పులికొండ సుబ్బాచారి
మన ప్రజాస్వామ్య
రాజకీయాలలో నడుస్తున్నది రాజరికపు కణిక నీతి
నేటి
ప్రజాస్వామ్య రాజకీయాల్లో అడుగడుగునా కణిక నీతి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఒక్కోసారి
రాచరికంలో జీవిస్తున్నామా అనే అనుమానమూ కలుగుతూ ఉంది. ఏం చేసైనా అధికారం సాధించాలి.
ఏం చేసైనా అధికారాన్ని నిలుపుకోవాలి అందుకోసం శత్రునిర్మూలనం ఏ విధంగానైనా చేయవచ్చు
అనే సూత్రాలు నేటి ప్రజాస్వామ్యంలో రాజ్యం ఏలుతున్నాయి. ఆ కణిక నీతి ఏంటో వివరంగా చూద్దాం.
కణికుడు
మహాభారతంలో ఒక పాత్ర. ఇతను ఒక మంత్రి. శకుని మంత్రి అని వ్యాస భారతంలో ఉంది. ధృతరాష్ట్రుడు
ధర్మారాజును యువరాజు కాకుండా చూడాలని ధుర్యోధనుని
యువరాజుగా కొనసాగించాలని చాలా ప్రయత్నం చేసాడు.
కానీ సాధ్యం కాలేదు. ధర్మరాజును యవరాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత అతనికి నిద్రపట్టలేదు.
ఈ సందర్భంలోనే రాజనీతి బాగా తెలిసిన కణికుని పిలిపించుకొని సలహాలు అడుగుతాడు. కణికునికి
ఏ విధమైన రాజనీతి అప్పటికి అవసరమో బాగా తెలుసు. ఈ కణిక నీతి ఉపాఖ్యానం ఆదిపర్వంలో ఉంది.
ఇది సంస్కృత వ్యాసభారతంలో ఆదిపర్వం సంభవ పర్వంలో 139అధ్యాయంగా ఉంది. ఇది అక్కడ 90 శ్లోకాలలో
సుదీర్ఘంగా రచించాడు వ్యాసుడు. ఈ భాగంలో ఒక ఉపకథ కూడా ఉంది. సామదానభేదదండోపాయాలతో శత్రువులను
ఎలా తప్పించేయాలి అని చెప్పడానికి ఈ కథ ఉంది. తెలుగు కవిత్రయ భారతంలో ఆదిపర్వంలో నన్నయ దీన్ని ఆరో ఆశ్వాసంలో
రచించాడు. కానీ ఇక్కడ కణికుడు ధృతరాష్ట్రునికి కాక దుర్యోధనునికి రాజనీతి చెప్పినట్లుగా
ఉంది. వ్యాసభారతంలో ఉన్నంత సుదీర్ఘంగా నన్నయ రచనలో లేదు. కేవలం 19 గద్యపద్యాలలోనే దీన్ని
పూర్తిచేశాడు నన్నయ. కానీ దీనిలో కూడా ముఖ్యమైన
అంశాలు చాలానే ఉన్నాయి. కణికుడు చెప్పిన రాజనీతి నేటికీ మన ప్రజాస్వామ్య రాజకీయాలలో నాయకులు ఎలా అమలు చేస్తున్నారో
చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కణిక రాజనీతిలో ముఖ్యమైన అంశాలను పరిశీలించి అవి
నేటి నాయకులు ఎలా పాటిస్తున్నారో పార్టీలు
ఎలా పాటిస్తున్నాయో చూద్దాం.
“అపకారం
చేసిన శత్రువులను చంపడమే మెచ్చుకోదగ్గ పని. గొప్ప పరాక్రమం కలిగిన శత్రువైనా ఇబ్బందులలో
పడినప్పుడు తేలికగా నష్టపరచవచ్చును. మేటి యోధుడైనా విపత్తు కాలంలో తేలికగా చంపవచ్చు.
విపత్కాలంలో ఉన్న శత్రువులపై తప్పక దాడి చేయాలి. ఆ సమయంలో సౌహార్దచర్యలు చేయరాదు. నాయనా
ధృతరాష్ట్రా
శత్రువు దుర్బలుడైనా ఏ రీతిగానూ అతనిని ఉపేక్షించకూడదు.” (ఆదిపర్వం-సంభవపర్వం- 139
అధ్యాయం-శ్లో 10-11 ఇకపైన కేవలం శ్లోకసంఖ్య మాత్రమే వేస్తాను. నన్నయ పద్యం అయితే పద్య
సంఖ్య వేస్తాను.)
మన
ప్రజాస్వామ్యంలో నేటి కాలపు రాజకీయాలలో అధికారంలో లేని పార్టీలను
ప్రతిపక్షాలుగా చూడడం లేదు శత్రుపక్షాలుగా చూస్తున్నట్లు ఇటీవలి రాజకీయాలలో మనం గమనిస్తూనే
ఉన్నం. ఆయా అధికారంలో లేని పార్టీలు ఈ ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి.
నిత్యముద్యతదండాద్ది
భృశముద్విజతే జనః/ తస్మాత్ సర్వాణి కార్యాణి దండేన విధారయేత్ ( శ్లోకం-7)
రాజు
ఎప్పుడూ దండాన్ని ఎత్తి పట్టే ఉంచాలి అలా ఉన్నప్పుడే ప్రజలు భయపడతారు. అన్ని
పనులూ దండం ద్వారానే సాధించాలి. అని దీని అర్థం. అధికారంలో ఉన్న నాయకుడు నేడు ఇవే పనులు చేస్తున్నాడు. సామాజిక మాధ్యమంలో
చిన్న విమర్శ చేసినా ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్
కి పిలిపించి హెచ్చరించడం, ఇంకా గట్టిగా విమర్శ చేస్తే ఏ అర్థరాత్రైనా స్టేషన్ కి
పిలిపించి మాటలతో హింసించడం లేదా లాఠీకి పని చెప్పడం జరుగుతున్నట్లుగా
వచ్చిన ఎన్నో వార్తలు ఈ దండం ఎత్తే కణికనీతినే చెబుతున్నాయి.
అవసర
పడినప్పుడు తన వింటిని తృణమయంగానే భావించాలి. అల్పజంతువులకు నమ్మకం కలిగేదాకా నిద్రనటిస్తున్న
మృగంలాగా అసమర్థునివలెనే కనిపించాలి. శత్రువు తనను సమీపించిన తరువాత సాంత్వనం మొదలగు
ఉపాయాలతో నమ్మించి సంహరించాలి. (శ్లో 13)
ఆ
శత్రువు శరణు గోరి నా జాలిపడరాదు. శత్రువును చంపినపుడే రాజుకు కలత ఉండదు. చంపకపోతే
నిత్యమూ భయంగానే ఉంటుంది. (శ్లో14).
సహజ
శత్రువును దానాదులచేత నమ్మకం కలిగించి చంపాలి. ఒకప్పుడు అపకారం చేసి, ప్రస్తుతం ఆశ్రయించి
ఉన్నవానిని కూడా సంహరించాలి. శత్రుపక్షం యొక్క
పురుషార్థరూప త్రివర్గాన్నీ, ప్రకృతి రూపం పంచవర్గాన్నీ, సాధనరూప సప్తవర్గాన్నీ నశింపచేయాలి. శ్లో (15). శత్రువు
దగ్గరకు వస్తే ఎదురేగటం, ఆసన భోజనాదులతో ఆదరించటం, ఏదైనా వస్తువును కానుకగా ఇవ్వడం
అతనిలో నమ్మకాన్ని కలిగిస్తాయి. నమ్మకం కలిగిన తర్వాత అవసరమైతే చంపివేయాలి. పాము కరకైన కోరలతో కాటువేసినట్టు దెబ్బతీయాలి.
ఇబ్బంది
లేదు అనుకున్న వారిని కూడా అనుమానిస్తుండాలి.
ఇబ్బందిపెడతాడు అనుకునే వారి విషయంలో ఇంకా జాగరూకతతో ఉండాలి. అనుమతించదగిన వాడు భయానికి కారకుడైతే సర్వ నాశనం చేయగలుగుతాడు.
ఎప్పుడూ
శత్రుపక్షం యొక్క మూలాన్నే ముందు నరకాలి. ఆ తరువాత శత్రు సహాయకులను చంపాలి. ఆపై ఆ పక్షానికి
చెందిన అందరినీ సంహరించాలి. (శ్లో16).
మూలాధారం
నశిస్తే దాని నాశ్రయించి ఉన్న వారంతా నశించినట్లే, చెట్టు మొదలు నరికిన తర్వాత కొమ్మలు
నిలువలేవు కదా (శ్లో 17).
విపక్షాలలో
ఉన్న నాయకులు ఎలాంటి తప్పులు చేస్తున్నారు.
ఎక్కడ ఆర్థికంగా తప్పులు చేస్తున్నారు. ఎదుటి పార్టీలలో
ఉన్న
నాయకుల బలహీనతలు ఏమిటి వారి ఆర్థిక మూలాలు ఎక్కడున్నాయి. ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి
వారిని తద్వారా వారి పార్టీని ఎలా బలహీన పరచాలి అని నేటి అధికార పార్టీలు ప్రయత్నం
చేస్తున్నట్లుగా నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి.
ప్రతిపక్షంలో
ఉన్న పార్టీనాయకుల లొంగదీసుకోవడానికి అధికారపార్టీ అధికార బలం చూపి వాడి లోపాలు చూపి
నిన్ను లోపల వేయగలను అని భయపెట్టి వారిని పార్టీ మార్పించి తమ పార్టీలో చేర్పించుకోవడం
మనం చూస్తూనే ఉన్నాం. ఓడిన పార్టీలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోవడం ఆ పార్టీని నామమాత్రంగా మార్చడం ఇటీవలి
కాలంలోనే వేరు వేరు రాష్ట్రాలలో కనిపించిన విషయం వెనుక ఉన్నది ఈ కణికనీతి మాత్రమే.
తెలుగు దేశం ఎమ్మెల్యేలకు చెందిన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి అందుబాటులో ఉన్న
చట్టాల ద్వారా కానీ ఎత్తుగడల ద్వారా కానీ చట్టాలకు విభిన్న రీతిలో వ్యాఖానాలు
చేయడం ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో పద్ధతులను అవలంబించినట్లు ఇటీవల వచ్చిన
విశ్లేషణలు ఈ కణికనీతి విషయాన్నే చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
లో 2014 ఎన్నికల్లో వైయస్సార్ సీపీ 70 సీట్లు గెలుచుకుంది ప్రతిపక్షపార్టీలో నిలబడింది.
తర్వాత జగన్ పాదయాత్ర. ఆతర్వాత ఆయన వదిలిన
బాణం షర్మిల పాదయాత్ర చేశారు. చాలా సీరియస్ గా తెలుగు దేశంపైన విమర్శల దాడి చేశారు.
ఫలితంగా 2019 ఎన్నికల్లో వైయస్సార్ సిపీకి 151 సీట్లు రాగా తెదేపాకి 23 మాత్రమే వచ్చాయి.
పదవిలోనికి వచ్చిన జగన్ అధికారంలో తాను ఒక్కడే ఉన్నాడు. తన చెల్లెలు కానీ తల్లి
కాని మరే కుటుంబ సభ్యులు కానీ అధికారంలో
భాగం పంచుకోలేదు. చివరికి మూడేళ్ళలోనే షర్మిల, విజయమ్మ రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాలలో
ప్రవేశించవలసి వచ్చింది. ఆయన బంధువర్గం అక్కడ ఎక్కడెక్కడ గెలిచినా వారు కేంద్రస్థాయిలో
వెళ్ళారు. లేదా తన అధికారానికి సానుకూలంగా పనిచేస్తున్నారు. జగన్ పాటించింది అక్షరాల
కణికుడు చెప్పిన రాజనీతి సూత్రాలనే అని స్పష్టంగా తెలుస్తున్నది. శత్రుపక్షాన్ని దెబ్బకొట్టడంలో
కూడా జగన్ పాటించేది కణికుడు చెప్పిన రాజనీతినే.
తెలంగాణ
ఏర్పడిన తొలి ఎన్నికల్లో టిడిపి 15 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది ఒక ఎంపీ సీటును కూడా
గెలుచుకుంది. టీఆరెస్ 63 స్థానాలలో గెలిచి మెజారిటీ సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది.
ఒక రకంగా ఇది టిఆర్ఎస్ కి బొటాబొటి గెలుపుగానే భావించింది ఆపార్టీ కూడా అంతే కాదు రాష్ట్రాన్ని
సాధించినా దానికి అడ్డుగా నిలిచిన తెలుగు దేశం ఇంకా గట్టిగా బతికే ఉంది. దానికి 15
సీట్లు వచ్చిన సంగతి టీఆరెస్ గుర్తించింది. దాన్ని బలహీన పరచాలనే ఉద్దేశం కేసీఆర్ కి
బలంగానే నాటుకుంది. రాష్ట్రం ఏర్పడిన తొలిరోజుల్లో తెలుగు దేశం దాని అధినేత చంద్రబాబు
చాలా గట్టిగా గొంతు వినిపించేవారు. దాన్ని నొక్కడానికి కేసీఆర్
గట్టిగానే ప్రయత్నించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు బహిరంగంగానే
రేవంత్ రెడ్డి చర్యతో పట్టుబడ్డాడు. కేసీఆర్ ఆడిన చాణక్యంతో చంద్రబాబు తర్వాత గొంతు
తగ్గించి తాను పూర్తిగా విజయవాడకు పోయి అక్కడే రాజధాని నిర్మించడంలో కాలం గడిపాడు.
తెలంగాణ రాజకీయాన్ని చంద్రబాబు పట్టించుకోకుండా చేయగలిగాడు కేసీఆర్. తెలుగుదేశం ఎమ్మెల్యేలను
తనవైపుకు తిప్పుకున్నాడు పార్టీ విడిచి వారు టిఆరెస్ లో చేరేలాగా చేశాడు కేసీఆర్ అందుకోసం
సామదానబేధ దండోపాయాలను అనుసరించాడు. తెలంగాణ ద్రోహులకు పదవులు ఇస్తున్నాడని ఉద్యమంలో
ఎన్నో త్యాగాలను చేసినవారిని పక్కన పెట్టాడని కేసీఆర్ ని తీవ్రంగా విమర్శించారు. అతను
అనుసరించిన రాజకీయం కణిక నీతి మాత్రమే తనను తన పార్టీని బలవత్తరం చేసుకోవడం ముందు తనకు
చాలా అవసరం. అందుకే తెలుగుదేశాన్ని పూర్తిగా దెబ్బకొట్టి పంపించగలిగాడు. తర్వాత వచ్చిన
2019 ఎన్నికల్లో టిడిపి ఒకే ఒక్క సీట్లో గెలిచింది. అతను కూడా తర్వాత టీ
ఆర్ ఎస్ లో చేరాడు. కాంగ్రెస్ నామమాత్రంగా
మిగిలింది. ఎమ్ ఐ ఎమ్ మిత్రపక్షంగా నిలిచింది. బీజేపి పట్ల కూడా కేసీఆర్ పాటించింది
ఈ కణికుని సూత్రాలనే మొయినాబాద్ లో బిజేపీకి చెందిన వ్యక్తులను గూఢచర్యంతో పట్టుకొని
వారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసినట్లు న్యాయస్థానాలకు పంపించాడు. అప్పుడు
రేవంత్ రెడ్డిని పట్టుకున్నది ఇదే విధమైన కణికనీతి సూత్రాలతోనే.
కేంద్రంలో
బిజేపీ పార్టీ అనుసరిస్తున్నది కూడా ఇదే తరహాలో కణికనీతినే అని ప్రతిపక్షపార్టీలు చేసే
విమర్శలలో స్పష్టంగా బయటికి వస్తున్నది. బీజేపీని విమర్శిస్తే మోడీ రంగంలోకి దిగుతారు.
దానితో ఇడి సీబీఐ, ఐటీ లు రంగంలోకి దిగుతాయి, దాడి చేస్తాయి అని ప్రతిపక్షపార్టీలలోని
ఎంపీలు పార్టీ మారి బిజేపీలో చేరితే నిర్మావాషింగ్ పౌడర్ లో కడిగినట్లుగా అప్పటిదాకా
అవినీతి మరకలు పడినవారు పై విధమైన దాడులకు
గురైనవారు కూడా స్వచ్ఛంగా బయటికి వస్తారని బిజేపీ పైన ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలవల్ల
బిజేపీ పార్టీ ఈ కణికు చెప్పిన రాజనీతినే పాటిస్తున్నట్లు ప్రజలకు స్పష్టం అవుతుంది.
రాజా
నిత్యమూ శత్రు గమనాన్ని తెలిసికొనుటలో ఏకాగ్రత కావాలి. తన రాజ్యాంగాలను రహస్యంగా నిలుపుకోవాలి.
శత్రువుల లోపాలను నిరంతరమూ గమనించాలి. వారి విషయంలో నిత్యమూ ఉద్విగ్నుడై చరించాలి.
(18).
మన
ప్రజాస్వామ్యంలో ఇది నిత్యం జరుగుతూనే ఉంది. ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉండవలసిన ప్రభుత్వ ఉత్తర్వులను రహస్యంగా
దాచి పెట్టడం RTA ద్వారా అడిగి ఉత్తర్వులను తెలుసుకోవలసి
రావడం మన ప్రజాస్వామ్యంలో నేడు పరిపాటిగా మారింది.
వాచాభృశం
వినీతః స్యాత్ హృదయేన తథాక్షురః/ స్మితపూర్వాభిభాషీ స్యాత్ సృష్టో రౌద్రాయ కర్మణే
(శ్లో66)
అంజలిఃశపథః
సాంత్వం శరసా పాదాభివందనమ్/ ఆశాకరణ మిత్యేవం
కర్తవ్యం భూతి మిచ్ఛతా (శ్లో 67)
వీటి
అర్థాన్ని చూడండి- రాజు బాగా వినయశీలడుగా మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. కానీ మనస్సు
మాత్రం కత్తిలా ఉండాలి. చిరునవ్వు నవ్వుతూనే మాట్లాడుతూ ఉండాలి, శపథాలు చేయాలి, అనునయించాలి,
తలవాల్చి కాళ్ళకు మొక్కాలి ఆశ చూపాలి. నేటి నాయకులు
చేస్తున్న చాలా పనులు ఇవే. ఇలా చేయవలసిన పనులే
ఇవి అని చెబుతున్నట్లుగా ఉంది.
శత్రువు
బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బకొట్టాలి. అతడు బలం పుంజుకుంటే కొట్టలేము అని వ్యాసభారతంలో
చాలా శ్లోకాలలో ఉన్నది. తెలుగులో నన్నయ కూడా ఇదే ఒక పద్యంలో రాశాడు చూడండి.
“కం.
బలహీనులైనచో శ/త్రుల జెఱచుట నీతి, అధిక దోర్వీర్య సుహృ/ద్బలులైన వార జెఱపగ/ నలవియె యక్లేశ సాధ్యులగుదురె మీదన్”
అంటాడు నన్నయగారి కణికుడు కూడా.
(ఏవం
సమాచారన్నిత్యం సుఖమేధేత భూపతిః/ భయేన భేదయేద్ భీరుమ్ శురమంజలి కర్మణా శ్లో50)
నిత్యం
రాజు సుఖంగా ఉంటూ వృద్ధి చెందవచ్చు. పిరికి వారిని భయపెట్టాలి. వీరులకు మొక్కి లొంగదీసుకోవాలి.
అని ఈ శ్లోకం భావం ఈ కణికనీతిని నేటి నాయకులు తూచ తప్పకుండానే పాటిస్తున్నట్లు మనం
నిత్యం చూస్తున్నాం.
దాని
తర్వాతి 51 శ్లోకంలో ఏం చెబుతాడంటే “రాజా పేరాస గలవానిని డబ్బుతో వశపరచుకోవాలి. తక్కువ
వారినీ తనంతవారినీ పరాక్రమంతో లొంగదీయాలి.” నేటి రాజకీయాలలో పరాక్రమంతో లొంగదీయడం అంటే
తమకు అధికారికంగా సంక్రమించిన రాజ్యాంగ సంస్థలను దండాధికారాన్ని వినియోగించుకోవడమే
అని నేడు కొత్త భాష్యం చెప్పుకోవాలి. అధికార
రాజకీయాలు ఇదే చేస్తున్నాయని నిత్య వార్తలు వస్తూనే ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న
పార్టీ తమకు విపక్షంగా ఉన్నవారిపైన విమర్శించేవారిపైన ఈడీ, ఐటి, సిబిఐ దాడులు చేయిస్తూ ఉందని వేరు వేరు
రాష్టాలలో
వేరు
వేరు పార్టీల నాయకులు ఆరోపించడం దాడులు జరగడం
వార్తల్లో విషయాలు. ఇక రాష్ట్రాలలో ఇదే తరహాలో పాలకులు సిఐడి పోలీసు విభాగాలు తదితర
రాజ్యాంగ అధికారిక వ్యవస్థలను తమ అధికారానికి ఎదురువస్తున్న లేదా విమర్శిస్తున్న వ్యక్తులు
సంస్థలపైన వారి ఆర్థిక మూలాల పైన దెబ్బకొట్టడం నిత్యం వార్తలలో వచ్చేవిషయాలే. ఇవన్నీ
నేటి ప్రజాస్వామ్యంలో నిలిచి ఉన్న కణిక నీతినే తెలుపుతున్నాయి. మార్గదర్శిపైన దాడి,
సంగం పైన దాడి, హెరిటేజ్ కంపెనీకి పోటీగా వేరే రాష్ట్రానికి చెందిన డైరి కంపెనీలను రంగంలోనికి దింపడం, ఇవన్నీ చట్టపరంగా శత్రుపక్షాలపైన
దాడిగా లేదా శత్రుపక్షాల ఆర్థిక మూలాలపైన దెబ్బకొట్టడంగా ప్రతిపక్షపార్టీలు చాలా బలంగా
ఆరోపించడం ఈ కణిక నీతి ఎంత బలంగా నేడు ప్రజాస్వామ్యంలో నాటుకొని ఉందో తెలియజేస్తున్నది.
నవిశ్వసేదవిశ్వస్తే
విశ్వస్తే నాతివిశ్వస్యేత్/ విశ్వాసాద్ భయముత్పన్నం మూల్యాన్యపి నికృంతతి (62)
నమ్మదగనివానిని
నమ్మకూడదు. నమ్మినవారిని కూడా పూర్తిగా నమ్మరాదు నమ్మిన వాడిద్వారా కలిగే భయం సమూలంగా నాశనం చేయవచ్చు. రాజు అనేవాడు తనకు నమమకస్తులైన
వారిని కానీ తన బంధువులను కానీ ఎవరినీ నమ్మకూడదు అంటాడు. నమ్మినట్లు కనిపించినా అసలు
నమ్మకూడదు. అంతే కాదు సంధిచేసుకున్నాం కదా
అని శత్రువుతో నమ్మి ఉండకూడదు. అలా పని అయిపోయింది అనుకున్నవాడు చెట్టుకొమ్మమీద నిదురిస్తున్నవాడితో
సమానం. పడితే కాని తనకు మెలకువ రాదు అప్పటికి అంతా అయిపోతుంది అంటాడు కణికుడు. (శ్లో 75)
తన
అధికారానికి అడ్డుగా వస్తాడనుకుంటే అంటే ఆవిధంగా తనకు నష్టం చేసే శత్రువుగా ఉండే వ్యక్తిని
గురువునైనా బంధువునైనా ఉపేక్షించ కూడదు వారిని
శిక్షించడం కానీ లేదా సంహరించడం కానీ చేయాలి.
ఈ కణికుడి మాటలు వ్యాసభారతంలోను నన్నయభారతంలోను ఉన్నాయి. చూడండి
పుత్రః
సఖా వా భ్రాతా వా పితా వా యది గురుః/ రిపుస్థానేషు వర్తంతః హంతవ్యా భూతి మిచ్ఛతా||52
అంటే
రాజు ఐశ్యర్యాన్ని (అధికారాన్ని) కోరుకుంటే కొడుకును అయినా, మిత్రునయినా, సోదరునైనా,
తండ్రినయినా, గురువునయినా సరే శత్రుస్థానంలో
నిలిస్తే సంహరించాలి అని అర్థం.
నన్నయ
గారి కణికుడు కూడా ఇలాగే ఒక పద్యంలో వచనంలో చెప్తాడు.
“గురుకొని
కార్యకార్యము/ లెఱుగక దుశ్చరితుడై యహితుడగునేనిన్
మఱువక
గురునైన జను/లెఱుగగ శాసించునది మహీశుడు బుద్ధిన్” ఆది. ఆశ్వాసం 4. పద్యం 103
వచనం:
కావున అపకారకారణులయిన వారిం బరులనయిన బాంధవులనయిన
నుపేక్షింపక యాత్మరక్షాపరుండవయి దూరంబుసేసి దూషించుది అనిని గణికు మతంబు విని దుర్యోధనుండు
చింతాపరుడై యొక్కనాడు ధృతరాష్ట్రున కేకాంతంబున నిట్లనియె. (120).
తన
ప్రభుత్వం పడిపోయినప్పుడు ఎన్టియార్ వేదనతో ఇలాంటి విషయం ఒకటి చెప్పాడు అధికారంకోసం
ఆనాడు ఔరంగజేబు తన తండ్రినే జైల్లో పెట్టాడని
సోదరును చంపాడని చదువుకున్నాం నేడు నాకు అదే జరిగింది అన్నాడు. ఇటీవలి వార్తల్లో వివేకానంద
రెడ్డి హత్య కేవలం రాజకీయ లబ్ధికోసమే జరిగిందని
కోర్టులోవాదనలు జరిగినట్లుగా వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. జగన్ వదిలిన బాణాన్ని
అని పాదయాత్రతో రాష్ట్రమంతటా ప్రచారం చేసిన షర్మిల ఇప్పుడు నేను తెలంగాణ కోడలిని అని
వేరే రాష్ట్రానికి పోయి అక్కడ పార్టీ పెట్టుకొని అధికారం కోసం ప్రయత్నించడం అన్న
పాలించే రాష్ట్రాన్ని గురించి మాట్లాడక పోవడం తన అన్న ఈ కణిక నీతిని పాటించడం వల్లనే జరిగిందని నేటి
రాజకీయాలు పరిశీలించే వారికి స్పష్టంగా అర్థమయ్యే విషయం. ఆత్మరక్షాపరుడు అయిన రాజు అంటే పాలకుడు తన అధికారానికి
అపకారం అనుకుంటే వారిని పరులనయినా, బంధువులనైనా ఉపేక్షించకుండా దూరంగా పెట్టాలని దూషించాలని
కణికుడు చాలా స్పష్టంగా చెబుతాడు కణికుడు. నేటి పాలకులు దీన్ని తూచ తప్పక పాటిస్తూనే
ఉన్నారు. తాను రాజుకాలేక తన కొడుకు రాజుగానే ఉండాలని ధృతరాష్ట్రుడు చేయని అకృత్యం లేదు
కదా.
నేటి
ప్రజాస్వామ్యంలో పెద్ద పదవిలో ఉన్న వారు పెద్ద అధికారంలో ఉన్న వారు
ప్రయాణం చేసేటప్పుడు పోలీసు యంత్రాంగం ఇతర
భద్రతా యంత్రాంగం ఎన్నో భద్రతా చర్యలు తీసుకుంటుంది. ప్రయాణించే దారిని వేదికను అసలు
ఆ భవనాలను ప్రాంతం మొత్తాన్ని జల్లెడపట్టి శోధిస్తారు. మెటల్ డిటెక్టర్లు పెట్టి మరీ
అంతా వెదకవలసి వస్తుంది. ఈ విషయాన్ని కణికుడు ఐదు వేల సంవత్సరాలనాడే చెప్పాడు.
రాజు
అన్ని ప్రదేశాలలో గూఢచారులను నియమించుకోవాలని ప్రతి శత్రుక్షేత్రంలో పాషండులైన వారిని
(వేదబాహ్యులను) గూఢచారులుగా పెట్టుకోవాలి. ఉద్యానవనాలలో, విహారక్షేత్రాలలో, దేవాలయాలలో,
పానగృహాలలో (అంటే నేటి బార్లలో), సందుగొందులలో సైతం, సమస్త తీర్థాలలో, చౌరస్తాలలో,
బావుల దగ్గరా పర్వతాలమీద, అడవులలో నలుగురు కలిసే ప్రదేశాలలో గూఢచారులు పనిచేయాలి అని
వాటిని పరిశీలించాలని కణికుడు విస్పష్టంగా
చెప్పాడు. (శ్లో 63-65)
మిత్రులకయనా
శత్రుల కయినా రాజు ఎప్పుడేమి చేస్తాడో తెలియకూడదు.
ప్రారంభించిన పని లేదా సమాప్తమైన పని మాత్రమే
వారికి తెలియాలి అంటాడు. ఇటీవలె ప్రత్యేక పార్లమెంటు సదస్సు జరుగుతుంది అని ప్రకటన వచ్చినప్పుడు ప్రతిపక్షాలన్నీ ఒకేదేశం
ఒకే ఎన్నిక బిల్లు పెట్టడానికి కావచ్చు అని ఊహించాయి కాని జరిగింది వేరు. ఇది కణిక
నీతి కాక మరేమిటి.
నేడు
రాజకీయాలతో సంబంధం లేని వారు కణిక నీతిని తప్పక చదవాలి.
చదివితే నేటి రాజకీయాలు కణిక నీతిని అడుగడుగునా
ఎలా పాటిస్తున్నాయో తెలుస్తుంది. నేటి రాజకీయ నాయకులు పదవిలో ఉన్న అధికారపార్టీల వారు పదవికి దూరంగా ఉండి పదవిని పొందలనుకునే రాజకీయ పార్టీలవారు తప్పక
కణికుడు చెప్పిన రాజనీతిని తప్పక చదవాలి. ఇది చదివితే నేటి ప్రజాస్వామ్యానికి ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలుస్తుంది. అంతే కాదు కణిక నీతిని
పాటించడంతోటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతందనే విషయమూ తెలుస్తుంది.
--------
0 --------
No comments:
Post a Comment