Tuesday, August 2, 2022

 ఇల్లు మీద ఇంటెడు పదాలు



తెలుగు వారి ఇంటి చుట్టూతా అంటే నిజంగా చుట్టూ అని కాదు ఇంటిని గురించి చెప్పే పదాలు నిజంగానే ఇంటెడు ఉన్నాయి. ఇక్కడే ఒక పదం అడ్డువచ్చింది మనకు ఇల్లు అనే పదం పరిమాణార్థకంగా ఇంటెడు అని తయారైంది. ఇంటెడు చాకిరీ అనే పలుకు బడి మన ఇల్లాళ్ళ నోటిలో రోజూ వచ్చేదే. సరే ఇల్లు లేని దేశం కాని సంస్కృతి కాని ఉండవు కదా. మనిషి గుహా జీవితం విడిచి నాగరికుడు అవుతున్న క్రమంలో తనకైన సౌకర్యవంతంగా నిర్మించుకున్న వాసమే ఇల్లు.  ఈ పదం ఎప్పటినుండి ఉంది అని అంటే తెలుగు భాష వయస్సంత పాతది అని చెప్పవచ్చు. దీని చరిత్రని తర్వాత చూద్దాం. కాని ఇంటికి సంబంధించిన పదజాలం చాలా ఇంకా నిఘంటువులకు ఎక్కలేదు. ఇంటిని అలా పట్టుకొని ఊపితే ఎన్నో పదాలు జలజల రాలతాయి. వాటిని చూద్దాం.
ఇల్లు కట్టేటప్పుడు మొట్టమొదట కాలవసింది మొగరాలు, దూలాలు. మొగరం అంటే నిలువున పాతే గుంజ, కానీ గుంజ అనే పదాన్ని మొగరం అనవలసిన చోట వాడరు. పందిరి గురించి చెప్పేటప్పుడు గుంజ అనే మాటని వాడతారు. పందిరి కూడా ఇంటి నిర్మాణంలో భాగమే. వాడు పందిరిగుంజకి పనిచెప్పేవాడు అనే తెలుగు పలుకుబడి చాలా ప్రసిద్ధం. అంటే వాడు అందరికీ  పనిచెబుతాడని ఏమాత్రం పనికి లొంగని వాడికి కూడా పనిచెబుతాడు కాని వాడు చేయడు అని దీని అర్థం. ఇక పైన చెప్పిన మొగరం, దూలం రెండూ ఇంటిపేర్లుగా చాలా కుటుంబాలకు ఉన్నాయి. మొగరాల వారు దూలం వారు ఉన్నారు. మొగరాలు రెండు వైపులా పాతిన తర్వాత వాటిపైన దూలాన్ని అడ్డంగా పెడతారు. మొగరానికి పై భాగాన కూసం చేస్తారు. ఆ కూసంలో పీటని పెడతారు.  ఈ పీట ఇంట్లో మనం కూర్చొనే పీట ఒకటి కావు. ఈ పీట పైనున్న అర్థచంద్రాకారంలో ఉంటుంది దానిపైననే దూలాన్ని పెడతారు. దేవాలయాల నిర్మాణంలో కూడా ఈ పీటలు స్తంభాల పైన ఉంటాయి. ఆ స్తంభాల పైననే తిరిగి పెద్ద దూలాలు ఉంటాయి. అయితే ఈ పీటలు వేరే ఆకారంలో పైన చదునుగా పొడవుగా ఉంటాయి. దూలాన్ని పీపటలపైన నిలబెట్టిన తర్వాతనే ఆ పైన నిర్మాణాలు జరుగుతాయి. మొగరాలకు సాధారణంగా చండ్ర చెట్టునుండి కర్రను వాడతారు. మద్ది కర్రని కూడా విస్తృతంగా మొగరాలకు వాడతారు. తుమ్మవి వాడతారు కాని అరుదు. చండ్ర కర్ర నిలువుగా ఎంత బరువైనా మోసే గుణం కలిగి ఉంటుంది. అందుకే దీన్ని వాడతారు. ఇక దూలానికి బిల్లుడు, సాగి, మద్ది, నల్లమద్ది చెట్లనే ఎక్కువగా వాడతారు. బిల్లుడు సాగి, మద్ది చెట్లకు అడ్డంగా కూడా చాలా ఎక్కువ బరువు మోసే గుణం ఉంటుంది.
