Monday, March 2, 2015


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం 9440493604
psubbachary@gmail.com

ఒక్క కవితే చాలు హృదయాన్ని ఆవహించేయడానికి....
ఇది యవకవుల కవితాప్రతిభ

పొద్దున్నే విన్న పాట ఆ రోజంతా వెంటాడినట్లు రాత్రి నిద్రించే దాకా పక్కన కూర్చొన్నట్లు కొన్ని కవితలు మనల్ని నిలవేస్తాయి. మనతోపాటే రోజంతా నిలబడి సేద తీరుస్తాయి. ఇటీవల కాలంలో కొందరు చాలా సీనియర్ కవులు వచన కవిత్వం పేరుతో వచనమై తేలిపోతున్నారు. ఏ కొత్తదనాన్ని కాని లేదా కొత్త వాదాన్ని చెప్పడం కాని సాంఘిక నిబద్ధతని చాటుకోలేక ఏమీ కాక చతికిలబడి పోతున్నారు. తాము రాసేదంతా కవిత్వమే అని భ్రమలో బ్రతికితే ఫర్వాలేదు. కాని వాటిని మోసుకుంటా అవార్డులు రివార్డులకోసం పరుగెత్తుతున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే, యవతరం చాలా మంచి కవితల్ని సృష్టిస్తున్నారు. కొత్త తరం కొత్త సాంకేతిక ప్రపంచం. నవయుగంలోని వారి సామాజిక సాంస్కృతిక అనుభూతి వారికి కొత్తగా ఆలోచించే శక్తిని ఇస్తూ ఉంది. పెద్దవాళ్ల కళ్లు గిర్రున తిరిగి పోయేలా చాలా మంచి కవితాసృజన చేస్తున్నారు.
అలాంటి కవితని ఇటీవల ఒక దాన్ని ముఖపుస్తకంలో (FaceBook)లో చదివాను. చాలా రోజులు నన్ను అంటి పెట్టుకొని ఉందా కవిత. ఎవరో అన్వీక్ష అనే పేరుతో రాస్తున్న అమ్మాయి. ఆమె అసలు పేరూ అదేనేమో. అభివ్యక్తిలో కొత్తపరిమళం. నిర్మాణంలో (శిల్పం అని అరిగి అరిగి నిరర్థకంగా మిగిలన పదాన్ని వాడ దలచుకోలేదు). చాలా చాలా కొత్తదనం యునీక్ నెస్ ఉంది. ఈ గుణం ఆ కవితని కొన్ని రోజుల పాటు నా పక్కనే నిలబడేలా చేసింది. అది నా పక్కన కొన్ని రోజులు నిలబడడమే కాదు అది నా అంతస్సీమల్ని వెలిగించింది. ఆ కవితపేరు నిర్గమధూమం దాన్ని రాసింది అన్వీక్ష అనే అమ్మాయి. కవితని యథాతథంగా కింద చూద్దాం. తర్వాత దాని రహస్యాల్ని గురించి మాట్లాడుకుందాం.
నిర్గమధూపము
కవయిత్రి అన్వీక్ష
ఆమె పుస్తకంలా మునగదీసుకున్నప్పుడు
అతనెప్పుడూ అటుగా
చూడనేలేదు
వాలిన మిణుగురులు ఒక్కో అక్షరం ఎత్తుకెళ్ళి
చీకటి కోటపై ముత్యాలవరసలు పేర్చుతుంటే
ఒక్క సారైనా తన చూపును
ప్రసరించనేలేదు
వండి వార్చి ఇళ్ళంతా ఒకరోజును లెక్కించాక
ఆమె కలంలో పరకాయ ప్రవేశం చేసి
ఏ సృష్టి చేసిందో
ఏనాడూ తెలుసుకొన ఆశపడలేదు
చీరలు మడతేస్తూ
వస్తువులు సరిచేస్తూ వాటితో చేసిన సంభాషణ
రోజూ తను పడుకోబోయేముందు
చెవిలో జూఊఉఊఉ ... అన్న నాదం వినవస్తున్నా
తెల్లబడ్డ తన తలవెంట్రుకలు మొహాన్ని తడిమినా
ఆమె ఉనికిని తలపోయనే లేదు
ఇప్పుడు
కట్టెలపై నిమ్మళంగా ఆమె పడుకున్నాక
పశ్చిమాన వాలే సూర్యుడు తన నుదుటన అస్తమించాక
ధూమమై ఎగుస్తున్న కవితలా అతన్ని అల్లుకున్నాక
చీకటిలో ఆ మిణుగురుల కోసం
అతనిప్పుడు వెతుకుతూ బయల్దేరాడు.

