Sunday, July 8, 2012

An Article on Madiga Poetry




మార్గం వేసుకున్న మాదిగ కవిత్వం

ప్రతి శాస్త్రంలోను ప్రతి జీవన రంగాలలోను సెగ్మెంటేషన్ పెరుగుతున్న రోజులివి. శాస్త్రం పెరిగిన కొద్దీ ఒక అధ్యయన రంగం కాని కళా రంగం కానీ వైపుల్యాన్ని సంతరించుకుంటున్న క్రమంలో దానిలో చిలవలు పలవలుగా శాఖోపశాఖలు ఏర్పడతాయి. ఉదాహరణకి వైద్య రంగంలో శరీరంలోని పైకి కనిపించని లోలోని ఎన్నో అవయవాలకు ఒక్కొక్క దానికి ఒక్కో శాస్త్ర అధ్యయన రంగం ఏర్పడింది. తెలుగు కవిత్వం కవిత్వ అధ్యయనం అంటే విమర్శలలో కూడా ఈ తీరు కనిపిస్తూ ఉంది. కవిత అంటే ఒకప్పుడు కవితే. కాని నేడు అలా కాదు. తెలుగు కవిత్వం చాలా వర్గాలుగా విడిపోయింది. స్త్రీ వాద కవిత, దళిత కవిత, బి.సి వాద కవిత, మైనారిటీ కవిత, డయస్పోరా కవిత, బ్లాగు కవిత, అంతర్జాల కవిత. ఇన్ని రకాలుగా వచ్చాయి. ఇందులో దళిత కవిత్వం తిరిగి విడిపోయింది. మాదిగ కవిత్వం, మాల కవిత్వం, దళిత స్త్రీవాద కవిత్వం అనేవి ప్రస్తుతానికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే దళిత స్త్రీ వాద కవిత్వంలో కూడా మాల, మాదిగ వైరుద్ధ్యం వస్తుందేమో చూడాలి. ఇది ఇప్పటికైతే స్ఫుటంగా కనిపించడం లేదు. మొత్తం మీద దళిత కవిత్వంలో మాదిగ కవిత్వం అనేది ప్రత్యేకంగా రూపుదిద్దుకొంది. ఈ వాదంతో ఎంతో మంది కవులు మంచి కవితల్ని ప్రచురించారు. వీరి కవితలతో ఒక ప్రత్యేకమైన కవిత సంకలనమే వచ్చింది. ఈ మాదిగ కవితా వాదంలోని బాగోగుల్ని ఎలువు సలువుల్ని చూడడం ఇక్కడి ఉద్దేశం.   
దళిత కవిత్వంలో మాదిగల ప్రత్యేక కవిత్వం రావడానికి ఒక ప్రధానమైన సాంఘిక కారణం ఉంది. ఇది మాదిగలు తమ అస్త్విత్వం కోసం చేసిన బ్రతుకు పోరాటం. అదే మాదిగ రిజర్వేషన్ పోరాటం. ఎన్నో దశాబ్దాలుగా అంటే రిజర్వేషన్ అమలైన దగ్గరనుండి దాని అమలులో మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని. వచ్చిన ఉద్యోగాలలో అత్యధిక శాతం మాల కులం వారికి వెళ్ళాయని తమకు అన్యాయం జరిగిందని మాదిగలు ఉద్యమోన్ముఖులయ్యారు. మొత్తం షెడ్యూల్డు కులాలలో మాదిగల ఉపకులాలు 25 కాగా మాలల ఉపకులాలు 27 అని సేకరించిన ఆధారాలు తెలియ జేస్తున్నాయి. ఇందులో మాదిగ మాల అనే కులాలు ప్రధానమైనవి. కాని రిజర్వేషన్ అన్నది అన్నిషెడ్యూల్డు కులాలకు కలిపి ఒకే యూనిట్ గా ఉండడంవల్ల వచ్చిన 15 శాతం రిజర్వేషన్ లో ఎస్.సి కేటగిరీ పొందిన కులం ఎదైనా ఉద్యోగాన్ని పొందడానికి వీలుంది. అయినా పొందిన ఉద్యోగాలలో కాని సర్కారీ లబ్ధి దారులలో కాని మాలలే అత్యధికంగా ఉన్నారని మాదిగలలో విద్యావంతులైనవారు మేధావులు భావించారు. వారికి అందిన గణాంకాల ప్రకారం 90 శాతం పైగా ప్రభుత్వ ఉద్యోగాలలో మాలలు ఉన్నారని అందువల్ల వారికి తీవ్రమైన అన్యాయం జరిగిందని మాదిగలు దాని ఉపకులాలు చాలా పెద్ద ఉద్యమం చేసాయి. ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద సాంఘిక ఉద్యమంగా దీన్ని పేర్కొనవచ్చు.  ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ లో ఎ.బి.సి.డి అనే ఉపవిభాగాలను చేసింది. దీని ద్వారా సాంఘిక న్యాయం జరిగిందని వారు భావించారు. కాని తర్వాత సుప్రీంకోర్టు ఈ ఉపవిభాగల రిజర్వేషన్ ను కొట్టివేసింది. దీనితో రాజ్యాంగ సవరణ అవసరం అని మాదిగ పోరాట ఉద్యమం దీన్ని చేయించేలా చేయాలని రాష్ట్ర  ప్రభుత్వం మీద తీవ్రమై ఒత్తిడి చేస్తూ ఉంది. అంతే కాదు ఈ ఉద్యమం ఇంకా సాగుతూనే ఉంది.
ఈ సాంఘిక నేపథ్యంలో మాదిగలు తమ సామాజిక అస్తిత్వాన్ని తాము సాధించుకునే దిశగా ఉద్యమం చేసే సందర్భంలో వారిదైన సాహిత్యం కూడా సృజించుకున్నారు. అంతే కాదు. మాల మాదిగల మధ్య వృత్తి పరంగా సాంఘిక సంబంధాల పరంగా సాంస్కృతిక పరంగా చాలా వైరుద్ధ్యాలు చాలా శతాబ్దాలనుండి ఉన్నట్లుగా పరిశీలనలో తెలుస్తుంది. తెలుగులో ఒక పలుకుబడి ఉంది అన్నాదమ్ములు తగాదా పెట్టుకొని విడిపోయేటప్పుడు "వాడు మాల నేను మాదిగ ఇక వాడికి నాకు ఏ సంబంధం లేదు". అని అంటూండటం ఉంది. అన్నా తమ్ముళ్ల వంటి మాల మాదిగల మధ్యన వైరాలు ఉన్నాయని ఇంకా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జాషువా కూడా ఈ ప్రస్తావన చేసాడు. గబ్బిలం రెండవ భాగంలో ప్రత్యేకించి చెప్పాడు. ఇద్దరూ కలిసి పని చేయవలసి వచ్చింది అని కూడా చెప్పాడు. కాని ఈ సాంఘిక వైరుద్ధ్యాలు పెరుగుతూ వచ్చాయే కాని తగ్గలేదు. రాజకీయ రంగంలో కూడా పార్టీలు తాము ఇచ్చే సీట్లలో కానీ లేదా ప్రభుత్వ పదవులలో కాని ఈ వైరుద్ధ్యం ప్రభావం కనిపిస్తూ ఉంది. పార్టీలు ప్రభుత్వం ఈ వైరుద్ధ్యాల మధ్య ఒక సమతూకం ఉండేలా చూస్తున్నాయి. కాని రిజర్వేషన్ కారణంగా ఇరు కులాల మధ్య బాగా అగాధం ఏర్పడింది. ఈ పరిస్థితి కవులలో కవితలలో పూర్తిగా ప్రతిబింబించింది. ఇద్దరి మధ్యనా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి కూడా ఒక దశలో ఏర్పడింది. కాని అక్కడక్కడ సమన్యయ ధోరణులు బాగా కనపడ్డాయి. ఇటీవల కత్తి పద్మారావు ఒక దినపత్రికలో ఒక సాహిత్య వ్యాసం రాస్తూ తాను జాషువ నుండి చాలా స్ఫూర్తి పొందానని రాసాడు. ఇలా సమన్వయం చేసే వారు కొందరు సాహిత్య కారులు ఇరు వర్గాల నుండి ఉన్నా ఈ వైరుద్ధ్యం బాగా వైపుల్యం చెందింది. చివరికి ప్రభుత్వం జాషువా పేరుమీద ఒక సాహిత్య పీఠాన్ని పెట్టగానే మాల వర్గంనుండి మరొక డిమాండ్ వచ్చింది. జాషువా అంత స్థాయి మహాకవి ఉండగా దళితులందరికీ అతను ప్రాతినిధ్యంవహిస్తాడనే దృక్పథం మాల వర్గం అటుంచింది వారి వర్గం నుండి కూడా ఒక కవి పేరుతో పీఠం ఏర్పాటు కావాలనే కోరిక బలంగా వినిపించిన కారణంగా ప్రభుత్వం బోయి భీమన్న పేరుతో మరొక పీఠాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా కనిపించే సామాజిక వైరుద్ధ్యాలు దళిత సాహిత్యంలో తిరిగి మాల మాదిగ కవిత్వం అనే వింగడింపులకు కారణం అయింది.
మాదిగ కవులు చాలా కాలంనుండే కవిత్వం రాస్తున్నారు. జాషువా మాదిగ వర్గంలో శిఖర ప్రాయమైనకవి. ఈయన 1919 ప్రాంతంనుండే కవిత్వాన్ని వెలయించడం ప్రారంభించాడు. కాని 1893 లో ఆంధ్రక్రైస్తవ గీతాలు అనే పుస్తకం వెలువడింది. దీనిలో కొందరు మాదిగ కవులు పాటలు రాసారు. ఆధునిక కాలంలో ఇదే తొలి మాదిగ కవిత్వంగా భావించాలి. (కృపాకర్ మాదిగ ఈ సమాచారాన్ని అందించాడు). కాని మాదిగ కవిత్వాన్ని ఈ వ్యాసంలో ఆ  కాలంనుండి పరీశీలించడం లేదు. 1985 తర్వాత మాదిగల సాంఘిక అస్తిత్వ ఉద్యమాలు వచ్చిన తర్వాతనే మాదిగ కవిత్వం అనే ప్రత్యేకమైన వింగడింపు ఏర్పడిన కారణంగా ఆనాటి నుండి ఉన్న కవితలనే ఇక్కడ పరిశీలిస్తున్నాను. ఆధునిక కవులలో కనీసం 60 మంది మాదిగ వర్గానికి చెందిన కవులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. పొనుగోటి కృపాకర్ మాదిగ ఒక మంచి ప్రయత్నం చేసి మాదిగ కవులు చేసిన ఆధునిక కవితలను ఒక సంకలనంగా కూర్చాడు. కైతునకల దండెం అని దీనికి పేరు పెట్టాడు. ఇందులో 91 కవుల కవితలు ఉన్నాయి. ఇందులో దళితేతరులైన ఇతర కులాలకు చెందిన కవులు కూడా రాసిన కవితలున్నాయి. ఇది చాలామంచి ప్రయత్నం. అంతే కాదు. మాదిగలకున్న ప్రత్యేకమైన చారిత్రికాంశాలను సాంస్కృతిక నేపధ్యాన్ని మాలలతో వారికున్న సంబంధాన్ని గురించి వివరిస్తూ  ఈ కవితలను చదవడానికి ఒక నేపథ్యాన్ని సృష్టించాడు కృపాకర్. పై చెప్పిన ఈ కాలంలో వచ్చిన ప్రముఖమైన కవితలనీ అదీ మాదిగ వాదాన్ని వినిపించే కవితల్ని ఇక్కడ కొన్నింటిని పరిశీలిస్తాను. అయ్యయ్యో దమ్మక్కా అనే కవితా సంకలనంలో జూపాక సుభద్ర పుస్తకం పేరుతోనే ఉన్న కవితలో మాదిగల సాంఘిక జీవితాన్ని వర్ణించింది. తెలంగాణాలో అమాయకమైన స్త్రీని సర్వసాధారణంగా ఓసి దమ్మక్కా అని అంటారు. ఇతర ప్రాంతాలలో దద్దమ్మా అనే అర్థంలో దీన్నివాడతారు. ఉత్త అమాయకురాలైతివి కదా అనే అర్థంలో దీన్ని  వాడతారు. ఈ అయ్యయ్యో దమ్మక్కా అనే కవితలో ఒక చోట "మల్లన్న తోలమ్మ/ మొకానికి గింత సున్నం బూడిద రాసియ్యంగనే/ దప్పుగ తెప్పుగ/, తొండంగ, సబ్బండగ/ నన్ను జూడు నా అందం జూడని/ గీ జబ్బురు తోలమ్మ తొంబై రకాలుగా వన్నెలు బడ్తదా". ఇక్కడ మాదిగ వృత్తి నేపథ్యాన్ని వర్ణిస్తూ ఉంది  కవయిత్రి. మాదిగల వృత్తి చెప్పులు కుట్టడం దానికి వారు తోలు ఊనుతారు. తోలుకు సున్నం బూడిద రాస్తారు. ఉప్పుకూడా రాస్తారు. తర్వాత లందలో తంగేడు చెక్కలో నానబెడతారు. ఇంకా చాలా పని చేసి తోలును ఊనుతారు. అంటే టానింగ్ చేస్తారు. తర్వాతనే ఇది చెప్పులకు కాని డప్పుకు కాని లేదా మోట బొక్కెన తొండానికి కాని ఇతర వ్యవసాయ అవసరాలకు కాని వినియోగిస్తారు. ఇంకా దీని కష్టాలు వర్ణిస్తుంది సుభద్ర ఇక్కడ. "అయ్యయ్యో దమ్మక్కా... / లందను పొందిచ్చుడంటే/ గుబండ కుదిచ్చుకొని/బొంద దువ్వినట్లు గాదు/ నరం తోలు నానీకి/ కోసెడు బాటలు అరిగే నీళ్ళు మొయ్యాలె/ కుక్క నక్క కాకి గద్ద కండ్ల పడకుంట/ కూడు మర్సి కావలుండాలె/లుక్కలుక్క పురుగులు/ జిబ్బజిబ్బ ఈగలు/ గప్ప గప్ప గబ్బులు/ కడుపుల పేగుల్ని కత్తోలె మెలిబెట్టి/ కండ్లు బెయిని తిప్పి అడ్డం బెడేసినా తప్పని తలరాతయింది అయ్యయ్యో దమ్మక్కా". ఇంకా ఇలా సాగుతుంది కవిత. దీనిలో స్పష్టంగా మాదిగల వృత్తిలో ఉన్న భీకరమైన కష్టాన్ని వర్ణించింది. దీనికి భిన్నంగా మాలల జీవితం ఉంటుంది. వారికి చర్మకార వృత్తి లేనేలేదు. అయితే వ్యవసాయం లేదా నేత. లేదా ఇతర చాలా వృత్తులు. కూలీ జీవితం. కాని ఈ మాదిగ జీవితంలోని కష్టాన్ని అనుభవించిన వారుతప్ప దీన్ని తెలుసుకొని రాయలేరు. ఇదే వృత్తిని ఎండ్లూరి సుధాకర్ అత్యంత ప్రతిభావంతంగా రచించాడు. "ఈ సప్త సముద్రాల తోలు ఒలిచి/ఆకాశానికోమేకు/పాతాళానికోమేకు/ సప్త సముద్రాల మీద/ చర్మాన్ని నానబెట్టిన నీకు/ ఆసూర్య చంద్రులు / చెరో చెప్పు కావలసిందే/ఆకలితోనో/అవమానంతోనో/ తలవంచుకొని నీ చర్మపు జోళ్ళు/ కుట్టుకుంటున్న తాతా/ ఈ ప్రపంచం/ ఉంగటంగా మారి నీ ముంగాలి బొట్టినేలిని/ ముద్దు పెట్టుకోవాలని/ కలలు కంటున్నాను". మాదిగ వృత్తిని నేపథ్యంగా వర్ణంచిన ఈ కవితలో జాంబవుని ప్రసక్తి, జాంబపురాణ ప్రసక్తి ఉంది. విశ్వమంత నేపథ్యం ఉందీ కవితలో. జాంబవుడు అవలీలగా సప్త సముద్రాలను దాటేవాడని పురాకథ ఉంది. రామాయణంలో జాంబవునే మొదట లంకకు పోయి రమ్మని చెప్పగా. పూర్వం నాకు మోకాలి లో ఒక పర్వతం విరిగింది తానిప్పుడు ఎగరలేను హనుమంతుడు దానికి సరైన వాడని చెబుతాడు. ప్రపంచ మొత్తం ఉంగటంగా మారి నీ పాదాలను ముద్దుపెట్టుకోవాలి అనడం అత్యంత ప్రతిభా వంతమైన కవితాభివ్యక్తి అదే సమయంలో మాదిగల కుల అస్తిత్వంపైన మంచివాదాన్ని వినిపిస్తుంది ఈ కవిత విశ్వం మొత్తాన్ని నేపథ్యంగా చేసిన ఈ కవితాప్రతిభా శక్తిని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఎండ్లూరి సుధాకర్ ఇటీవలే వెలయించిన గోసంగి కావ్యం కూడా కవితాప్రతిభకు పండిన చేను. మాదిగలలో ఒక ఉపకులమైన గోసంగి కులం గురించి ప్రత్యేకంగా రాసిన దీర్ఘ కవిత ఇది. ఇందులో వారి ప్రత్యేక సాంఘిక అస్తిత్వాన్ని గురించి మాట్లాడాడు. మొత్తం దళిత కవులలోనే ఎండ్లూరిసుధాకర్ ఆధునిక కాలంలో ఉన్న అత్యంత ప్రతిభావంతమైన సృజనశీలియైన కవి అని చెప్పవచ్చు. ఈ స్థాయిలో రాసే మరొక దళిత కవిని ఇంకా వెదక వలసే ఉంది. మాదిగలలోనే కళాకారులు కళారూపాలు చాలా ఉన్నాయి. బైండ్లకథ ఆసాది కథ డక్కలి పటంకథ, చిందుయక్షగానం, గోసంగి వేషం, ఇవన్నీ మాదిగల ఉపకులాల కళారూపాలే. వారు జన్మతః కళాకారులు, మంచిగాయకులు ఈ స్థితిని వర్ణించే కవిత నాగప్పగారి సుందరరాజు రాసిన కవిత పెద్దింటి పిల్ల దీనిలో గ్రామంలోని అన్ని కులాల ఆడపిల్లలు పెద్దమనిషి అయినప్పుడు పోయి పాట పాడిన మాదిగ పిల్ల తాను పెద్దమనిషి అయితే ఒక్క కులం వారు కూడా రానందుకు హృదయం ద్రవించేలా బాధపడుతుంది. చివరికి మా మాలోళ్లు కూడా మా కంటే ఎక్కువంట వాళ్ళ పిల్ల కూడా నా దగ్గరికి రాలేదు. వాళ్ళు కూడా మా కంటే పెద్దోళ్ళంట అని అనుకుని నా పాట నేనే పాడుకుంటా నా పాట నేనే పాడుకుంటా అని ఈ కవిత ముగుస్తుంది. మాదిగల జీవితపు మరోకోణాన్ని ఆవిష్కరించింది ఈ కవిత. మాదిగలు చనిపోయిన పశువులను తీసుకుపోవడం దాని మాంసాన్ని విభజించడం పంచుకోవడం తినడం గురించి వర్ణించిన కవితలున్నాయి. మాదిగల సాంస్కృతిక చిహ్నాలైన డప్పును చెప్పులుకుట్టే ఆరె చిహ్నాన్ని వారి ఇతర సంగీత  చిహ్నాలను మాలలు హైజాక్ చేసి వారి కులసంబంధ విషయాలలో మాలలు వాడుకుంటున్నారని బాధను వ్యక్తం చేసిన కవితలున్నాయి. సువార్తమ్మ అనే కవయిత్రి (బహుశా మారుపేరేమో) తెరతీయగరాదా అనే కవితలో మాల ప్రముఖులు తమ మాదిగలకు చేసిన అన్యాయాలను రాజకీయాలను ఎండగడుతుంది. మాల ప్రముఖుల పేర్లను కవితలలో నర్మ గర్భంగా ఇరికించి వారి దమననీతిని దుయ్యబడుతుంది ఈ కవిత. దున్న కూర అనే కవితలో మాదిగల ఆహార సంస్కృతిని గురించి వర్ణించడం ఉంది. మాదిగ సాహిత్యాన్ని సృష్టించడమే కాదు దానికి మార్గదర్శనం చేస్తూ సాహిత్య కృషి  చేస్తున్న మరికొందరు ప్రముఖులలో దార్ల వెంకటేశ్వరరావు ఒకడు. కొలకలూరి ఆశాజ్యోతి, ఎజ్రా శాస్త్రి లాబన్ బాబు. ఇంకా చాలా మంది కవులు దాదాపు అరవై మందికి పైగా మాదిగ కవులు సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. అయితే ఉద్యమ స్ఫూర్తి సాంఘిక ఆవేశంతో వచ్చిన ఈ కవితలలో కవిత శక్తి చాలా పలచబడిన అసలు లేని కవితలు కూడా ఉన్నాయి. కేవల వచన ప్రాయమైన కవితలూ వచ్చాయి. వాటిలో ఉన్నది మాదిగ ఉద్యమ స్పూర్తే.  మాదిగ కవిత్వాన్ని ఒక చోట సంకలించిన సంకలనానికి కైతునకల దండెం అనే పేరు పెట్టడం కూడా చాలా ప్రయోగాత్మకంగా ఉంది. తెలంగాణాలో కవిత్వం రాసే వాడిని కైతకాలోడు అంటారు. కవిత్వాన్ని కైతకం అంటారు. కై  అన్నది దీనికి  పొట్టి రూపం. దండెం  అంటే ఇంటిలోపల బట్టలు వేసుకోవడానికి గడను కాని పొడవాటి కర్రను కాని అడ్డంగా వేలాడదీసి కడతారు. దీన్ని తెలంగాణాలో దండెం అంటారు. అలాగే మాదిగలు మాంసం ముక్కల్ని ఇంటి బయట ఆరేసుకోవడానికి కట్టిన తాడు కాని గడను కాని దండెం అని అంటారు. ఈ ముక్కల్నే సియ్యలు అని అంటారు. సియ్యలు ఆర బెట్టేది దండెం. కవితలను కైతునకలు అని అచ్చ తెలుగు మాట వాడి  ఈ పేరు పెట్టడంలో కూడా మాదిగల జీవన రీతి తెలియ వస్తూ ఉంది. దళిత కవిత్వంలో మరొక పాయ ఉందని దీన్ని ప్రత్యేకంగా చూడాలని దళిత కవిత్వాన్ని లేదా సాహిత్యాన్ని గుండుగుత్తగా చూడడం వల్ల సరైన ఫలితం ఉండదని సాహిత్య విమర్శలో గ్రహించాలి. మాదిగ కవిత్వం, సాహిత్యం ప్రత్యేక మార్గాన్ని వేసుకుంది. ఇది వారి అస్తిత్వ మార్గం దీన్ని ఇలా చూస్తేనే సామాజిక న్యాయం మరింతగా జరుగుతుంది.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.
9440493604

1 comment:

Nrahamthulla said...

కైతకం,సియ్యలు,తునకలు,లాంటి మూలపదాలను చక్కగా గుర్తు చేశారు.తెలుగు నిఘంటువుల్లోకి ఇలాంటి ఎన్నో పదాలు రావాలి.ఒక తెలుగు సామెత గుర్తొస్తోందిః
"చదువు సందె లేకుండా మాదిగ వెదవ్వి అవుతున్నావు అన్నది విని,ఆరె అట్ట లేకుండా బేపన వెదవ్వి అవుతున్నావన్నాడట".సామెతలలో కొంతవరకు మన పూర్వీకులు వాడిన పదాలు దొరుకుతున్నాయి.