ఇక ఈ దూలంపైన నిర్మాణం రెండు రకాలుగా ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న వారు ఒంటి దూలం ఇంటిని కడతారు. కాస్త పెద్ద ఇల్లు కావాలను కొని డబ్బు కాస్త ఎక్కువ ఖర్చు పెట్టగలవారు రెండు దూలాలు లేదా మూడు దూలాల కొట్టాలు నిర్మిస్తారు. ఒంటి దూలం ఇల్లు పైన మధ్యలో కోసుగా పలకలుగా ఉన్న శంఖాకారంలో ఉంటుంది. అంటే ఇంటి మధ్యలో ఒకటే దూలం ఉంటేనే ఇలా వస్తుంది. ఇలా కాక మధ్యలో రెండు కాని మూడు కాని దూలాలు ఉన్నప్పుడు పైన అడ్డంగా ఒక వెడల్పు వరుస ఉంటుంది. దాన్నే ఎన్నుగాడి అని అంటారు. దూలం పైన తక్కువ ఆదాయం ఉన్నవారు వెడల్పులో మధ్యన రెండు నిలువు కర్రలు సుమారు నాలుగు అంగుళాల కైవారం లావున ఉండే వాటిని పెడతారు. ఈ రెండు కొయ్యలు సుమారు ఆరు నుంచి ఎనిమిది అడుగులు ఉంటాయి. వాటికిపైన అడ్డంగా మళ్లీ ఒక పీట ఉంటుంది. ఇక మధ్యలో రెండో దూలం ఉంటే దానికి కూడా ఇలాగే రెండు కొయ్యలు ఉండి పైన వాటికి పీట ఉంటుంది. ఈ రెండు దూలాలు నిలువులో ఉండగా వాటి పైన కొయ్యలపైన తిరిగి అడ్డంగా ఒక కొయ్యని సుమారు ఆరు అంగుళాల కైవారం లావున ఉన్న దాన్ని అడ్డంగా పెడతారు. ఇలా ఉన్న అడ్డుకొయ్యనే యెన్నుగాడి అని అంటారు. యెన్నుగాడి అనే మాట వెన్నులోనుండే పుట్టిన పదం. ఇంటికి పైన వెన్నులాగా బలంగా నిలిచేది కాబట్టి దీన్ని అలా అంటారు. ఇక దూలంపైన నిలిపిన కొయ్యలను కొమిరెలు అంటారు.
కాస్త ఆదాయం ఎక్కువగా ఉన్న వారు కింది పెద్దదూలంపైన కొమిరెలను నేరుగా వేయకుండా సుమారు మూడు నుండి నాలుగు అడుగుల ఎత్తున దూలానికి రెండు వైపులా రెండు నిలువు కొయ్యలను బిగించి దానిపైన ఇంకొక చిన్న దూలం వేస్తారు. ఆ చిన్న దూలం పైన తిరిగి మధ్యలో ఒక గుజ్జు వేసి రెండు దూలాలకు ఇలా ఎత్తుగా గుజ్జులు వేసిన తర్వాత ఈ రెంటి పైన అడ్డంగా యెన్నుగాడిని పెడతారు. ఇలా దూలం పైన రెండో సారి వేసే చిన్న దులాన్ని మేల్‌దూలం అని అంటారు. ఇక్కడ మేల్ అంటే పైన ఉండేది అని అర్థం. పైన అనే అర్థంలో మేల్ అనే మాట కన్నడంలో నేటికీ చాలా విస్తృతంగా వినియోగంలో ఉంది.  ఇక మరికాస్త ఆదాయం ఉన్నవారు ఇలా గుజ్జులను ఒకటి గా కాకుండా ఒక్కో చోట రెండు రెండు గుజ్జులను నిలబెడతారు. వీటిని జంటగుజ్జు కట్టడం అని అంటారు. ఈ జంట గుజ్జులు అడుగున్నర ఎడంలో దూలంపైన పక్కపక్కనే నిలబడి ఉంటాయి. ఈ గుజ్జులను అందమైన ఆకారాలలో చెక్కించి సుందరంగా తయారు చేస్తారు. పైపీటలను కూడా మంచి డిజైన్లలో చెక్కిస్తారు. ఇది ఉన్నత ఆదాయం ఉన్నవారు చేసేపని. ఇక మధ్యలో ఉన్న పెద్ద దూలంనుండి పక్కనున్న గోడ మీదికి ఒక దూలం పోతుంది ఇది కూడా సుమారు ఆరు అంగుళాల కైవారం లావులో ఉంటాయి. ఇక ఇంటిమధ్యలో ఉండే పెద్దదూలాలు 12 నుండి 15 అంగుళాల మందంలో గుండ్రంగా ఉంటాయి. ఈ దూలాలు చెట్టు మానునుండే తిన్నగా నరుకుతారు. మిగతా చిన్న దూలాలు, మేల్ దూలం, కుంటదూలాలకు  చెట్టుకొమ్మలు కూడా సరిపోతాయి. కుంట దూలంమీద వేసే గుజ్జులను కలుపుతూ పక్కదూలాలు వస్తాయి. ఇవి సన్నగా నాలుగు అంగుళాల మందంలోనే ఉంటాయి. ఈ నిర్మాణాలు అయిన తర్వాత పైన యెన్నగాడి నుండి, మధ్యలో ఉండే పక్కదూలానుండి గోడమీదున్న సన్నదూలాల మీదికి వాసాలు వస్తాయి. సాధారణంగా వాసం వెదురుది ఉంటుంది. వెదురుగడలే వాసాలుగా వాడడం ఉంది. క్వచిత్తుగా ఆదాయం ఎక్కువగా ఉన్న వారు పైన కప్పు పెంకు తో వేసుకునే వారు తాటి వాసాలు అంటే తాడిచెట్టు చేవతో చేసిన వాసాలు వాడతారు. ఇక భవంతిలాగా కట్టేవారు మేల్ దూలాలకు గుజ్జులకు పైన యెన్నుగాడి తర్వాత వాసాలకు కూడా టేకు కలపని పాడతారు. పెద్దదూలాలకు, మొగరాలకు ఎప్పుడూ టేకు కలప వాడరు. కారణం టేకుకు అందంగా వచ్చే గుణమే కాని అది బరువులు మోయలేదు. దీన్ని దూలంగా వాడితే విరిగిపోయే లక్షణం ఉంటుంది.
ఇక వాసాలు వేసిన తర్వాత వాటి పైన అడ్డంగా సన్నటి కర్రలు కడతారు. అధిక ఆదాయం ఉన్న వారు వెదురు బద్దలు చీల్చిన వాటిని అడ్డంగా మేకులతో బిగిస్తారు. లేకుంటే వీటిపైనే కప్పు వస్తుంది.  ఈ కప్పు కూడా ఆదాయవర్గాన్ని బట్టి ఉంటుంది. జొన్న చొప్పతో కప్పు వేస్తారు. కొన్ని ప్రాంతాలలో పూరిగడ్డితో వేస్తారు. పూరి అనేది తుంగలాగా వాగులు ఒడ్డుల పొలం గట్ల మీద పెరిగే ఒక గడ్డి. ఒక రకంది ఇది సన్నగా ఉంటుంది. తుంగతో కూడా ఇల్లు కప్పడం ఉంటుంది. వరిగడ్డితో కూడా చిన్న చిన్న ఇళ్ళు కప్పుతారు. తాడిచెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఖమ్మం కోనసీమ కృష్ణా జిల్లాలలో తాటి ఆకుతో కప్పు కప్పుతారు. కాని ఇది రెండు మూడు సంవత్సరాలే ఉంటుంది.  చొప్పకప్పు సాధారణంగా మూడు సంవత్సరాల వరకు చెడకుండా ఉంటుంది. పూరిగడ్డి సన్నగా ఉంటుంది. ఇది కనీసం ఎనిమిది పది సంవత్సరాలు చెడకుండా ఉంటుంది. ప్రజలకు ఏఏ ప్రాంతాలలో ఏ గడ్డి దొరుకుతుంది అనే దానిపైన ఈ కప్పు ఆధారపడి ఉంటుంది. ఈ కప్పులు పైన చెప్పిన పద్ధతిలో కొంత కాలం కాగానే కురుస్తాయి. తర్వాత కప్పు తీసి తిరిగి కప్పు వేసుకోవలసి ఉంటుంది. ఇక పెద్ద పెద్ద గాలి వానలు వచ్చినప్పుడు కప్పు లేచి పోవడం లేదా విడిపోయి ఆగడం జరుగుతుంది ఇలాంటప్పుడు కూడా ఇల్లు పూర్తిగా కురుస్తుంది. పేదవారికి ఇవన్నీ కష్టాలే. ఇక అగ్నిప్రమాదం జరిగితే ముందుగా ఆహుతి అయ్యేది ఈ ఇళ్ళే. పూరి గడ్డి మీద వచ్చిన పదమే పూరిల్లు. ఇల్లు కప్పేటప్పుడు గజం పొడవున ఒక వరుస చొప్పున వేసి దాన్ని పైన బద్దవేసి కట్టుకట్టి తర్వాత దానిపైన కలుపుకొని పైకి మరొక గజం కప్పుతారు. ఇలాగే పైదాకా కప్పుతారు. ఈ బద్ద వేసి కట్టడాన్ను పెండెకట్టు అంటారు. ఇలా కట్టడానికి ఒక గజం పొడవు ఉన్న వెదురుతో చేసిన అంగుళం వెడల్పు ఉన్న బద్దకు ముందు భాగం సన్నగా చేసి దానిలో తాడు పెట్టి దాన్ని పైన కప్పునుండి కిందికి గుచ్చితే కింద ఉన్న వ్యక్తి దాన్ని చూచి రెండు చివరలు కలిపి ముడి వేస్తారు. కింద వాసానికి  ముడి వేయడం వల్ల కప్పు పైకి లేవకుండా ఉంటుంది. ఇలా కుట్టే దబ్బణం లాంటి బద్దను చూరుకుట్టుబద్ద అని అంటారు. కట్టు వేయడానికి తాడు వాడరు. తాడు త్వరగా తెగుతుంది. తడిస్తే వెంటనే తెగుతుంది. ఇలా పెండెకట్టు కట్టడానికి ఈత బరికెలు, చింతబరికెలు తాడుగా వాడతారు. ఈత ఆకుమట్ట కోసి దానికి రెండు పక్కలా ఉన్న ఆకులు దూసివేస్తే వేలు మందం కన్నా సన్నగా ఉన్న తీగె లాంటి ఈతబరికె వస్తుంది. దీన్ని గుండ్రాళ్ళతో నలగ గొడితే నిలువుగా నాలుగైదు సన్నగా తాళ్ళలాగా విడిపోతుంది. ఇలా విడిపోయిన వాటిని నడి అని అంటారు. వాటినే ఈత నళ్ళు అని బహువచనంలో అంటారు.  వీటిని తాడులాగా వాడి పెంటకట్టుకడతారు. ఇవి ఎండకు వానకు తట్టుకొని ఎక్కువకాలం ఉంటాయి. ఇక చింతబరికె అంటే చింతచెట్టు కొమ్మలకు చివరి భాగంలో సన్నగా ఉండే పొడవైన కొమ్మ దీన్ని రెమ్మలు కత్తిరించి ఆకు దూసివేస్తే సన్నగా పొడవుగా ఉంటుంది. దీన్ని కూడా నడిలాగా వాడతారు. దీన్ని చింతనడి అంటారు.  
ఇలా కొత్త ఇంటికి కప్పు కప్పక ముందే గోడలు పెట్టుకుంటారు. కింద గోడకు పునాదితొక్కడం అంటారు. అంటే ఇంటి చుట్టూ గడ్డపారతో నాలుగు అంగుళాల మందం రెండు అడుగుల వెడల్పున కందకం లాగా పై పొర లేపి మట్టి అక్కడ అలాగే ఉంచి నీళ్ళు పోసి కాళ్లతో తొక్కి పునాది లాగా చేస్తారు. దీన్ని పునాదితొక్కడం అంటారు. ఇక దీనిపైన ఒక్కో సారి అడుగున్నర ఎత్తు చొప్పున గోడ పెట్టుకుంటూ వస్తారు. ఈ గోడ పైకి పైకి పోను సన్నగా వస్తూ పైన అడుగు వెడల్పు కే వస్తుంది. పైన దూలం తాకే దాకా గోడ పెడతారు. పూరిళ్ళకు ఎక్కువ మట్టిగోడలే ఉంటాయి. కాస్త ఆదాయం ఎక్కువగా ఉన్న వారు గోడలపైన దాన్ని పెట్టకుండా  గోడలు మట్టితో కట్టినా పైన పూరి కప్పుకాకుండా పెంకులు వేసి కట్టుకుంటారు. ఈ ఇల్లు అగ్ని ప్రమాదాన్ని తట్టుకొని ఉండగలదు. మరింత ఆదాయం ఉన్నవారు కింద గోడలు ఇటుకతో పైన కప్పు పెంకు తో చేసుకుంటారు.  ఈ పెంకులు కుమ్మరి ఆములో చేసే అర్ధచంద్రాకారంలో తొమ్మిది అంగుళాల పొడవున దొప్పలలాగా ఉండే పెంకులను గూనపెంకులు అంటారు. ఇవి కాక ఆధునికంగా చేసే బెంగూళురు పెంకులనూ కొందరు వేసుకుంటారు.
ఇక ఇంటిలో మిగతా ముఖ్యమైనవి కిటికీలు, దర్వాజాలు. ఈ రెండు పదాలు హిందుస్తానీవి.  కిటికీకి సోరణ అని సోరణగండి అని రెండు మాటలున్నాయి. పదిహేను పదహారు శతాబ్దాల కావ్యాలలో ఇవి కనిపిస్తాయి. ఇక దర్వాజాకు అచ్చతెలుగు పదం గలుమ లేదా గల్మ. ఈ రెండు పదాలు నేటికీ తెలంగాణ పల్లెలలో వాడుకులో ఉన్నాయి. గనుమ నుండి ఈ పదం వచ్చి ఉంటుంది. గలుమ దాటితే ఇంటి బయటికి పోతాం కనుక ఇలా ఈ పదం వచ్చి ఉంటుంది. నిజానికి ఇవి వ్యవహార దూరమైన పదాలు అనే చెప్పాలి. వీటికి తలుపులు ఉంటాయి. ఈ తలుపులు ఒంటి రెక్క తలుపు ఉండడమే ఒకనాటి అలవాటు నా బాల్యంలో మా గ్రామంలో ఒంటిరెక్క తలుపులే ఎక్కువగా ఉండేవి. చెరొక పక్కకి తీసే జంటతలుపులు తర్వాత వచ్చిన ఫేషన్. ఈ తలుపులు బిగించి పెట్టడానికి తలుపునకు వెనుక తిమ్మిడీలు ఉంటాయి. దర్వాజాకు పిడసలు ఉంటాయి. తలుపు తిమ్మిడీకి ఉన్న రంధ్రంలోనికి వచ్చేలాగా దర్వాజా పిడసలో తలుపును కూర్చోపెడతారు. తలుపునకు ముందు భాగంలో గొళ్ళెం ఉంటుంది. వెనుక అంటే లోపలి భాగంలో గడి ఉంటుంది. ఇవన్నీ అచ్చతెలుగు పదాలే. ఇక దర్వాజా కింద ఉన్న కమ్మిని గడప అని అంటారు. దీన్నే మండిగం కమ్మి అంటారు.  పై దాన్ని గొడుగు కమ్మి అని అంటారు. కొంత ఎక్కువ ఆదాయం ఉన్న వారు పైగడపకు పైన గోడ కింద రెండు అడుగుల వెడల్పున ఒక చెక్క పెట్టి దాని కింద గుర్రం బొమ్మలు మామిడి పిందెల బొమ్మలు చెక్కిస్తారు. దీన్ని గొడుగు బల్ల అని అంటారు. ఇక అంటే ఇంటి ముందు ఉండే పెద్ద దర్వాజాను మునిగడప  అని లేదా సింహ ద్వారా  అని కూడా అంటారు. దీన్నే తలుపును వాకిలి అని అనడం కూడా ఉంది. నిజానికి ఇంటి ముందు ప్రాంగణాన్ని వాకిలి అని అంటారు. వెనుక భాగాన్ని పెరడు అని అంటారు. ముందు ఉండే దర్వాజాను కూడా దీని భావంతోనే వాకిలి అని అనడం కూడా ఉంది.
ఇక పైన చెప్పినవి కాక కట్టే ఇళ్ళలో రకాలు ఉంటాయి. ఎడ్లకోసం పశువుల కోసం గోడలు లేకుండా లేకుంటే ఒకవైపే గోడతో కట్టేవాడిని కొట్టాలు అని అంటారు. ఎడ్ల కొట్టం పశువుల కొట్టం అనే మాటలున్నాయి. ఇంటికి ముందు కాని వెనుక కాని అదనంగా పెంచి కిందికి వచ్చేలా కట్టే దాన్ని వసారా అంటారు. నిట్టాడిపాక అనే మరొక రకం ఇల్లు ఉంటుంది. దీనికి దూలం ఉండదు. ఇంటి మధ్యలో చాలా ఎత్తుగా అంటే సుమారు పన్నెండు నుండి పదిహేను అడుగుల ఎత్తున ఒక గుంజ ఉంటుంది. మధ్యలోనున్న ఈ గుంజ నుండే అన్ని వైపులకు వాసాలు తీసి కట్టి పాకలాగా చేస్తారు. ఈ ఎత్తైన మధ్యగుంజనే నిట్టాడి అని అంటారు. ఇక చుట్టుగుడిసె అనేది ఉంది. గుండ్రంగా ఉండే చిన్న ఇంటినే చుట్టుగుడిసె అని అంటారు. గుండ్రంగా చుట్టు ఆరు కాని ఎనిమిది కాని గుంజలు లేదా మొగరాలు వృత్తాకారంలో వేసి మధ్యలో నిట్టాడి వేసి పైనుండి వాసాలు కింది వృత్తంలోని గుంజలపైకి వాసాలు తీసి కట్టే  చుట్టుగుడిసెలు సాధారణంగా వంట ఇల్లుగా వాడతారు. చుట్టుగుడిసెగు దిసెలు ఉండవు కనుక వాస్తు నియమాలు కూడా ఉండవు. చుట్టుగుడిసెను ఎక్కడైనా ఏ మూలనైనా గుండ్రని ఆకారంలో కట్టుకోవచ్చు.  
ఇన్ని పదాలు ఇంటికి సంబంధించి ఉన్నాయి. ఇక ఈ ఇంటికి సంబంధించిన పదాలు చాలా భాషలో పలుకుబడులుగా పరిణతి చెందాయి. ఇంటాయన, ఇంటోడు అంటే యజమాని. ఇల్లు ఆలు ఇల్లాలుగా మారింది. ఇల్లరికం, ఇల్లిటం అంటే ఇంటికే వచ్చే అల్లుడు అని చెప్పడం. ఇంటిల్లపాది అంటే కుటుంబం మొత్తం అని, ఇల్లు అనే పదానికి కొంప అని ఇక్క అని ఇమ్ము అనే పర్యాయ పదాలున్నాయి. ఇక్క, ఇమ్ము అనేవి కూడా అచ్చతెలుగు పదాలే. ఇమ్ము అంటే మంచి రుచికరమైన అని తియ్యనైన అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇంటి చుట్టూ ఉన్న ఎన్నో తెలుగు పదాలు నేడు వ్యవహార దూరం అయ్యాయి. కారణం అలా ఇల్లు కట్టడం ఇప్పుడు లేదు. అన్నీ సిమెంటు ఇళ్ళు వచ్చాయి. ఇక్కడ ఇంటిని గురించి చెప్పిన పదాలలో  తొంబై శాతం పదాలు నిఘంటువుల లోనికి ఎక్కలేదు. కొత్తగా వచ్చే నిఘంటువుల లోనికి ఈ పదాలు ఎక్కించకపోతే ఇవి పూర్తిగా భాషనుండి అదృశ్యం అవుతాయి. భాషావేత్తలు జాగ్రత్తపడవలసిన సమయం ఇది.