Wednesday, July 11, 2012

Article on Telugu Desham at Cross Roads


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం 9440493604

తెలుగు దేశం (19822014) ఒక అంతశ్శోధనం
ఉపఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ మునుపు ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితులను చూస్తూ ఉంది.  ఎన్నడూ లేని విధంగా ఎన్నికలలో నిలబడిన అన్ని స్థానాలలో ఓడిపోయి చేదు అనుభవాన్ని మూటకట్టుకుంది. అంతే కాదు తెలుగు దేశం పార్టీ నేడు ఒక సంక్లిష్ట పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ గడ్డుకాలాన్ని చవి చూస్తూ ఉంది. ఈ పరిస్థితిని చారిత్రక నేపథ్యంలో విశ్లేషించడమే ఇక్కడి ఉద్దేశం.
 ప్రజా స్వామ్య ప్రక్రియ భారత దేశంలో ఒక ప్రత్యేకమైన రూపం పొందింది. 65 సంవత్సరాల చరిత్రలో మన ప్రజాస్వామ్యం నానాటికి తీసికట్టు నాగంబొట్లు అన్నట్లుందే కాని దాని మౌలిక ప్రజాస్వామిక విలువలను పెంచుకోకపోగా భారత దేశంలో అధికారం అంటే మధ్య యుగాలనాటి రాచరిక వ్యవస్థ క్రమంగా నయారూపంలోనికి తీసుకు వచ్చి నయా రూలింగ్ డైనాస్టీస్ ను ఏర్పాటు చేస్తూంది. మన మార్కు ప్రజాస్వామ్యంలో అంటే బహుపార్టీల విధానంలో అధికారంలో ఉన్న పార్టీలు భ్రష్టు పట్టి ఒక రకమైన స్తబ్ధతకు దారితీయడం మనం గమనించాం. 1975 లో వచ్చిన ఎమర్జెన్సీ నాటి చీకటి రోజుల తర్వాత జనతా పార్టీ అధికారంలోనికి వచ్చే నాటి రోజులలో అఖిలభారత స్థాయిలో ఈ పరిస్థితి వచ్చింది. లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ చేసిన ఉద్యమం దీని వెనుక ఉంది. ఈస్థితిలో ప్రజలు తీవ్రమైన మార్పు కోరుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో 1979 – 82 మధ్య వచ్చింది. అప్పటి కాంగ్రెస్ పరిస్థితి  చాలా దారుణంగా తయారైంది. అధిష్ఠానం చేతిలో కీలుబొ మ్మలు ఇక్కడ రాష్ట్రంలో పార్టీలో చాలా ఎక్కువ కావడం గిల్లికజ్జాలు పెట్టుకోవటం  ఏడాదికొక ముఖ్యమంత్రి మారడం, రాష్ట్ర నాయకులకు నాయకత్వానికి ఒక స్వతంత్ర వ్యక్తిత్వం లేదు అనే స్థితి ఏర్పడింది,  అభివృద్ధి నీరుగారి పోయి ప్రజలు పూర్తిగా విసిగి పోయి ఒక శూన్యం ఏర్పడింది. దీన్ని శూన్యం అనడం కన్నా ఒక రాజకీయ దివాళా స్థితి అని అనవచ్చు. దీన్ని నింపే చారిత్రక అవసరంగా ఆనాడు మార్చి 29, 1982న తెలుగు దేశం పార్టీ ఏర్పడింది. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు బహుముఖీన ప్రతిభతో తెలుగు చిత్ర సీమను ఏలిన రారాజు ఎన్టీ రామారావు అంతటి మహానటుడు రాజకీయాలలోనికి రావడం పార్టీ పెట్టడం అనేవి తెలుగు వారికి నూతన చరిత్ర. సినిమా నటుడు ఎం.జి ఆర్ అప్పటికే రాజకీయాలలో విశేష ఆదరణ పొంది ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం అక్కడ ద్రావిడ కఝగం, ద్రావిడ మున్నీట్ర కఝగం, తర్వాత ఎం.జి. ఆర్ పార్టీ అఖిల భారత ద్రావిడ మున్నీట్ర కఝగం ప్రజలలో కలిగించిన స్ఫూర్తి, సాధించిన విజయాలు ఎన్టీఆర్ కి వెనుక స్ఫూర్తిగా నిలిచాయి. పార్టీ పేరు పెట్టడం ప్రచారం చేయడం ఈ శైలి అంతా అక్కడ నుండి తెచ్చుకున్నవే. తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అనే నినాదాలు ప్రజల్లో తారక మంత్రంలా మోగినాయి. అద్దాల మేడల్లో, దంతభవనాలలో ప్రజల కలలో మాత్రమే నివసించే ఎన్టీ ఆర్ ప్రజల మధ్యకు రావడం ఒక పెద్ద సంచలనం. అతని ఆకృతి వాచికం ప్రజల గుండెల్లో ఎల్లప్పడూ మారుమోగుతుంటాయా. అలాంటిది అతన్ని బహిరంగంగా బయట చూడడం అతని గొంతును సజీవంగా వినడం. ప్రజలకు సరికొత్త అనుభూతి. దేశ రాజకీయాలలో ఒక చైతన్య రథం అనే భావన అలా కూడా ప్రచారం చేయవచ్చు అనే రీతి దేశ రాజకీయాలలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలో పార్టీని అఖండ విజయం వైపు నడిపాడు. ప్రమాణ స్వీకారాన్ని అప్పటిదాకా జరిగే రాజభవనాలలో కాక ప్రజల మధ్య చేయడం మరొక సంచలనం. ఆయన చేసినవి అన్నీ వినూత్న ప్రయోగాలే సంచలనాలే. ఇవి రాజకీయాలకు కొత్త ఒరవడి తెచ్చాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో 204 సీట్లు సంపాదించి అనూహ్యమైన అఖండమైన విజయాన్ని పార్టీ సాధించింది. తెలుగు వారు ఆంధ్రప్రదేశ్ అనే మాటలు అంతర్జాతీయ మీడియాలోనికి వెళ్ళాయి. బిబిసి ప్రత్యేక వార్తాకథనాలు ప్రకటించింది.

ఎన్టీ ఆర్ ఏ ముహుర్తాన పార్టీ పెట్టాడో (ఇది పలుకుబడి, వ్యాసకర్తకు ముహుర్తాల మీద నమ్మకం లేదు) కాని ఆయన ఎదుర్కున్నవి సామాన్యమైన సమస్యలు కావు చాలా తీవ్రమైన ఆటుపోట్లు. అంత అఖండమైన మెజార్టీ సాధించి అధికారంలో ఉన్న పార్టీ ఐదు సంవత్సరాలు అవలీలగా పాలించి మళ్లీ విజయం దిశగా వెళ్లవలసి ఉంది. కాని అలా జరగలేదు. ఎన్టీఆర్ స్వభావతః రాజకీయ నాయకుడు కాడు. అతను ఆవేశ పూరితుడైన కళాకారుడు. దీనివల్ల ఆయన ప్రజల వద్దకు పోగలిగాడు ఓట్లు సంపాదించాడు. సీట్లు సంపాదించాడు, ప్రభుత్వాన్ని సాధించాడు కాని రాజకీయాలు ఆడలేకపోయాడు. అధికారాన్ని సాఫీగా నిలుపుకోలేకపోయాడు. అధికారానికి వచ్చిన సంవత్సరానికే 1984 ఆగస్టులో నాదెండ్లభాస్కరరావు అతనికి సన్నిహితంగా ఉన్న నాయకుడే పార్టీకి వెన్నుపోటు పొడిచి రామారావు ప్రభుత్వాన్ని కూలదోసాడు. ఇందిరాగాంధి కేంద్రంలో ప్రధానిగా అధినాయకత్వం ఉండడం. ఇక్కడ కాంగ్రెస్ తాబేదారు గవర్నర్ గా ఉండడంతో అల్పసంఖ్యాక ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం నాదెండ్ల భాస్కరరావుకు వచ్చింది. అమెరికా నుండి తిరిగి వచ్చిన ఎన్టీ ఆర్ కి వెంటనే ఉద్యమం చేయవలసి వచ్చింది. ఎమ్మెల్యేలని అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్ సమక్షంలో పరేడ్ చేయించి మెజారిటీ తన వద్ద ఉందని రుజువు చేయడం ఆనాడు అదొక కొత్త చరిత్ర. ఇందిరాగాంధికి ఎన్టీ ఆర్ ని తిరిగి అధికారంలోనికి తీసుకు రాక తప్పదు అనే ఇంటిలిజన్స్ నివేదికలు చాలా బలంగా వెళ్లాయి. దీనితో గవర్నర్ ని మార్చి రామ్ లాల్ స్థానంలో శంకర్ దయాళ్ శర్మను తీసుకురావడం ఎన్టీఆర్ కి ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం కల్పించడం వడివడిగా జరిగాయి. 31 రోజులు అధికారంలో ఉన్న నాదెండ్ల నెలరాజు అని కొత్త పేరు సంపాదించాడు. తిరిగి 1984లో సాధారణ ఎన్నికలు జరిగే సందర్భంలో ప్రభుత్వాన్ని రద్దు చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లాడు ఎన్టీ ఆర్. ఇది సాహసోపేతమైన చర్య అని అందరూ అప్పుడు కీర్తించారు. 1984 ఏడవ అసెంబ్లీలో తెలుగు దేశం 205  స్థానాలు గెలిచి తిరిగి చరిత్ర సృష్టించింది.
ఎన్టీఆర్ ప్రజాపాలనలోను ప్రజాసంక్షేమంలోను ఎన్నో కీలకమైన విజయాలు సాధించాడు. అన్నింటికంటే చెప్పవలసినవి పాలనా సంస్కరణలు. అడ్మినిస్ట్రేటివి రిఫార్మ్ అనేవి ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం నిజాంల పాలనలో జరిగాయి. తర్వాత జరగలేదని చరిత్ర చెబుతూంది. ఎన్టీ ఆర్ తాలూకాల వ్యవస్థను తొలగించి మండలాల వ్యవస్థని తెచ్చాడు. ప్రజలు ఆనాటి నుండి ఈనాటి వరకూ దీని సత్ఫలితాలను ఆనందిస్తున్నారు. తాలూకా వ్యవస్థలో అతి పెద్ద పరిమాణంలో తాలూకాలు ఉండడం వల్ల ప్రజలు పాలనా పరంగా సంక్షేమ కార్యక్రమాల అమలు పరంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కునే స్థితిలో మండలాల ఏర్పాటు ప్రజలకు వరంగా మారింది. దీని కన్నా ముఖ్యమైంది గ్రామాధికారుల వ్యవస్థను తొలగించడం. పటేల్, కరణం పద్ధతుల్ని తొలగించడం గ్రామస్థాయిలో ప్రజలకు మరొక వరంగా మారింది. రాచరిక వ్యవస్థ చిహ్నంగా మిగిలి ఈ దుష్ట వ్యవస్థని తొలగించే ధైర్యం అంతకు ముందెవరూ చేయలేదు. ఈ రెండు పాలనా సంస్కరణలు ఆనాటి తెలుగు దేశం వరంగా ఈనాటికీ ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. రెండు రూపాయలకు కిలోబియ్యం వంటి ఎన్నో విజయాలతో పాటు ఎన్టీ ఆర్ కొన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకొని ప్రజాగ్రహానికి కూడా గురయ్యాడు. ఉద్యోగుల వయోపరిమితి తగ్గించడం ఇందులో ఒకటి. తిరిగి కాంగ్రెస్ అధికారంలోనికి రావడానికి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఇదే కారణం అయింది. 1989 ఎన్నికల్లో తెలుగు దేశం 78 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైనా  తిరిగి 1994లో వచ్చిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించి మునుపెన్నడూ లేని విధంగా 218 స్థానాలు సాధించి మళ్ళీ చరిత్ర సృష్టించింది. ఇన్ని స్థానాల్ని ఏ పార్టీ ఇంతవరకు సాధించలేదు.

ఆ తర్వాత  పార్టీకి అతి గడ్డు సమస్య లక్ష్మీ పార్వతిరూపంలో ఎదురైంది. ఎన్టీ ఆర్ జీవితంలోనికి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి రాజకీయ పాత్ర పోషించి రాజ్యాంగేతర శక్తిగా మారింది. ముఖ్యమంత్రి ఎన్టీ ఆర్ అయితే పాలించేది లక్ష్మీ పార్వతి ఆమె చుట్టూ చేరిన వందిమాగధ గణం అనే స్థితి ఏర్పడింది.  ఎన్టీ ఆర్ కుటుంబసభ్యులు ఏకమై తమ తండ్రిని తమ  పార్టీని రక్షించుకోవాలనుకున్నారు. చంద్రబాబు నాయకుడుగా ఆయన కుటుంబ సభ్యులు అందరు చేసిన ప్రయత్నాల కారణంగా కుటుంబ సభ్యుల చేతనే ఎన్టీ ఆర్ అధికారాన్ని కోల్పోయి అతని అల్లుడైన చంద్రబాబే అగస్టు సంక్షోభంలో ముఖ్యమంత్రిగా అవతరించాడు. ప్రజల్లో దీనికి మిశ్రమ స్పందన వచ్చినా ప్రజలు చంద్రబాబును పార్టీ నాయకుడుగా వారసుడుగా అంగీకరించారు. తర్వాతి తర్వాతి ఎన్నికల్లో ఇదే రుజువు అయింది. 1994లో 218 స్థానాలలో అఖండ విజయం సాధించిన ఎన్టీఆర్ 1995లో నే అధికారాన్ని కోల్పోవడం అతను నిజమైన రాజకీయ నాయకుడు కాలేకపోయాడని రుజువు చేసింది. మంచి పరిపాలన అందించడం చేయగలిగాడు కాని రాజకీయాలు నడపలేకపోయాడు.
ఈ స్థాయి తర్వాతి నుండే తెలుగు దేశం పార్టీ ఎన్టీ ఆర్ కుటుంబంతో సంబంధాలు దోబూచులు మొదలయ్యాయి. ప్రభుత్వాన్ని లక్ష్మీ పార్వతి కబంధ హస్తాలలోనుండి తప్పించడానికి చంద్రబాబుకు వెనుక ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ నిలిచారు. తర్వాత 1995 నుండి 2004 నాలుగు వరకు చంద్రబాబు నిరాఘాటంగా పరిపాలించి కొత్త ఒరవడి సృష్టించాడు. అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నంత సేపు రాజకీయాలు మాట్లాడకపోవడం. ముఖ్యమంత్రి పదవిని పరిపాలించి ఒక సిఇఓ లాగా మార్చిన మార్కును సాధించాడు బాబు. కాని ఎన్టీ ఆర్ కుటుంబ సభ్యలనుండి చాలా ఆటుపోట్లను ఎదుర్కోవాల్సివచ్చింది. హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, ఇలా వారి కుటుంబ సభ్యులను ఎవరినీ అధికారంలోనికి పదవులలోనికి రానివ్వక పోవడం చంద్రబాబుపై వారిలో తీవ్రమైన అసంతృప్తికి దారితీసింది. మేము అతని వెనుక ఉండి అధికారంలోనికి తెస్తే అతను అధికారంలోనికి వచ్చి మమ్మల్ని దూరంగా నెట్టాడు అనే భావం వారిలో వచ్చింది. విసిగి పోయిన దగ్గుబాటి వేంకటేశ్వరరావు ముందు బి.జె.పిలో చేరాడు. తర్వాత చివరికి కాంగ్రెస్ వాదిగా అతను పురందేశ్వరి మారవలసి వచ్చింది. కాంగ్రెస్ మీద తన తండ్రి ఎన్టీఆర్ అలుపెరుగని పోరాటం చేసాడన్న విషయాన్ని కూడా పురందేశ్వరి మర్చిపోయేలా చేసింది వారికి అవసరమైన రాజకీయ బలం అధికార వాంఛ. ఇక హరికృష్ణ సొంత పార్టీ యే పెట్టుకున్నాడు. అన్నా డిం ఎంకె లాగా అన్న తెలుగుదేశం అని పార్టీ పెట్టాడు. కాని పూర్తిగా విఫలమై తిరిగి చంద్రబాబు వద్దకే చేరి పార్టీలో ప్రజలలో బాబుకు ఉన్న పట్టును అంగీకరించవలసి వచ్చింది. ఇక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడి ఒక్క సీటుకూడా గెలుచుకోలేకపోయింది. ఏతావాతా ఎన్టీ ఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీకి అసలైన వారసుడు చంద్రబాబుగా దానికి ఇప్పటిదాకా అధ్యక్షుడుగా బాబు ప్రజాంగీకారం పొందాడు, స్థిరపడిపోయాడు.
కాని ఎన్టీ ఆర్ కుటుంబ సభ్యులతో ఇతని సంబంధాలు అటు ఇటు, ఇటు అటు చెదిరి పోతూనే వచ్చాయి. హరికృష్ణకు మిగతా వారికి అధికార వాంఛ అలా తీరకుండానే వచ్చింది. పార్టీ పెద్దలు చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలే ఉన్నాయి అనే సన్నాయి నొక్కులు నొక్కుతూ ప్రజల మధ్య చెప్పుకునే స్థితి అప్పుడప్పుడూ వస్తూనే ఉంది. రాజుల కాలంలో రాజ్యాల మధ్య సత్సంబంధాలు ఏర్పడడానికి శత్రువుల పిల్లల్ని వివాహం చేసుకునే వారని చదివాం. బాలకృష్ణ తన కూతురిని చంద్రబాబు కొడుకు లోకేష్ కు ఇవ్వడంతో కుటుంబసంబంధాలలో కొత్త రాజకీయ కోణం వచ్చింది. బాలకృష్ణ బాబుకు దూరంగా పోలేని పరిస్థితి వచ్చింది. ఇక పురందేశ్వరి ఎలాగూ దూరం అయింది. కాగా ఇక హరికృష్ణ ఒంటరిగా నిలబడ్డాడు. జూనియర్ ఎన్టీ ఆర్ కొత్త శక్తిగా రూపుదాల్చడం ప్రజాభిమానం చాలా విస్తృతంగా ఉన్న నటుడు కావడం ఎన్టీఆర్ ని ప్రజలు అతనిలో చూడడం అన్నవి తిరిగి కొత్త సంబంధాలకు దారితీసింది. ఈ ఇద్దరు తండ్రీ కొడుకులు బాబుకు దూరం అవుతారని కొత్త పార్టీ పెట్టవచ్చుననే సంకేతాలు అప్పుడప్పుడూ వెలువడుతూ రావడం. సయోధ్యలు కుదుర్చుకోవడం ఇలా తెగూతూ ముడిపడుతూ రావడం జరుగుతూ వచ్చింది. 2009 ఎన్నికల నాటికి చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు పూర్తిగా సయోధ్య కుదరడం జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యతో పాటు ఎన్నికల ప్రచారంలో వీర విహారం చేయడం. తెలుగు దేశం పార్టీకి ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల అండ పూర్తిగా ఉందనే సంకేతాలు పంపింది. హరికృష్ణ రాజ్యసభ సభ్యుడు కావడం దరిమిలా జరిగిన పరిణామం. అయినా ఈ సంబంధాలు ఇటీవల కూడా కొంత అపోహలకు అపార్థాలకు దారి తీసాయి. అనుమానాలు ఇంకా ఉన్నా సంబంధం స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే అది ఎన్టీ ఆర్ కుటుంబసభ్యులకు తప్పుడు సంకేతాలు పంపుతుంది. హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తో పార్టీ సంబంధాలు చెడి దీనివల్ల బెడిసి కొట్టవచ్చు. పార్టీ ఎన్టీ ఆర్ కుటుంబం నుండి చంద్రబాబు కుటుంబానికి శాశ్వతంగా పోతుందనే అర్థాలు వస్తాయి. దీనివల్ల పార్టీకి వచ్చే మేలు కన్నా కీడు ఎక్కువగా ఉంటుంది. పార్టీలో వీరవిధేయలు అధినాయకుడికి దగ్గర కావాలనుకునే వారు ఈ స్లోగన్లు తెస్తుంటారు. రాహుల్ ప్రధాని కావాలని వాదించిన రాజశేఖర్ చాలా బలవంతుడయ్యాడు. కాని  ఆ పార్టీ అప్పుడే అలా రాహుల్ ప్రధానిని చేసే ఆలోచన చేయక ఇప్పటి దాకా తొక్కి పట్టింది. ఈ స్థితి తెలుగు దేశానికి కూడా ఉంది. ఇక్కడే పార్టీ ఆచి తూచి వ్యవహరించక పోతే అది వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది.
ఈ పరిణామాలు చెప్పే సంకేతాలు ఏమంటే కేంద్రంలో నెహ్రూ కుటుంబంలాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీ స్థాయిలో ఎన్టీ ఆర్ కుటుంబం అలా  ఏర్పడి అధికార కేంద్రంగా మారింది. ఈ వారసత్వపు ధోరణి మన ప్రజాస్వామ్యానికి అడ్డు కాదని ఇది అవసరం అయితే లాభిస్తుందని మన రాజకీయాలలో రుజువు అయింది. దీనికి దూరంగా పార్టీని బలోపేతం చేయాలనుకునే చంద్రబాబు సంకల్పం గండిపడుతూనే వచ్చింది.
1999లో తెలుగు దేశం పరాజయం పొంది ఓడి పోయి 184 సీట్లకు పరిమితమై కాంగ్రెస్ కు అధికార పగ్గాలను అందించింది. దీని కారణాలను విశ్లేషించుకుంటే ప్రజలు మార్పు కోరుకున్నారనే మొదటి విషయమే కాక అప్పటి చంద్రబాబు పాలనా శైలి కూడా దీనికి కారణం అయింది. హైటెక్ ముఖ్య మంత్రి అని పేరు తెచ్చుకోవడం. రైతులు ఎన్నో కడగండ్లు పాలు కావడం అతి వృష్టి అనావృష్టి. రైతులలో నిస్సహాయ స్థితి కలిగి ప్రభుత్వ వ్యతిరేక ధోరణి పెరగడం. ఇవే కాక బాబు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరులో ప్రజల మధ్యకు పాలనలో ప్రజల ఎదురుగా ప్రభుత్వాధికారులను నిలిపి వారిని తీవ్రంగా విమర్శించి దోషులుగా నిలబెట్టిన తీరు ఆరోజున ప్రజలు చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు. కాని ఈ ధోరణి ప్రభుత్వాధికారులలో తీవ్రమైన అసంతృప్తిని అలజడిని వ్యతిరేకతను సృష్టించింది అనే విషయాన్ని పార్టి గుర్తించలేకపోయింది. 1999 ఎన్నికల్లో ఉద్యోగ వర్గం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసి వ్యతిరేకంగా ఓటు వెయ్యడానికి కారణం అయింది. రాజశేఖర్ రెడ్డి తిరుగులేని నాయకత్వం, పాదయాత్ర ఉచిత విద్యుత్తు వంటి రైతులకిచ్చిన వరాలు ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోనికి రాగలిగింది. అప్పటి నుండి చంద్రబాబుకు తన పాలనా లోపాలను సరిదిద్దుకునే అవకాశం కాని పార్టీ తన తప్పిదాలను సరిచేసుకునే అవకాశం కాని రాలేదు. 2004 లో జరిగిన ఎన్నికల్లో అతి దీనంగా 47 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది.
తెలంగాణా విషయం 1999 నాటికే గడ్డుసమస్యగా తెలుగు దేశానికి పరిణమించింది. కాంగ్రెస్ తెరాసతో పొత్తు పెట్టుకోవడం ఆనాటికే కాంగ్రెస్ లాభించింది. తెరాస ఉనికి వల్ల అది బలపడడం వల్ల కాంగ్రెస్ కు వచ్చిన నష్టం కన్నా తెలుగు దేశానికి వచ్చిన నష్టమే అధికం. చిరంజీవి కొత్త పార్టీ పెట్టడం అనే కొత్త పరిణామం కాంగ్రెస్ కే లాభించి తెలుగు దేశం అధికారంలోనికి వచ్చే అవకాశానికి గండి కొట్టింది. చిరంజీవి కాంగ్రెస్ ఓట్లు చీలుస్తాడనుకున్న దేశం అంచనా తలక్రిందులైంది. దరిమిలా చిరంజీవి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం వేరే విషయం.
2009 ఎన్నికల్లో తెలుగు దేశం పుంజుకొని 94 స్థానాలు దాకా పొంద గలిగినా తెలంగాణా సమస్య తెరాస ఉనికి పార్టీకి తీవ్రమైన సమస్యని సృష్టించింది. తెలంగాణా వాదాన్ని అక్కడి పార్టీల నైజాన్ని ఎదుర్కోవడంలో  తెలుగు దేశం అప్పటినుండి ఇప్పటికీ సరిగ్గా వ్యవహరించలేక పోతూ ఉంది. మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని చెప్పిందే కాని అంతకు ముందుకు పోలేకపోయింది. కాంగ్రెస్ ఆడే రాజకీయ క్రీడను ఎదుర్కోవడమే దీని వెనుక ఉన్న వ్యూహం. కాంగ్రెస్ మేము తెలంగాణాను కచ్చితంగా ఇస్తాం అని అధిష్ఠానం చెప్పలేక రెండు పడవల్లో కాళ్ళు పెట్టి కూర్చొంది. అలాంటప్పుడు మేము తెలంగాణా రాష్ట్రాన్ని కోరుతున్నామని ఎందుకు చెప్పాలి అది అధికారంలోఉన్న కాంగ్రెస్సే చెప్పాలి కదా అనేది తెలుగు దేశం వ్యూహం.
ఈ ఆలోచనను దేవేందర్ గౌడు రాజ్యసభలో చాలా స్పష్టంగా చెప్పాడు. "చిదరంబరం ఇతర పార్టీలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఏముంది. పార్లమెంటు లో వారు తీసుకునే నిర్ణయాలు అన్నీ మమ్మల్ని సంప్రదించి తీసుకుంటున్నారా. బిల్లులన్నీ తమ అభిప్రాయాన్ని తీసుకొని పెడుతున్నారా. ఇప్పుడు మా అభిప్రాయం దేనికి తెలంగాణా పూర్తిగా ఇస్తాం అని మీరే చెప్పండి". అని వాదించాడు. దీనితో తెలంగాణా బంతిని కాంగ్రెస్ కోర్టులోనికి తెలుగుదేశం బాగా బలంగా తోయగలిగింది. వ్యూహం బాగానే ఉంది కాని దీని వల్ల తెలంగాణా ప్రజలకు కాంగ్రెస్ ఎలా దూరం అవుతూ ఉందో తెలుగు దేశం కూడా అలాగే దూరం అవుతూ వస్తూ ఉంది. ఈ నిజాన్ని పార్టీ గ్రహించాలి. తెలుగు దేశం రైతు చైతన్య యాత్రలు నిర్వహించి ఇతర కారణాలతోను చంద్రబాబు తెలంగాణాలో విస్తృతంగా పర్యటించినప్పుడు పార్టీ పరిస్థితి నిజానికి బాగా మెరుగుపడింది. పార్టీ తెలంగాణా ఫోరంలో ఎర్రబెల్లి, మోత్కుపల్లి చేసే తెలంగాణా వాదం కెసిఆర్ పై విమర్శ చాలా గట్టిగానే మీడియాలో వినపడింది. తెలుగుదేశం నిజంగా తెలంగాణాని పూర్తిగా సమర్థిస్తే రెండు రాష్ట్రాలలోను తెలుగు దేశం గట్టిగా నిలబడి అధికార పగ్గాలను పట్టే అవకాశం కూడా ఉంటుంది. కాని ఇది చాలా ఖరీదైన రాజకీయ క్రీడగా మారే అవకాశం కూడా లేకపోలేదు. సీమాంధ్రలో ఉన్న తెలుగు దేశం నాయకత్వాన్ని మానసికంగా అందుకు తయారు చేసే స్థితిలో కాని ఒప్పించే స్థితిలో కాని పార్టీ  లేదు.
సీమాంధ్రలో వైకాపా కొత్తశక్తిగా అవతరించింది. నిన్న మొన్న జరిగిన ఉపఎన్నికలు తెలుగు దేశానికి ఎన్నడూ లేని చేదు అనుభవాన్ని అందించాయి. కాని వచ్చిన ఓట్ల సంఖ్య ఆశాజనకంగానే ఉంది. పార్టీ రెండో స్థానంలో ఉండడం గుడ్డిలో మెల్ల అన్నట్లుంది. కాగా తెలంగాణాలో తెరాసని నిలువరించి అధిక స్థానాలు పొందాలంటే తెలంగాణా విషయంలో కాంగ్రెస్ కన్నా తామే మేలు అనే సంకేతాన్ని ప్రజలకు అందించవలసి ఉంటుంది. తెరాస కన్నా తామే తెలంగాణా ప్రయోజనాలను కాపాడగలం అని కూడా అది ప్రజల్లో నమ్మకాన్ని కలిగించవలసి ఉంది. ఇలా కాని పక్షంలో పార్టీ పరిస్థితి ఏదో కొన్ని స్థానాలకు పరిమితం కావలసి ఉంటుంది.
ఇక పార్టీకి ఎన్టీ ఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న తాజా పరిస్థితి ఇంకా కొంత అనుమానపు సంకేతాలను అందిస్తూనే ఉంది. హరికృష్ణ జూనియర్ ఎన్టీ ఆర్ మాతోనే ఉన్నారని పదే పదే ప్రజలకు నమ్మించేలా చెప్పుకోవలసిన పరిస్థితే ఎదురవుతూ ఉంది. బాలకృష్ణ ప్రచారం చేస్తానని చెబుతున్నాడు అతనికి వేరే మార్గం కూడా లేదు. ఈ కుటుంబం ఎలా చివరికి పవర్ సెంటర్ గా తనకు ఎదురు శక్తిగా నిలబడుతుందా, లేక తమకు పూర్తిగా అనుకూలంగా ఉండి బాబు నాయకత్వానికి వెనుక ఉండడానికి సిద్ధపడుతుందా అనే విషయాన్ని కూడా నాయకత్వం ఇప్పుడు సరిచూసుకోవసలిన అవసరం ఉంది.
ఎన్టీ ఆర్ పార్టీ పెట్టిన దగ్గరనుండీ బి.సిలకు పార్టీలో పెద్ద పీట ఉంది. 50 శాతం స్థానాలకు మించి బి.సి ఎస్.సిలకు సీట్లు ఇచ్చింది పార్టీ. అంతే కాదు బాబు పాలనలో కూడా బి.సిలు కీలకమైన మంత్రి పదవులు పొందారు. కానీ ఇటీవల పార్టీ కొంత బి.సిలకు దూరం అవుతూ వచ్చినట్లు ఇటీవలి ఎన్నికల్లో తెలియవస్తూ ఉంది. 2014 నాటికి ఇప్పుడున్న నేపథ్యంలో పార్టీ వ్యూహరచన చేసుకోవలసి ఉంటుంది. బి.సి ఎస్.సి లకు సింహభాగాన్ని ఇచ్చి. ఎనబై శాతం సీట్లను ఈ రెండు వర్గాలకు పార్టీ ఇవ్వగలిగితే నిజమైన అధికారాన్ని బలహీన వర్గాలకు బదిలీ చేసే స్థిరసందేశాన్ని ఈ బి.సి ఎస్.సి వర్గాలకు ఇవ్వగలిగితే తిరిగి పార్టీ పూర్వ వైభవాన్ని పొందే అవకాశం ఉంది. 2014 నాటికి బి.సిలు పార్టీపెట్టి అది ఒక నిర్ణాయక శక్తిగా మారే అవకాశాలు ఎండమావుల్లా ఉన్న నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ మా పార్టీ లో బి.సి సెల్లు ఉంది దానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు వారికి కూడా పదవులు ఇస్తున్నాము అని చెప్పుకోవడం, కాక. మాదే బి.సిల పార్టీ బలహీన వర్గాలు అన్నింటికి కలిపి ఎనబై శాతం సీట్లు ఇస్తున్నాం ఇది బి.సిల పార్టీ అని ఒక ముద్రను పార్టీ ఇవ్వగలిగితే 2014 నాటికి ఇలాంటి వ్యూహరచన చేసుకోగలిగితో రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ పూర్వ స్థితిని పొందే అవకాశం ఉంది.  బి.సిలకు బలహీన వర్గాలకు ఎనబై శాతం సీట్లు ఇవ్వడం అన్నది వైకాపా చేయలేదు, కాంగ్రెస్ అసలే చేయలేదు. చేయగలిగేది ఒక తెలుగుదేశం పార్టీయే. మాది బి.సిల పార్టీ అనిపించుకోగలగిన అవకాశం దానికే ఉంది. ఈ వ్యూహం తెలుగుదేశానికి వరం అయ్యే అవకాశం ఉంది. సీమాంధ్రలో తెలుగు దేశం సంపూర్ణ మెజారిటీ సాధిస్తే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో 2014 నాటికి తెలుగు దేశం పూర్తిగా నిర్ణాయక శక్తిగా మారవచ్చు. ఏమైనా తెలుగు దేశం పార్టీ ఇప్పుడు ఇంతకు ముందెన్నడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటూ ఉంది. బలహీన వర్గాలకు సామాజిక న్యాయమే కాదు రాజ్యాధికారం అవసరం ప్రాంతీయ న్యాయమూ అవసరం అనే నిజాన్ని గ్రహించి పార్టీ 2014 కు వ్యూహరచన చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ ఆర్ నాటి వైభవాన్ని పొందవచ్చు.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.
9440493604

No comments: