Friday, May 11, 2012



ప్రొఫెసర్   పులికొండ సుబ్బాచారి
Director, Internal Quality Assurance Cell
ద్రావిడ విశ్వవిద్యాలయం 517425
09440493604psubbachary@gmail.com

తొలి అస్మితి (అస్తిత్వ) సాహిత్యం కులపురాణాలే
తెలుగులో అస్తిత్వ సాహిత్యం అనే ఒక సాహిత్య వర్గీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. ఇటీవలే అంటే మరీ ఐదారు సంవత్సరాలే అయింది. రకరకాల రాజకీయ కారణాలవల్ల సాంఘిక సంఘర్షణల కారణంగా తెలుగులో కవులు రచయితలు కూడా సామాజిక వర్గాల రీత్యా విభాజితమయ్యారు. దళిత సాహిత్యం అని దళిత కవిత్వం అని ప్రారంభమై అది బాగా ఒక ప్రత్యేక అస్తిత్వంతో నిలదొక్కుకున్న తర్వాతనే మిగతా సామాజిక వర్గాల నుండి కూడా ఈ రకమైన అస్తిత్వవాణి వినబడుతూ వస్తూ ఉంది. తెలుగులో దళితుల గురించి దళిత సమస్యను గురించిన సాహిత్యం ఎప్పటినుంచో ఉన్నా దళిత సాహిత్యమనే కొత్త వర్గీకరణ చేయడం 80 వ దశకంలోనే ఆరంభం అయింది.  ఈ రోజున దళిత సాహిత్యం కన్నా భిన్నంగా, మైనారిటీ సాహిత్యమని, వెనుకబడినకులాలవారి సాహిత్యమని బహుజన సాహిత్యమని స్త్రీవాద సాహిత్యమని ఇందులో కూడా ఉన్నత వర్గాల స్త్రీ వాద సాహిత్యం, దళిత బహుజన వర్గాల స్త్రీవాద సాహిత్యమని, మైనారిటీ స్త్రీ సాహిత్యమని ప్రత్యేకమైన వర్గీకరణలతో సాహిత్యం వస్తూ ఉంది. తెలుగు సాహిత్య ప్రక్రియలు చాలా ఉన్నా ఈ  సామాజిక అస్తిత్వాలను గురించి విచారించి రాసే సాహిత్యం, వచన కవిత, కథా ప్రక్రియల్లో బాగా వెలువడింది. దళిత కవిత్వం, మైనారిటీ వర్గాలకు చెందిన కవిత, స్త్రీవాద వివిధ రకాల స్త్రీవాద కవిత అలాగే వెనుకబడిన తరగతులకు  వృత్తి కులాలకు చెందిన కవితలు కవితాసంపుటాలు బాగా వెలువడినాయి. కథలు కూడా మైనారిటీ జీవన చిత్రాలను బాగా తెలిపేవి, చేతివృత్తుల కులాల జీవన గమనాలను సమస్యలను బాగా వర్ణించిన కథలు బాగా వెలువడినాయి. చేతి వృత్తుల వారి జీవితాలను బాగా వర్ణించిన కథా సాహిత్యంపైన విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇక నవలా ప్రక్రియలో కూడా వివిధ సామాజిక వర్గాల అస్తిత్వాన్ని ప్రత్యేకించి చిత్రించిన నవలలు వచ్చాయి. ముఖ్యంగా దళిత జీవితాన్ని గురించి వెనుకబడిన వృత్తి కులాల వారి గురించిన నవలా సాహిత్యం కనిపిస్తూ ఉంది.  కొంత కాలం గడిచిన తర్వాత తిరిగి తెలుగు సాహిత్య చరిత్రను రచింప బూనుకునే సాహిత్య చరిత్రకారులు ఈ గడచిన రెండు దశాబ్దాలలో జరుగుతూ వస్తున్న సామాజికపరిణామాల్ని వాటికనుగుణంగా వస్తూ ఉన్న సాహిత్య వర్గీకరణాల్ని బాగా గమనించవలసి ఉంటుంది.  
