Friday, April 20, 2012


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం
psubbachary@gmail.com
దళితుల ఆహారం చర్చనీయాంశమా?
(ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉదంతం నేపథ్యంలో...)
రాముడు లేడి మాంసం తిన్నాడు అనే అంశాన్ని తిక్కనగారు తన నిర్వచనోత్తర రామాయణంలో రాకుండా అనువాదం చేసాడని ఒక చాలా పెద్ద పరిశోధకుడు చాలా సంవత్సరాల క్రితం ఎత్తి చూపాడు. దీనికి కారణం తిక్కన శాకాహారి కావడమేననీ ఆ పరిశోధకుడు తీర్మానించాడు కూడా. తను అత్యంతం భక్తితో సేవించే శివుని విగ్రహానికి తిన్నడు మాంసాన్ని నివేదిస్తే శివుడు చాలా సంతోషించాడు అని చెప్పే కావ్యం జగత్ప్రసిద్ధమే. గ్రామదేవతలకు గ్రామీణులు తాము తినే ఆహారమైన మేకలు గొర్రెలు కోళ్లను సమర్పించుకోవడం చాలామామూలుగా వస్తున్న విషయం. ఇవేవీ చర్చనీయాంశాలు కావు. ఈ నాటి సమాజంలో అభ్యంతరకరమైన విషయాలూ కావు. ఆంధ్రప్రదేశ్ లో కాని ఇతర రాష్ట్రాలలో కాని దళితులు గొడ్డు మాంసం (ఆవు ఎద్దు దున్న బర్రె) తింటారు. అసలు దళితులు చరిత్ర క్రమంలో అంటరానివారు కావడానికి ఇదే కారణమైందనే సాంఘిక సిద్ధాంతం కూడా సమాజ శాస్త్రంలో ఒకటుంది. కాని ఇటీవలి కాలంలో దళితుల ఆహారం బాగా చర్చనీయాంశంగా మారుతూ వస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఉదంతం అకస్మాత్తుగా జరిగింది కాదు. దీని వెనుక చాలా సైద్ధాంతిక పరమైన ఆలోచనతో ఒక హక్కును చాటుకోవడానికి చేసిన దళిత ప్రయత్నంగా ఇది కనిపిస్తూ ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టల్ లో బీఫ్ ఫెస్టివల్ జరుపుకోవడానికి దళిత విద్యార్థులు, మరికొందరూ ప్రయత్నించడం దాన్ని మరొక వర్గం విద్యార్థులు అడ్డుకోవడం జరిగింది. పెద్ద హింసాకాండే జరిగింది. ఉస్మానియా చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇది తొలిసారి. ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టళ్ళలో శనివారం ఆదివారం చికెన్, మటన్ అంటే కోడిమాంసం మేక గొర్రె మాంసాలను ఆహారంలో ఇవ్వడం ఉంది. (నేను 1980 నుండి 1987 దాకా ఉస్మానియా హాస్టళ్ళలో ఉన్నాను. విద్యార్థిగా నాకు బాగా తెలిసిన విషయం ఇది). దళిత విద్యార్థులు ఆరోజుల్లోనే మేము తినే మాంసం కూడా పెడితే బాగుంటుంది కదా అనే వాదన చాలా గుంభనంగా చేసే వారు. దాన్ని వారు పైకి గట్టిగా అనడానికి కూడా బాధపడే వారు. దాన్ని వారే చిన్నతనంగా భావించే రోజులు అవి. కాని సామాజిక అస్తిత్వ ఉద్యమం పెరిగిన తర్వాత దళితులు తమ సమాజపు సాంఘిక జీవన విధానాన్ని పూర్తిగా ఎసర్ట్ చేసుకుంటున్నారు(తమజీవితాన్ని తమ ఇష్టం ప్రకారం గడపాలనే భావన).  ఈనాడు దళితుల తమ ఆహారపు అలవాట్లను తమ హక్కుగా బహిరంగంగా చెప్పి తమ జీవన శైలిపై ఆహారపు అలవాట్లపై సమాజంలోని ఇతర వర్గాలు ఆంక్షలు పెట్టడానికి వీలు లేదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘటనగానే ఉస్మానియా విశ్వవిద్యాలయపు భీఫ్ ఫెస్టివల్ ని అర్థం చేసుకోవాలి. ఈశాన్య రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాలు కొన్నింటిలో భీఫ్ ను కూడా హాస్టళ్ళలో విద్యార్థులకు ఇస్తున్నట్లు తెలియవచ్చింది. 
గొడ్డు మాంసంతినడం అనే విషయం శతాబ్దాలుగా చర్చనీయాంశంగానే ఉంది. ఒకప్పుడు ఆంధ్రదేశంలో ఒక శిక్ష ఉండేది. అదేమంటే గ్రామంలోని ఉన్నత కులానికి చెందిన వారు ఎవరైనా దళితుల అమ్మాయిని కాని స్త్రీలను కాని చెరిపినప్పుడు ఆ వ్యక్తి వారికి పట్టుబడితే అతడిని గూడెం లోనికి తీసుకుపోయి గుంజకు కాని చెట్టుకు కాని కట్టేసి అతని నోట్లో గొడ్డు మాంసం ముక్కను పెట్టి తర్వాత వదిలి పెట్టే వారు. దీని అర్థం అతను మాదిగ మాలలతో సమానుడైనాడని చెప్పడం అతడిని అపవిత్రుడుగా చేయడంగా భావించేవారు. నా బాల్యంలో కూడా మా గ్రామంలో ఇది జరిగినట్లు చెప్పుకునేవారు. దళితుల మహాభారతం అయిన జాంబపురాణంలో ఆదిజాంబవుని వంశంవారు, చెన్నయ్య అతని వారసులు అంటరానివారుగా మారే శాపం తగలడానికి ఆవు మాంసం తినడమేనని చెప్పే ఉదంతం ఉంది. దీన్ని బట్టి గొడ్డు మాంసం తినడం అనేది ఈ సంస్కృతిలో హీనమైనదిగా పరిగణింపబడి అది దళితులకు శాపమైనది అని చేసే వాదనలకు బలం దొరికింది. కాని నేటి దళితుల వాదన తమ సామాజిక హక్కును గురించి తమ జీవన శైలిని తాము అనుకున్న విధంగా నడుపుకోవడానికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కు గురించి. తమ ఆహారాన్ని తాము తినడానికి మరొక సామాజిక వర్గం అభ్యంతరం చెప్పడానికి వీలు లేదని అన్నికులాల వారికి ఆహారం అందించే పబ్లిక్ సంస్థలలో అందరి ఆహారం అందించడం తమకు సిద్ధమైన హక్కు అని వారు భావిస్తున్నారు. వాదిస్తున్నారు. ఇది చాలా న్యాయబద్ధమైన రాజ్యాంగ బద్ధమైన ఆలోచనగానే ఉంది.
కేంద్రంలో బి.జె.పి ప్రభుత్వం పరిపాలించే రోజుల్లో గోవధ నిషేధం గురించి చర్చ జరిగే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలనుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చౌకధరలో తమకు మంచి ఆహారం (ప్రొటీన్ రిచ్ ఫుడ్) దొరికే మార్గం ఇదే దీన్ని ఎందుకు నిషేధిస్తారు అని వారు తీవ్రంగా అభ్యంతరం చెప్పారు.  బహు సంస్కృతుల ప్రజలు నివసించే విశాల మైన దేశంలో ఇలాంటి భేదాభిప్రాయాల రావడం చాలా సహజం. అది ఆయా ప్రజల సహజ హక్కులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు సంబంధించిన విషయం.
అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర ప్రభుత్వాలు కూడా జంతు బలిని నిషేధించాయి. జంతుబలి చేసిన వారిని అరెస్టు చేయవచ్చు శిక్షించవచ్చు. కాని ఇది మతరమైన అంశం అందుకే పోలీసులు చూసీ చూడనట్లు ఊరుకుంటారు. ఆది వారం వస్తే గంగమ్మ గుడులలో కనీసం వందకు తగ్గ కుండా మేకలు గొర్రెలు బలి అవుతాయి ఒక్క కుప్పం పట్టణంలోనే. ఇది వారు తినే ఆహారాన్ని వారు తమ దేవతకు అర్పిస్తున్నారు. కాని ఇతర మతాలలో ఉన్న జంతుబలిని ఏ ప్రభుత్వం నిషేధించలేకపోయింది. ఇది చాలా చర్చనీయాంశం. ఒక మతానికి చెందిన ఆరాధనలలోనే జంతుబలిని నిషేధించడం పట్ల చాలా ప్రశ్నలు ఉన్నాయి.
కాని ఇక్కడ ఇంకా మౌలికమైన చర్చ అవసరం. మానవుడు పుట్టుకతో మాంసాహారా లేక శాకాహారా అనే (హెర్బిఓరస్ లేక కార్నిఓరస్) అనే శాస్త్రీయ చర్చ అలాగే ఉంది. కాని ఈ రోజున ఈ భూమండలంలోని అన్ని దేశాలలోను జరిగే చర్చ అన్ని జంతువులకు అన్ని పక్షులకు ప్రాణులకు జీవించే హక్కు ఉంది అని చెప్పడమే. మనిషిని మరొకరు బలి ఇచ్చి కోసుకొని తింటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తే బాగుంటుందని అలాగే అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉందని ఈనాడు మనిషి ఆలోచించి వాదిస్తున్నాడు. ఏ జంతువునీ చంపే హక్కు మనిషికి లేదు.
అడవి జంతువులను వేటాడి చంపడం నేరం అని చెప్పి నిషేధించిన ప్రభుత్వం ఇంటి జంతువులైన కోళ్ళు మేకలు, గొర్రెలను చంపడాన్ని నిషేధించలేదు. మున్సిపాలిటీలలో ఇంతకు ముందు కుక్కలను పట్టుకుపోయి కరెంటు పెట్టి చంపేసే వారు. జీవకారుణ్య సంఘాల వారి కృషి ఫలితంగా వాటిని చంపడం ఆగిపోయి వాటికి కుటుంబనియంత్రణ ఆపరేషన్లు  చేసే ప్రక్రియ అమలులోనికి వచ్చింది. ఇది ఎంతో ఆహ్వానించదగిన పరిణామం. కాని ఈ జీవ కారుణ్య సంఘాల వారు బ్లూక్రాస్ వగైరా వగైరా పేర్లతో దేశవ్యాప్తంగా ఉన్న జీవ కారుణ్య సంఘాల వారు జంతుబలిని కాదు జంతు వధని నిషేధించమని కోరరు ఎందుకని? అసలు మొత్తం మాంసాహారాన్ని నిషేధిస్తే జంతు వధ అనేది ఉండదు. ఈనాడు మానవుడికున్న అవగాహన ప్రకారం ప్రతి జంతువుకూ బ్రతికే హక్కు సహజంగా ఉంది అని అంగీకరించినప్పుడు ఏజంతువునూ చంపి తినే హక్కు ఏ మనిషికీ లేదు. ఇలా ఆలోచించినప్పుడు నిషేధించవలసింది జంతు బలిని కాదు, జంతువధను. హిందువులకు పవిత్రమైనదిగా భావించే గోవును మాత్రమే వధించడం నిషేధించాలి అని అనడం సరికాదు. అసలు మొత్తం ఏ జంతువునూ కోడి మేకలు సహితం చంపకూడదు అలా చంపే హక్కు మనిషికి లేదు అని నిషేధించడం చాల అవసరం. ఇదే సహజ న్యాయం కూడా. (ఈ వ్యాసకర్త బ్రాహ్మణేతరుడైన సంపూర్ణ శాకాహారి). అంతే కాని కొన్ని జంతువులను చంపి తినడం సరైనదే, కొన్నిజంతువులను చంపితినడం న్యాయం కాదు అని వాదించడం రాజ్యాంగ బద్ధమైన సమన్యాయానికి విరుద్ధం అవుతుంది. దళితులు తినే ఆహారం ద్వారా వారి సామాజిక స్థితిని కొలవడం సమన్యాయవిరుద్ధమైన చర్య. భారత దేశంలో అన్ని వర్ణాలలోను మాంసాహారం ఉందని చెప్పే చారిత్రక ఉదంతాలు ఉన్నాయి. వేదకాలంలోని జంతుబలి మాంసాహారభక్షణాన్ని గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. ఒరిస్సా, బెంగాలులోని అన్నివర్ణాల వారు అన్ని మాంసాలను తింటారు. ఈనాడు మనిషి ఆలోచించే సమన్యాయ సిద్ధాంతం ప్రకారం అన్ని ప్రాణులకు జీవించే హక్కు ఉంది. దేన్నీ చంపే హక్కు మనిషికి లేదు. ప్రభుత్వాలు మొత్తం జంతువధని అంటే మాంసాహారాన్ని నిషేధించే దిశగా అడుగులు వేసి అన్ని ప్రాణుల్ని చంపడాన్ని నిషేధించాలి. అంత దాకా ఒక సామాజిక వర్గానికి చెందిన ఆహారాన్ని అనుమతిస్తూ మరొక వర్గానికి చెందిన ఆహారాన్ని అంటే వారి  జంతువధని ప్రశ్నించే వీలు లేదు. దళితుల  ఆహారం అప్పటిదాకా చర్చనీయాంశం కారాదు. అందరి హక్కులతో వారికీ ఉన్న హక్కు. మనకు కావలసిఉంది సంపూర్ణ జంతువధ నిషేధం. నిజానికి మనిషికన్నా క్రూర జంతువు ఉన్నాడా అనేది జంతువుల మూగ వేదనలలో నుండి పారే రక్తంలోనుండి వస్తున్న ప్రశ్న. 

1 comment:

www.apuroopam.blogspot.com said...

చాలా చక్కటి హేతుబధ్దమైన విషయాలు వ్రాసేరు.నూటికి నూరు పాళ్లూ మీతో నేను ఏకీభవిస్తున్నాను.అయితే జంతు బలుల్నీ ప్రత్యేకించి గోవధనీ నిషేధించాలని కోరుకునే వారు గాని వారిని ప్రోత్సహించే రాజకీయ పార్టీలు కాని పూర్తి జంతు వధని నిషేధించాలనే మాట ఏనాడూ అనవు. అనలేవు. కారణం సంఘంలో ఎక్కువ మంది మాంసాహారులుండడం. వారిని ఎదిరించి నిలిచే ధైర్యం ఎవరికీ లేదు. అదీ కాక జంతువుల్ని వేరే జంతువులు చంపి తినడం ఎంత సహజ న్యాయమో ఇదీ అంతే.ఈ సహజ న్యాయానికి అడ్డు చెప్పడాని ఎవరికి మాత్రం ఏం హక్కు ఉంటుంది కనుక. అయితే మనం జంతువులం కాదు.ఉత్కృష్టమైన మానవ జన్మ నెత్తాము కనుక మనం జీవ హింస చేయరాదనే భావన అర్థం చేసుకున్నప్పుడే ఈ సహజ న్యాయం మనకి వర్తించదనీ మనం జీవ హింస చేయకుండానే బ్రతికే అవకాశాలు ఉన్నాయి కనుక మన జీవన విధానాల్ని మార్చుకోవలసి ఉందనే విషయం జనం గ్రహించాలి ఇది జరగని పని అని నా భావన.జంతు వధని నిషేధించ లేనప్పుడు selective గా కొన్ని జంతువుల్ని చంపకూడదనడం కాని బలి ఇవ్వడం కూడదనడం కాని ఏ విధంగానూ సమర్థనీయం కావు.