Friday, April 20, 2012


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం
psubbachary@gmail.com
దళితుల ఆహారం చర్చనీయాంశమా?
(ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉదంతం నేపథ్యంలో...)
రాముడు లేడి మాంసం తిన్నాడు అనే అంశాన్ని తిక్కనగారు తన నిర్వచనోత్తర రామాయణంలో రాకుండా అనువాదం చేసాడని ఒక చాలా పెద్ద పరిశోధకుడు చాలా సంవత్సరాల క్రితం ఎత్తి చూపాడు. దీనికి కారణం తిక్కన శాకాహారి కావడమేననీ ఆ పరిశోధకుడు తీర్మానించాడు కూడా. తను అత్యంతం భక్తితో సేవించే శివుని విగ్రహానికి తిన్నడు మాంసాన్ని నివేదిస్తే శివుడు చాలా సంతోషించాడు అని చెప్పే కావ్యం జగత్ప్రసిద్ధమే. గ్రామదేవతలకు గ్రామీణులు తాము తినే ఆహారమైన మేకలు గొర్రెలు కోళ్లను సమర్పించుకోవడం చాలామామూలుగా వస్తున్న విషయం. ఇవేవీ చర్చనీయాంశాలు కావు. ఈ నాటి సమాజంలో అభ్యంతరకరమైన విషయాలూ కావు. ఆంధ్రప్రదేశ్ లో కాని ఇతర రాష్ట్రాలలో కాని దళితులు గొడ్డు మాంసం (ఆవు ఎద్దు దున్న బర్రె) తింటారు. అసలు దళితులు చరిత్ర క్రమంలో అంటరానివారు కావడానికి ఇదే కారణమైందనే సాంఘిక సిద్ధాంతం కూడా సమాజ శాస్త్రంలో ఒకటుంది. కాని ఇటీవలి కాలంలో దళితుల ఆహారం బాగా చర్చనీయాంశంగా మారుతూ వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఉదంతం అకస్మాత్తుగా జరిగింది కాదు. దీని వెనుక చాలా సైద్ధాంతిక పరమైన ఆలోచనతో ఒక హక్కును చాటుకోవడానికి చేసిన దళిత ప్రయత్నంగా ఇది కనిపిస్తూ ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టల్ లో బీఫ్ ఫెస్టివల్ జరుపుకోవడానికి దళిత విద్యార్థులు, మరికొందరూ ప్రయత్నించడం దాన్ని మరొక వర్గం విద్యార్థులు అడ్డుకోవడం జరిగింది. పెద్ద హింసాకాండే జరిగింది. ఉస్మానియా చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇది తొలిసారి. ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్ళలో శనివారం ఆదివారం చికెన్, మటన్ అంటే కోడిమాంసం మేక గొర్రె మాంసాలను ఆహారంలో ఇవ్వడం ఉంది. (నేను 1980 నుండి 1987 దాకా ఉస్మానియా హాస్టళ్ళలో ఉన్నాను. విద్యార్థిగా నాకు బాగా తెలిసిన విషయం ఇది). దళిత విద్యార్థులు ఆరోజుల్లోనే మేము తినే మాంసం కూడా పెడితే బాగుంటుంది కదా అనే వాదన చాలా గుంభనంగా చేసే వారు. దాన్ని వారు పైకి గట్టిగా అనడానికి కూడా బాధపడే వారు. దాన్ని వారే చిన్నతనంగా భావించే రోజులు అవి. కాని సామాజిక అస్తిత్వ ఉద్యమం పెరిగిన తర్వాత దళితులు తమ సమాజపు సాంఘిక జీవన విధానాన్ని పూర్తిగా ఎసర్ట్ చేసుకుంటున్నారు(తమజీవితాన్ని తమ ఇష్టం ప్రకారం గడపాలనే భావన).  ఈనాడు దళితుల తమ ఆహారపు అలవాట్లను తమ హక్కుగా బహిరంగంగా చెప్పి తమ జీవన శైలిపై ఆహారపు అలవాట్లపై సమాజంలోని ఇతర వర్గాలు ఆంక్షలు పెట్టడానికి వీలు లేదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనగానే ఉస్మానియా విశ్వవిద్యాలయపు భీఫ్ ఫెస్టివల్ ని అర్థం చేసుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాలు కొన్నింటిలో భీఫ్ ను కూడా హాస్టళ్ళలో విద్యార్థులకు ఇస్తున్నట్లు తెలియవచ్చింది. 
గొడ్డు మాంసంతినడం అనే విషయం శతాబ్దాలుగా చర్చనీయాంశంగానే ఉంది. ఒకప్పుడు ఆంధ్రదేశంలో ఒక శిక్ష ఉండేది. అదేమంటే గ్రామంలోని ఉన్నత కులానికి చెందిన వారు ఎవరైనా దళితుల అమ్మాయిని కాని స్త్రీలను కాని చెరిపినప్పుడు ఆ వ్యక్తి వారికి పట్టుబడితే అతడిని గూడెం లోనికి తీసుకుపోయి గుంజకు కాని చెట్టుకు కాని కట్టేసి అతని నోట్లో గొడ్డు మాంసం ముక్కను పెట్టి తర్వాత వదిలి పెట్టే వారు. దీని అర్థం అతను మాదిగ మాలలతో సమానుడైనాడని చెప్పడం అతడిని అపవిత్రుడుగా చేయడంగా భావించేవారు. నా బాల్యంలో కూడా మా గ్రామంలో ఇది జరిగినట్లు చెప్పుకునేవారు. దళితుల మహాభారతం అయిన జాంబపురాణంలో ఆదిజాంబవుని వంశంవారు, చెన్నయ్య అతని వారసులు అంటరానివారుగా మారే శాపం తగలడానికి ఆవు మాంసం తినడమేనని చెప్పే ఉదంతం ఉంది. దీన్ని బట్టి గొడ్డు మాంసం తినడం అనేది ఈ సంస్కృతిలో హీనమైనదిగా పరిగణింపబడి అది దళితులకు శాపమైనది అని చేసే వాదనలకు బలం దొరికింది. కాని నేటి దళితుల వాదన తమ సామాజిక హక్కును గురించి తమ జీవన శైలిని తాము అనుకున్న విధంగా నడుపుకోవడానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కు గురించి. తమ ఆహారాన్ని తాము తినడానికి మరొక సామాజిక వర్గం అభ్యంతరం చెప్పడానికి వీలు లేదని అన్నికులాల వారికి ఆహారం అందించే పబ్లిక్ సంస్థలలో అందరి ఆహారం అందించడం తమకు సిద్ధమైన హక్కు అని వారు భావిస్తున్నారు. వాదిస్తున్నారు. ఇది చాలా న్యాయబద్ధమైన రాజ్యాంగ బద్ధమైన ఆలోచనగానే ఉంది.
కేంద్రంలో బి.జె.పి ప్రభుత్వం పరిపాలించే రోజుల్లో గోవధ నిషేధం గురించి చర్చ జరిగే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలనుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చౌకధరలో తమకు మంచి ఆహారం (ప్రొటీన్ రిచ్ ఫుడ్) దొరికే మార్గం ఇదే దీన్ని ఎందుకు నిషేధిస్తారు అని వారు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు.  బహు సంస్కృతుల ప్రజలు నివసించే విశాల మైన దేశంలో ఇలాంటి భేదాభిప్రాయాల రావడం చాలా సహజం. అది ఆయా ప్రజల సహజ హక్కులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు సంబంధించిన విషయం.
అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర ప్రభుత్వాలు కూడా జంతు బలిని నిషేధించాయి. జంతుబలి చేసిన వారిని అరెస్టు చేయవచ్చు శిక్షించవచ్చు. కాని ఇది మతరమైన అంశం అందుకే పోలీసులు చూసీ చూడనట్లు ఊరుకుంటారు. ఆది వారం వస్తే గంగమ్మ గుడులలో కనీసం వందకు తగ్గ కుండా మేకలు గొర్రెలు బలి అవుతాయి ఒక్క కుప్పం పట్టణంలోనే. ఇది వారు తినే ఆహారాన్ని వారు తమ దేవతకు అర్పిస్తున్నారు. కాని ఇతర మతాలలో ఉన్న జంతుబలిని ఏ ప్రభుత్వం నిషేధించలేకపోయింది. ఇది చాలా చర్చనీయాంశం. ఒక మతానికి చెందిన ఆరాధనలలోనే జంతుబలిని నిషేధించడం పట్ల చాలా ప్రశ్నలు ఉన్నాయి.
కాని ఇక్కడ ఇంకా మౌలికమైన చర్చ అవసరం. మానవుడు పుట్టుకతో మాంసాహారా లేక శాకాహారా అనే (హెర్బిఓరస్ లేక కార్నిఓరస్) అనే శాస్త్రీయ చర్చ అలాగే ఉంది. కాని ఈ రోజున ఈ భూమండలంలోని అన్ని దేశాలలోను జరిగే చర్చ అన్ని జంతువులకు అన్ని పక్షులకు ప్రాణులకు జీవించే హక్కు ఉంది అని చెప్పడమే. మనిషిని మరొకరు బలి ఇచ్చి కోసుకొని తింటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తే బాగుంటుందని అలాగే అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందని ఈనాడు మనిషి ఆలోచించి వాదిస్తున్నాడు. ఏ జంతువునీ చంపే హక్కు మనిషికి లేదు.
అడవి జంతువులను వేటాడి చంపడం నేరం అని చెప్పి నిషేధించిన ప్రభుత్వం ఇంటి జంతువులైన కోళ్ళు మేకలు, గొర్రెలను చంపడాన్ని నిషేధించలేదు. మున్సిపాలిటీలలో ఇంతకు ముందు కుక్కలను పట్టుకుపోయి కరెంటు పెట్టి చంపేసే వారు. జీవకారుణ్య సంఘాల వారి కృషి ఫలితంగా వాటిని చంపడం ఆగిపోయి వాటికి కుటుంబనియంత్రణ ఆపరేషన్లు  చేసే ప్రక్రియ అమలులోనికి వచ్చింది. ఇది ఎంతో ఆహ్వానించదగిన పరిణామం. కాని ఈ జీవ కారుణ్య సంఘాల వారు బ్లూక్రాస్ వగైరా వగైరా పేర్లతో దేశవ్యాప్తంగా ఉన్న జీవ కారుణ్య సంఘాల వారు జంతుబలిని కాదు జంతు వధని నిషేధించమని కోరరు ఎందుకని? అసలు మొత్తం మాంసాహారాన్ని నిషేధిస్తే జంతు వధ అనేది ఉండదు. ఈనాడు మానవుడికున్న అవగాహన ప్రకారం ప్రతి జంతువుకూ బ్రతికే హక్కు సహజంగా ఉంది అని అంగీకరించినప్పుడు ఏజంతువునూ చంపి తినే హక్కు ఏ మనిషికీ లేదు. ఇలా ఆలోచించినప్పుడు నిషేధించవలసింది జంతు బలిని కాదు, జంతువధను. హిందువులకు పవిత్రమైనదిగా భావించే గోవును మాత్రమే వధించడం నిషేధించాలి అని అనడం సరికాదు. అసలు మొత్తం ఏ జంతువునూ కోడి మేకలు సహితం చంపకూడదు అలా చంపే హక్కు మనిషికి లేదు అని నిషేధించడం చాల అవసరం. ఇదే సహజ న్యాయం కూడా. (ఈ వ్యాసకర్త బ్రాహ్మణేతరుడైన సంపూర్ణ శాకాహారి). అంతే కాని కొన్ని జంతువులను చంపి తినడం సరైనదే, కొన్నిజంతువులను చంపితినడం న్యాయం కాదు అని వాదించడం రాజ్యాంగ బద్ధమైన సమన్యాయానికి విరుద్ధం అవుతుంది. దళితులు తినే ఆహారం ద్వారా వారి సామాజిక స్థితిని కొలవడం సమన్యాయవిరుద్ధమైన చర్య. భారత దేశంలో అన్ని వర్ణాలలోను మాంసాహారం ఉందని చెప్పే చారిత్రక ఉదంతాలు ఉన్నాయి. వేదకాలంలోని జంతుబలి మాంసాహారభక్షణాన్ని గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. ఒరిస్సా, బెంగాలులోని అన్నివర్ణాల వారు అన్ని మాంసాలను తింటారు. ఈనాడు మనిషి ఆలోచించే సమన్యాయ సిద్ధాంతం ప్రకారం అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉంది. దేన్నీ చంపే హక్కు మనిషికి లేదు. ప్రభుత్వాలు మొత్తం జంతువధని అంటే మాంసాహారాన్ని నిషేధించే దిశగా అడుగులు వేసి అన్ని ప్రాణుల్ని చంపడాన్ని నిషేధించాలి. అంత దాకా ఒక సామాజిక వర్గానికి చెందిన ఆహారాన్ని అనుమతిస్తూ మరొక వర్గానికి చెందిన ఆహారాన్ని అంటే వారి  జంతువధని ప్రశ్నించే వీలు లేదు. దళితుల  ఆహారం అప్పటిదాకా చర్చనీయాంశం కారాదు. అందరి హక్కులతో వారికీ ఉన్న హక్కు. మనకు కావలసిఉంది సంపూర్ణ జంతువధ నిషేధం. నిజానికి మనిషికన్నా క్రూర జంతువు ఉన్నాడా అనేది జంతువుల మూగ వేదనలలో నుండి పారే రక్తంలోనుండి వస్తున్న ప్రశ్న. 

Tuesday, April 10, 2012


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం 9440493604

మన దేవుళ్ళకు తెలుగు రాదా?
(వ్యావహారికభాషా మార్గదర్శి గురజాడ 150 జయంతి సంవత్సరం పురస్కరించుకొని భాషోద్యమవ్యాసం).

మన దేవుళ్ళు ఏ భాషలో మాట్లాడారో మనకు తెలియదు.  తెలుసు అని అనుకుని చెప్పేవాళ్ళు మాత్రం దేవుళ్ళు సంస్కృతంలో మాట్లాడుకుంటారు అని చెబుతారు. అందుకే దీన్ని దేవభాష అనీ అంటూంఛారు అంతే కాదు దీన్ని గీర్వాణభాష అని గీర్వాణంగా చెబుతారు. కాని దేవుళ్ళు మాట్లాడగా విని చెప్పిన వారు తటస్థిస్తే దీన్ని నిక్కచ్చిగా నమ్మే వీలుంది. దేవుళ్ళలో కూడా జండర్ వివక్ష చాలా ఉందని చెప్పడానికి వీలుంది. మన సంస్కృత నాటకాల్లో పురుష దేవతలు అందరూ సంస్కృతంలో సంభాషిస్తూండగా సేవకులు పరిచారకులు వంటి అథమ పాత్రలు, స్త్రీ దేవతలు మాత్రం సమాజంలో తక్కువగా భావించబడిన ప్రాకృత భాషలో మాట్లాడతాయి. ఇదంతా మన సంస్కృత నాటకకారుల చేతిచలువే కాని దేవతా స్త్రీలు ఏ భాషలో మాట్లాడారో వారికేం తెలుసు అని మన ఫెమినిస్టు వీరనారీమణులు అడిగే అవకాశమూ లేకపోలేదు. నిజానికి దేవుళ్ళు ఏభాషలో మాట్లాడినా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాని మనం మాట్లాడే తెలుగు వారికి అర్థం కాదట. దీనితోనే మనకు ఇబ్బంది వచ్చింది.
ప్రతి మనిషి తాను పుట్టిన ఇంట్లో తల్లి తండ్రి కుటుంబ సభ్యులతో నేర్చుకునే భాష ఒకటి ఉంటుంది. దాన్నే మాతృభాష అని అంటారు. నిజానికి ఇది కుటుంబ భాష. వ్యక్తి పెరిగి విద్యావంతుడు అవుతూ ఇతర భాషలు నేర్చుకుంటాడు. తన సామాజిక అవసరాలకు ఏ భాష అవసరమో దానిలో అతను పని చేసుకుంటాడు. తన దైనందిన జీవితపు అవసరాలకు తన భాషే వినియోగపడాలని ప్రతి భాషీయుడు కోరుకుంటాడు. అలా వీలుపడని సందర్భాలలో ఆ సందర్భానికి అవసరమైన భాషలో పని చేసుకోవలసి ఉంటుంది.
ప్రతి భాషకు సంబంధించిన వారికి, ప్రతి సంస్కృతిలోని వారికీ సామాజిక సందర్భాలతో పాటు మత సందర్భాలూ ఉంటాయి. అంటే దేవునితో సంబంధం ఉన్న సందర్భాలు అని కూడా వీటిని చెప్పవచ్చు.  ప్రతి సంస్కృతిలో జానపదులలో గిరిజనతెగలలోను ఈ మత సందర్భాలలో దేవునికి మనిషికి మధ్యన మరొక మనిషి ఉంటాడు. ఇతడినే పూజారి అని ఆచారమంతుడు అని, ముజావర్ అని పాస్టర్ అని ఒక్కొక్క మతంలో ఒక్కో సంస్కృతిలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ మధ్యవర్తి మన తరఫున దేవునితో మాట్లాడుతుంటాడు.  
ప్రతి సంస్కృతిలోను దేవునితో మాట్లాడే భాష దేవుడు మాట్లాడే భాష వేరుగా ఉంటాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే చాలా మత గ్రంథాలు సామాన్య మానవులు మాట్లాడే భాషలో లేవు. అంతే కాదు మత సంబంధమైన దైవ సంబంధమైన కార్యక్రమాలు అన్నీ అందరికీ అర్థంకాని భాషలో ఉంటాయి. ఒక తరహా భాషకు మతగౌరవం లభించిన తర్వాత ఆ భాష అర్థంకాకపోయినా ఫర్వాలేదు అనే భావన ఆ భాషీయులలో కలగడం అన్ని చోట్లా గమనించవచ్చు. అందుకే వీటికి రిచ్యువల్ లాంగ్వేజస్ అని అంటారు. అంటే ఇక్కడ పావిత్ర్యం అనే భావన భాషతో ఉందే కాని భావంతో ప్రధానంగా కాదని. ప్రస్తుతం ఈ విషయాన్ని తెలుగు నేలపై లేదా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏం జరుగుతుందో గమనించి మంచి చెడు ఆలోచన చేద్దాం. ఆంధ్ర దేశంలో ఎక్కువ శాతం ప్రజలలో అంటే చాలా కులాల వారికి మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేది బ్రాహ్మణ కులానికి చెందిన పూజారులు. లైఫ్ సైకిల్ రిచ్యువల్స్ వీటినే జీవన చక్ర సంబరాలు అని అంటారు. అంటే మనిషి పుట్టినప్పుడు చేసే ఆచారం దగ్గరనుండి ఉపనయనం, రజస్వల, పెండ్లి, గర్భాదానం తిరిగి పుట్టుక అంటే బారసాల మరణం వీటన్నింటి సందర్భాలలో పూజారి ఉండి మనతో ఆయన పూజ చేయించవలసి ఉంటుంది. మన తరఫున దేవునికి ఆయన మంత్రాలు చదువుతాడు. అంతే కాదు చాలా ఇతర సందర్భాలలో అంటే గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతాలు వంటి చాలా వ్రతాలలోను ఇలాంటి ఇతర మత సందర్భాలలోను పూజారి లేకుండా పనులు జరగవు. ఇక గుడికి పోతే మనం చేసే అష్టోత్తరం సహస్రనామం, అర్చనలు వంటి అన్ని సేవలు మన తరఫున పూజారి చేస్తాడు. తెలుగు నేలమీద తెలుగు వారి ఇండ్లలో, గుడులలోను జరిగే ఈ అన్ని కార్యక్రమాలలోను పూజారి చదివే మంత్రాలు పూజలు  అన్నీ అటు పూజారికీ ఇటు చేయించుకునే వారికి తెలిసిన తెలుగు భాషలో జరగవు. ఇవి అన్నీ సంస్కృత భాషలో జరుగుతాయి. 
దేవునికి ఘంటానాదం సమర్పయామి, మధ్యమధ్యే పానీయం సమర్పయామి, ధూపదీపమాఘ్రాపయామి  అని మనం చేసే సేవలు అన్నింటికీ మన తరఫున పూజారి మనకు తెలియని సంస్కృతభాషలో చదువుతాడు. దేవాలయంలో కాని ఇంటి వద్ద కాని చేసే యజ్ఞయాగాదులన్నింటా చేసేది మనం అయినా చేయంచే పూజారి చదివేది మనకు తెలియని సంస్కృత భాషే. చివరికి సంకల్పం చెప్పే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, కృష్ణా గోదావరీయోర్మధ్యదేశే అస్మద్ గృహే పత్నీ సహితం అని వగైరా మన  ఇంట్లో మనం, అంటే నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనం చెప్పే మాటల్ని పూజారి దేవునికి సంస్కృతంలో వినిపిస్తాడు.  ఇలాంటి సంకల్పాన్ని చక్కగా మనకై మనం తెలుగులో నేను ఫలానా పేరు కలిగిన వ్యక్తిని భరతవర్షంలో భరతఖండంలో మేరు పర్వతానికి దక్షిణ దిక్కున కృష్ణాగోదావరీ నదుల మధ్యభాగంలో ఉన్న తెలుగు నేలలో ఫలానా ఊరిలో కుటుంబ క్షేమాన్ని కోరి వ్రతం చేస్తున్నాను దేవా అని దేవునికి తెలుగులో మనం చెప్పుకోలేమా అన్నది ప్రశ్న. ఇక్కడ పవిత్రత సంస్కృత భాషని బట్టి వస్తుందా లేదా చేసే మనసును బట్టి వస్తుందా అన్నది మనం ఆలోచించాలి.
అంతే కాదు పెళ్ళి సందర్భంలో వరుడుతో తాళి కట్టే ముందు పూజారి ఒక మంత్రం అని పిస్తాడు. మాంగల్యంతంతునానేనా మమ జీవన హేతునాం కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం అని. నోరు తిరిగినా తిరగకపోయినా పెళ్ళికొడుకు దాన్ని చెప్పి తర్వాత ఆమె మెడలో మాంగల్యాన్ని కడతాడు. ఇది పూజారికి అర్థం అయితే కావచ్చుగాక కాని తాళికట్టే పెండ్లి కొడుకులకు దీని అర్థం నూటికి తొంభై తొమ్మిది మందికి అర్థం కాదు. కట్టించుకునే పెండ్లి కూతురుకీ అర్థం కాదు చుట్టూ ఉన్న బంధుమిత్రులకూ  అర్థంకాదు. ఇంత బాధ ఎందుకు పెండ్లి కొడుకుతో నేను నూరేండ్లు హాయిగా ఈమతో కలిసి జీవించడానికి గాను ఈమె కంఠంలో మాంగల్యాన్ని కడుతున్నాను అని చక్కగా తెలుగులో చెప్పి కట్టవచ్చుగా. మిగతా ప్రమాణాలు అన్నీ కూడా ఇలా తెలుగులో చేస్తే చాలా హాయిగా ఉండదా. కాని పెండ్లివేళ అక్కడికి ఆవాహన చేసిన దేవుళ్ళకి ఈ తెలుగు అర్థం కాదట. దేవుళ్ళకి అలా సంస్కృతం మంత్రాలలోనే చదివితేనే పవిత్రమైనదని వారికి తెలుస్తుందని ఒక పూజారి గారు సెలవిచ్చారు. అంతే కాదు అలా మంత్రాలని తెలుగులో చదివి చెప్పడాన్ని పెళ్ళి చేయించుకునే ప్రజలు ఎవరూ అంగీకరించేలా కూడా లేరు. వారికి కూడా సంస్కృతం మంత్రాలు చదివితేనే తృప్తి అక్కడికి అది పవిత్రమౌతుందని భావం కలుగుతుంది. గుడిలో జరిగే విషయంలోను ఇదే జరుగుతుంది. కాని ఒకప్పుడు కవి రాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారు పెండ్లిండ్లు అన్నీ తెలుగులో చేయవచ్చని చేయాలని ఒక ఉద్యమంగా గ్రహించి చేపట్టారని చాలా సందర్భాలలో అలా చేయించారని మా పెద్దవాళ్లు చెప్పగా విన్నాను. పెండ్లి మంత్రాలన్నీ తానే చదివి దేవునికి అప్పగిస్తే పెండ్లి కొడుకు ఊరక అతను చెప్పినవన్నీ చేస్తే ఆమె ఎవరి భార్య అవుతుంది అనే తీవ్రమైన ప్రశ్నలు కూడా లేవనెత్తాడు వెనిగళ్ళ సుబ్బారావు పెండ్లి మంత్రాల వెనుక బండారం అనే పుస్తకంలో.
కాని ఈ పరిస్థితి దేశం అంతటా ఇలా లేదు. చాలా గ్రామ దేవత గుడులలో పేరంటాళ్ళ దేవతల గుడులలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు దళితులు పూజారులుగా ఉన్నారు. అక్కడ జరిగే ఆచారాలన్నింటిలో తెలుగులోనే పూజా కార్యక్రమాలు జరగడం గమనించవచ్చు. చాలా గ్రామ దేవతల గుడులలో రజకులు, క్షురక వృత్తి వారు పూజారులుగా ఉన్నారు. అలాగే కొమ్ముల వాళ్ళు, బైండ్లవాళ్ళు వంటి దళితులు పూజలు చేసే గుడులు జాతరలు కొన్ని ఉన్నాయి వాటిలో ఈ కులాల పూజారులు వారి మంత్రాలను ఆచారాలను తెలుగులోనే చేస్తారు. కొన్ని సందర్భాలలో వినపడకుండా చదవడం కూడా ఉంది. దీన్ని బట్టి పవిత్ర కార్యక్రమాలు అన్నీ తెలుగులో చేసుకోవచ్చు అని ఒక నిరూపణ మనకు ఉండనే ఉంది.
చాలా మంది గిరిజనులు వారి దేవతల పూజల్ని వారి భాషలోనే చేసుకోవడం ఉంది. ఇన్ని ఉండగా నూటికి ఎనభై మంది పైగా ఉన్న తెలుగు వారు అటు గుడులలోను ఇటు ఇండ్లలో జరిగే మత కార్యక్రమాలలోను ఎరికీ తెలియని సంస్కృత భాషను ఎందుకు వాడాలి మనకు తెలిసిన తెలుగులోనే మనం చేసుకోకూడదా. నిజానికి మనం మన దేవునికోసం మనమే చేసే పూజకు మధ్యవర్తి ఉండి మనకు తెలియని భాషలో చదవడం అవసరమా. ఇవి మౌలికమైన ప్రశ్నలు. ఇవి విశ్వాసానికి మాత్రమే సంబంధించినవి కావు. అసలు దేవుని దృష్టిలో మనుషుల మధ్య తారతమ్యాలు లేనట్లే భాషల మధ్య కూడా ఉండవు. అది నిజంగా దేవుడే అయితే అసలు ఉండడానికి వీలు లేదు. మన దేవుళ్లకు తెలుగు రాదా అని ప్రశ్నవేసుకుంటే రాదు అని చెప్పగలిగే తెలుగు వారు ఉన్నారా. రాదు అని చెప్పలేనప్పుడు మన తెలుగుకు మతసంస్కార స్థాయిని కల్పించి గుడిలో ఇంట్లో అన్ని మత కార్యాలకు తెలుగే ఎందుకు వాడకూడదు అని ప్రశ్న వేసుకుందాం. ఈ విషయంలో క్రిస్టియన్లు కొంత మెరుగు అనిపిస్తుంది వారు మత ప్రచారం చేయడానికి తమ టార్గెట్ గా ఎవరు ఉన్నారో వారి భాషలోనే ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. క్రీస్తు భాష అని హీబ్రూ భాషలో చేయరు. పెండ్లిలోను అందరికీ అర్థమయ్యే తెలుగులో ప్రమాణం చేస్తారు. కాని వారి తెలుగు విషయంలోను తకరారు ఉంది. వారు ఒక ప్రత్యేకమైన తెలుగును కృతకమైనదాన్ని అభివృద్ధి పరచారు. వారి మతప్రచారకులకు మామూలు అందరికీ అర్థమయ్యే తెలుగు వచ్చినా దానిలో మాట్లాడరు. వారి కృతక తెలుగులోనే మాట్లాడతారు. ఇక్కడ కూడా ఆ తెలుగుకు మత స్థాయి వచ్చింది.
బడుల్లో తెలుగు పరిస్థితి దీనాతిదీనంగా ఉందనే విషయం మొన్న విశాఖపట్నంలో జరిగిన సంఘటన ఇంకా ఇలాంటి చాలా సంఘటనలు రుజువు చేస్తాయి. అధికారభాష అమలుకూడా ప్రభుత్వం చేతిలో ఉంది. దానికోసం ఉద్యమం చేయాల్సిందే. కాని మన ఇండ్లలో చేసే పూజల్లోను గుడుల్లో చేసే పూజల్లోను మనకు మనమే దేవునికి మనకు తెలిసిన మన తెలుగులో చేసుకోలేమా అని ప్రశ్నించుకొని ఆచరిస్తే మన తెలుగుకు మతసంస్కార స్థాయిని పవిత్ర స్థాయిని తెచ్చుకోవడం మన చేతల్లోనే ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఉద్యమం చేసైనా తెలుగుకు మతపవిత్రస్థాయికూడా తెచ్చుకోవాలి. నాకు తెలుగు అర్థం కాదు అనే దేవుడు ఉంటాడని దేవుడిని నమ్మేవాళ్ళు ఎవరైనా అంటారా. చూద్దాం వేచి చూద్దాం.
పులికొండ సుబ్బాచారి 

Wednesday, April 4, 2012

మిత్రులారా
నేను మా విశ్వవిద్యాలయంలోని మా జానపదవిజ్ఞాన శాఖనుండి తెలుగు జానపద కథలలో అంతర్గతంగా ఉన్న వివిధ సామాజిక వర్గాల వారి మనోభావాలు సామాజిక నిరసన ఎలా ఉంటుంది అనే అంశంపైన యుజిసి వారి మేజర్ రిసెర్చి ప్రాజెక్టుకోసం పరిశోధన చేస్తున్నాను. ప్రస్తుతం వివిధ జిల్లాలనుండి కథలను సేకరిస్తున్నాను. రాయలసీమ జిల్లాలలో కొన్ని సర్కారు జిల్లాలలో కొన్నింటి నుండి కథలు సేకరించాను. ఇక తెలంగాణా జిల్లాలలో నుండి కొన్నింటిని సేకరించవలసి ఉంది. 
తెలుగు వారందరికీ చేసే మనవి ఏమంటే మీకు తెలిసిన జానపద కథలు ఏమైనా ఉంటే పంపండి వాటిని పరిశోధనలో విశ్లేషణకు చేరుస్తాను. వాటిని ఇచ్చిన వారి పేరు పైన ప్రచురిస్తాను. ఈ ఆలోచనను నలుగురితో పంచుకుంటే నేను మరింత కృతజ్ఞుడిని 
భవదీయుడు
పులికొండ సుబ్బాచారి.