తెలుగులో ఇటీవలి కాలంలో సామాజిక సమూహాల గుర్తింపునకు సంబంధించి వెలువడిన సాహిత్యాన్ని గురించి ఆలోచించి చేసిన విమర్శనా వ్యాసాలు వాటిపైన చర్చోపచర్చలు ఆయా సామాజిక వర్గాలుగా విడిపోయిన రచయితలు రచయిత్రులు వారి సంఘాల మధ్య రాజకీయాలు వీటిపైన ఘాటైన చర్చలు దాదాపు ఏడాది క్రితం వివిధ పత్రికలలో బాగా జరిగాయి. అధిక ఉష్ణోగ్రతతో కూడిన చర్చల గురించి  లోతుపాతుల్లోనికి వెళ్ళి ఎలువు సలువులను క్షుణ్ణంగా చర్చించవలసిఉంది.
 ఒక వ్యక్తికి సంబంధించి కాని వ్యక్తుల సమూహం అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన అంటే భారతీయ సందర్భంలో కులానికి సంబంధించిన  సామాజిక పరమైన గుర్తింపును గురించి సామాజిక సమస్యను గురించి ఆలోచించి సాహిత్యాన్ని సృజించడం గాని ఒక సామాజిక వాదాన్ని వినిపించడానికి గాని సాహిత్యాన్ని చేయడం చాలా ప్రాచీన కాలంనుండే శతాబ్దాల నాడే ఉందని చెప్పడానికి వీలుంది. ఈరకమైన సాహిత్యాన్ని గురించి వివేచిస్తూ దీని సామాజిక ప్రకార్యాలను (functions) క్షోదక్షమంగా చర్చించవలసి ఉంది. ఇలాంటి సాహిత్యం తెలుగులో కూడా అతి ప్రాచీన కాలంనుండి ఉంది. కాని దాన్ని ఒక వర్గం పైకి రానీయకండా పరిశీలనకు రానీయకుండా చేసింది. ఈ సామాజిక సాహిత్యం ఒక సమాంతర రేఖలో మౌఖిక సాహిత్యంలో కొనసాగి వస్తూనే ఉంది. దీన్ని గురించే ఇక్కడ చర్చించడానికి లక్షించాను.
ఇక్కడ కొంత పదచర్చ కూడా తప్పని సరి అవసరం.  అస్తిత్వం అనే పదాన్ని తెలుగు సాహిత్య విమర్శలో ఇంతకు ముందు వేరే అర్థంలో వాడేవారు. Existence అనే పదానికి సమానార్థకంగా అస్తిత్వం అనే పదాన్ని గ్రహించిExistentialism అనే సాహిత్య వాదాన్ని తెలుగులో అస్తిత్వవాదసాహిత్యం అనేపేరుతో అనువదించి బాగా వ్యవహరించారు. అరవై డెబ్బై దశకాలలో వచ్చిన సాహిత్య విమర్శ విశేషించి నవలపై వచ్చిన సాహిత్య విమర్శలో ఈ పదాన్ని బాగా వినియోగించారు. కాగా ఇటీవల అస్తిత్వం, అస్తిత్వసాహిత్యం, అస్తిత్వవాదం అనే మాటల్ని ఇక్కడ చెప్పిన వింగడింపుకన్నా భిన్నంగా పైన చెప్పిన కొత్త అర్థంలో వినియోగిస్తున్నారు. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన గుర్తింపును అస్తిత్వం అని ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సాంఘిక గుర్తింపును గురించి సృజించిన సాహిత్యాన్ని అస్తిత్వ సాహిత్యం అని వ్యవహరించడం ఇటీవల జరుగుతూ ఉంది. నిన్నమొన్నటి పత్రికలలో వచ్చిన సాహిత్య వ్యాసాలలో ఇలా వినియోగించారు. కొత్తగా వీటిని చదివేవారికి పెద్దగా ఇబ్బంది అనిపించకపోయినా తొలినాటి నుండీ వచ్చిన సాహిత్య విమర్శను చదువుతూ వస్తున్న వారికి మాత్రం ఈ పదం చాలా ఇబ్బందిగానే ఉంది. పాత,Existentialism అనే అర్థమే మనసులో ఉన్నవారికి అస్తిత్వవాదం అని చూడగానే అదే గుర్తుకు వస్తుంది. అయోమయానికి గురిచేస్తుంది.నిజానికి literature of social identity అనే అర్థం వచ్చేలా సమకూర్చడానికి  అస్తిత్వవాదసాహిత్యం అనే పదబంధ సరిపోదు. ఐడెంటిటీ అనే ఆంగ్లపదానికి సరైన తెలుగు పదం గుర్తింపు. కాని గుర్తింపు అనే అచ్చ తెలుగు పదంతో తర్వాత అవసరమైన సమాసాలని చేయలేము. ఉదాహరణకి గుర్తింపు సాహిత్యమనో గుర్తింపువాదం అనో గుర్తింపువాద సాహిత్యమనో సమాసాలు చేస్తే అంత బాగోదు. అంటే ఇక్కడ వ్యాకరణం ప్రకారం ఇవి వైరి సమాసాలు అనో దుష్ట సమాసాలు అనో వ్యతిరేకించడం కాదు. కాని వినడానికే అంత బాగాలేవు. వీటికి పూర్తిగా వచ్చే సంస్కృత సమాసాలు చూడవలసిందే. అస్మి అంటే నేను అస్మితి అంటే నేను అనే భావన అంటే  నా అస్మితి అంటే నేను అనే ఐడెంటిటీ. వివిధ సామాజిక వర్గాలు వాటి సామాజిక పరమైన గుర్తింపును గురించి సామాజిక వర్గాల సామాజిక సమస్యల గురించి సృష్టించే సాహిత్యం అంతా వారి సామాజిక గుర్తింపు అంటే ఐడెంటిటీని గురించి రాసే సాహిత్యమే. ఈ భావనలో దీన్ని అస్మితిసాహిత్యం అని అనవచ్చు.  హిందీ సాహిత్యంలోను అస్మితి అనే మాటను వినియోగిస్తున్నారు. తెలుగులో ఇటీవలి కాలంలో వచ్చిన ఈ సాంఘిక వాదాన్ని అస్మితివాదం అని ఇలా వివిధ సామాజిక వర్గాలు సృష్టించుకుంటున్న సాహిత్యాన్ని అస్మితిసాహిత్యం అని అస్మితివాదసాహిత్యంఅని స్పష్టంగా వర్గీకరించి అధ్యయనం చేయవచ్చు. వర్గీకరణ అనేది ఇప్పటికే జరిగిపోయింది. కాబట్టి ఈ కొత్త సాహిత్య వర్గీకరణని అస్తిత్వసాహిత్యం అని అనకుండా అస్మితిసాహిత్యం ఈ నేపథ్యంతో చేసే వాదాన్ని అస్మితివాదం అని  ఆ సాహిత్యాన్ని అస్మితివాదసాహిత్యం అని వ్యవహరిస్తే బాగుంటుంది అని ఇక్కడ ప్రతిపాదిస్తున్నాను.
ఇక సాంఘిక అస్మితిని గురించి సాహిత్యం ఎప్పటినుండి వస్తున్నది అని వివేచిస్తే, ఇది పైన చెప్పినట్లు ఇప్పటిది కాదు. ఆధునిక సాహిత్యానికి లిఖిత సాహిత్యం విషయానికి వస్తే పైన చెప్పిన రీతిలో ఇది ఇటీవలిదే. కాని మౌఖిక సాహిత్యంలో శతాబ్దాలనుండే అస్మితిసాహిత్యం వస్తూ ఉంది. కాని మనం మౌఖిక సాహిత్యాన్ని సాహిత్యంగా గుర్తించింది మహా అయితే ఒక వంద సంవత్సరాలనుండి. మౌఖిక సాహిత్యం కూడా సాహిత్యమేనా అని వాదించే వారు ఇప్పటికీ ఉన్నారు. ఇది మన బలహీనత, దౌర్భాగ్యం.  ప్రపంచంలోని 6,500 భాషలలో భారతదేశంలోనే 1650 భాషలు ఉన్నాయి. కాని వీటిలో లేఖన సంప్రదాయం ఉన్న భాషలు 20 మాత్రమే. ఇవి రాజ్యాంగం గుర్తించిన 20 భాషలు వీటిలో కూడా అన్నింటిలో ఉన్నత స్థాయిలో లిఖిత సాహిత్యం లేదు. కాని మిగిలిన 6530 భాషలకు కూడా సాహిత్యం ఉంది. వాటిలో కూడా రామాయణ భారతాలు, కవిత్వం, కథలు ఉన్నాయి. కాని 95 శాతంగా ఉన్న ఈ మౌఖిక సాహిత్యాన్ని ఇంకా మనం సాహిత్యం గా గుర్తించడం లేదు.
