్తృతంగా పర్యటించినప్పుడు పార్టీ పరిస్థితి నిజానికి బాగా మెరుగుపడింది. పార్టీ తెలంగాణా ఫోరంలో ఎర్రబెల్లి, మోత్కుపల్లి చేసే తెలంగాణా వాదం కెసిఆర్ పై విమర్శ చాలా గట్టిగానే మీడియాలో వినపడింది. తెలుగుదేశం నిజంగా తెలంగాణాని పూర్తిగా సమర్థిస్తే రెండు రాష్ట్రాలలోను తెలుగు దేశం గట్టిగా నిలబడి అధికార పగ్గాలను పట్టే అవకాశం కూడా ఉంటుంది. కాని ఇది చాలా ఖరీదైన రాజకీయ క్రీడగా మారే అవకాశం కూడా లేకపోలేదు. సీమాంధ్రలో ఉన్న తెలుగు దేశం నాయకత్వాన్ని మానసికంగా అందుకు తయారు చేసే స్థితిలో కాని ఒప్పించే స్థితిలో కాని పార్టీ  లేదు.
సీమాంధ్రలో వైకాపా కొత్తశక్తిగా అవతరించింది. నిన్న మొన్న జరిగిన ఉపఎన్నికలు తెలుగు దేశానికి ఎన్నడూ లేని చేదు అనుభవాన్ని అందించాయి. కాని వచ్చిన ఓట్ల సంఖ్య ఆశాజనకంగానే ఉంది. పార్టీ రెండో స్థానంలో ఉండడం గుడ్డిలో మెల్ల అన్నట్లుంది. కాగా తెలంగాణాలో తెరాసని నిలువరించి అధిక స్థానాలు పొందాలంటే తెలంగాణా విషయంలో కాంగ్రెస్ కన్నా తామే మేలు అనే సంకేతాన్ని ప్రజలకు అందించవలసి ఉంటుంది. తెరాస కన్నా తామే తెలంగాణా ప్రయోజనాలను కాపాడగలం అని కూడా అది ప్రజల్లో నమ్మకాన్ని కలిగించవలసి ఉంది. ఇలా కాని పక్షంలో పార్టీ పరిస్థితి ఏదో కొన్ని స్థానాలకు పరిమితం కావలసి ఉంటుంది.
ఇక పార్టీకి ఎన్టీ ఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న తాజా పరిస్థితి ఇంకా కొంత అనుమానపు సంకేతాలను అందిస్తూనే ఉంది. హరికృష్ణ జూనియర్ ఎన్టీ ఆర్ మాతోనే ఉన్నారని పదే పదే ప్రజలకు నమ్మించేలా చెప్పుకోవలసిన పరిస్థితే ఎదురవుతూ ఉంది. బాలకృష్ణ ప్రచారం చేస్తానని చెబుతున్నాడు అతనికి వేరే మార్గం కూడా లేదు. ఈ కుటుంబం ఎలా చివరికి పవర్ సెంటర్ గా తనకు ఎదురు శక్తిగా నిలబడుతుందా, లేక తమకు పూర్తిగా అనుకూలంగా ఉండి బాబు నాయకత్వానికి వెనుక ఉండడానికి సిద్ధపడుతుందా అనే విషయాన్ని కూడా నాయకత్వం ఇప్పుడు సరిచూసుకోవసలిన అవసరం ఉంది.
ఎన్టీ ఆర్ పార్టీ పెట్టిన దగ్గరనుండీ బి.సిలకు పార్టీలో పెద్ద పీట ఉంది. 50 శాతం స్థానాలకు మించి బి.సి ఎస్.సిలకు సీట్లు ఇచ్చింది పార్టీ. అంతే కాదు బాబు పాలనలో కూడా బి.సిలు కీలకమైన మంత్రి పదవులు పొందారు. కానీ ఇటీవల పార్టీ కొంత బి.సిలకు దూరం అవుతూ వచ్చినట్లు ఇటీవలి ఎన్నికల్లో తెలియవస్తూ ఉంది. 2014 నాటికి ఇప్పుడున్న నేపథ్యంలో పార్టీ వ్యూహరచన చేసుకోవలసి ఉంటుంది. బి.సి ఎస్.సి లకు సింహభాగాన్ని ఇచ్చి. ఎనబై శాతం సీట్లను ఈ రెండు వర్గాలకు పార్టీ ఇవ్వగలిగితే నిజమైన అధికారాన్ని బలహీన వర్గాలకు బదిలీ చేసే స్థిరసందేశాన్ని ఈ బి.సి ఎస్.సి వర్గాలకు ఇవ్వగలిగితే తిరిగి పార్టీ పూర్వ వైభవాన్ని పొందే అవకాశం ఉంది. 2014 నాటికి బి.సిలు పార్టీపెట్టి అది ఒక నిర్ణాయక శక్తిగా మారే అవకాశాలు ఎండమావుల్లా ఉన్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ మా పార్టీ లో బి.సి సెల్లు ఉంది దానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు వారికి కూడా పదవులు ఇస్తున్నాము అని చెప్పుకోవడం, కాక. మాదే బి.సిల పార్టీ బలహీన వర్గాలు అన్నింటికి కలిపి ఎనబై శాతం సీట్లు ఇస్తున్నాం ఇది బి.సిల పార్టీ అని ఒక ముద్రను పార్టీ ఇవ్వగలిగితే 2014 నాటికి ఇలాంటి వ్యూహరచన చేసుకోగలిగితో రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ పూర్వ స్థితిని పొందే అవకాశం ఉంది.  బి.సిలకు బలహీన వర్గాలకు ఎనబై శాతం సీట్లు ఇవ్వడం అన్నది వైకాపా చేయలేదు, కాంగ్రెస్ అసలే చేయలేదు. చేయగలిగేది ఒక తెలుగుదేశం పార్టీయే. మాది బి.సిల పార్టీ అనిపించుకోగలగిన అవకాశం దానికే ఉంది. ఈ వ్యూహం తెలుగుదేశానికి వరం అయ్యే అవకాశం ఉంది. సీమాంధ్రలో తెలుగు దేశం సంపూర్ణ మెజారిటీ సాధిస్తే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో 2014 నాటికి తెలుగు దేశం పూర్తిగా నిర్ణాయక శక్తిగా మారవచ్చు. ఏమైనా తెలుగు దేశం పార్టీ ఇప్పుడు ఇంతకు ముందెన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటూ ఉంది. బలహీన వర్గాలకు సామాజిక న్యాయమే కాదు రాజ్యాధికారం అవసరం ప్రాంతీయ న్యాయమూ అవసరం అనే నిజాన్ని గ్రహించి పార్టీ 2014 కు వ్యూహరచన చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ ఆర్ నాటి వైభవాన్ని పొందవచ్చు.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.
9440493604