కవితని ఒక్క సారి పరిశీలించండి. దీన్ని ఆయిదు భాగాలలో రాసింది కవయిత్రి. ఈ భాగాల్ని చరణాలు అని పిలుద్దాం. చరణాలలో ఉన్న పంక్తుల్ని పాదాలు అని పిలుద్దాం. నిజానికి పాదం అన్నా చరణం అన్నా ఒకటే కాకుంటే ఇక్కడ భాగం అని అనకుండా పాటలోని భాగాల సామ్యంతో చరణం అని పిలుద్దాం. ఒక్కోచరణంలో పాదాల సంఖ్య కూడా సరిగ్గా ఒకే సంఖ్యలో ఉండాలి అని కవయిత్రి భావించలేదు. అలా ఉండాలని కూడా లేదు. కాని పాదాల మధ్య ఎడం ద్వారా చరణాల విభాగాన్ని సూచించింది కవయిత్రి. ఇక్కడ చరణాల విభజనలో ఆశించిన ప్రయోజనం ఉంది. అంటే చరణంలో ఒక వస్తువు ఉంది అని దానిలో భావం ఉంది అని అది ఒక మొత్తం కవితలోని భావభాగం అని అర్థం చేసుకోవాలి. దీన్నే భావాంశం అని అందాం. ఇక్కడ సంపత్కుమార, చేరాల సంవాదంలో లాగా ఇది పద్యం అని నిరూపించే ప్రయత్నం చేయడం లేదు. వచన కవిత పద్యకవితకు పొడిగింపు అనే భావానికి నేను పూర్తిగా వ్యతిరేకిని. ఆయన భావగణాలు ఉంటాయి అని చేసిన వాదన ఇప్పటికీ ఋజువుకు నిలబడేదికాదు. వచన కవితని వచన పద్యం అని అనడానికి నేను వ్యతిరేకిని కాదు. కాని ఇది పాత పద్యానికి పొడిగింపు ప్రక్రియ కాదని ఇది కొత్త ప్రక్రియ అనే వాదానికే కట్టుబడి ఉంటాను.
విశ్లేషణలో సౌకర్యం కోసం పై కవితలో చరణాలు పాదాలు అనే విభాగాల కొలతలతో దీన్ని విశ్లేషించడానికి అనుభూతిని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటి చరణాన్ని చూడండి ఇందులో మూడు పాదాలున్నాయి.
ఆమె పుస్తకంలా మునగదీసుకున్నప్పుడు
అతనెప్పుడూ అటుగా
చూడనేలేదు
కవిత ప్రారంభంలోనే ఆమె అని ప్రకటించి రాసేది ఒక స్త్రీ మీద అని కంఠోక్తిగా చెప్పి ముందుకు సాగింది. ఇదొక పద్ధతి ఈ పద్ధతిలో ఒక మంచి చిత్రం పాఠకుడికి తొలిలోనే ఆవిష్కృతం అవుతుంది. పుస్తకంలా మునగదీసుకున్నప్పుడు/ అతనెప్పుడూ అటుగా/ చూడనే లేదు. పుస్తకంలా మునగదీసుకున్నప్పుడు అనేది సరికొత్త భావచిత్రాన్ని అందిస్తూ ఉంది. ఇంతదాకా ఎవ్వరూ మునగదీసుకుని పడుకున్న వారిని ఇలాంటి పోలికతో చెప్పలేదు. ఇదే కవయుత్రి ప్రతిభ. ఎంతో నిరాసక్తంగా లేదా బాధతో మునగదీసుకుని పడుకుని ఉంది. కాని ఆమె పురుషుడు అటువైపు చూడనేలేదు. చూడలేదు అనే క్రియాపదానికి చూడనేలేదు అనే క్రియా పదానికి ఎంతో అంతరం ఉంది. సుదీర్ఘకాలంతో ఉన్న, ఒక పట్టీపట్టని పురుషుని ధోరణిని బాగా బలంగా ఆవిష్కరించి ఈ పదప్రయోగం.
వాలిన మిణుగురులు ఒక్కో అక్షరం ఎత్తుకెళ్ళి
చీకటి కోటపై ముత్యాలవరసలు పేర్చుతుంటే
ఒక్క సారైనా తన చూపును
ప్రసరించనేలేదు
ఈ చరణాన్ని పై చరణంతో అనుసంధానం చేసుకొని చదివి అర్థం చేసుకోవాలి. మిణుగురులు ఒక్కో అక్షరాల్ని ఎత్తుకెళ్ళి అని చెప్పడం మరొక అద్భుత పదచిత్రం పైన పుస్తకంలా అని ఎందుకు పదచిత్రం వేసిందో ఇక్కడ అక్షరాల్ని మిణుగురులు ఎత్తుకుపోతున్నాయి అని చెప్పినప్పుడు బాగా బోధపడుతుంది. చీకటి కోటపైన ముత్యాలవరుసలు పేర్చుతున్నాయని చెప్పడం లో స్వారస్యం చూడండి. అక్షరాల్ని బాగా కుదురుగా రాస్తే ముత్యాల కోవలా ఉన్నాయి అని అంటాం. ఇక్కడ అంతే కాదు అవి చీకటిలో మెరుస్తున్నాయి అని చెప్పడం కూడా ఉంది. అతను ఈ ముత్యాల వైపు ఆ చీకటి వైపు ఒక్కసారైనా తన చూపును ప్రసరించ లేదు. ఆమె బాధలో చీకటి కోణాన్ని ఒక్కసారైనా చూచే ప్రయత్నం చేయలేదు. సారైనా, ఇంకా ప్రసరించనేలేదు అనే క్రియాపద ప్రయోగాలు తిరిగి సాభిప్రాయ ప్రయోగాలు. ఆమె అంతరంగాన్ని దానిలోని చీకటి కోణాల్ని ఏనాడూ అతను చదివే ప్రయత్నం చేయలేదు. ఈ భావాన్ని నిక్షిప్తం చేయడానికే కవయిత్రి పుస్తకం అని అక్షరాలు అనే వాటిని ఎంత కొత్తగా చెప్పే ప్రయత్నం చేసిందో చూచినప్పుడు ఈమె సృజన ప్రతిభ, మనకు అర్థం అవుతుంది.
వండి వార్చి ఇళ్ళంతా ఒకరోజును లెక్కించాక
ఆమె కలంలో పరకాయ ప్రవేశం చేసి
ఏ సృష్టి చేసిందో
ఏనాడూ తెలుసుకొన ఆశపడలేదు
ఈ మూడో చరణం చూడండి ఇల్లంతా ఒక రోజును లెక్కించాక అన్నది అతి నవ్యమైన ప్రయోగం. ఈ పాదంలో వండి వార్చి అనే పదాలు లేకున్నా ఫర్వాలేదు. ఒక రోజును లెక్కించాక అని అన్నా ఇంటెడు చాకిరి రోజంతే చేసిన తర్వాత అలసిన తర్వాత అనే భావాన్ని ఇది సమర్థంగా చెప్పగలదు. కలంలో పరకాయ ప్రవేశం చేసి ఏ సృష్టి చేసిందో ఏనాడూ తెలుసుకనే ఆశపడలేదు అతను. ఇది స్పష్టమైన భావన. ఇక్కడ ఆశపడలేదు కన్నా ప్రయత్నించనేలేదు అనే భావం చాలా బాగుంటుంది. కవయిత్రి దీన్ని గ్రహించాలి. ఆమె రచనా ప్రపంచం అతనికి ఏ మాత్రం పట్టలేదు. అందులో తొంగి చూచే ప్రయత్నం చిన్నది కూడా చేయలేదు. అది అపరిచితగానే మిగిలింది. ఇక నాలుగో చరణం చూద్దాం.
చీరలు మడతేస్తూ
వస్తువులు సరిచేస్తూ వాటితో చేసిన సంభాషణ
రోజూ తను పడుకోబోయేముందు
చెవిలో జూఊఉఊఉ ... అన్న నాదం వినవస్తున్నా
తెల్లబడ్డ తన తలవెంట్రుకలు మొహాన్ని తడిమినా
ఆమె ఉనికిని తలపోయనే లేదు
ఈ చరణంలో పై భావమే సరికొత్త వస్తువుతో భృశార్థం కోసం పునరావృతం అయింది. రోజంతా వస్తువులతో పనిలో ఆమె చేసిన సంభాషణ అతనికి ఆ జూ.... అనే నాదం వినిపిస్తూ ఉన్నా ఆమె తెల్లబడ్డ వెంట్రుకలు అతని మొహాన్ని తడిమినా.. అంటే జీవితాంతం అతను ఆమెతో ఏకశయ్యాగతులై ఉండినా ఆమె ఉనికిని అతను ఏమాత్రం గ్రహించలేదు. ఇక్కడి నిర్మాణం చాలా గుంభనంగా ఉంటుంది. చెప్పకుండా నాదం అతనికి వినిపిస్తున్నా,  తెల్ల వెంట్రుకలు అతడిని తడిమినా  అని చెప్పకుండా దాచి చెప్పిన పద్ధతి ఇక్కడి కవయిత్రి ప్రతిభకు గీటురాయి. ఇక్కడ కవితని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక చివరి చరణం చూద్దాం
ఇప్పుడు
కట్టెలపై నిమ్మళంగా ఆమె పడుకున్నాక
పశ్చిమాన వాలే సూర్యుడు తన నుదుటన అస్తమించాక
ధూమమై ఎగుస్తున్న కవితలా అతన్ని అల్లుకున్నాక
చీకటిలో ఆ మిణుగురుల కోసం
అతనిప్పుడు వెతుకుతూ బయల్దేరాడు.
పశ్చిమాన వాలే సూర్యుడు తన నుదుటన అస్తమించాక అని చెప్పడం సరికొత్త పరిమళం. కట్టెలపై నిమ్మళంగా పడుకుంది ఆమె. ఆమె అంతరంగాన్ని అంతర్గత వేదనని ఆవిష్కరించిన ఆమె కవిత నిర్గమించి, ధూమమై ఎగసింది. దాన్ని ఏనాడూ అతను చదవనే లేదు. కానీ ఈ ధూమం ఇప్పుడు నిర్గమించింది. ఇక ఇప్పుడు అంతా గడిచిన తర్వాత తన స్త్రీకోసం ఆమెను చదవడం కోసం చీకటిలో మిణుగురుల్లా ఉన్న అక్షరాల్ని ఏరుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అతను.
జీవితాంతం తన స్త్రీని అర్థం చేసుకోలేని బాధల్ని తెలుసుకోలేని జీవన సహచరిని సహచరిగా తనలో భాగంగా చూడలేని పురుషుడు ఆమె లోకం దాటిన తర్వాత ఆమె ఉనికికోసం తడుముకుంటున్నాడు. నిరామయంగా, నిరాసక్తంగా ఏదో ఒక రొటీన్ క్రియగా సంసారాలు చేసుకునే భార్యాభర్తల జీవితంలో స్త్రీ ఆర్తనాదాన్ని అంతరంగాన్ని అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించింది ఈ కవిత. భావవ్యక్తీకరణలో అతి నవ్యమైన రీతిని పట్టుకుంది. ప్రతి భాచిత్రం సరికొత్త పరిమళాన్ని అందిస్తూ ఉంది. కవయిత్రి తనదైన ప్రతిభని చూపింది. కవిత నిర్మాణంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించింది. చరణాల్ని విభజించుకొన్న పద్ధతి వాటిలో పాదాలు పేర్చుకున్న తీరు బాగా మెచ్చదగినదిగా ఉంది. కవితలో మంచి నిర్మాణం ఉంది. కవయిత్రి తన కవితకు దానికై దానికి అవసరమైన నిర్మాణాన్ని చూపింది. ప్రతి చరణంలో ఆమె అన్నది వ్యక్తంగానో గుప్తంగానో ఉంది. కాని దాన్ని ధ్వనించే తీరులో తేడా ఉంది.
వచన కవులు చాలా మంది ఇంకా ఏ స్థితిలో ఉన్నారంటే వచన కవిత అంటే ఫ్రీ కవిత అని అంటే స్వేచ్ఛగా ఎన్ని పాదాలైనా ఉండవచ్చు వాటిలో ఎన్ని పదాలైనా ఉండవచ్చు అని ఎంత స్వేచ్ఛగానైనా రాయవచ్చు అనే భ్రమలోనే ఉన్నారు. ఈ స్థితి చాలా సీనియర్స్ లో కూడా కొందరిలో ఉంది. కాని వచన కవి తన కవితలో దాని భావానికి అవసరమైన నిర్మాణాన్ని తనకు తానుగా నిర్దేశించుకొని ఒక ప్రకృష్టమైన రీతిలో నిర్మాణాన్ని  చేసుకోవాలని అనవసరమైన పదాల్ని, అనవసరమైన పాదాల్ని తీసివేసుకొని చిక్కగా రాయాలని ఒక నిర్దిష్టమైన ధ్యాస ఉండదు. కవితలో ఈ పాదాల్ని లేదా కొన్ని పదాల్ని తీసివేసినా ఇందులో భావం చెడదు అనే పరిస్థితి ఉండకూడదు. ఏ పాదం తీసిన చివరికి పదం మార్చినా కవిత కూలిపోతుంది, అనేంతగా అతి చిక్కగా కవితలని రాయాలి నిర్మించాలి అనే స్పృహ మన వచన కవులలో కొందరికే ఉంది. అది కొత్తగా వస్తున్న యువతీ యవకులైన వారిలో ఈ శ్రద్ధ చాలా మందిలో కనిపిస్తూ ఉంది. ఇదే సంప్రదాయ పద్యాన్ని రాయడానికి వచన కవితని రాయడానికి ఉన్న తేడా. ఛందోబద్ధమైన పద్యంలో నిర్మాణం సిద్ధంగా ఉంటుంది. కవి కష్టపడే పనిలేదు. కాని వచనకవి తన కవిత నిర్మాణాన్ని తనే తయారు చేసుకోవాలి. అది ప్రతి కవితకీ కొత్తగా చేసుకోవాలి. అందుకే సరైన మంచి వచన కవిత రాయడం ఛందోబద్ధమైన పద్యం రాయడం కన్నా కష్టమైన పని. ఈ స్పృహ కూడా కొందరు కవులకే ఉంది. ఈ యువతరం కవుల నిర్మాణ ధోరణి వచన కవితకు తెలుగులో మంచి భవిష్యత్తు ఉంది అనే నమ్మకాన్ని కలిగిస్తూ ఉంది. ఈ కవయిత్రి అన్వీక్ష లో కూడా ఈ సృజన శక్తి కవితా నిర్మాణం పట్ల శ్రద్ధ బాగా కనిపిస్తూ ఉంది. దీన్నే రూపనిర్మాణశ్రద్ధ అని నేను చెప్పదలచుకున్నాను. ఇది ఈనాటి వెంటాడే కవితల్లో మంచి కవిత. దీన్ని ఫెమినిస్టు కవిత అని ప్రత్యేకంగా పిలవడం నాకు అంతగా ఇష్టంలేదు.  
పులికొండ సుబ్బాచారి.






No comments: