Sunday, December 29, 2013

నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి నేటికి ఏడాది దాటింది

ద్రావిడ విశ్వవిద్యాలయం

ఏవి తల్లీ నిరుడు మెరిసిన తెలుగు కిరణములు
నాలుగవ తెలుగు ప్రపంచ మహాసభలు జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక పునరాలోకన

తెలుగు తల్లీ ఎక్కడమ్మా నీదు మల్లియలు

ఏవి తల్లీ నిరుడు కురిసిన సుమ సమూహములు

ఎచట తల్లీ నిరుడు పాడిన మెచ్చుగీతికలు

ఏల తల్లీ తెలుగు భాషకు ఈ దురదృష్టం

ఏవీ తల్లీ నిరుడు మెరిసిన తెలుగు కిరణములు

సరిగ్గా పోయిన ఏడాది ఇదేరోజు అంటే డిసెంబరు  29 న నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు ముగిసాయి. డిసెంబరు 27 నుండి 29 దాకా మూడు రోజుల పాటు జరిగాయి. సాక్షాత్తు మహా మహిమ్ భారత రాష్ట్రపతి తిరుపతికి విచ్చేసి  ఈ మహా సభల్లో పాల్గొన్నారు. ఎన్నో కోట్ల రూపాయిల ప్రజాధనం ఖర్చు అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలోఉన్న తెలుగు వారు ఒక చోట చేరడానికి మంచి అవకాశం లభించింది. చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నారు. ఎన్నో తెలుగు ప్రదర్శన కళలు లలిత కళలు ప్రదర్శితమైనాయి. సాహిత్య సాంస్కృతిక కార్యక్రమలు మూడు రోజుల పాటు చాలా అట్టహాసంగా చాలా ఆనందకరంగా జరిగాయి. సరే కొంత మంది అలగడం. మాకు తగిన ప్రాధాన్యం రాలేదని బాధపడడం ఇలాంటి పెద్ద ఘటనలు జరిగినప్పుడు ఎలాగూ ఉంటాయి. అలగే ఉండినాయి. అంత మాత్రమే కాదు. ఇలాంటివి జరిగినప్పుడు ఏలినవారి పక్షాన మనామనిగా ఎంపికలు జరగడం కూడా తోసివేయరాని విషయం.
సరే ఈ వేడుకలన్నీ ఆనంద కరమైనవే. వీటిని గురించి పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ దేన్ని గురించి ఆలోచించాలి. తెలుగు భాష సాహిత్యం సంస్కృతుల అభృద్ధికి, తెలుగు అధికారభాషఅమలు గురించి చేసిన వాగ్దానాలు ఎన్ని. వాటికి పట్టిన గతి ఏమిటి అనే ఆలోచించవలసిఉంటుంది. ఇది ప్రభుత్వాన్ని కాని లేదా కొందరు ప్రభుత్వాధికారులు కానీ విమర్శించడానికి చేసే ప్రయత్నం కాదు. తెలుగుకు పట్టిన ఈ దౌర్భాగ్యస్థితికి ప్రగాఢమైన బాధను వ్యక్తం చేయడానికి చేసే ప్రయత్నమే. ప్రభుత్వ ప్రతినిధిగా మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు కూడా చాలా వాగ్దానాలు చేశారు. ఆయన నిజంగా భాష పట్ల సాహిత్యం పట్ల మంచి నిబద్ధత ఉన్నవారు. మంచి పని చేయాలని తలపెట్టినవారు. కాని ఆయన ఒక అనుకోని తీరులో రాజీనామా కూడా చేశారు. సభల్లో చేసిన వాగ్దానాలు చేసిన పథకాలు ఏవీ అమలు కాక పోవడానికి కారణాలు ఏమిటి అని ఆలోచించవలసి ఉంది.
ఒక పక్క రాష్ట్ర విభజన ఉద్యమం జరుగుతుంది. తెలుగు జాతి తెలుగు భాష అని ఒక ఏకీకరణ భావంతో జరిగే ఈ మహాసభలు రాష్ట్రవిభజనకు అడ్డుపడతాయని తెలంగాణా వారు భావించారు. అక్కడనుండి చాలామంది కవులు కళాకారులు ఈ మహాసభలకు హాజరు కాలేదు. ఇది రాజకీయ కారణం. అయినా కొంత మంది హాజరయినారు. కొన్ని తెలంగాణా ప్రాంత జానపద కళారూపాలు కూడా ప్రదర్శితమైనాయి. ఇది సంతోషించ దగిన విషయమే.  ఈ మహాసభల్లో ముఖ్యమైన పథకాలు వాగ్దానాలు బయటికి వచ్చాయి. ముఖ్యమైనవి ఏమంటే అన్ని స్థాయిల్లోను తెలుగు అధికార భాషగా అమలు కావాలి. అవసరమైన చోట ఉర్దూ రెండవ అధికార భాషగా ఉంటుంది. ఈ ప్రయత్నం కొంత జరిగింది. న్యాయస్థానాలలో కూడా పూర్తి స్థాయిలో తెలుగు అమలు జరగాలని మరికొన్ని సభల్లో కూడా నిర్ణయాలు జరిగాయి. కాని దీని పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రభుత్వ పీఠమైన రాష్ట్ర సచివాలయంలోనే తెలుగు అమలు చాలా నిరాశాజనకంగా ఉంది. ప్రభుత్వ
ఉత్తర్వులు ఎన్ని తెలుగులో వస్తున్నాయి అనే విషయం వారే ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇక రెండో ముఖ్యమైన విషయం పాఠశాల స్థాయిలో తెలుగు తప్పనిసరిగా ఒక అంశంగా ఉండాలి. ఈ నిర్ణయం ఆనాడే నిరాశను కలిగించింది. కారణం ఇంటర్ విద్య వరకు తెలుగు ఉండాలని తలపెట్టారు. కాని పది వరకైనా ఎన్ని పాఠశాలల్లో ఇది అమలు జరుగుతూ ఉందని ఏ విచారణైనా జరిగిందా. దీని అమలుకు పకడ్బందీ ప్రణాళిక విధానం రచితమైందా లేదు. అంతే కాదు ప్రైవేటు పాఠశాలల ఆగడాలను నిరోధించి తెలుగును తప్పని సరి భాషగా పెట్టేందుకు ఏదైనా కచ్చితమైన అదేశాలు వారికి చేరాయా అవి అమలు అవుతున్నాయా ఫలితం ఏమి జరిగింది.
నగరాలలో అన్ని పట్టణాలలో దుకాణాల ముందు అన్ని సంస్థల ముందు నామ ఫలకాలన్నీ తెలుగులో ఉండేలా ఆదేశాలు చేస్తామన్నారు. నాటి అధి కార భాషాసంఘం అధ్యక్షులు దీని అమలును గురించి చాలా శ్రద్ధగా చెప్పారు. చేశారు కూడా. కాని హైదరాబాదులో నగరంలోని ఏ దుకాణం ముందూ బోర్డులు తెలుగులోనికి మారలేదు. అదే కర్ణాటకలో అయితే స్వచ్ఛంద సంస్థలవారే ఇంగ్లీషులో ఉన్న బోర్డులు అన్నింటిపైన నల్లరంగుపూస్తారు. కన్నడంలో రాసినదాకా ప్రభుత్వం వారు కూడా ఊరుకోరు. ఈ అదృష్టం తెలుగుకు రావడానికి ఇంకా ఎన్నిదశాబ్దాలు ఎదురు చూడాలి. ఈ ఏడాది మొత్తం తెలుగు భాష సాంస్కృతిక  సంవత్సరంగా పాటించి విశేషకార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. కాని ఏమి జరిగింది. మూడు కళా వేదికలు అంటే ఆడిటోరియంల నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఆ దిశగాపని ఏమి జరుగుతూ ఉందో తెలియదు. ఇది యాదృచ్ఛికంగా తెలుగు వైతాళికుడు తెలుగు మహాకవి గురజాడ అప్పారావు నూటాఏభై యవ జయంతి. ప్రభుత్వం ఆయన కోసం కొన్ని మంచిసభలను నిర్వహించింది. మంచి కార్యక్రమాలు చేపట్టింది. కాని ఆయన కట్టుకున్న సొంత ఇల్లు ఆకుటుంబానికి దారిలేక అమ్ముకోవలసి వచ్చింది. దాన్ని కొనుకున్న వారు దాన్ని కూలగొట్టారు. ఇది తెలుగు వారు అందరినీ కలచివేసే అత్యంత దురదృష్ట ఘటన. ఏ భాషా రాష్ట్రంలోను ఇది జరిగి ఉండేది కాదు. ఏ మహాకవికీ ఇంతటి క్షోభకలిగేది కాదు. ఇది తెలుగు వాడైనందుకు గురజాడకు పట్టిన గతి.
ప్రపంచ మహా సభలు నిర్వహించి ఎన్నో ఊసులు చెప్పుకున్నాము. కాని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఏడాది గడిచి పోయింది. ఈ దురదృష్టానికి కారయణం ముఖ్యమైంది, తెలుగు జాతి ఎన్నడూ లేని రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడమే. రాష్ట్రం చీలి పోయే స్థితిలో అటు వారు కాని ఇటు వారు కాని చివరికి ప్రభుత్వం కాని భాషను గురించి పట్టించుకునే స్థితిలో లేదు. తెలంగాణా వారికి ముందున్న పెద్ద సమస్యవారికి రాష్ట్రం ఏర్పడడం ఆ సమస్య ముందు భాషకు సంబంధించినది వారికి చాలా చిన్న సమస్య అయింది. రాష్ట్రం వచ్చిన తర్వాత వారిదైన భాషా విధానాన్ని వారు ఏర్పరచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక సర్కారాంధ్ర వారికి కాని రాయలసీమ వారికి కాని ముందున్న సమస్య రాష్ట్ర విభజనను అడ్డుకోవడం. ఈ సంకులసమరంలో తెలుగు భాషకోసం చేసుకున్న బాసలన్నీ నీటిలో కలిసినయ్. తెలుగు క్లాసికల్ లాంగ్వేజ్ కు చెందిన కేంద్ర సంస్థ ఇప్పుడు ఎక్కడికి రావాలనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. అది రెండు రాష్ట్రాలలో పని చేయవలసి వస్తుంది. తెలంగాణా వాడిగానే తెలంగాణా వాదిగానే నేను ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను.  రాజకీయంగా అధికార పరంగా పాలనా పరంగా తెలుగు వారు రెండు రాష్ట్రాలలో ఉండవచ్చు. ఇది వేరే విషయం కాని భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన విషయాలలో మనం ఇద్దరం అన్నదమ్ములం కొంత సంయమనం పాటించాలి రెండు రాష్ట్రాలలో ఉన్నంత మాత్రాన మాండలికాలు మారినంత మాత్రాన తెలుగు భాష రెండుగా చీలదు. అప్పుడు కూడా రాజమండ్రి నన్నయను, వరంగల్లు పోతన్నను రాయలసీమ పెద్దన్నను ఒకే భాషాసాహిత్య విమర్శ విధానాలతో చూడవలసి ఉంటుంది. అప్పుడూ తెలుగు సాహిత్యం ఒకటే అవుతుంది. తెలుగు తల్లికూడా రెండుగా చీలి తెలంగాణా తల్లి, ఆంధ్రమాతగా రెండుగా అవతారాలెత్తవలసిన అవసరం లేదు. తెలుగు భాషా సాహిత్యాల అభివృద్ధికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడి ప్రణాళికలు వేసుకోవచ్చు. ఉమ్మడి విధానాలు అవలంబించవచ్చు. రాష్ట్రం ఎలాగూ పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానినికలిగి ఉంటుంది కాబట్టి తెలుగు క్లాసికల్ సంస్థ రాజధానిలోనే పెట్టుకొని ఇరు ప్రాంతాల వారు కలిసి ఉమ్మడి ప్రణాళికలు వేసుకోవచ్చు. అదే సమయంలో తెలంగాణా మాండలికాలకు రాయలసీమ మాండలికానికి కళింగాంధ్ర మాండంలికానికి తగిన విధంగా పెద్ద పీట వేసుకొని పరిశోధనలు చేయవచ్చు.
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి ఏడాది గడిచిపోయింది. అయినాఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది.  ఎవరినీ నిందించకుండా రెండు ప్రాంతాల వారు భాషాసాహిత్యాలకు సంబంధించి అధికార భాష అమలుకు సంబంధించి ఉమ్మడి ప్రణాళికలు వేసుకోవలసిన సమయం ఇది. ఇది ఎవరినో తప్పుపట్టడానికి కాకుండా తెలుగు భాషకు పట్టిన దురదృష్టానికి బాధపడుతూ రాసేది. భాషా సాహిత్యాల విషయంలో ఇద్దరు అన్నదమ్ములు మరింత సహనంతో సంయమనంతో పని చేయవలసిఉంది. చేసిన బాసలను తిరిగి ఆలోచించుకోవలసిన సమయం కూడా ఇదే.

1 comment:

Arjun said...

చక్కటి సమీక్ష. ప్రభుత్వాలేదో చేస్తాయని ఆశించేరోజులు పోయాయి. పౌరసమాజం ప్రాధాన్యత గుర్తించనంతవరకు తెలుగుకు మహర్దశ పట్టటం కష్టం