తెలుగులోని  మౌఖిక సాహిత్యం ప్రాచీనత గురించి చర్చించవలసిన అవసరం లేదు. ఈ భాష ఎంత ప్రాచీనమైందో దీని సాహిత్యం కూడా అంత ప్రాచీనమైంది. కులపురాణం అనే సాహిత్య ప్రక్రియ కూడా ఇంత ప్రాచీన మైంది. కులపురాణాన్ని ఒక సాహిత్య ప్రక్రియగా గుర్తించి దానిపైన ప్రత్యేకంగా పరిశోధించడం 1980 దశకం నుండి అస్మదాదులతో ప్రారంభం అయింది. అప్పటిదాకా వచ్చిన సాహిత్య విమర్శలో విశేషించి పురాణాల పైన పరిశోధన చేసిన పండితులు వీటిని సాహిత్య ప్రక్రియగా గుర్తించకుండా పక్కకి నెట్టివేశారు. కారణం ఇవిమౌఖిక సాహిత్యంలో ఉన్నాయనే కాదు. లిఖిత సాహిత్యంలో కూడా ఇవి వచ్చినా ఇవి కొన్ని కులాల సామాజిక అస్మితి (అస్తిత్వం) గురించి మాట్లాడి అగ్ర కులాల అధిపత్యాన్ని తిరస్కరించిన కారణానే వీటిని సాహిత్య ప్రక్రియగా గుర్తించక సాహిత్య ప్రపంచంలోనికి రాకుండా అడ్డుకున్నారు.
కులపురాణం అన్నది తొలి సాహిత్యప్రక్రియగా కూడా చెప్పడానికి వీలుంది. కారణం సాహిత్య ప్రక్రియలలో పరివర్థితమైన సాహిత్య ప్రక్రియగా ప్రతి సంస్కృతిలోను పురాకథ లేదా మిత్ అనే ప్రక్రియ కనిపిస్తూ ఉంది. సృష్టి గురించిన సాహిత్యం వివిధ సామాజిక వర్గాల పుట్టుకల గురించిన పురాకథా సాహిత్యం అతి పురాతన జాతులలోను కనిపించిన వైనాన్ని ప్రపంచ వ్యాప్తంగా జానపదవిజ్ఞానులు, ఆంథ్రోపాలజీకి అంటే మానవ శాస్త్రానికి చెందిన శాస్త్రజ్ఞులు ఇప్పటికే వివరించి ఉన్నారు. తెలుగు విషయానికి వస్తే మనకు స్పష్టమైన లిఖితసాహిత్యం 11 వ శతాబ్దినుండే కనిపిస్తుంది. అదీ లభించినంత వరకు అనే ఇక్కడ చెప్పేది. కనీసం ఆరవ శతాబ్దంనుండే లిఖిత పద్యసాహిత్యం కావ్యాలు ఉన్నట్లు శాసనస్థ ఆధారాలు చెబుతున్నాయి. తెలుగు భాష ప్రాచీనతను నిరూపించి కేంద్రప్రభుత్వ ప్రాచీన భాష హోదా పొందే ప్రయత్నంలో జరిగిన ఇటీవలి పరిశోధనలో ఇది బాగా తెలియవచ్చింది. అదే కాలంనుండి అంతకు ముందే కులపురాణ సాహిత్యం తెలుగులో అటు మౌఖిక సాహిత్యంలో ఉందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి.
కులపురాణం ప్రాచీనత గురించి విశేషించి అది గొంతు విప్పే సామాజిక అస్మితిని గురించి వివరంగా చర్చించవలసి ఉంది. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే విశ్వకర్మపురాణం సంస్కృతంలో ఉన్నట్లు మనకు శ్రీమాన్ కొండూరు వీర రాఘవాచార్యులవారి పరిశోధనలో తెలియవచ్చింది. వడ్డెపాటి నిరంజన శాస్త్రిగారు 1937లో ప్రచురించిన విశ్వకర్మబ్రాహ్మణ వంశాగమము అనే గ్రంథంలో వేదాలలో పంచఋషి సంప్రదాయం గురించి చాలా వివరంగా ఉంది. ఇందులో పంచగోత్ర ఋషుల గురించి వారు అనుసరించే అనుష్ఠానాల గురించి చాలా వివరంగా ఉంది. సప్తఋషి సంప్రదాయం గురించి మాత్రమే మాట్లాడే వర్గం వీరి గురించి మాట్లాడరు. కారణం వీరు విశ్వకర్మ కులానికి చెందుతారని విశ్వకర్మపురాణంలో విశ్వకర్మల ప్రాచీనతను సామాజికంగా ఉన్న ఔన్నత్యాన్ని గురించి మాట్లాడవలసి వస్తుందని అంగీకరించవలసి వస్తుందని ఒక భయం. ఒక సామాజిక వర్గం అస్మితిని వివరించే ఈ వేదప్రామాణ్యాన్ని కూడా వీరు అంగీకరించరు. ఇదే విశ్వకర్మపురాణం బ్రాహ్మణాధిక్యతని తిరస్కరించి ఐదు శ్రామిక వృత్తులు కళావృత్తుల కులాలవారి సామాజిక అస్మితిని తెలియజేస్తూ మౌఖిక మాధ్యమంలో ఆనాటి నుండీ వస్తూ ఉంది. దీన్ని దాదాపు 17 వశతాబ్దంలో వీపూరి వెంకటార్యుడు అనే కవి విశ్వకర్మపురాణం పేరుతో పద్యకావ్యంగా రాశాడు. మన సమాజంలో అంటరానితనం అనే ఘోర సామాజిక దురన్యాయానికి గురైన మాదిగ మాల కులాలకు కులపురాణంగా ఉంది జాంబ పురాణం. జాంబపురాణం అన్ని ఇతర కులాల అధిక్యతని నిరసిస్తూ మాదిగ కుల మూలపురుషుడు అయిన జాంబవంతుడు సృష్టికి ఆదిగా జన్మించి ఇతర దేవతల మానవుల సృష్టికి వారి చేతివృత్తుల కులాలకు వారి పనిముట్ల సృష్టికి కారణం అయ్యాడని చాలా విపులంగా వివరిస్తుంది. జాంబపురాణం మౌఖిక సాహిత్యం లో ఎప్పటినుండి వస్తున్నది అని ప్రత్యేకంగా ప్రశ్నించవలసిన అవసరమే లేదు. జాంబపురాణం తాళపత్ర రూపంలో కూడా డక్కలి వారి వద్ద, నులక చందయ్యల వద్ద కొన్ని శతాబ్దాలనుండే వస్తూ ఉంది. అసలు నిమ్నకులాల వారు తాళపత్రాలు తయారు చేస్తారని వాటిమీదకొన్ని శతాబ్దాలనాడే ఘంటంతో రాశారని మన ఉన్నత సామాజిక వర్గాల వారు ఇప్పటికీ నమ్మలేని నమ్మని నిజం. విశ్వకర్మ కులంవారే కాదు  దళితులలోనే అతిదళితులుగా భావించే నులక చందయ్యలలో, డక్కలి కులం వారిలో తాళపత్రాలు చేసి వాటిపైన గ్రంథ రచన చేయడం ఉంది అని శతాబ్దాలనాడే ఉంది అని ఈనాటి నాగరక సమాజం కళ్ళువిప్పి తెలుసుకోవాలి. కులపురాణం సామాజిక అస్మితిని ఎలా తెలియజేస్తుంది. ఎలా వాదిస్తుంది అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణని అతి క్లుప్తంగా ఇక్కడ చెప్పవలసి ఉంది. "ఒక ఊరిలో ఒక సాలె కులస్తుల ఇంట్లో పెళ్ళి అయింది. పెళ్ళి జరిగిన తర్వాత ఊరేగింపు తీసారు. ఊరేగింపులో పగటి దివిటీలు పచ్చ జెండాలు పట్టుకొని బజారులో పోతున్నారు. ఇలా పోయే ఊరేగింపును రాజుగారు ఆయన మహలులో ఉన్నతసౌధం కిటికీలలోనుండి చూశాడు. భటులను పిలిచి ఎవరా ఊరేగింపు ఏమా సంగతి అని అడిగాడు. భటులు వచ్చి సాలెవారి ఇంట్లో పెండ్లి అని చెప్పారు. ఆఁ కులంతక్కువ వారు అయిన సాలెవారికి ఇంత అహంకారమా. పగటి దివిటీలు పచ్చజెండాలు అనేవి అయితే రాజకుటుంబాల ఊరేగింపులోగాని దేవుళ్ల ఊరేగింపులో కాని ఉపయోగించాలి.  ఈ సాలెవారికి ఇంత ధైర్యమా వారిని పిలిపించండి అని ఆజ్ఞవేశాడు. వారు అఘమేఘాలమీద సాలె ఇంటి యజమానిని రమ్మని దండధారులు గద్దించారు. ఆ ఇంటి యజమాని భయపడ్డాడు అనుకున్నంతా జరిగిందని తన కులంవారు అందరితో సమావేశమై తన కులానికున్న హక్కును గురించి మాట్లాడుకున్నారు. చివరికి తమ వాదాన్ని వినిపించడానికి వారి కులగాయకుడు పౌరాణికుడు అయిన పురాణం కొండయ్య అనే అతన్ని రాజుగారివద్దకు పంపించారు. రాజు ఇంటి యజమాని రాకుండా నువ్వు వచ్చావేం అని ఉరిమాడు. మహారాజా తమకు మాహక్కు గురించివివరించడానికి పురాణకథ తెలిసిన నన్ను పంపారు అని చెప్పాడు వినయంగా. ఏమిటా హక్కు, పగటి దివిటీలు, పచ్చజెండాలు పట్టుకునే హక్కు రాజులకు దేవుళ్లకే ఉంది. మీకు లేదు దీనికి శిక్షఅనుభవించాలి అని గర్జించాడు రాజు. మహారాజా మీరు ఏ శిక్ష అయినా వేయండి కాని నేను మనవిచేసేది విన్నతర్వాత వేయండి అని అభ్యర్థించాడు. రాజు అంగీకరించాడు. మహారాజా నావిష్ణుఃపృథివీపతిః అని తమరు అంగీకరిస్తారు కదా అని అడిగాడు. దానికి రాజు అవును రాజు అంటే విష్ణుమూర్తి అవతారమే అని అన్నాడు గర్వంగా మీసంపై చెయి వేసి. మహారాజా సాలెలు తమకు బావమరదులు అవుతారు. అనిచెప్పాడు పురాణం కొండయ్య. రాజు గాండ్రించి, తల తీయిస్తాను జాగ్రత్త మేము మీకు బావమరదులం ఎలా అని అడిగాడు. మహారాజా మీరు విష్ణుమూర్తి, తమరి ఇంటి ఇల్లాలు లక్ష్మీ దేవి భార్గవులు ఇంట పుట్టిందని ఆయన ఆడబిడ్డ అని అంగీకరిస్తారు కదా అని అడిగాడు కొండయ్య. దానికి రాజు అవునని తల ఊపాడు. ఇక కొండయ్య ఇక భార్గవమహర్షే తమ వంశపురుషుడు అని అతని కుమారుడు మృకండుడు అని అతని కుమారుడు మార్కండేయుడు అని వీరంతా తమకులంవారు అని లక్ష్మీదేవి మాకూతురు కాబట్టి తమరు సాలె వారికి అల్లుడు అని మాకు బావల వరస  అవుతారని కాబట్టి సాలెవారికి ఆవిధంగా ఊరేగింపుతీసే హక్కు ఉందని వాదించాడు. రాజు పురాణం కొండయ్య పురాణపరిజ్ఞానానికి వాదనాపటిమకు ముగ్ధుడయ్యాడు. అతని వినయానికి సంతోషించి అవును మేము దీన్ని అంగీకరించాము వెళ్ళవచ్చు అని చెప్పాడు". ఇది కూనపులి వారు అనే సాలెల ఆశ్రితకులంవారు చెప్పే పద్మసాలెల కులపురాణంలో ఒక భాగం మాత్రమే. ఇందులో సాలె కులంవారి సామాజిక అస్మితిని ఔన్నత్యాన్ని స్థాపించి కులం తక్కువ అనే వాదాల్ని ఖండించడం జరిగింది. పద్మసాలె కులం ప్రాచీనతని వారి పవిత్రని వారి పనికున్న పవిత్రతను గురించి వాదిస్తుంది. సాలెల కులపురాణం. జాంబపురాణంలో కూడా సరిగ్గా ఇలాగే బ్రాహ్మడు మాదిగ వారికి ఇంటి అల్లుడు అని అరుంధతి మాదిగవారి ఆడపడుచు అని బ్రాహ్మణుని ఇల్లాలు అని జాంబపురాణం వాదిస్తుంది. దీనిలో ఉన్న గొంతు కూడా సామాజిక అస్మితిని తెలుపుతూ రెండు కులాలు మౌలికంగా ఒకటే అని చెప్పే ప్రయత్నమే చేస్తుంది. పైన చెప్పిన రెండు కులపురాణాలలో లాగే కొంత భిన్నత్వంతో అన్ని కులాలవారికీ కులపురాణాలు ఉన్నాయి. ఈ కులపురాణాలన్నీ కూడా ఆయా కులాల సామాజిక అస్మితిని గురించి అంటే ఈనాడు అనే సామాజిక అస్తిత్వాన్ని గురించే ఘోషిస్తూ ఉంటాయి. అంటే తొలి సామాజిక అస్మితి (లేదా అస్తిత్వ) సాహిత్యం కులపురాణాలే అని చెప్పాలి.  
కులపురాణాలన్నింటిలోని మౌలిక లక్షణాలను క్లుప్తంగా గమనిస్తే ఇవి కింది కులాల ప్రాచీనతను గురించి, వారి వృత్తి ప్రాధాన్యాన్ని గురించి, వృత్తి పనిముట్లుకు వృత్తికి ఉన్న పవిత్రతను గురించి, సమాజంలో ఆ కులాలకున్న ఉండవలసిన ఔన్నత్యం గురించి మాట్లాడతాయి వాదిస్తాయి. అంతేకాదు ఇతర కులాల ఆధిక్యతని ఖండిస్తాయి. ఈ మౌలిక లక్షణాలు అన్నీ అస్మితి సాహిత్యానికి కూడా మౌలిక లక్షణాలే అవుతాయి. లిఖిత సాహిత్యంలో కూడా చాలా కులాల వారి కులపురాణాలు 16 వశతాబ్దంనుండే దొరుకుతున్నాయని చెప్పడానికి చాలా చారిత్రక ఆధారాలు లభించాయి. సాలెల కులపురాణం పద్మపురాణం లేదా భావనర్షిపురాణం  16వ శతాబ్దంలోనే రాయబడింది ఇది ప్రాచ్యలిఖిత భాండాగారాలలో తాళపత్ర ప్రతి లభించింది. దేవాంగుల కులపురాణం దేవాంగ పురాణం కూడా పద్యకావ్యంగా ఉంది. కన్యకాపురాణం కూడా అతి ప్రాచీనమైనది లభించింది. ఇలా కులపురాణం మౌఖిక సాహిత్యంలో అతి ప్రాచీన కాలంనుండే ఉంది. లిఖిత సాహిత్యంలో కూడా సంస్కృతంలో రెండు వేల సంవత్సరాలనాడు తెలుగులో కూడా 16 వ శతాబ్దంనుండే లభిస్తుంది. అందువల్ల కులపురాణాలే తొలి అస్మితి (అస్తిత్వ) సాహిత్యం అని ఇక్కడ స్థాపించడం జరుగుతూ ఉంది.
నిమ్నకులాలుగా, అంటరాని కులాలుగా ఈసడించబడిన ఈకులాలు కులపురాణలని కలిగి ఉండి పై కులాల ఆధిక్యాన్ని నిరసిస్తూ తమ సామాజిక అస్తిత్వాన్ని నిలుపుకోవడమే కాదు, తమ కులాల పురాణాలను ప్రచారం చేసి తమ సామాజిక అస్మితిని నిలుపుకోవడానికి శతాబ్దాలనుండే గట్టి వ్యవస్థీకృతమైన ప్రయత్నం చేశాయి. కులపురాణాలను ప్రచారం చేయడానికి ఒక మంచిసామాజిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. అదే ఆశ్రితకుల వ్యవస్థ.  ఈకులాలన్నింటికి ఆశ్రిత కులాలు ఉండి కులపురాణాన్ని గానం చేయడం ప్రదర్శించడం దాన్నే వృత్తిగా జీవించడం ఒక పటిష్టమైన సాంఘిక వ్యవస్థ. ఈ ఆశ్రిత కులాలు దాదాపు అన్నికులాలకు ఉన్నాయి. వారు తమ దాతృకులం వారికి కులపురాణాన్ని ప్రదర్శించి వారి నుండే ఏడాది మేరలుపొందడం హక్కుగా కలిగి ఉన్నారు. అన్నికులాకన్నా ఎక్కువగా మాదిగవారికే ఆరు రకాల ఆశ్రిత కులాలవారు ఈ సేవలను అందిస్తూ మాదిగ కుల పురాణాన్ని ప్రదర్శించి ప్రచారం చేస్తున్నారు. వీరిలో డక్కలి, నులకచందయ్య, బైండ్ల, ఆసాది, గోసంగి, సంగడి, చిందు అనే కులగాయకులు ఈ పని చేస్తూన్నారు. అన్ని చేతి వృత్తుల వారికి ఈ విధమైన ఏర్పాటు ఉంది. చాకలి, మంగలి, కమ్మరి కులాలకు కూడా ఆశ్రితకులాలు వారి కులపురాణాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా కులపురాణమే తొలి సామాజికఅస్మితి సాహిత్యం సామాజికఅస్తిత్వ సాహిత్యం అని చెప్పవచ్చు.
అంతేకాదు ఉన్నత కులాల వారికి కూడా తమ సామాజిక అస్తిత్వాన్ని గురించి లేదా వారిని క్షత్రియ స్థానంలో స్థాపించుకోవడానికి కులపురాణం అవసరమైంది. రెడ్లకున్న కులపురాణం బసవలింగపురాణం, లేదా కుంటిమల్లారెడ్డి కథ. దీన్నిప్రచారం చేయడానికి పిచ్చుకుంట్లు అనే ఆశ్రిత కులం ఉంది. దీని ద్వారా రెడ్లు క్షత్రియులు అని వారి అస్మితిని నిరూపిస్తారు. నిత్య సత్యవ్రతుడని అనిచెప్పుకున్న నన్నయ్య తన మహాభారతం అవతారికలోనే అబద్ధం చెప్పాడు. కనీసం తను నిజం అనుకున్న అబద్ధాన్ని రచించాడు. రాజరాజ నరేంద్రుడు మహాభారత వంశానికి కురువంశానికి చెందినవాడు అని  చెప్పే ప్రయత్నం చేసి "హిమకరు దొట్టి పూరు భరతేశులు...." రాజనరేంద్రుని పూర్వికులు అనిపద్యం రాశాడు. ఈ విధంగా రాజనరేంద్రుని చంద్రవంశ క్షత్రియుడుగా స్థాపించే ప్రయత్నం చేశాడు నన్నయ్య. నిజానికి ఆంధ్రప్రదేశ్ ను లేదా తెలుగు నేలను పరిపాలించిన వారిలో క్షత్రియ వంశాలులేవని చరిత్రకారులు వివరించి మరీ చెబుతారు.  వెయ్యి సంవత్సరాల క్రితం నాటి రాజనరేంద్రుని కనీసం నాలుగు వేలనుండి ఐదు వేల సంవత్సరాలనాటి వారుగా భావించే కురువంశానికి చెందినవాడుగా చెప్పడం అద్భుతమైన పురాణ కథా కల్పన. రాజుల వద్ద ఉన్న "కులబ్రాహ్మణులు", ఆస్థాన కవులు అయిన అందరూ చేసిన పని వారివారి రాజులను క్షత్రియులుగా చంద్రవంశానికో సూర్య వంశానికో ముడిపెట్టే ప్రయత్నమే. ఈ రకంగా ఇదంతా సామాజిక అస్తిత్వాన్ని లేదా అస్మితిని వారికి కొత్తగా ఏర్పాటు చేసే ప్రయత్నమే, అస్మితి సాహిత్యమే. ఇలా కులపురాణాలు తిరుగులేని బలమైన సామాజికఅస్మితి సాహిత్యం అని అంతే కాదు కులపురాణాలే తొలి సామాజిక అస్మితి (అస్తిత్వ) సాహిత్యం అని గట్టిగా చెప్పవచ్చు.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి