Thursday, March 22, 2012

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి

ద్రావిడ విశ్వవిద్యాలయం

కొత్త జేబురుమాలు

కాలాన్ని కత్తిరించి

చిన్ని రుమాలు చేసి జేబులో పెట్టుకున్నా

గొడుగ్గుడ్డ చేసి నెత్తిమీద పెట్టుకున్నా

అదే బుష్ షర్టయింది అదే బెత్తెడంత

చిత్తూరు అంచు పంచైంది మా యావిడ

పండగనాడు సింగారించిన పోచంపల్లి చీరైంది

మా నామ్నాయి పాలు పొంగిస్తే బుస్సుమని పొంగిన

తెల్లటి నురుగు ఎండిన వరిమాగాడి పక్క

పురుగుల మందు తాగిన నోట్లో నుండి బయటి కొచ్చింది

మా అక్క వేప పచ్చడి నోటికాడి కందించింది

మామిడి ముక్కాలేదు తీపి బెల్లం ముక్కాలేదు

చేదంతా ఒంటి నిండా పాకింది చేదంతా కిరాణాకొట్లో

పచారీ సరుకునంతా పాకిపాకి వాటేసింది

నోరంతా కశం బజాట్లో దేన్నడిగినా

ఒళ్ళంతా చేదై చేతుల్నికట్టేస్తా ఉంది

బస్సంతా చేదే రైలంతా చేదే బండి మీదమ్మే జిలేబీ చేదే

అప్పుడప్పుడూ తొంగిచూసే కరెంటు తిప్పిన ఫ్యాను గాలంతా చేదే

కట్టిన బట్టంతా చేదే, జేబురుమాలు, పంచె, మా అబ్బాయి జీన్సు

మా మాయావిడ పోచంపల్లి చీర అబ్బా అన్నీ

చేదు చేదై బుగులు బుగులైతాంది

ముక్కుబేసరి తాకట్టు పెట్టి మా యావిడ సీరియల్ చూడనీకి

వాయిదాల మీద తెచ్చిన కలర్ టీవీ కంటినిండా చేదు

కనిమొళిని చూస్తిని, రాజాని చూస్తిని, బళ్లారి గనుల్ని చూస్తిని

యలహంక, లోటస్ పాండ్ పాలెస్ లని జూస్తిని, శ్రీలక్ష్ములు, ఆచార్యలు

సుఖ్ రామ్ లు హర్రాములు అబ్బా

ఏ ఛానల్ నొక్కినా గదంతా చేదు ఇల్లంతా చేదు

ఇల్లంతా పందికొక్కుల కన్నాలతో నులకమంచం కళ్ళాయె

కూసోనీకి జాగలేకపాయె నిలవనీకి కాలు చాలక పాయె

కాలం దొరలు తొక్కిన పావురం తలతెగిన విగ్రహం

ఒకేపున అడివి మరోయేపున కొరివి ఏడ జత్తు

నందనా ఓ కొత్త జేబురుమాలూ

కాస్త నువ్వయినా తీపిని తెస్తావా

ఎన్ని గల్లంతుల్ని చూడాలో ఎన్ని గోసల్ని చూడాలో

ఎంత నెత్తురు చూడాలో ఎంత చేదును పూసుకోవాల్నో

కాలాన్ని కత్తిరించాను ఆశగా మంచి మంచి రూపాల్లో

ఏ ముక్క పడితేనేం ఆ తానులో గుడ్డేగా

ఒక కండువాతో ముఖం చెమట తుడుద్దామనుకున్నా

అబ్బా చేదు చేదు కాలమంతా చేదేనా...

ఎక్కడో కూస్తున్న కోకిల మాత్రం కాస్తంత తీపిని వినిపిస్తూంది

పులికొండ సుబ్బాచారి

Description: https://mail.google.com/mail/images/cleardot.gif

Monday, March 19, 2012

ప్రొఫెసర్‌ పులికొండ సుబ్బాచారి

ద్రావిడ విశ్వవిద్యాలయం 517426

అధూరె రహ్‌ గయె జిందగీ

వ్యధార్త జీవన యథార్థ దృశ్యాలు స్కైబాబా కథా చిత్రాలు

కథారచనలో తెలుగులో ఒక కొత్త తరంగం. అస్తిత్వ వాద కథల్లో కూడా ఇది నవతరంగం అని చెప్పవచ్చు. అదే స్కైబాబా అధూరె కథాసంకలనం. తెలుగు ముస్లింల వ్యధార్త జీవన యథార్థ చిత్రాలను కళాత్మకంగా చిత్రించిన కథలివి. ఒక అత్యంత నిపుణుడైన సినిమెటోగ్రాఫర్ కళాత్మకంగా చిత్రించిన దృశ్యకళాఖండం అనిపించేలా ముస్లిం జీవనదృశ్యాల్ని మాటలతో చిత్రించిన కథలు అధూరె. అధూరె అనే ఉర్దూ పదానికి అసంపూర్ణమైన అని పూర్తికాని అని అర్థం. ఇందులోని కథలు నిజంగా ముగింపు చేయకుండా సగంలో ఆపినట్లు కనిపిస్తాయి. తర్వాతి విషయాన్ని పాఠకునికి వదిలి పెడతాయి. కాని రచయిత తను చెప్పదలచుకున్న విషయం మాత్రం ముగుస్తుంది. కథని ఆపడంలో మంచి కళాత్మకతనే కాదు పరిణతినీ కథకుడు ప్రదర్శిస్తాడు.

గడచిన దశాబ్దంలో తెలుగు సాహిత్యంలో పెరిగినంత వస్తు వైవిధ్యం క్రితంలో లేదు. దాదాపు ఐదారు సంవత్సరాలనుండి అస్తిత్వ వాద సాహిత్యం విరివిగా రావడం దీనికి మొదటి కారణం. సాహిత్య సృష్టి చేసే వ్యక్తులు కూడా విభిన్న సామాజిక వర్గాలనుండి ఇంకా వివరంగా చెబితే వివిధ కులాలనుండి రావడం గడచిన రెండు దశాబ్దాలలో వచ్చినంత విస్తృతంగా ఇంతకు ముందు లేదు. దీనికి చాలా సామాజిక కారణాలను చెప్పవలసి వస్తుంది. దళిత కులాల వారు ఇతర నిమ్న కులాల వ్యక్తులు ఇంతకు ముందు సాహిత్య సృష్టిచేయలేదని కాదు. ఇంతకు ముందు ఉన్న సామాజిక నేపథ్యానికి ఇప్పటి సామాజిక నేపథ్యానికి ఉన్న తేడాని గమనిస్తే ఈ రెండు దశాబ్దాలలో వచ్చిన సామాజిక అస్తిత్వ సాహిత్యం పుట్టిన తీరును గమనించవచ్చు. రెండు దశాబ్దాల క్రితం తెలుగు సాహిత్య విమర్శలో అస్తిత్వ వాదం అనే పదాన్ని Existentialism అనే అర్థంలో వాడేవారు. జీన్ పాల్ సార్త్ర్ దగ్గరనుండీ ఈ వాదానికి మూలమైన వారి రచనల ద్వారా ఆలోచనా ధోరణుల ద్వారా ఈ సాహిత్యాన్ని విశ్లేషణ చేసేవారు. కాని గడచిన ఐదారు సంవత్సరాలలో అస్తిత్వం అస్తిత్వసాహిత్యం అస్తిత్వవాదం అనే మాటల్ని దీనికి భిన్నమైన అర్థంలో వినియోగిస్తున్నారు. ఒక సామాజిక వర్గం అది దళిత కులానికి చెందినది కావచ్చు లేదా ఇతర నిమ్న వర్గాల బి.సి కులాలకు చెందిన వారు కావచ్చు తమ కులానికి లేదా సామాజిక వర్గానికి చెందిన సామాజిక అస్మితి (Social Identity) ని నేపథ్యంగా చేసుకొని చేసిన రచనలను అస్తిత్వ సాహిత్యం అని వర్గీకరించి పిలవడం పరిపాటి అయింది. అస్తిత్వ వాదం అనేది తెలుగు సాహిత్యంలోను సాహిత్య విమర్శలోను సరికొత్త అర్థంలో ఈనాడు స్థిరపడింది. ఈ సాహిత్య నేపథ్యంలో ఇటీవలే వచ్చిన స్కైబాబా కథాసంకలనం అధూరె ని చదివితే దీని విలువని అర్థం చేసుకోవడంలో సరైన పద్ధతి ఏర్పడుతుంది. సంకలన రూపంలో వచ్చిన ఈ కథలు ఇంతకు ముందు వివిధ పత్రికలలో వచ్చి పలువురి మెప్పు పొందినవే.

ఆంధ్ర ప్రదేశ్‌లో ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న ప్రస్తుత కాల పరిస్థితుల్ని గురించి చెప్పకుండా ఈ కథల్ని అర్థం చేసుకోలేం. ఈ పుస్తకానికి ఇద్దరు సాహిత్య కారులు మంచి పీఠికల్ని సంతరించారు. వీటిని అలవాటుగా రాసే పీఠికలు అని అనలేం. కారణం అఫ్సర్, కె. శ్రీనివాస్ చేసిన ప్రయత్నం ఫీఠికల రచనకు భిన్నమైన పని. ఈ పుస్తకాన్ని ఈ కథల్ని contextualize చేసే పని చేసారు అంటే అవి గూడుకట్టిన సందర్భంలో నుండి వాటిని చూపే ప్రయత్నం చేశారు. ఇటీవల సిద్ధాంతిగా మారుతూతూన్న అఫ్సర్ కొంత ముందుకు వెళ్లి వీటిని సిద్ధాంతీకరించే పని చేశాడు. కె. శ్రీనివాస్ సామాజిక రాజకీయ నేపథ్యం దృష్ట్యా చరిత్ర భారాన్ని వర్తమాన గాయాన్ని చూపుతూ ఈ కథలకొక సామాజిక భూమికని ముందుంచాడు. ఈ రెండు ఈ కథలలోనికి పొయ్యే పాఠకులకు దారిదివ్వెగా నిలబడతాయి.

ఈ రచయిత సామాజిక నేపథ్యాన్ని సంభావించి తర్వాతనే ఈకథల్ని చూడాలి. స్కై బాబా అంటే ఎస్.కె. యూసుఫ్ బాబా. S.K.Y అనే ఇంగ్లీషు అక్షరాలు తన పేరుకు ముందుకు రావడంతో వాటిని స్కై అని చిత్రంగా మార్చుకొని స్కై బాబా అనే పేర రచనలు చేస్తున్న యూసుఫ్ బాబా నల్గొండ జిల్లాకు చెందిన తెలుగు ముస్లిం, కవి రచయిత, పత్రికా రచయిత. గడచిన దశాబ్దంగా ఆయన కవితలు కథలు రాస్తూ తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితు డయ్యాడు. అటు మంచి తెలుగు సాహిత్యాన్ని ప్రచురించడంలోను మంచి కృషి చేస్తున్నాడు. అంతే కాదు ముస్లిం వాద సాహిత్యం అనే దాన్ని తెలుగులో అస్తిత్వ సాహిత్యాలలో ఒక పాయగా తీసుకొని వచ్చి దానికి ప్రత్యేకమైన గుర్తింపును సాధించడంలో కృషి చేసిన తొలి సాహిత్యకారుడు అని కూడా స్కైబాబాను చెప్పవచ్చు. గడచిన దశాబ్దంలో ఈయన చేసిన సాహిత్యకృషి వల్లనే ఈనాడు తెలుగులో ముస్లిం సాహిత్యం అనే ప్రత్యేక వింగడింపు ఏర్పడడానికి మార్గం సుగమం అయింది. అఫ్సర్, యూకూబ్ కవిత్వంలో ముస్లిం వాద కవిత్వం కూడా ఉంది. వారు దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే రాస్తున్నారు. కాని ఆ కవులు మరింత విస్తృత సాహిత్య నేపథ్యంలో రాస్తున్నారు అంతే కాదు. ముస్లిం వర్గం నుండి తెలుగు సాహిత్యంలో విశేషించి ఆధునిక వచన కవిత్వాన్ని రాసిన కవులు ఇంతకు ముందే, వజీర్ రెహ్మాన్, ఇస్మాయిల్, స్మైల్, దేవిప్రియ సుగమ్ బాబు లాంటి వారు ఇంకా కొందరున్నారు. అంతకు ముందు కూడా సంప్రదాయ కవిత్వ రాసిన ముస్లింలు తెలుగులో ఉన్నారు. కాని స్కైబాబా చేసిన రచనలు అతను చేస్తూ వచ్చిన నేపథ్య కృషి ముస్లిం వాద సాహిత్యం అనే ప్రత్యేకమైన వింగడింపుకు బాగా తోడ్పడింది. తర్వాతి వచ్చే ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర రచనలో ఈ వింగడింపులో ఈ విషయం స్పష్టంగా ఉండవలసి వస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్నిప్రాంతాలలో అంతే కాదు అన్ని గ్రామాలలో ముస్లింలు పరచుకొని ఉన్నారు. ముస్లింలు దాదాపు అన్నిగ్రామాలలో ఐదు పది కుటుంబాలవారు ఉన్నారు. గుడి లేని గ్రామం లేనట్లే దాదాపు పీర్లచావడి లేని గ్రామం కూడా కనిపించదేమో. అన్ని ప్రాంతాలలోని ముస్లింలు తెలుగు మాట్లాడతారు. తెలుగు ముస్లిం మాట్లాడే తెలుగును సినిమాలలో చూపే ధోరణి చాలా ఘోరంగా ఉంటుంది. వారు మాట్లాడే తెలుగే కాదు చాలా ప్రాంతాలలో వారు మాట్లాడే ఉర్దూ మీద కూడా చాలా చమత్కారాలు ఉన్నాయి. పందిరిమీద చొప్పకట్టా భైంస్‌కో డాలోరే అన్నట్లుగా ఉంటుంది వారి ఉర్దూ అని అంటూంటారు. కాని వారిదైన వారి జీవన శైలిని గుర్తించడంలో చాలా మంది పొరబడ్డారు. తెలంగాణా ప్రాంతంలోని ముస్లింలు మాట్లాడే తెలుగుకు అటు ఆంధ్రప్రాంతం ముస్లింలు మాట్లాడే తెలుగుకు తిరిగి చాలా భేదం ఉంది. అలాగే ఆంధ్ర ప్రాంతంలోని ముస్లింలు బయట తిరుగుతూ ఉండడంవల్ల వారు మాట్లాడే తెలుగు వారింట్లో ఉండే స్త్రీలు మాట్లాడ లేరు. తెలంగాణా ప్రాంతంలో విశేషించి నల్గొండ జిల్లా ప్రాంతంలో ముస్లిం కుటుంబాలు మాట్లాడే తెలుగుభాష ఈ కథలన్నింటిలోను సజీవంగా ఉంది. వీరు మాట్లాడే తెలుగులో ఉర్దూ పదాలు చాలా ఎక్కువగా ఉండడమే కాదు వాళ్ళు పలికే తెలుగు పదాలు కూడా ఉర్దూ లాంటి ఉచ్చారణతో ఉంటాయి. చానా అనే మాటను షానా అని చూచిండు అనడానికి సూషిండు అని అనడం. (నల్గొండకు చెందిన ఒక తెలుగు మంత్రి తెలుగు కూడా ఇలాగే ఉంటుంది.) అంతే కాదు ఉర్దూ పదాల్ని హైపర్ స్టాండర్డైజ్ చేయడం కనిపిస్తుంది. శాదీని షాదీ అని చాలా పదాల్ని ఇలా మాట్లాడడం కనిపిస్తుంది.

కథా రచనలో ముఖ్యంగా భాషని ఎన్నుకోవడంలో ఇంతకు ముందు రచయితలు చాలా ప్రయోగాలు చేశారు. ఉత్తరాంధ్ర మాండలికంలో, రాయలసీమ మాండలికంలో, తెలంగాణా మాండలికంలో, గోదావరి జిల్లాల యాసలోను కథలు నవలలు వచ్చాయి. కానీ ఒక ప్రత్యేక సామాజిక వర్గం మాట్లాడే భాషలో కథలు రావడం స్కైబాబాతోనే ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ఇది డయలెక్ట్ కాదు భాషాశాస్త్రంలో దీన్ని ఇడయలెక్ట్ (idialect) అంటారు. అంటే వర్గ మాండలికం అని తెలుగులో అనాలి. ఇలా వర్గ మాండలికంలో ఎవరైనా ఇంతకు ముందు కథలు రాసారేమో కాని ముస్లిం వర్గమాండలిక భాషకు మంచి సాహిత్య స్థితిని సాహిత్య గౌరవాన్ని తెచ్చిన గౌరవం కీర్తి స్కైబాబాకు దక్కవలసి ఉంది.

తెలుగు సాహిత్యంలో భాష విషయంలో ప్యూరిటాన్లు (స్వచ్ఛతావాదులు) దీన్ని తురకతెలుగు అని అనవచ్చు. సంకర భాష అని కూడా ఈసడించ వచ్చు. ఇది సాహిత్య రచనకు పనికి రాదని ఇదేం తెలుగు అని కూడా మరికొందరు ఎక్కిరించవచ్చు. కాని జీవన యదార్థాలను గ్రహించలేని వారిని కొన్ని వేలమంది మాట్లాడే ఒక భాషకు సాహిత్య స్థితి లేదనే వారిని ఉపేక్షించి ఊరుకోవడం మంచిది. ఒక సామాజిక నేపథ్యంలో జీవిస్తున్న ఒక సామాజిక వర్గం దాని నేపథ్యంలో అది మాట్లాడుతుంది. ముస్లింలు రెండు భాషా నేపథ్యాలలో పెరుగుతారు. ఒకటి మాతృభాష ఇక్కడ అది ఉర్దూ రెండోది వారి పరిసర భాష అంటే సామాజిక భాష అది తెలుగు దీన్నే పితృభాష అని ఇక్కడ అనవచ్చు. మిశ్రమం సంకరం కాని ఏభాషా లేదు, ఇది భాషాశాస్త్రం చెప్పే శాస్త్రీయవిషయం.

కాని ఇక్కడ ఈ కథల్లో ముస్లింలు మాట్లాడేది కృతక భాష అని అనడం అవగాహనా లోపమే. వారిదైన సజీవసామాజిక సందర్భంలో మాట్లాడే సజీవభాష అది. నల్గొండ జిల్లాలో తెలుగు సమాజంలో జీవించే ముస్లింలు బయటికి వచ్చి తెలుగు సమాజంలో వ్యవహరించే సజీవమైన తెలుగు భాష ఇదొక వర్గమాండలికంగా రూపొందింది. ఈ సహజ భాషలోనే స్కై బాబా తన కథల్నిరాశాడు. ఈ భాష నేపథ్యాన్ని చూడకుండా ప్రశ్నించడం అపరిణతదృష్టి అల్పదృష్టి అనే చెప్పాలి. అస్తిత్వసాహిత్యంలో ఈ వర్గ మాండలికమే ముఖ్యపాత్ర పోషిస్తుంది. తెలుగు నేలలోని ఒక్కొక్క కులం వారు ఒక్కొక్క వృత్తిని అవలంబిస్తున్నవారు ఉన్నారు. వారి భాషలలో వారి వర్గమాండలికం దాగుంది. దళిత సాహిత్యంలో మాదిగ కులం వారు మాట్లాడే పదజాలాన్ని పట్టి చూడవచ్చు. మాండలికమే కాదు ఈనాడు వర్గమాండలిక భాష అస్తిత్వ సాహిత్యంలో ప్రముఖపాత్ర పోషిస్తూ ఉంది. కారణం ఆ రచయితలు ఆ కులాల సామాజిక నేపథ్యాన్ని ప్రతిభావంతంగా పోషించే పనిచేయడమే. జూపాక సుభద్ర కవితల్లో కూడా అంత ప్రతిభావంతంగా జీవన దృశ్యాలు కనిపించడానికి కారణం వర్గమాండలిక భాష అస్తిత్వ సాహిత్యంలో పోషించిన పాత్రే. స్కైబాబా యథార్థ జీవన చిత్రణలో తను గ్రహించిన సామాజిక నేపథ్యపు సజీవ భాషని అందించాడు.

స్కైబాబా కథల్లోని ఈ భాషానేపథ్యం ఈ కథలకున్న సామాజిక నేపథ్యం ఈ కథల్ని తెలుగు సాహిత్యం లో ఒక కొత్త కెరటంగా నిలుపుతున్నాయి. ఇవి ఒక ప్రత్యేక స్రోతస్సుగా రూపొందాయి.

జానపదశాస్త్రంలోను, మానవశాస్త్రంలోను ఇన్‌సైడ్ అబ్జర్వర్ అనే మాట ఉంది. అంటే ఒక పరిశోధకుడు ఒక సామాజికవర్గాన్ని గురించి లేదా జానపద సమూహాన్ని గురించి పరిశోధన చేసే టప్పుడు ఆ పరిశోధకుడు ఆ కులానికే లేదా ఆ సామాజిక వర్గానికే లేదా ఆ మతానికే చెందినప్పుడు అతనిని ఇన్‌సైడ్ అబ్జర్వర్ అని అంటారు. ఆంతరిక పరిశోధకుడు అని తెలుగులో అనవచ్చు. ఆంతరిక వ్యక్తులు ఆ సామాజిక వర్గం పైన పరిశోధన చేయడంలో చాలా సౌకర్యాలు ఉంటాయి. అంతే కాదు కొంత అసౌకర్యం కూడా ఉంటుంది. ఆ సామాజిక వర్గంపైన అలవిమాలిన ప్రేమ చూపి రాసే ప్రమాదం ఉందని కూడా శాస్త్రం చెబుతుంది. ఇదే మాట కవులకు రచయితలకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ స్కైబాబా ఇన్‌సైడ్ అబ్జర్వర్ గా ఉండి తాను ముస్లిం అయి తన చుట్టూ ఉన్న ముస్లిం సమాజం జీవన చిత్రాన్ని కథలుగా రచించాడు. ఇది ఇతనికి లభించిన ఫాయిదా అని అంతే కాదు తెలుగు సాహిత్యానికి లభించిన ఫాయిదా అనీ చెప్పవచ్చు. అందుకే స్కైబాబాని ఇన్‌సైడ్ పోయట్ లేదా ఇన్‌సైడ్‌ రైటర్ అని అనాలి. నల్గొండ జిల్లా ముస్లిం జీవితాన్ని ఆ భాషని ఇంత ప్రతిభావంతంగా బయటి వారు చెప్పే వీలు ఉండదు. ఇది సాహిత్య సృజనలో ఇన్‌సైడర్ కి ఉన్న సౌలభ్యం. అందుకే అస్తిత్వసాహిత్య సృజనలో ఇన్‌సైడరే ప్రధానపాత్ర పోషిస్తాడు. ముస్లిం జీవన చిత్రణలో స్కైబాబా పోషించిన పాత్ర ఇది.

కొయ్యబొమ్మలె మెచ్చుకళ్ళకు కోమలుల సౌరెక్కునా అని గురజాడ అన్నాడు. అలాగే ప్రబంధ పాత్రల్ని కొయ్య బొమ్మలు అని కట్టమంచి చాలా వివేచించి చెప్పాడు. కథా సాహిత్యంలో నవలా సాహిత్యంలో తెలుగులో కొయ్య బొమ్మ మూసపాత్రలు చాలా చోట్ల కనిపిస్తాయి. కాని స్కైబాబా చిత్రించిన పాత్రలు జీవం ఉట్టిపడుతూ రోజూ మన మధ్య కనిపించే ముస్లిం వ్యక్తులుగా మనకు తారసపడే వారై కనిపిస్తారు. మనకు తెలిసిన ముస్లింల జీవితాల్లో కూడా మనకు తెలియని కష్టాలు కన్నీళ్ళగురించి విలపించి వివరిస్తాయి ఈ కథలు. ఇందులోని పాత్రలు సుల్తానా, జానీబేగం, సల్మా, జరీనా, ఫాతిమా, షాహీన్, పర్వీన్, షాజీదా, సైదాబేగం, ముంతాజ్ బేగం పాత్రలు తెలుగు సాహిత్యంలో చాలాకాలం నిలబడి ఉంటాయి. కారణం కవి నిజజీవితంలోనికి తొంగిచూచిన తీరు తాను దర్శించిన జీవన వాస్తవాల్ని ఉన్నదున్నట్లు మాత్రమే కాకుండా దాన్నొక అద్భుత కళగా మలచిన తీరు ఇదే సన్నపోగారు శిల్పంపని, ఇవి ఈ కథల్ని కలం కాలం గుర్తుండేలా చేస్తాయి. చదివిన పాత్ర మనస్సులో ముద్రవేసుకోవడం ఇందులో ఒక గుణంగా కనిపిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లింల జీవితాల్లో గడచిన రెండు మూడు దశాబ్దాలలో వచ్చిన సామాజిక పరిణామం వారు పొందే సంఘర్షణ ఈ కథల్లో కనిపిస్తుంది. ప్రపంచం ఒక చిన్న కుగ్రామం అయిందనే మాట ఉగ్రవాదం విషయంలోను వర్తిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే రాజకీయ సంక్షోభాలు దేశాల మధ్య సంఘర్షణలు అంతర్జాతీయ స్థాయి ఉగ్రవాదం కూడా ఎక్కడో ఉండే నల్గొండ జిల్లా గ్రామంలోని ముస్లిం కుటుంబం పైన పడుతుంది. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అమెరికాపై జరిగిన నవంబరు 9 ఉగ్రవాదఘటన ఆసియా దేశాలపైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. అమెరికా మన పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో శాశ్వతమైన స్థావరాన్ని ఏర్పరచుకొని నాటో పేరుతో నిత్యం చేస్తున్న యుద్ధం పాకిస్థాన్ ఆంతరిక సమాజం మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. పాకిస్థాన్లో అంతర్గతంగా జరుగుతున్న ఉగ్రవాదనరమేధం అక్కడ ముస్లిం సమాజంలోనే మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉంది. జీహాద్ అనే మాట ప్రపంచాన్ని వణికిస్తూ ఉన్న నేపథ్యంలో దాని ప్రభావం భారతదేశంలోని ముస్లిం సమాజం పైన చాలా తీవ్రంగా పడింది. పలు ఇస్లామిక్ ఉగ్రవాద చర్యల వెనుక ఉగ్రవాద సంస్థల వెనుక ఉన్న మూలాలు చాలా సార్లు హైదరాబాదులోను నల్గొండ, నిజామాబాదుల్లోను దొరికాయి. అరెస్టులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ఉగ్రవాదానికి చాలాసార్లు మూల్యం చెల్లించింది. గోకుల్ ఛాట్ లోను, లుంబినీ పార్కులోను, మక్కామసీద్ లోను ఆంధ్రరాష్ట్రానికి తగిలిన గాయాలు హిందు ముస్లిం ప్రజల మధ్య తీవ్రమైన అగాధాన్ని మిగుల్చాయి. సంబంధంలేని, ఏ నేరం తెలియని అమాయకులైన లక్షలాది ముస్లింల దైనందిన జీవితం కూడా దీనివల్ల ఛిద్రం అయింది. ఒక్కడి తప్పుకు వేల మంది మూల్యం చెల్లించుకోవలసి వస్తూ ఉంది. ఈ జీవన స్థితిని దావా అనే కథలో అత్యంత హృద్యంగా చిత్రించాడు స్కైబాబా. ముంతాజ్ బేగం ఒక అమాయకుడైన యువకుడైన ముస్లింకు తల్లి. పోలీసులు ఉగ్రవాద చర్యపైన అనుమానంతో అరెస్టు చేసిన కొందరు ముస్లిం యువకుల్లో ఒక యువకుని తల్లి. ఏ పాపం ఎరుగని తన కొడుకుని విడిపించుకోవడానికి ఏ పలుకుబడీ లేని ఒక బీద ముస్లిం తల్లి చేసిన హృదయవిదారకమైన ప్రయత్నాన్ని ఇందులో ప్రతిభావంతంగా చిత్రించాడు రచయిత. ఈ స్థితిని రచయితే కథ మధ్యలో ఒక వాక్యంలో ఇలా చెప్తాడు. గూట్లోంచి కిందబడ్డ తన పిల్లకోసం ఒకటే అరుసుకుంట అటు ఇటు చక్కర్లు కొడుతున్నది కాకి. అని రాసాడు. ముంతాజ్ బేగం ఎంతో ప్రయత్నంచేసీ పోలీసుల కాళ్ళవేళ్ళా బడీ తన కొడుకుని విడిపించుకోలేక పోయింది కొద్ది రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ నుండి తన కొడుకును ఎక్కడకో మరొక పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయారని తెలుసుకుంటుంది ఆ తల్లి. ఆ తల్లి గుండెపగిలి చక్కరొచ్చినట్లు అక్కడనే కూలబడిపోయింది అది తెలిసి. ఇక్కడ కథ చివరి వాక్యంగా రచయిత కాకిపిల్లను కుక్కలు ఎక్కడికో ఎత్తుకుపోయినయ్. అని రాసి కథను ఆపాడు. ఇక్కడున్న సింబాలిజం గురించి కథాకళ గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. ఇది పాఠకుల హృదయాల్ని ప్రత్యక్షంగా తాకుతుంది.

ముస్లిం జీవితాల్లోనో ఉండే ఇలాంటి ప్రత్యేక సమస్యల్ని కొన్ని కథలు ఇలా చెబితే మరికొన్ని కథల్లోని జీవన సంఘర్షణలు ఇవి అన్ని సమాజాల్లో కనిపించేవే అని అనిపిస్తాయి. కబూతర్ అనేకథలో ఒక పేద ముస్లిం మహిళ తన కూతురు పెండ్లి కోసం పడే కష్టం మనసుని హత్తుకుంటుంది. కాని ఇక్కడ ఈ భాషని మినహా ఇస్తే ఇది తెలుగు సమాజంలో కింది తరగతి కుటుంబాలలో అన్నిచోట్లా కనిపించే దృశ్యమే. ఇలా సర్వసాధారణ సాంఘికాంశాలను కొన్ని కథల్లో గ్రహించినా ముస్లిం కుటుంబ జీవనంలోని వైవిధ్యాన్ని ఇక్కడ రుచి చూడవచ్చు. నగర జీవనంలోని ముస్లింలకు ఎదురయ్యే ప్రధానమైన సామాజిక సమస్య నగరంలో ముస్లింలకు ఇళ్ళు అద్దెకు ఇవ్వడానికి ఇతరులు ఎవ్వరూ అంగీకరించకపోవడం ఈ అంశాన్ని వెజిటేరియన్స్ ఓన్లీ అనే కథలో ప్రతిభావంతంగా చిత్రించాడు. కోయంబత్తూరులో జరిగిన వరుస పేలుళ్ల తర్వాత అక్కడ ముస్లింల సామాజిక జీవనం అత్యంత దుర్భరం కావడాన్ని సామాజిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ప్రతి ముస్లింను అనుమానంగా చూడడం రైళ్ళలో బస్సుల్లో వారి పక్కన కూర్చోకపోవడం. వారికెవరికీ ఇళ్ళు అద్దెకు ఇవ్వక పోవడం ఇలా ప్రతి అంశంలోను వారు దుర్భరమైన జీవితాన్ని గడపడాన్ని, అక్కడా కొందరు రచయితలు చిత్రించారు. ఈ దుర్భరస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎలా ముస్లిం సమాజం ఎదుర్కొంటు ఉందో స్కైబాబా మన కళ్ళ ముందుంచడమే కాదు దాన్ని హృద్యంగా మలచడంలో తన ప్రతిభను చూపాడు. ఇక ఈ కథల్లోని భాషని గురించి ప్రత్యేకమైన వ్యాసమే రాయవలసి ఉంది. ముస్లిం సమాజంలోని వివిధ వృత్తులు చేస్తూ అతి కఠినంగా జీవితాన్ని గడిపే వ్యధార్థ జీవనదృశ్యాలు, పేదరికంతో విడిపోయే ప్రణయబంధాలు, చాలీచాలని బ్రతుకుల్లోని దైన్యం, వలస జీవితాలు, దుబాయ్ జీవితాల్లోని సంఘర్షణలు ఇవన్నీ ఇందులో మసక కన్నీటి తెరచాటున దాచబడినాయ్.

ఈ కథలకు పాఠకులు ఎవరు అని అనుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలు మనసును వేధిస్తాయి. ఇందులో ఉర్దూ పదాల సమ్మేళనం చాలా విస్తారంగా ఉంది. తెలుగు పాఠకులు అందరూ చదవాలనే ఉద్దేశం రచయితకు ఉంటే తప్పనిసరిగా ఇందులోని తొంబై శాతం పదాలకు ఫుట్ నోట్ లో అర్థాలు ఇవ్వాలి. ఇది ప్రామాణికపద్ధతి. తెలుగు వారు అందరికీ అర్థమయ్యే ఉర్దూ పదాలు ఇందులో కొన్నే ఉన్నాయి. ఉర్దూ బాగా తెలిస్తే తప్ప ఈకథలు అధూరాగనే అర్థం అవుతాయి. తన ఉద్దిష్టపాఠకులు ఎవరు అనే ప్రశ్న రచయిత వేసుకున్నట్లు కనిపించదు. తదుపరి ప్రచురణలో ఈ లోపాన్ని స్కైబాబా సరిదిద్దుకోవలసి ఉంది.

ఒక ఇన్ సైడ్ అబ్జర్వర్ చేసిన పరిశీలన ఒక క్లోజప్ దృశ్యం అధూరె... కథలు చదవడం ముగిసిన తర్వాత స్కైబాబానుండి ఏ దిల్ మాంగే మోర్ అని అనిపిస్తుంది. మహ్మద్ రఫీ గొంతులోని ఏ దిల్ అభీ భరా నహీఁ అని మనసు అధూరాగా మిగిలిపోతుంది...

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.

Monday, March 5, 2012

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, ౫౧౭౪౨౫. అ.ప ఇండియా

దేవుని సేవలో ఏ కులం గొప్పది?

అన్ని దేశాలలో మనుషులు ఆసుపత్రులలో పుడతారు. కాని మన దేశంలో మాత్రం ఒక్కొక్కరు ఒక్కో కులంలో పుడతారు. ఒక సారి మన ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మనం స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది కాని ఇరుగు పొరుగు వారిని ఎంపిక చేసుకునే వీలు లేదు కదా అని అన్నాడు. ఇది పాకిస్థాన్ ను ఉద్దేశించి. ఇరుగు పొరుగు దేశాలను ఎంపిక చేసి తెచ్చుకోవడం ఎలా సాధ్యం కాదో ఈ దేశంలో పుట్టిన కులాన్ని మార్చుకోవడం కూడా అలాగే సాధ్యం కాదు అన్నది శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా ఋజువైన సత్యం. మతం మారినా ఈ కుల విభేదాలు ఆ కొత్త మతాలలోనికి పోయాయే కాని పోయిన వారి కులాలు పోక వారు అలాగే ఉండిపోయారు. గొప్ప కులం తక్కువ కులం అనే సామాజిక వివక్షను ఆ దేవుడు కూడా తీసివేయలేకపోయాడు. మనుషులు అందరూ సమానులే అని కనీసం దేవుడు కూడా అంగీకరించాడో లేదో అనే అనుమానం చాలా మంది సంతులు సధువులకు, మహా కవులకు కూడా చాలా సార్లు వచ్చింది. నిమ్నకులాలలో పుట్టిన సాధు సంతులు దేవుడినే శాసించగలిగిన వారు కూడా సామాజిక వివక్షను తట్టుకోలేక ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా అని ప్రశ్నించారు. నేను ఈ కులంలో ఎందుకు పుట్టానా అని రోదించిన ఘట్టాలున్నాయి. పుట్టరాని చోట పుట్టి నాశక్తి నా కళ ఎంత వృథా అయిందో కదా అని మహాకవి జాషువా దుఃఖించిన పద్యం ఉంది. "ఎంత కోయిలపాట వృథ యయ్యోనో కదా చిక్కు చీకటి వనసీమలందు/ ఎన్నివెన్నెలవాగు లింకిపోయెనొకదా కటిక కొండలమీద మిటకరించి/, ఎన్ని కస్తురి జింక లీడేరెనో కదా మురికి తిన్నెల మీద పరిమళించి/, ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా పండిన వెదురు జొంపములలోన/ ఎంత గందవహన మెంత తంగెటి జున్ను ఎంత రత్నకాంతి ఎంతశాంతి/ ప్రకృతి గర్భమందు భగ్నమైపోయనో, పుట్టరాని చోట పుట్టుకతన". అని బిగ్గరగా వాపోయాడు. ఇలాంటి కంఠాలెన్నో ఈ దేశంలో రుద్ధమై పోయినాయి. కాని కులం మారలేదు.

కాని సాక్షాత్తు దేవుని సన్నిధానంలో ఉండి కూడా దేవుని సేవలో నిమగ్నమై కూడా నా కులం గొప్పది వాడి కులం తక్కువది అనే దుర్నీతిని దురహంకారాన్ని వీడలేని స్థితి నేడు కూడా ఎలా ఉందో చెప్పడం ఇక్కడి ఉద్దేశం. దేవుని సేవలో కులాలు అనే ప్రశ్న ఎందుకు వస్తుంది అనే ప్రశ్న వేసుకోవలసి వస్తుంది. వేసేవారుకూడా ఉన్నారు. కాని ఈ దేశంలో విశేషించి ఆంధ్రప్రదేశ్ లో దేవుని సేవల కోసం కులచట్రం ఉంది. ఇది కొన్ని వందల వేల సంవత్సరాలుగా వస్తూ ఉంది. దీనిని ఎవరూ మార్చలేకపోయారు. ఒక్కొక్క కులం వారికి కొన్ని సేవలు నిహితమై ఉన్నాయి. ఆలయం కట్టించేవారు దానికి అవసరమైన ధనాన్ని సేకరించి అందించి భూమిని ఇచ్చి దానికి నిర్మాణానికి దారితీసే వ్యక్తులు ధర్మకర్తలు అవుతారు. సాధారణంగా ఈ ధర్మకర్తలుగా రాజులు మన్నీడులు, రాజాలు ఉంటారు. తర్వాత సంపన్నులైన భూస్వాములు ఉంటూ ఉంటారు. ఈ ధర్మకర్తలు గా ఉన్నవారు వారి వంశ పారంపర్యంగా ధర్మకర్తలుగానే మిగిలిపోతారు. వీరికి వంశపారంపర్యంగా ఆకుటుంబానికి ఆలయంలో ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. తొలి హారతి వారికే ఇస్తారు. దేవునికి కల్యాణం జరిగినప్పుడు పీటలమీద కూర్చునేది ఈ ధర్మకర్తల కుటుంబం వారే. వారి తర్వాతే ఎవరైనా దీన్ని గురించి ఆలోచించాలి. ఈ ధర్మకర్తలే దేవాలయాన్ని దేవుని విగ్రహాన్ని తయారు చేసే శిల్పిని ఎన్నుకుంటాడు. శిల్పులను రాజులు పోషించిన కారణం ఇదే. ఈ నాటికి కూడా ధర్మకర్తలే శిల్పులను ఎన్నుకొని వారికి డబ్బు ఇచ్చి ఆలయ నిర్మాణాన్ని విగ్రహ నిర్మాణాన్ని చేయిస్తారు. ఈ కాలంలో ఈ నిర్మాణ రీతిలో కొంత మార్పు వచ్చినా దేవుని శిలా విగ్రహాలను శిల్పాచార్యులే చేస్తున్నారు. అంటే విశ్వబ్రాహ్మణులు లేదా విశ్వకర్మకులంలో పుట్టిన శిల్పాచార్యులు చేస్తారు. వారితో చేయిస్తేనే అది లాయకీ అని ఇప్పటికీ మిగతా కులాల వారు నమ్ముతారు. ఈ విశ్వకర్మకులంవారు నేడు బి.సి వర్గీకరణలో ఉన్నారు. వీరు కూడా సామాజిక దురన్యాయాన్ని చవిచూచేవారే. తర్వాత ఆలయ నిర్మాణం చేసిన తర్వాత విగ్రహరచన పూర్తి అయిన తర్వాత ఆ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసేది విశ్వబ్రాహ్మణులే. ఇప్పటికీ తెలిసిన వారు దీన్ని పాటిస్తున్నారు. కాగా ఈ ధర్మకర్తలు అందరూ ప్రస్తుత కాలంలో కూడా ఉన్నత భూస్వామ్య వర్గాలకు చెందిన కులాల వారే ఉండడం గమనించాలి. క్వచిత్తుగా వెనుకబడిన కులాల వారు ఉన్నా వారు అత్యధిక సంపన్నలైన సందర్భాలలో జరిగింది. కాని వారు కూడా ఆలయంలోనే సామాజిక వివక్షకు గురైన సందర్భాలున్నాయి.

ఇక ఆలయ నిర్మాణం ప్రతిష్ఠ అయిన తర్వాత రోజువారీగా గుడిలో చేసే సేవలు ఉంటాయి. ఇలా సేవలు చేయడానికి ఆలయాలలో శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయడం సంప్రదాయంగా శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తూ ఉంది. గర్భగుడిని కాక గుడిలోపల గుడి వెలుపల ప్రాంగణాన్ని ఊడ్చి శుభ్రం చేసే పనిని చాకలి కులం వారికి అప్పగిస్తారు. అలా ఇచ్చిన కుటుంబానికి ఎకరంనుండి ఐదు ఎకరాల వరకు ఇనాం భూమిని ఇస్తారు. దీన్నే మాన్యం అంటారు. ఆ చాకలి కుటంబం వారు వంశ పారంపర్యంగా దాన్ని అనుభవిస్తూ దేవుని ప్రాంగణంలో సేవ చేస్తారు. అలాగే దేవుని కల్యాణం జరిగినప్పుడు ఇతర ఊరేగింపులు జరిగినప్పుడు పగటి దివిటీలు పట్టుకుని ఊరేగింపులో ముందు నడిచేది ఈ చాకలి కులం వారే. దేవుని ఆలయంలో సన్నాయిని ఇతర సంగీత వాద్యాలను వినిపించవలసి ఉంటుంది. ఇది రోజువారీ పూజలోను తర్వాత వార్షిక కల్యాణాల సమయంలోను ఊరేగింపులలోను అవసరం ఈ సేవను మంగలి కులంవారికి ఇస్తారు. ఒక కుటుంబానికి ధర్మ కర్త ఈ సేవను ఇచ్చి ఆ కుటుంబానికి మాన్యం ఇస్తాడు. వారు ఆ పొలంలో వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తూ దేవుని సేవ చేస్తారు. కొన్ని సందర్భాలలో ఈ సంగీత వాద్యాల బృందంలో దూదేకుల కులం వారు ఉండడం కూడా ఉంది. వీటినే చాకలి మంగలి మాన్యాలు అనిఅంటారు. ఈ కింది కులాల వారికి ఇచ్చిన మాన్యాలను భూస్వామ్య కులాల వారు కబ్జా చేయడం అమ్మడం వంటి పనులు చేయడం అవి కోర్టు వివాదాలలోని వెళ్ళి కొన్ని వేల కేసులు ఉండడం ఈనాటి చారిత్రక సత్యం. చాకలి మంగలి మాన్యాలను ఇచ్చిన విషయాలను ఇతర మాన్యాల విషయాలను అందుకే రాజులు శాసనాలలో రాయించారు. చాలా మంది ధర్మకర్తలు కూడా శాసనాలు వేయించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇంకా చాలా పెద్ద దేవస్థానాలలో ఈ మాన్యాల వివరాలు సేవ చేసే కులాల వివరాలు చెక్కిన శాసనాలున్నాయి. వాటి ప్రకారమే ఆయా కులాలు దేవుని సేవలో పని చేస్తున్నాయి. ఈ సేవతో పాటు దేవని గుడిలో పూజించడానికి నైవేద్యం పెట్టడానికి బ్రాహ్మణులను పూజారులుగా నియమిస్తారు ఈ ధర్మకర్తలే. ఈ పూజారికి కూడా మాన్యంగా కొంత భూమిని ఇస్తారు. ఆ భూమిలో వచ్చే ఆదాయాన్ని పూజారి తను అనుభవించడమే కాక రోజు నైవేద్యానికి రోజువారీ ఇతర ఖర్చులకు వాడవలసి ఉంటుంది. దేని దేనికి వాడాలనే విషయం రాసి ఉంటుంది. ఇక కొన్ని దేవాలయాలలో దేవదాసీలు ఉంటారు. వీరు భోగం వారు అనే కులానికి చెందినవారు. వీరు దేవునికి కుంభహారతి ఇస్తారు. కుంభహారతి ఇచ్చి ప్రాంగణంలోనే దేవుని ముందు నాట్యంచేస్తారు. నాట్యం దర్శయామి అని దేవునికి చెప్పాలి. ఇది కూడా ఒక ప్రముఖమైన సేవగా చెప్పబడింది. ఈ సేవ చేసినందుకు గాను వీరికి కూడా మాన్యాలు ఇస్తారు. అయితే భోగం వారి ఈ దేవదాసి వ్యవస్థ ఇప్పుడు కనుమరుగైంది. అంతే కాదు వీరికిచ్చిన మాన్యం భూములు పెద్దలు ఆక్రమించుకోవడం వీరు వీధిన పడడం జరిగింది. వీటి విషయంలో కూడా కోర్టు కేసులు కొన్ని వందలు ఉన్నాయి. ఇలా అన్యాయం జరిగింది అంతా కూడా కింది కులాల వారికి నిమ్నవర్గాలు వారికే అన్నది ఇక్కడ గమనించాలి. ఇక పేరంటాళ్ల దేవతల గుడులలో మరి కొన్ని కులాలు కూడా ఉంటాయి. పాటలు పాడి దేవత కథను పాడే కులాలు వారున్నారు. వీరు కొమ్మల వారు బైండ్ల వారున్నారు. వీరు దళిత కులాలకుచెందిన వారు. వీరు చేసే సేవలకు కూడా వంశపారంపర్యంగా వచ్చే మాన్యాలు ఇచ్చిన ఆలయాలున్నాయి. ఇది కూడా ప్రముఖమైన సేవగా తిరునాళ్ళ జరిగే సందర్భాలలో వీరు ప్రముఖపాత్రను పోషిస్తారు. గొల్ల, కురమ, సాతాని, జంగమ వంటి ఇతర మైన ఎన్నో కులాల వారూ కొన్ని పనులు చేస్తారు. ఇక తల నీలాలు సమర్పించడం అన్నది ప్రధానమైన దేవాలయాలలో ఉంటుంది. ఈ తలనీలాలు తీసే సేవ చేసేది మంగలి కులం వారు. ఈ కుటుంబాల వారికి కూడా మాన్యాలు వంశపారంపర్య హక్కులు ఉంటాయి.

ఇలా దేవుని సేవలో దేవసంబంధమైన ఇతర సేవలలో ఈ కుల చట్రంఇమిడి ఉంది. వీరిలో అణగారిన కులాలు దళిత కులాలు కూడా ఉన్నాయి. మధ్యమ స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఉన్నత స్థితిలో బ్రాహ్మణ ఇతర భూస్వామ్య కులాలు ఉన్నాయ. గ్రామ దేవతల ఆరాధన సంప్రదాయంలో చాకలి, మంగలి కులాలవారు పూజారులుగా ఉంటారు. కొన్ని చోట్ల ఇతర కూలాలు కూడా పూజారులుగా ఉన్నాయి. కుమ్మరి, మేదరి కులాలు కూడా సేవలో ఉన్నాయి. వీరికీ మాన్యాలు ఉన్నాయి. దేవునికి వీరందరూ సేవచేసే వారే. ఒక్కొక్క కులం వారు ఒక్కొక్క సేవ చేస్తున్నారు. గర్భగుడిలో మంత్ర చదివే సేవ, గుడిని శుభ్రం చేసే సేవ, దేవునికి సంగీతం వినిపించే సేవ, దేవునికి నాట్యం చేసే దేవదాసీ సేవ, అసలు విగ్రహాన్ని చేసిన సేవ ఇలా దేవునికి చేసే సేవలు అన్నీ చాలా ముఖ్యమైనవే. ఇందులో ఏ సేవ లేకున్నా దేవుని పని జరగదు ఏదీ తక్కుది కాదు. కాని ఈ సేవలు చేసే కులాల వారు అందరూ సమాన మైన గౌరవం పొందుతున్నారా. చేసే సేవలు అన్నీ సమాన మైన గౌరవాన్ని పొందుతున్నాయా అనేది ఈనాటికీ మన ముందు నిలిచి ఉన్న పెద్ద ప్రశ్న. ఇది మనం సమాధానం చెప్పలేని సామాజిక సమస్య. ఒక సారి విగ్రహాన్ని చేసి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత గర్భగుడిలోనికి పోయే అధికారం అక్కడి బ్రాహ్మణుడికి తప్ప మరెవ్వరికీ లేదు. కనీసం ఆ దేవుని విగ్రహాన్ని చేసిన విశ్వబ్రాహ్మణ శిల్పికి కూడా ఆ అధికారం లేదు. ఇది అన్ని గుడులలోను ఉన్నదే. ఒక్క పండరిలోని పాండురంగని గుడిలో మాత్రం ప్రతిఒక్కరు గర్భగుడిలోనికి పోయి దేవుని విగ్రహాన్ని స్పృశించ వచ్చు. ఇలాంటి పాండురంగని గుడి ఒకటి బందరులో ఉంది. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక చోట మాత్రం ప్రజలందరినీ అంటే అన్ని కులాల వారిని గర్భగుడిలోనికి పోనిస్తారు. గర్భగుడి అత్యంత పవిత్రమైనదైనప్పుడు లోనికి పోయే అర్హత అన్ని కులాలవారికి ఎందుకులేదన్నది ఈ నాడు ప్రజాస్వామ్య యుగంలో వేయవలసిన మొదటి ప్రశ్న. దేవునికి సేవచేసే కులాలు అన్నింటిని సమానంగా ప్రాబల్య కులాలవారు ఎందుకు గౌరవించలేక పోతున్నారు. ఉన్నత కులాల వారు తాముచేసే సేవే గొప్పది ఇతరులు చేస్తున్న సేవ తక్కువది అనే దురహంకారంతో ఇంకా ఎందుకుంటున్నారు. అనేవి నేడు మనం సంధిస్తున్న ప్రశ్నలు. ఈ మధ్య తిరుమల తిరుపతి ఆలయంలో ఒక అధికారితో వ్యవహరించే సందర్భంలో ఒక పూజారి ఆ ఉన్నతాధికారిని ఏంరా, నేను కల్యాణకట్టలో కూర్చొన్న మంగలిని అనుకున్నావా అని గద్దించి ప్రశ్నించాడు. అంటే తనను ఉన్నత కులం వాడిగా గౌరవించకుండా ఇతరులతో సమానంగా చూస్తున్నావా అని ప్రశ్నించాడు. ఈ ఒక్క మాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరగడానికి కారణం అయింది.

ఇక్కడ ఉద్యమం చేయడం కాదు ముఖ్యం. దేవునికి చేసే సేవలో కూడా అన్ని సేవలు అవసరమైనవే సమానమైనవే ఆ సేవ చేసే కులాలన్నీ సమానమైనవే అనే ఇంగితం మనకు ఇప్పటికీ ఎందుకు కలగటం లేదు అన్నది ప్రశ్న. సాక్షాత్తు దేవునికి అతి దగ్గరగా ఉండి దేవుడు నా వాడు అని చెప్పుకునే ఈ కులాల వారికి ఆ దేవుడు కూడా మనుషులు అందరూ ఒకటే అనే ఈ జ్ఞానాన్ని ఎందుకివ్వలేక పోతున్నాడు. ఈ సాంఘిక దుర్వివక్షని చూడలేకు ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా అని ప్రశ్నించిన కింది కులాల భక్త కవుల ప్రశ్నకి దేవుడు సమాధానం చెప్పడం లేదు. దేవుడనే భావన ఆ ఉనికి సాక్షాత్తు దేవుడు తన ఎదురుగా తనకు సేవ చేస్తున్న మనుషులలో కూడా తాను మార్పుతేలేక పోతున్నాడు. అన్ని కులాలను సమానంగా గౌరవించే పనిని ఆదేవుడూ సాక్షాత్తూ చూసి ఏమీ చేయలేక పోతున్నాడు. నరులన్ ముట్టకనందులన్ గొలిచి అప్పరమంబైన రహస్యము ఏమిటి అని జాషువా ఎక్కిరిస్తాడు. దీన్నే. రాతి నందులను కొలిచి సాటి మనిషిని తొక్కి వేసే ఈ దుర్నీతిని ఎండగట్టడం అన్ని కులాలను సమానంగా గౌరవించే సామాజిక స్థితిని తెచ్చే పనిని రాతి విగ్రహాలు చేయలేవు అనే విషయం శతాబ్దాలుగా రుజువైంది. దీనికి మనమే మనుషులమే పూనుకోవాలి. పులికొండ సుబ్బాచారి