Monday, March 5, 2012

ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి

ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం, ౫౧౭౪౨౫. అ.ప ఇండియా

దేవుని సేవలో ఏ కులం గొప్పది?

అన్ని దేశాలలో మనుషులు ఆసుపత్రులలో పుడతారు. కాని మన దేశంలో మాత్రం ఒక్కొక్కరు ఒక్కో కులంలో పుడతారు. ఒక సారి మన ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మనం స్నేహితులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది కాని ఇరుగు పొరుగు వారిని ఎంపిక చేసుకునే వీలు లేదు కదా అని అన్నాడు. ఇది పాకిస్థాన్ ను ఉద్దేశించి. ఇరుగు పొరుగు దేశాలను ఎంపిక చేసి తెచ్చుకోవడం ఎలా సాధ్యం కాదో ఈ దేశంలో పుట్టిన కులాన్ని మార్చుకోవడం కూడా అలాగే సాధ్యం కాదు అన్నది శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా ఋజువైన సత్యం. మతం మారినా ఈ కుల విభేదాలు ఆ కొత్త మతాలలోనికి పోయాయే కాని పోయిన వారి కులాలు పోక వారు అలాగే ఉండిపోయారు. గొప్ప కులం తక్కువ కులం అనే సామాజిక వివక్షను ఆ దేవుడు కూడా తీసివేయలేకపోయాడు. మనుషులు అందరూ సమానులే అని కనీసం దేవుడు కూడా అంగీకరించాడో లేదో అనే అనుమానం చాలా మంది సంతులు సధువులకు, మహా కవులకు కూడా చాలా సార్లు వచ్చింది. నిమ్నకులాలలో పుట్టిన సాధు సంతులు దేవుడినే శాసించగలిగిన వారు కూడా సామాజిక వివక్షను తట్టుకోలేక ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా అని ప్రశ్నించారు. నేను ఈ కులంలో ఎందుకు పుట్టానా అని రోదించిన ఘట్టాలున్నాయి. పుట్టరాని చోట పుట్టి నాశక్తి నా కళ ఎంత వృథా అయిందో కదా అని మహాకవి జాషువా దుఃఖించిన పద్యం ఉంది. "ఎంత కోయిలపాట వృథ యయ్యోనో కదా చిక్కు చీకటి వనసీమలందు/ ఎన్నివెన్నెలవాగు లింకిపోయెనొకదా కటిక కొండలమీద మిటకరించి/, ఎన్ని కస్తురి జింక లీడేరెనో కదా మురికి తిన్నెల మీద పరిమళించి/, ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా పండిన వెదురు జొంపములలోన/ ఎంత గందవహన మెంత తంగెటి జున్ను ఎంత రత్నకాంతి ఎంతశాంతి/ ప్రకృతి గర్భమందు భగ్నమైపోయనో, పుట్టరాని చోట పుట్టుకతన". అని బిగ్గరగా వాపోయాడు. ఇలాంటి కంఠాలెన్నో ఈ దేశంలో రుద్ధమై పోయినాయి. కాని కులం మారలేదు.

కాని సాక్షాత్తు దేవుని సన్నిధానంలో ఉండి కూడా దేవుని సేవలో నిమగ్నమై కూడా నా కులం గొప్పది వాడి కులం తక్కువది అనే దుర్నీతిని దురహంకారాన్ని వీడలేని స్థితి నేడు కూడా ఎలా ఉందో చెప్పడం ఇక్కడి ఉద్దేశం. దేవుని సేవలో కులాలు అనే ప్రశ్న ఎందుకు వస్తుంది అనే ప్రశ్న వేసుకోవలసి వస్తుంది. వేసేవారుకూడా ఉన్నారు. కాని ఈ దేశంలో విశేషించి ఆంధ్రప్రదేశ్ లో దేవుని సేవల కోసం కులచట్రం ఉంది. ఇది కొన్ని వందల వేల సంవత్సరాలుగా వస్తూ ఉంది. దీనిని ఎవరూ మార్చలేకపోయారు. ఒక్కొక్క కులం వారికి కొన్ని సేవలు నిహితమై ఉన్నాయి. ఆలయం కట్టించేవారు దానికి అవసరమైన ధనాన్ని సేకరించి అందించి భూమిని ఇచ్చి దానికి నిర్మాణానికి దారితీసే వ్యక్తులు ధర్మకర్తలు అవుతారు. సాధారణంగా ఈ ధర్మకర్తలుగా రాజులు మన్నీడులు, రాజాలు ఉంటారు. తర్వాత సంపన్నులైన భూస్వాములు ఉంటూ ఉంటారు. ఈ ధర్మకర్తలు గా ఉన్నవారు వారి వంశ పారంపర్యంగా ధర్మకర్తలుగానే మిగిలిపోతారు. వీరికి వంశపారంపర్యంగా ఆకుటుంబానికి ఆలయంలో ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. తొలి హారతి వారికే ఇస్తారు. దేవునికి కల్యాణం జరిగినప్పుడు పీటలమీద కూర్చునేది ఈ ధర్మకర్తల కుటుంబం వారే. వారి తర్వాతే ఎవరైనా దీన్ని గురించి ఆలోచించాలి. ఈ ధర్మకర్తలే దేవాలయాన్ని దేవుని విగ్రహాన్ని తయారు చేసే శిల్పిని ఎన్నుకుంటాడు. శిల్పులను రాజులు పోషించిన కారణం ఇదే. ఈ నాటికి కూడా ధర్మకర్తలే శిల్పులను ఎన్నుకొని వారికి డబ్బు ఇచ్చి ఆలయ నిర్మాణాన్ని విగ్రహ నిర్మాణాన్ని చేయిస్తారు. ఈ కాలంలో ఈ నిర్మాణ రీతిలో కొంత మార్పు వచ్చినా దేవుని శిలా విగ్రహాలను శిల్పాచార్యులే చేస్తున్నారు. అంటే విశ్వబ్రాహ్మణులు లేదా విశ్వకర్మకులంలో పుట్టిన శిల్పాచార్యులు చేస్తారు. వారితో చేయిస్తేనే అది లాయకీ అని ఇప్పటికీ మిగతా కులాల వారు నమ్ముతారు. ఈ విశ్వకర్మకులంవారు నేడు బి.సి వర్గీకరణలో ఉన్నారు. వీరు కూడా సామాజిక దురన్యాయాన్ని చవిచూచేవారే. తర్వాత ఆలయ నిర్మాణం చేసిన తర్వాత విగ్రహరచన పూర్తి అయిన తర్వాత ఆ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసేది విశ్వబ్రాహ్మణులే. ఇప్పటికీ తెలిసిన వారు దీన్ని పాటిస్తున్నారు. కాగా ఈ ధర్మకర్తలు అందరూ ప్రస్తుత కాలంలో కూడా ఉన్నత భూస్వామ్య వర్గాలకు చెందిన కులాల వారే ఉండడం గమనించాలి. క్వచిత్తుగా వెనుకబడిన కులాల వారు ఉన్నా వారు అత్యధిక సంపన్నలైన సందర్భాలలో జరిగింది. కాని వారు కూడా ఆలయంలోనే సామాజిక వివక్షకు గురైన సందర్భాలున్నాయి.

ఇక ఆలయ నిర్మాణం ప్రతిష్ఠ అయిన తర్వాత రోజువారీగా గుడిలో చేసే సేవలు ఉంటాయి. ఇలా సేవలు చేయడానికి ఆలయాలలో శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేయడం సంప్రదాయంగా శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తూ ఉంది. గర్భగుడిని కాక గుడిలోపల గుడి వెలుపల ప్రాంగణాన్ని ఊడ్చి శుభ్రం చేసే పనిని చాకలి కులం వారికి అప్పగిస్తారు. అలా ఇచ్చిన కుటుంబానికి ఎకరంనుండి ఐదు ఎకరాల వరకు ఇనాం భూమిని ఇస్తారు. దీన్నే మాన్యం అంటారు. ఆ చాకలి కుటంబం వారు వంశ పారంపర్యంగా దాన్ని అనుభవిస్తూ దేవుని ప్రాంగణంలో సేవ చేస్తారు. అలాగే దేవుని కల్యాణం జరిగినప్పుడు ఇతర ఊరేగింపులు జరిగినప్పుడు పగటి దివిటీలు పట్టుకుని ఊరేగింపులో ముందు నడిచేది ఈ చాకలి కులం వారే. దేవుని ఆలయంలో సన్నాయిని ఇతర సంగీత వాద్యాలను వినిపించవలసి ఉంటుంది. ఇది రోజువారీ పూజలోను తర్వాత వార్షిక కల్యాణాల సమయంలోను ఊరేగింపులలోను అవసరం ఈ సేవను మంగలి కులంవారికి ఇస్తారు. ఒక కుటుంబానికి ధర్మ కర్త ఈ సేవను ఇచ్చి ఆ కుటుంబానికి మాన్యం ఇస్తాడు. వారు ఆ పొలంలో వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తూ దేవుని సేవ చేస్తారు. కొన్ని సందర్భాలలో ఈ సంగీత వాద్యాల బృందంలో దూదేకుల కులం వారు ఉండడం కూడా ఉంది. వీటినే చాకలి మంగలి మాన్యాలు అనిఅంటారు. ఈ కింది కులాల వారికి ఇచ్చిన మాన్యాలను భూస్వామ్య కులాల వారు కబ్జా చేయడం అమ్మడం వంటి పనులు చేయడం అవి కోర్టు వివాదాలలోని వెళ్ళి కొన్ని వేల కేసులు ఉండడం ఈనాటి చారిత్రక సత్యం. చాకలి మంగలి మాన్యాలను ఇచ్చిన విషయాలను ఇతర మాన్యాల విషయాలను అందుకే రాజులు శాసనాలలో రాయించారు. చాలా మంది ధర్మకర్తలు కూడా శాసనాలు వేయించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇంకా చాలా పెద్ద దేవస్థానాలలో ఈ మాన్యాల వివరాలు సేవ చేసే కులాల వివరాలు చెక్కిన శాసనాలున్నాయి. వాటి ప్రకారమే ఆయా కులాలు దేవుని సేవలో పని చేస్తున్నాయి. ఈ సేవతో పాటు దేవని గుడిలో పూజించడానికి నైవేద్యం పెట్టడానికి బ్రాహ్మణులను పూజారులుగా నియమిస్తారు ఈ ధర్మకర్తలే. ఈ పూజారికి కూడా మాన్యంగా కొంత భూమిని ఇస్తారు. ఆ భూమిలో వచ్చే ఆదాయాన్ని పూజారి తను అనుభవించడమే కాక రోజు నైవేద్యానికి రోజువారీ ఇతర ఖర్చులకు వాడవలసి ఉంటుంది. దేని దేనికి వాడాలనే విషయం రాసి ఉంటుంది. ఇక కొన్ని దేవాలయాలలో దేవదాసీలు ఉంటారు. వీరు భోగం వారు అనే కులానికి చెందినవారు. వీరు దేవునికి కుంభహారతి ఇస్తారు. కుంభహారతి ఇచ్చి ప్రాంగణంలోనే దేవుని ముందు నాట్యంచేస్తారు. నాట్యం దర్శయామి అని దేవునికి చెప్పాలి. ఇది కూడా ఒక ప్రముఖమైన సేవగా చెప్పబడింది. ఈ సేవ చేసినందుకు గాను వీరికి కూడా మాన్యాలు ఇస్తారు. అయితే భోగం వారి ఈ దేవదాసి వ్యవస్థ ఇప్పుడు కనుమరుగైంది. అంతే కాదు వీరికిచ్చిన మాన్యం భూములు పెద్దలు ఆక్రమించుకోవడం వీరు వీధిన పడడం జరిగింది. వీటి విషయంలో కూడా కోర్టు కేసులు కొన్ని వందలు ఉన్నాయి. ఇలా అన్యాయం జరిగింది అంతా కూడా కింది కులాల వారికి నిమ్నవర్గాలు వారికే అన్నది ఇక్కడ గమనించాలి. ఇక పేరంటాళ్ల దేవతల గుడులలో మరి కొన్ని కులాలు కూడా ఉంటాయి. పాటలు పాడి దేవత కథను పాడే కులాలు వారున్నారు. వీరు కొమ్మల వారు బైండ్ల వారున్నారు. వీరు దళిత కులాలకుచెందిన వారు. వీరు చేసే సేవలకు కూడా వంశపారంపర్యంగా వచ్చే మాన్యాలు ఇచ్చిన ఆలయాలున్నాయి. ఇది కూడా ప్రముఖమైన సేవగా తిరునాళ్ళ జరిగే సందర్భాలలో వీరు ప్రముఖపాత్రను పోషిస్తారు. గొల్ల, కురమ, సాతాని, జంగమ వంటి ఇతర మైన ఎన్నో కులాల వారూ కొన్ని పనులు చేస్తారు. ఇక తల నీలాలు సమర్పించడం అన్నది ప్రధానమైన దేవాలయాలలో ఉంటుంది. ఈ తలనీలాలు తీసే సేవ చేసేది మంగలి కులం వారు. ఈ కుటుంబాల వారికి కూడా మాన్యాలు వంశపారంపర్య హక్కులు ఉంటాయి.

ఇలా దేవుని సేవలో దేవసంబంధమైన ఇతర సేవలలో ఈ కుల చట్రంఇమిడి ఉంది. వీరిలో అణగారిన కులాలు దళిత కులాలు కూడా ఉన్నాయి. మధ్యమ స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఉన్నత స్థితిలో బ్రాహ్మణ ఇతర భూస్వామ్య కులాలు ఉన్నాయ. గ్రామ దేవతల ఆరాధన సంప్రదాయంలో చాకలి, మంగలి కులాలవారు పూజారులుగా ఉంటారు. కొన్ని చోట్ల ఇతర కూలాలు కూడా పూజారులుగా ఉన్నాయి. కుమ్మరి, మేదరి కులాలు కూడా సేవలో ఉన్నాయి. వీరికీ మాన్యాలు ఉన్నాయి. దేవునికి వీరందరూ సేవచేసే వారే. ఒక్కొక్క కులం వారు ఒక్కొక్క సేవ చేస్తున్నారు. గర్భగుడిలో మంత్ర చదివే సేవ, గుడిని శుభ్రం చేసే సేవ, దేవునికి సంగీతం వినిపించే సేవ, దేవునికి నాట్యం చేసే దేవదాసీ సేవ, అసలు విగ్రహాన్ని చేసిన సేవ ఇలా దేవునికి చేసే సేవలు అన్నీ చాలా ముఖ్యమైనవే. ఇందులో ఏ సేవ లేకున్నా దేవుని పని జరగదు ఏదీ తక్కుది కాదు. కాని ఈ సేవలు చేసే కులాల వారు అందరూ సమాన మైన గౌరవం పొందుతున్నారా. చేసే సేవలు అన్నీ సమాన మైన గౌరవాన్ని పొందుతున్నాయా అనేది ఈనాటికీ మన ముందు నిలిచి ఉన్న పెద్ద ప్రశ్న. ఇది మనం సమాధానం చెప్పలేని సామాజిక సమస్య. ఒక సారి విగ్రహాన్ని చేసి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత గర్భగుడిలోనికి పోయే అధికారం అక్కడి బ్రాహ్మణుడికి తప్ప మరెవ్వరికీ లేదు. కనీసం ఆ దేవుని విగ్రహాన్ని చేసిన విశ్వబ్రాహ్మణ శిల్పికి కూడా ఆ అధికారం లేదు. ఇది అన్ని గుడులలోను ఉన్నదే. ఒక్క పండరిలోని పాండురంగని గుడిలో మాత్రం ప్రతిఒక్కరు గర్భగుడిలోనికి పోయి దేవుని విగ్రహాన్ని స్పృశించ వచ్చు. ఇలాంటి పాండురంగని గుడి ఒకటి బందరులో ఉంది. మన రాష్ట్రంలో ఇక్కడ ఒక చోట మాత్రం ప్రజలందరినీ అంటే అన్ని కులాల వారిని గర్భగుడిలోనికి పోనిస్తారు. గర్భగుడి అత్యంత పవిత్రమైనదైనప్పుడు లోనికి పోయే అర్హత అన్ని కులాలవారికి ఎందుకులేదన్నది ఈ నాడు ప్రజాస్వామ్య యుగంలో వేయవలసిన మొదటి ప్రశ్న. దేవునికి సేవచేసే కులాలు అన్నింటిని సమానంగా ప్రాబల్య కులాలవారు ఎందుకు గౌరవించలేక పోతున్నారు. ఉన్నత కులాల వారు తాముచేసే సేవే గొప్పది ఇతరులు చేస్తున్న సేవ తక్కువది అనే దురహంకారంతో ఇంకా ఎందుకుంటున్నారు. అనేవి నేడు మనం సంధిస్తున్న ప్రశ్నలు. ఈ మధ్య తిరుమల తిరుపతి ఆలయంలో ఒక అధికారితో వ్యవహరించే సందర్భంలో ఒక పూజారి ఆ ఉన్నతాధికారిని ఏంరా, నేను కల్యాణకట్టలో కూర్చొన్న మంగలిని అనుకున్నావా అని గద్దించి ప్రశ్నించాడు. అంటే తనను ఉన్నత కులం వాడిగా గౌరవించకుండా ఇతరులతో సమానంగా చూస్తున్నావా అని ప్రశ్నించాడు. ఈ ఒక్క మాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరగడానికి కారణం అయింది.

ఇక్కడ ఉద్యమం చేయడం కాదు ముఖ్యం. దేవునికి చేసే సేవలో కూడా అన్ని సేవలు అవసరమైనవే సమానమైనవే ఆ సేవ చేసే కులాలన్నీ సమానమైనవే అనే ఇంగితం మనకు ఇప్పటికీ ఎందుకు కలగటం లేదు అన్నది ప్రశ్న. సాక్షాత్తు దేవునికి అతి దగ్గరగా ఉండి దేవుడు నా వాడు అని చెప్పుకునే ఈ కులాల వారికి ఆ దేవుడు కూడా మనుషులు అందరూ ఒకటే అనే ఈ జ్ఞానాన్ని ఎందుకివ్వలేక పోతున్నాడు. ఈ సాంఘిక దుర్వివక్షని చూడలేకు ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా అని ప్రశ్నించిన కింది కులాల భక్త కవుల ప్రశ్నకి దేవుడు సమాధానం చెప్పడం లేదు. దేవుడనే భావన ఆ ఉనికి సాక్షాత్తు దేవుడు తన ఎదురుగా తనకు సేవ చేస్తున్న మనుషులలో కూడా తాను మార్పుతేలేక పోతున్నాడు. అన్ని కులాలను సమానంగా గౌరవించే పనిని ఆదేవుడూ సాక్షాత్తూ చూసి ఏమీ చేయలేక పోతున్నాడు. నరులన్ ముట్టకనందులన్ గొలిచి అప్పరమంబైన రహస్యము ఏమిటి అని జాషువా ఎక్కిరిస్తాడు. దీన్నే. రాతి నందులను కొలిచి సాటి మనిషిని తొక్కి వేసే ఈ దుర్నీతిని ఎండగట్టడం అన్ని కులాలను సమానంగా గౌరవించే సామాజిక స్థితిని తెచ్చే పనిని రాతి విగ్రహాలు చేయలేవు అనే విషయం శతాబ్దాలుగా రుజువైంది. దీనికి మనమే మనుషులమే పూనుకోవాలి. పులికొండ సుబ్బాచారి

No comments: