Tuesday, June 23, 2020

తెలంగాణ తల్లి ప్రార్థనాగీతం


గీతరచన: ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి, సంగీతదర్శకత్వం: డా. బిరాధ, గాయనీగాయకులు: శ్రీమతి కల్పన, శ్రీమతి హరిణి, శ్రీ సాయిచరణ్, శ్రీ కృష్ణచైతన్య, అర్కెస్ట్రా నిర్వహణ, కీబోర్డు: శ్రీ గురుప్రసాద్, తబల: శ్రీ జయకుమారాచార్యులు, సౌండ్ ఇంజీనీర్ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీ నందీశ్వరరావు. దీనికి తెలంగాణ చరిత్ర సంస్కృతిని తెలిపే వీడియోలు సమకూర్చినది శ్రీ దూలం సత్యనారాయణగారు. 
తెలంగాణ అమాత్యులు శ్రీ కల్వకుంట తారక రామారావుగారు దీన్ని 12-6-2020న ఆవిష్కరించారు.

వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ
వరదాయని సుమధారిణి వఱలు కల్పవల్లీ                /వందనమిదె/

శృంఖలాలు ఛేదించిన శూర ధీర నీవమ్మా
పంటసిరుల పొంగించే బతుకమ్మవు నీవమ్మా
కృష్ణమ్మను కొంగువేసి గోదావరి నడికట్టుగ
మంజీరగ మానేరుగ మమ్ము గాచు మా తల్లీ                            /వందనమిదె/

శాతవాహన రాజ్య సిరిపొలము నీ చీర
కాకతీయ వైభవమది ఘనమైన మకుటమ్ము
అమరవీ
రుల రుధిరమె అలరారే పారాణి 

ఆది తెలుగుల చరిత అవతారమె నీవూ                                    /వందనమిదె/

సోమనాథుని జానుతెనుగు తేనెల జాలు
పోతన్న భాగవత పూదేనె మధురిమలు
మల్లినాథయ
వ్యాఖ్య యశోభూషణ యశము
కావ్యాలు శాస్త్రాలు కళలు విరిసిన గడ్డ                                      /వందనమిదె/

యాదాద్రి నరసన్న  ఏడుపాయల దుర్గ

రాజరాజేశ్వరుడూ రాజిలుసతి జోగులమ్మ
భద్రాద్రీ రామయ్య  బాసరలో చదువులమ్మ

కొండగట్టు అంజన్న కొరివిలోన వీరభద్ర
కోరి కొలుచు దేవుళ్ళు కొలువుందురు నీలోనే                           /వందనమిదె/

రామప్ప ఉలి కళలు రాగ రాగిణి చెలువు
వేయి స్తంభాల గుడి ఏకశిల నగర సిరి
చార్మినారు భాగ్యలక్ష్మి చేయిచేయి కలుపు
నేల
పరిఢవిల్లె నీగడ్డన  బౌద్ధజైనఇస్లాములు

శిల్పకళ వాస్తు  కళ చెలువొందిన దీనేల                                    /వందనమిదె/

 

ఆ చరిత ఆ ఘనత ఆ స్ఫూర్తి ఆ కీర్తి
ఆ కళల అనురక్తి ఆ అక్షర ఘనశక్తి
ఆ పంట సిరులన్ని అమరి చెలువొందగా
పాలు పొంగిన రీతి మమ్ముల నడుపవె తల్లి                               /వందనమిదె/
 సమాప్తం.

