కవితలు


పులికొండ సుబ్బాచారి

చినుకు ఓనమాలు

చినుకు చినుకు చినుకు
ఈ కరిమబ్బులు ఓనమాలు నేర్చుకున్నాయా
దారల బలపాలతో నేలపలక మీద
అక్షరాలు దిద్దుకుంటున్న సవ్వడి
పదాలుగా వాక్యాలుగా వరదలు వరదలుగా
వాగులు వంకలుగా నదులుగా కడకు కడలిగా
అబ్బ చినుకు చినుకు చినుకు
అక్షరాలు అక్షరాలు ఎక్కడ చూచినా అక్షరాలు
ఒక అక్షరం
ఒకచోట జలజల సంగీతంతో పారే సెలఏఱు
కృష్ణపక్షాన్ని కప్పుకుని
అక్షరాల్ని నిట్టూరుస్తూ పోతూంది
కొండ మీంచి దూకే జలపాతం
మహాప్రస్థానంలా గర్జించి పోతూ ఉంది
చినుకు చినుకు చినుకు ఎక్కడ చూచినా అక్షరాలు
దళితవాడ మీద కురిసిన వర్షం
ఫిరదౌసి గోరీ గుంబజ్  మీద గబ్బిలాల్లా
కిచకిచ లాడుతూ వలపోశాయి
శతాబ్దాల కోనేటిలో పడ్డవాన
వేయిపడగలతో జ్ఞానపీఠంపై కురిసింది
మసీదు మినార్లపై పడ్డ చినుకులు
మైనారిటీ కవితల్లో చిటచిటపటపటలాడాయి.
జైలుగదుల్లో పడ్డ వర్షం
చంపకోత్పలాలుగా మత్తేభశార్దూలాలుగా
భయపెట్టి తాటాకులు కప్పుకుంది, చినుకు చినుకు
గాలితాపుకు చిందిన దారి దారి చినుకులు
వచన కవితల అల్కెమీ రాశాయి
ఆసుపత్రి గీతాలయినాయి
ముక్కు పుటాలదిరే మురికి కాలువల్లో పడ్డ
ఓనమాలు పైరవీ కవుల కలాల్లో
నక్కల ఊళలు వేశాయి
నంగి మానవత్వం స్కలించాయి
చినుకు చినుకు చినుకు చినుకు
అక్షరాలు ఎక్కడచూచినా అక్షరాలే
గులాబి రెమ్మలపై నిలిచిన ముత్యాల బిందువులు
ఇంద్రధనుస్సును ప్రతిఫలిస్తూ
నిష్కల్మష హృదయంగా అక్షరాలై మెరిశాయి
ఎక్కడ చూచినా అక్షరాలే

ఎక్కడ చూచినా అక్షరాలే 

2 comments:

రమాసుందరి said...

మీ 'చినుకు చినుకు' అన్ని విధాలుగా ఆకట్టుకొంది. మీ పదాలు అచ్చతెలుగు ఆడపిల్లలు.చాలా సున్నితంగా ఆకర్షిస్తాయి

Saatyaki S / o Seshendra Sharma said...

Chaalaa baagundi. Congrats.
Regards