ఈ పాటని ఆచార్య పులికొండ సుబ్బాచారి దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం రచించిచారు. ఆ తర్వాత రెండుమూడు నెలలకు డా. బి. రాధగారు సంగీతం సమకూర్చి తనొక్కరే ఏ వాద్య సహకారం లేకుండా పాడారు. దాన్ని ఆరోజుల్లోనే యూట్యూబ్ లోనికి పంపారు. దాన్ని చాలా మంది వింటూ వచ్చారు. కాని ఇటీవల అంటే జనవరిలో ఈ పాటకు సంగీతం వాద్యాల సహకారంతో రికార్డింగు చేయించమని ఆచార్య సుబ్బాచారి రాధగారిని కోరారు. ఆమె పైన చెప్పిన వారి సహకారం తీసుకొని దీన్ని రికార్డింగు చేయించారు. తర్వాత జూన్ రెండవ తేదీన 2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పాటని కేటీఆర్ చేత ఆవిష్కరింపజేయాలని ఆచార్య సుబ్బాచారి ప్రయత్నం చేశారు. కాని ఆరోజున వారు అందుబాటులో లేకపోవడం వల్ల కార్యక్రమం వాయిదా పడింది. జూన్ 12 వ తేదీన ప్రగతి భవన్ లో కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ పాటను ఆవిష్కరించారు. ఈ పాటకు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా దూలం సత్యనారాయణగారు వీడియోలు సమకార్చారు. కావ్య గారు దీన్ని ఎడిట్ చేశారు. యూట్యూబ్ లో ఈ పాటను చూడవచ్చు వినవచ్చు. లింకు ఇక్కడ ఉంది. https://www.youtube.com/watch?v=tSa7skN1ICo

Comments

Tuesday, March 28, 2017

శిఖామణికి అభినందనలునేను బాగా నచ్చే మెచ్చే కొద్ది మంది వచనకవులలో శిఖామణి ముందువరుసలోనే ఉన్నారు. తన అనుభూతిని నూటికి నూరుపాళ్లు సిగ్నల్ లాస్ లేకుండా పాఠకుడికి అందించడంలో శిఖామణి చాలా ప్రతిభావంతుడు. శిఖామణి కవితానిర్మాణంలో చాలా సింప్లిసిటీని పాటిస్తాడు. వాక్య రచన గానీ పాదాల కూర్పు కానీ చాలా సింపుల్ గా ఉంటుంది. నిర్మాణంలో ప్రౌఢిని చూపించాలని ఎక్కడా తాపత్రయపడడు. ఇంత సింప్లిసిటీని కొందరు అాపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. కాని నాటి మువ్వల చేతికర్రదగ్గరనుండీ నిన్నమొన్నటి కవితదాకా శిఖామణి తన సింప్...లిసిటీని వీడలేదు. ఒక చెమ్మ ఎప్పుడూ గుండెకు తగిలించే గుణం ఈయన కవితనిండా ఉంటుంది. శతాబ్దాలుగా సుప్రసిద్ధమైన అలంకారాలని చాలా కొత్తగా చెప్పడం ఈయనకు బాగా వచ్చు. శిఖామణికి ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ప్రకటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. శిఖామణిని దళిత కవి అని ఆయన పరిధిని తగ్గించడం నాకు నిజంగా ఇష్టం ఉండదు. చాలా విస్తృత ప్రపంచాన్ని సృష్టించాడు. వచన కవితారచన నిర్మాణంలో మంచి బిగింపును ప్రౌఢిని విచిత్రమైన వాక్య నిర్మాణాలూ (శిల్పం అనే మాట విచక్షణారహితంగా వాడి పనికి రాకుండా పోయిన పారిభాషిక పదాలలో ఒకటి దాన్ని వాడడంనాకు అంతగా నచ్చదు.) చేసే వారున్నారు. అదొక గొప్పకళ కాదనను. కాని ఈ సింప్లిసిటీతో ఆకట్టుకోవడం చాలా కష్టం. అనుభూతిని ట్రాన్స్ఫర్ చేసే శిఖామణి నైపుణ్యం నాకు బాగా నచ్చుతుంది. ఆయనకు ఈ సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అందిస్తున్నాను.

Thursday, January 7, 2016The Ever Agitating Leader Krishnaiah

The name Krishnaiah become the synonym of BCs agitation for the last 40 years. He has been relentlessly agitating for the cause of BC students, research scholars BC professionals and the general population of various BC castes. He is instrumental in getting scholarships, mess charges, gurukul schools and many benefits for the last forty years in Undivided Andhra Pradesh. 

His present mission is getting reservation for BCs in parliament seats and in the seats of legislative assemblies. He brought the agitation to the national level and to the notice of Prime Minister of India and the President of India. His argument is “BCs of this country cannot be prosperous unless until they get the real power of the state. According to the spirit of the democracy, The BCs who occupied 60% of the population in the country should lead and rule the country then only the interests of the various sections of BC population would be protected. Around 200 BC castes in Telugu speaking states should get benefited in political power it is his theory. The most deprived castes among BCs should be benefited along with the little developed and benefited among BCs. Let us struggle for the political rights of BCs our justified power share in parliament and in all assemblies across the countries. Krishnaiah the Leader with a vision and courage to lead the struggle for BCs.    

Let us follow and strengthen the hands of R. Krishnaiah to protect the interests of BCs not only in the Telugu States but also at the national level. 

Prof. Pulikonda Subbachary
Monday, March 2, 2015


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం 9440493604
psubbachary@gmail.com

ఒక్క కవితే చాలు హృదయాన్ని ఆవహించేయడానికి....
ఇది యవకవుల కవితాప్రతిభ

పొద్దున్నే విన్న పాట ఆ రోజంతా వెంటాడినట్లు రాత్రి నిద్రించే దాకా పక్కన కూర్చొన్నట్లు కొన్ని కవితలు మనల్ని నిలవేస్తాయి. మనతోపాటే రోజంతా నిలబడి సేద తీరుస్తాయి. ఇటీవల కాలంలో కొందరు చాలా సీనియర్ కవులు వచన కవిత్వం పేరుతో వచనమై తేలిపోతున్నారు. ఏ కొత్తదనాన్ని కాని లేదా కొత్త వాదాన్ని చెప్పడం కాని సాంఘిక నిబద్ధతని చాటుకోలేక ఏమీ కాక చతికిలబడి పోతున్నారు. తాము రాసేదంతా కవిత్వమే అని భ్రమలో బ్రతికితే ఫర్వాలేదు. కాని వాటిని మోసుకుంటా అవార్డులు రివార్డులకోసం పరుగెత్తుతున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే, యవతరం చాలా మంచి కవితల్ని సృష్టిస్తున్నారు. కొత్త తరం కొత్త సాంకేతిక ప్రపంచం. నవయుగంలోని వారి సామాజిక సాంస్కృతిక అనుభూతి వారికి కొత్తగా ఆలోచించే శక్తిని ఇస్తూ ఉంది. పెద్దవాళ్ల కళ్లు గిర్రున తిరిగి పోయేలా చాలా మంచి కవితాసృజన చేస్తున్నారు.
అలాంటి కవితని ఇటీవల ఒక దాన్ని ముఖపుస్తకంలో (FaceBook)లో చదివాను. చాలా రోజులు నన్ను అంటి పెట్టుకొని ఉందా కవిత. ఎవరో అన్వీక్ష అనే పేరుతో రాస్తున్న అమ్మాయి. ఆమె అసలు పేరూ అదేనేమో. అభివ్యక్తిలో కొత్తపరిమళం. నిర్మాణంలో (శిల్పం అని అరిగి అరిగి నిరర్థకంగా మిగిలన పదాన్ని వాడ దలచుకోలేదు). చాలా చాలా కొత్తదనం యునీక్ నెస్ ఉంది. ఈ గుణం ఆ కవితని కొన్ని రోజుల పాటు నా పక్కనే నిలబడేలా చేసింది. అది నా పక్కన కొన్ని రోజులు నిలబడడమే కాదు అది నా అంతస్సీమల్ని వెలిగించింది. ఆ కవితపేరు నిర్గమధూమం దాన్ని రాసింది అన్వీక్ష అనే అమ్మాయి. కవితని యథాతథంగా కింద చూద్దాం. తర్వాత దాని రహస్యాల్ని గురించి మాట్లాడుకుందాం.
నిర్గమధూపము
కవయిత్రి అన్వీక్ష
ఆమె పుస్తకంలా మునగదీసుకున్నప్పుడు
అతనెప్పుడూ అటుగా
చూడనేలేదు
వాలిన మిణుగురులు ఒక్కో అక్షరం ఎత్తుకెళ్ళి
చీకటి కోటపై ముత్యాలవరసలు పేర్చుతుంటే
ఒక్క సారైనా తన చూపును
ప్రసరించనేలేదు
వండి వార్చి ఇళ్ళంతా ఒకరోజును లెక్కించాక
ఆమె కలంలో పరకాయ ప్రవేశం చేసి
ఏ సృష్టి చేసిందో
ఏనాడూ తెలుసుకొన ఆశపడలేదు
చీరలు మడతేస్తూ
వస్తువులు సరిచేస్తూ వాటితో చేసిన సంభాషణ
రోజూ తను పడుకోబోయేముందు
చెవిలో జూఊఉఊఉ ... అన్న నాదం వినవస్తున్నా
తెల్లబడ్డ తన తలవెంట్రుకలు మొహాన్ని తడిమినా
ఆమె ఉనికిని తలపోయనే లేదు
ఇప్పుడు
కట్టెలపై నిమ్మళంగా ఆమె పడుకున్నాక
పశ్చిమాన వాలే సూర్యుడు తన నుదుటన అస్తమించాక
ధూమమై ఎగుస్తున్న కవితలా అతన్ని అల్లుకున్నాక
చీకటిలో ఆ మిణుగురుల కోసం
అతనిప్పుడు వెతుకుతూ బయల్దేరాడు.

కవితని ఒక్క సారి పరిశీలించండి. దీన్ని ఆయిదు భాగాలలో రాసింది కవయిత్రి. ఈ భాగాల్ని చరణాలు అని పిలుద్దాం. చరణాలలో ఉన్న పంక్తుల్ని పాదాలు అని పిలుద్దాం. నిజానికి పాదం అన్నా చరణం అన్నా ఒకటే కాకుంటే ఇక్కడ భాగం అని అనకుండా పాటలోని భాగాల సామ్యంతో చరణం అని పిలుద్దాం. ఒక్కోచరణంలో పాదాల సంఖ్య కూడా సరిగ్గా ఒకే సంఖ్యలో ఉండాలి అని కవయిత్రి భావించలేదు. అలా ఉండాలని కూడా లేదు. కాని పాదాల మధ్య ఎడం ద్వారా చరణాల విభాగాన్ని సూచించింది కవయిత్రి. ఇక్కడ చరణాల విభజనలో ఆశించిన ప్రయోజనం ఉంది. అంటే చరణంలో ఒక వస్తువు ఉంది అని దానిలో భావం ఉంది అని అది ఒక మొత్తం కవితలోని భావభాగం అని అర్థం చేసుకోవాలి. దీన్నే భావాంశం అని అందాం. ఇక్కడ సంపత్కుమార, చేరాల సంవాదంలో లాగా ఇది పద్యం అని నిరూపించే ప్రయత్నం చేయడం లేదు. వచన కవిత పద్యకవితకు పొడిగింపు అనే భావానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. ఆయన భావగణాలు ఉంటాయి అని చేసిన వాదన ఇప్పటికీ ఋజువుకు నిలబడేదికాదు. వచన కవితని వచన పద్యం అని అనడానికి నేను వ్యతిరేకిని కాదు. కాని ఇది పాత పద్యానికి పొడిగింపు ప్రక్రియ కాదని ఇది కొత్త ప్రక్రియ అనే వాదానికే కట్టుబడి ఉంటాను.
విశ్లేషణలో సౌకర్యం కోసం పై కవితలో చరణాలు పాదాలు అనే విభాగాల కొలతలతో దీన్ని విశ్లేషించడానికి అనుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటి చరణాన్ని చూడండి ఇందులో మూడు పాదాలున్నాయి.
ఆమె పుస్తకంలా మునగదీసుకున్నప్పుడు
అతనెప్పుడూ అటుగా
చూడనేలేదు
కవిత ప్రారంభంలోనే ఆమె అని ప్రకటించి రాసేది ఒక స్త్రీ మీద అని కంఠోక్తిగా చెప్పి ముందుకు సాగింది. ఇదొక పద్ధతి ఈ పద్ధతిలో ఒక మంచి చిత్రం పాఠకుడికి తొలిలోనే ఆవిష్కృతం అవుతుంది. పుస్తకంలా మునగదీసుకున్నప్పుడు/ అతనెప్పుడూ అటుగా/ చూడనే లేదు. పుస్తకంలా మునగదీసుకున్నప్పుడు అనేది సరికొత్త భావచిత్రాన్ని అందిస్తూ ఉంది. ఇంతదాకా ఎవ్వరూ మునగదీసుకుని పడుకున్న వారిని ఇలాంటి పోలికతో చెప్పలేదు. ఇదే కవయుత్రి ప్రతిభ. ఎంతో నిరాసక్తంగా లేదా బాధతో మునగదీసుకుని పడుకుని ఉంది. కాని ఆమె పురుషుడు అటువైపు చూడనేలేదు. చూడలేదు అనే క్రియాపదానికి చూడనేలేదు అనే క్రియా పదానికి ఎంతో అంతరం ఉంది. సుదీర్ఘకాలంతో ఉన్న, ఒక పట్టీపట్టని పురుషుని ధోరణిని బాగా బలంగా ఆవిష్కరించి ఈ పదప్రయోగం.
వాలిన మిణుగురులు ఒక్కో అక్షరం ఎత్తుకెళ్ళి
చీకటి కోటపై ముత్యాలవరసలు పేర్చుతుంటే
ఒక్క సారైనా తన చూపును
ప్రసరించనేలేదు
ఈ చరణాన్ని పై చరణంతో అనుసంధానం చేసుకొని చదివి అర్థం చేసుకోవాలి. మిణుగురులు ఒక్కో అక్షరాల్ని ఎత్తుకెళ్ళి అని చెప్పడం మరొక అద్భుత పదచిత్రం పైన పుస్తకంలా అని ఎందుకు పదచిత్రం వేసిందో ఇక్కడ అక్షరాల్ని మిణుగురులు ఎత్తుకుపోతున్నాయి అని చెప్పినప్పుడు బాగా బోధపడుతుంది. చీకటి కోటపైన ముత్యాలవరుసలు పేర్చుతున్నాయని చెప్పడం లో స్వారస్యం చూడండి. అక్షరాల్ని బాగా కుదురుగా రాస్తే ముత్యాల కోవలా ఉన్నాయి అని అంటాం. ఇక్కడ అంతే కాదు అవి చీకటిలో మెరుస్తున్నాయి అని చెప్పడం కూడా ఉంది. అతను ఈ ముత్యాల వైపు ఆ చీకటి వైపు ఒక్కసారైనా తన చూపును ప్రసరించ లేదు. ఆమె బాధలో చీకటి కోణాన్ని ఒక్కసారైనా చూచే ప్రయత్నం చేయలేదు. సారైనా, ఇంకా ప్రసరించనేలేదు అనే క్రియాపద ప్రయోగాలు తిరిగి సాభిప్రాయ ప్రయోగాలు. ఆమె అంతరంగాన్ని దానిలోని చీకటి కోణాల్ని ఏనాడూ అతను చదివే ప్రయత్నం చేయలేదు. ఈ భావాన్ని నిక్షిప్తం చేయడానికే కవయిత్రి పుస్తకం అని అక్షరాలు అనే వాటిని ఎంత కొత్తగా చెప్పే ప్రయత్నం చేసిందో చూచినప్పుడు ఈమె సృజన ప్రతిభ, మనకు అర్థం అవుతుంది.
వండి వార్చి ఇళ్ళంతా ఒకరోజును లెక్కించాక
ఆమె కలంలో పరకాయ ప్రవేశం చేసి
ఏ సృష్టి చేసిందో
ఏనాడూ తెలుసుకొన ఆశపడలేదు
ఈ మూడో చరణం చూడండి ఇల్లంతా ఒక రోజును లెక్కించాక అన్నది అతి నవ్యమైన ప్రయోగం. ఈ పాదంలో వండి వార్చి అనే పదాలు లేకున్నా ఫర్వాలేదు. ఒక రోజును లెక్కించాక అని అన్నా ఇంటెడు చాకిరి రోజంతే చేసిన తర్వాత అలసిన తర్వాత అనే భావాన్ని ఇది సమర్థంగా చెప్పగలదు. కలంలో పరకాయ ప్రవేశం చేసి ఏ సృష్టి చేసిందో ఏనాడూ తెలుసుకనే ఆశపడలేదు అతను. ఇది స్పష్టమైన భావన. ఇక్కడ ఆశపడలేదు కన్నా ప్రయత్నించనేలేదు అనే భావం చాలా బాగుంటుంది. కవయిత్రి దీన్ని గ్రహించాలి. ఆమె రచనా ప్రపంచం అతనికి ఏ మాత్రం పట్టలేదు. అందులో తొంగి చూచే ప్రయత్నం చిన్నది కూడా చేయలేదు. అది అపరిచితగానే మిగిలింది. ఇక నాలుగో చరణం చూద్దాం.
చీరలు మడతేస్తూ
వస్తువులు సరిచేస్తూ వాటితో చేసిన సంభాషణ
రోజూ తను పడుకోబోయేముందు
చెవిలో జూఊఉఊఉ ... అన్న నాదం వినవస్తున్నా
తెల్లబడ్డ తన తలవెంట్రుకలు మొహాన్ని తడిమినా
ఆమె ఉనికిని తలపోయనే లేదు
ఈ చరణంలో పై భావమే సరికొత్త వస్తువుతో భృశార్థం కోసం పునరావృతం అయింది. రోజంతా వస్తువులతో పనిలో ఆమె చేసిన సంభాషణ అతనికి ఆ జూ.... అనే నాదం వినిపిస్తూ ఉన్నా ఆమె తెల్లబడ్డ వెంట్రుకలు అతని మొహాన్ని తడిమినా.. అంటే జీవితాంతం అతను ఆమెతో ఏకశయ్యాగతులై ఉండినా ఆమె ఉనికిని అతను ఏమాత్రం గ్రహించలేదు. ఇక్కడి నిర్మాణం చాలా గుంభనంగా ఉంటుంది. చెప్పకుండా నాదం అతనికి వినిపిస్తున్నా,  తెల్ల వెంట్రుకలు అతడిని తడిమినా  అని చెప్పకుండా దాచి చెప్పిన పద్ధతి ఇక్కడి కవయిత్రి ప్రతిభకు గీటురాయి. ఇక్కడ కవితని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక చివరి చరణం చూద్దాం
ఇప్పుడు
కట్టెలపై నిమ్మళంగా ఆమె పడుకున్నాక
పశ్చిమాన వాలే సూర్యుడు తన నుదుటన అస్తమించాక
ధూమమై ఎగుస్తున్న కవితలా అతన్ని అల్లుకున్నాక
చీకటిలో ఆ మిణుగురుల కోసం
అతనిప్పుడు వెతుకుతూ బయల్దేరాడు.
పశ్చిమాన వాలే సూర్యుడు తన నుదుటన అస్తమించాక అని చెప్పడం సరికొత్త పరిమళం. కట్టెలపై నిమ్మళంగా పడుకుంది ఆమె. ఆమె అంతరంగాన్ని అంతర్గత వేదనని ఆవిష్కరించిన ఆమె కవిత నిర్గమించి, ధూమమై ఎగసింది. దాన్ని ఏనాడూ అతను చదవనే లేదు. కానీ ఈ ధూమం ఇప్పుడు నిర్గమించింది. ఇక ఇప్పుడు అంతా గడిచిన తర్వాత తన స్త్రీకోసం ఆమెను చదవడం కోసం చీకటిలో మిణుగురుల్లా ఉన్న అక్షరాల్ని ఏరుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అతను.
జీవితాంతం తన స్త్రీని అర్థం చేసుకోలేని బాధల్ని తెలుసుకోలేని జీవన సహచరిని సహచరిగా తనలో భాగంగా చూడలేని పురుషుడు ఆమె లోకం దాటిన తర్వాత ఆమె ఉనికికోసం తడుముకుంటున్నాడు. నిరామయంగా, నిరాసక్తంగా ఏదో ఒక రొటీన్ క్రియగా సంసారాలు చేసుకునే భార్యాభర్తల జీవితంలో స్త్రీ ఆర్తనాదాన్ని అంతరంగాన్ని అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించింది ఈ కవిత. భావవ్యక్తీకరణలో అతి నవ్యమైన రీతిని పట్టుకుంది. ప్రతి భాచిత్రం సరికొత్త పరిమళాన్ని అందిస్తూ ఉంది. కవయిత్రి తనదైన ప్రతిభని చూపింది. కవిత నిర్మాణంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించింది. చరణాల్ని విభజించుకొన్న పద్ధతి వాటిలో పాదాలు పేర్చుకున్న తీరు బాగా మెచ్చదగినదిగా ఉంది. కవితలో మంచి నిర్మాణం ఉంది. కవయిత్రి తన కవితకు దానికై దానికి అవసరమైన నిర్మాణాన్ని చూపింది. ప్రతి చరణంలో ఆమె అన్నది వ్యక్తంగానో గుప్తంగానో ఉంది. కాని దాన్ని ధ్వనించే తీరులో తేడా ఉంది.
వచన కవులు చాలా మంది ఇంకా ఏ స్థితిలో ఉన్నారంటే వచన కవిత అంటే ఫ్రీ కవిత అని అంటే స్వేచ్ఛగా ఎన్ని పాదాలైనా ఉండవచ్చు వాటిలో ఎన్ని పదాలైనా ఉండవచ్చు అని ఎంత స్వేచ్ఛగానైనా రాయవచ్చు అనే భ్రమలోనే ఉన్నారు. ఈ స్థితి చాలా సీనియర్స్ లో కూడా కొందరిలో ఉంది. కాని వచన కవి తన కవితలో దాని భావానికి అవసరమైన నిర్మాణాన్ని తనకు తానుగా నిర్దేశించుకొని ఒక ప్రకృష్టమైన రీతిలో నిర్మాణాన్ని  చేసుకోవాలని అనవసరమైన పదాల్ని, అనవసరమైన పాదాల్ని తీసివేసుకొని చిక్కగా రాయాలని ఒక నిర్దిష్టమైన ధ్యాస ఉండదు. కవితలో ఈ పాదాల్ని లేదా కొన్ని పదాల్ని తీసివేసినా ఇందులో భావం చెడదు అనే పరిస్థితి ఉండకూడదు. ఏ పాదం తీసిన చివరికి పదం మార్చినా కవిత కూలిపోతుంది, అనేంతగా అతి చిక్కగా కవితలని రాయాలి నిర్మించాలి అనే స్పృహ మన వచన కవులలో కొందరికే ఉంది. అది కొత్తగా వస్తున్న యువతీ యవకులైన వారిలో ఈ శ్రద్ధ చాలా మందిలో కనిపిస్తూ ఉంది. ఇదే సంప్రదాయ పద్యాన్ని రాయడానికి వచన కవితని రాయడానికి ఉన్న తేడా. ఛందోబద్ధమైన పద్యంలో నిర్మాణం సిద్ధంగా ఉంటుంది. కవి కష్టపడే పనిలేదు. కాని వచనకవి తన కవిత నిర్మాణాన్ని తనే తయారు చేసుకోవాలి. అది ప్రతి కవితకీ కొత్తగా చేసుకోవాలి. అందుకే సరైన మంచి వచన కవిత రాయడం ఛందోబద్ధమైన పద్యం రాయడం కన్నా కష్టమైన పని. ఈ స్పృహ కూడా కొందరు కవులకే ఉంది. ఈ యువతరం కవుల నిర్మాణ ధోరణి వచన కవితకు తెలుగులో మంచి భవిష్యత్తు ఉంది అనే నమ్మకాన్ని కలిగిస్తూ ఉంది. ఈ కవయిత్రి అన్వీక్ష లో కూడా ఈ సృజన శక్తి కవితా నిర్మాణం పట్ల శ్రద్ధ బాగా కనిపిస్తూ ఉంది. దీన్నే రూపనిర్మాణశ్రద్ధ అని నేను చెప్పదలచుకున్నాను. ఇది ఈనాటి వెంటాడే కవితల్లో మంచి కవిత. దీన్ని ఫెమినిస్టు కవిత అని ప్రత్యేకంగా పిలవడం నాకు అంతగా ఇష్టంలేదు.  
పులికొండ సుబ్బాచారి.


Wednesday, July 9, 2014

Dear Friends I am posting the invitation card of my book releasing function. I request all of my friends to participate in the programme and encourage telugu poetry. The Programe is organising by Kavi Sangamam with the cooperation of Runja Association. Please attend. yours Pulikonda Subbachary.

ప్రియ మిత్రులందరికీ అభివాదం. నా కవితా సంకలనం బాడిశ మొక్క బోయింది పుస్తకం ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని ఇక్కడ పెడుతున్నాను. మిత్రులందరూ కార్యక్రమానికి హాజరై తెలుగు కవిత్వాన్ని ప్రోత్సహించగలరని ఆహ్వానం పలుకుతున్నాను. మీ రాక నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ కార్యక్రమాన్ని కవిసంగమం రుంజ సహకారంతో నిర్వహిస్తూ ఉంది.
భవదీయుడు పులికొండ సుబ్బాచారి.