Sunday, April 28, 2013

ఆచార్య పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం
చరవాణి:          9440493604

ఆకలి అక్షరాల భరద్వాజ
పాకుడు దారిలోని ప్రతిభామూర్తికి జ్ఞానపీఠం

జ్ఞాన పీఠ పురస్కారానికి అర్హతలు అన్ని ఉండి దాన్ని పొందే క్రమంలో  నిలవడానికీ ముందుగా ఎన్నవలసిన వ్యక్తి భరద్వాజ. కాని భరద్వాజకు జ్ఞానపీఠ పురస్కారం లభించడం, తెలుగు సాహిత్య వర్గాలలో అందునా అవార్డులు ఎలా వస్తాయో తెలిసిన సాహిత్య వర్గాలలో మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈయన భరద్వాజ గోత్రీకుడా అని అడిగిన వారున్నారు. ఈ ఆశ్చర్యానికి కారణం లేకపోలేదు. భరద్వాజ సాహిత్యంలో తప్ప మిగతా ఎన్నో విషయాలలో బలహీనుడు. ఈయన విద్యార్హతలు లేనివాడు. ఏడో తరగతే చదివాడని పదేపదే చెప్పవలసిన అవసరంలేదు కాని విషయం ఏమంటే ఈయన విశ్వవిద్యాలయాలలో పనిచేసే ఆచార్యుడు కాడు. ఆ పరిసరాల్లోకి రాడు. సాహిత్య వాతావరణాన్ని ఏలేది సాహిత్యవిమర్శనారంగంలో గజ్జకట్టి ఆడేది, తిమ్మిని బమ్మిని చేసేది బమ్మిని తిమ్మిని చేసేది, ఒక కవితార్భకుడిని మహాకవిని చేయగలిగేది, తమకు నచ్చని సామాజిక వర్గాలలో నుండి వచ్చిన మహాకవుల్నైనా మచ్చులోనికి లేకుండా చేయగలిగేది, విశ్వవిద్యాలయాల పరిధిలో ఉండి ఆచార్యశ్రేణులలో ఉన్న కవిపుంగవులు కవితావిమర్శక కేసరులు రాజకీయ నాటక ధురంధరులు. ఏ అవార్డును ఎలా తెచ్చుకోవాలి ఎవరితో ఎలా మెలగాలి. ఏ గుంపులో ఉంటే సాహిత్య రంగంలో ఎలా పేరు వస్తుంది. ఏలినవారితో ఏరకాలుగా సహవాసాలు చేయాలి రాజకీయ ప్రాపకాన్ని ఎలా పెంచుకోవాలి. ఇలాంటి మెళకువలు లాబీయింగులు ఎన్నో  విద్యలు వస్తే కాని, ఈనాడు కవిగా కాని సాహిత్య కారుడుగా కాని రాణించడంకాని లేదా అవార్డులు తెచ్చుకోవడం కాని సాధ్యం కాదు. ఈ మాట తెలుగు సాహిత్యానికి ఒక్కదానికి మాత్రమే వర్తించేది కాదు. భారతీయ భాషల్లో ఉన్న అన్ని సాహిత్య వాతావరణాలకు వర్తించే మాట ఇది. జ్ఞాన పీఠ పురస్కారాలు పొందినవారందరూ నిస్సందేహంగా మహా సాహిత్య కారులే మహాకవులే అందులో సందేహం లేదు. కాని బంగారు పళ్ళెరానికి కూడా గోడచేర్పు అవసరం.
ఇక్కడ ఏ కవికి ఏ సాహిత్య కారుడుకి ఏ గోడ చేర్పు దొరుకుతుంది అన్నదే ప్రధాన విషయం. ఏ లాబీయింగ్ చేతకానివాడు, విశ్వవిద్యాలయాల వాతారణంలో లేనివాడు కులంబలం లేనివాడు, రాజకీయ బలం అసలే లేనివాడు అయిన భరద్వాజకు జ్ఞానపీరావడం సాహిత్య లోకంలో నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. పాకుడు పట్టిన రాళ్ళమీద ప్రయాణం చేస్తూ ఒక మెట్టు ఎక్కగానే జారుతూ జారూతూ ఉన్నా కిందికి పోకుండా తిరిగి ఇంకో మెట్టుపైకి పోతూ, తన విస్తరినిన తానే వేసుకొని అన్నింటిని ఒక్కొక్కటిగా సమకూర్చుకునే దశలో తను వడ్డించుకున్న దాన్ని ఎవడో వచ్చి తినిపోతుంటే కూడా చూస్తూ నడిచి, నడిచి, పరుగెత్తి ఈనాటికి జ్ఞానపీఠం అనే అత్యున్నత స్థానానికి రావడం భరద్వాజకు నిజంగా వైకుంఠపాళి ఆడడమే.
ఆశ్చర్య పోవడం అనే మాటకు మరిన్ని వత్తాసు మాటలు ఇక్కడ చెప్పుకుంటే భరద్వాజ విలువ జనానికి మరింత తెలుస్తుంది. ఇటీవలి కాలంలో కన్నడంలోఒక గొప్ప కవి రచయిత నాటకకారుడుకి జ్ఞాన పీఠ పురస్కారం వచ్చింది. రాష్ట్రప్రజలు చాలా సంతోషించారు. కానిఒక వర్గం మరొక కవికి రచయితకు రావలసిన జ్ఞాన పీఠాన్ని ఇతను తన్నుకుపోయాడు, అంతా రాజకీయం జరిగింది. రాజకీయ బలం అతనికి లేకపోయింది అందుకే అతనికి కాకుండా మరొకరికి ఇచ్చారు. ఇంత హీనంగా రాజకీయాలు చేస్తారా అని కన్నడ నాట చాలా దుమారం లేచింది. అయితే అక్కడ  అవార్డు వచ్చిన సాహిత్య కారుడు కూడా ఆ అర్హతకు ఏమాత్రం తీసిపోని వాడే. కాని ఆనాడు జరిగిన వివాదంలో చాలా చాలా సాహిత్యేతర విషయాలు తెలిసి వచ్చాయి అంటే ఏ వర్గం వారి మనిషికి అవార్డు కోసం ఎలా పనిచేస్తుంది అనే విషయాలు. తెలుగులో కూడా నెటిజన్లు కొంత మంది, ఏమిటీ అఘాయిత్యం ఫలనావారు వి.సిలుగా పనిచేశారు ఆయన ఫలానా వర్గానికి చెందుతాడు, అంతే కాదు ఫలానా విశ్వవిద్యాలయ ఆచార్యుడు కూడా వి.సిగా కూడా పనిచేశాడు బోలెడంత కవిత్వం రాశాడు జ్ఞానపీఠ కమిటీకి వీరు కనిపించలేదా అని మెటికలు విరచినవారు ఆడిపోసుకున్నవారు ఉన్నారు. ఇవేవీ తెలియకుండా నిరామయంగా ఉన్న భరద్వాజను చూస్తే ఎందుకు ఆశ్చర్యం కలగదు.
అలాగని భరద్వాజకు ఇంతకు ముందు పురస్కారాల విషయంలో అన్యాయం జరిగిందని చెప్పడానికి వీలు లేదు. ఆయనకు చాలా అవార్డులు సాహిత్య అకాడమీ అవార్డులు కూడా వచ్చాయి. కాని అప్పుడు కూడా ఇంతే విధంగా ఆశ్చర్య పోయే ఘటనగానే ఎందరికో అనిపించింది. తెలుగులో ఏ లాబీయింగూ చేయకుండా పురస్కారాలు తెచ్చుకోవడం చాలా ఆశ్చర్యం కలిగించడం అనేది ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయం.
తెలుగు సాహిత్యానికి జ్ఞాన పీఠ పురస్కారం వచ్చి పాతికేళ్ళు దాటింది. 1970 విశ్వనాథ సత్యనారాయణగారు. తర్వాత 1988లో  సినారె పుచ్చుకున్న తర్వాత ఇంత కాలం వేచి చూడవలసి వచ్చింది. కాని మిగతా దక్షిణాది భాషలకు ఈ పరిస్థితి లేదు. కన్నడంలో ఎనిమిది సార్లు జ్ఞాన పీఠం వచ్చింది. మళయాళంలో అయిదు  సార్లు వచ్చింది. తమిళం వారికి మనలాగే రెండు సార్లు వచ్చింది. ఇలా ఎక్కువ సార్లు రావడానికి అక్కడి భాషల్లో మిగతా భాషల కన్నా ఎక్కవసాహిత్య సృజన జరిగిందని కాడు. అక్కడి ప్రభుత్వాలు పెద్దలు చేసిన ప్రయత్నాలు ఇచ్చిన ప్రోత్సాహం కారణం. మాకు ఇంత గొప్ప కవి ఉన్నాడు అతనికి పురస్కారం రావాల్సిందే అని అక్కడి ప్రభుత్వాలు గొంతెత్తి మాట్లాడతాయి. తెలుగు వారికి ఇంత మక్కువ వీటిపట్ల లేదు. తెలుగు వారికి వచ్చిన పద్మశ్రీలు చాలా తమిళ సోదరులు సిఫారిష్ చేస్తే వచ్చినవని తెలిసి మనం సిగ్గుతో చచ్చి పోవాలి. కాని మనం ఈ విషయంలో హాయిగా బతికే ఉంటాం.
భరద్వాజ ప్రత్యేకతని చెప్పుకోవడానికి ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్పుకోవాలి. భరద్వాజ ప్రధానంగా రచయిత, కవి కాడు. ఆయనకు కథారచయితగాను నవలా రచయితగాను పేరుందే కాని కవిగా ఆయనను చెప్పుకోవడం లేదు. తెలుగులో రెండు పురస్కారాలు వచ్చింది కవిత్వానికే గాని వచనానికి కాదు. కన్నడంలో నవలా సాహిత్యానికి జ్ఞానపీఠ పురస్కారంవచ్చింది. మళయాళంలో నవలా సాహిత్యానికి కథా సాహిత్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. తమిళంలోను వచన సాహిత్యానికి పురస్కారం వచ్చింది. ఇప్పటిదాకా 53 మందికి జ్ఞానపీఠ పురస్కారాలు వస్తే ఎక్కుమందికి కవిత్వానికే వచ్చింది. దక్షిణ భారతదేశంలో ఎక్కువమందికి వచన రచయితలకు నాటకకారులకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. కాని తెలుగులో ఇద్దరికీ ఇప్పటిదాకా కవిత్వానికే పురస్కారం వచ్చింది. విశ్వనాథ కవిత్వంతో పాటు అతి విస్తృతమైన నవలా సాహిత్యం కూడా రాశాడు. కాని ఆ వచనాన్ని ఆధునిక వచనంగా అంగీకరించడానికి వీలు లేదు. అర్థగ్రాంథిక సంపూర్ణగ్రాంధిక భాషలలో ఉన్న ఈ నవలలు ఆధునిక వచనంగా అంగీకరించలేము. ఇక సినారెకి కూడా వచ్చింది కవిత్వానికే కాని సినారేని వచన రచయితగా మనం గుర్తించం. కాగా తెలుగు ఆధునిక వచనానికి జ్ఞాన పీఠ పురస్కారాన్ని తెచ్చిన ఘనత రావూరి భరద్వాజకే దక్కుతుంది. తెలుగులో మంచి ఆధునిక వచనసాహిత్యం కథాసాహిత్యం చాలా ఉంది. కాని మనకు వచ్చిన అకాడమీ పురస్కారాలు చాలా కవిత్వానికే వచ్చాయి. తెలుగు వచనానికి ఇంత గొప్ప కీర్తిని ఒక జాతీయ స్థాయిని అంతర్జాతీయ స్థాయిని తెచ్చిన ఘనత ఇలా భరద్వాజకు దక్కుతుంది.
మరొక విషయంలో కూడా భరద్వాజ ప్రత్యేకతని చెప్పడానికి వీలుంది. తెలుగులో నవలలు రాసివారున్నారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డులు వచ్చిన నవలలు కూడా ఉన్నాయి. కన్నడంలో, మళయాళం తమిళభాషలలో నవలలకు ఈ అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారాలు వచ్చాయి. కాని తెలుగులో నవలా సాహిత్యానికి జ్ఞానపీఠ అత్యున్నత పురస్కారాన్ని తెచ్చిన ఘనత కూడా భరద్వాజదే.
జ్ఞానపీఠ పురస్కారాన్ని ప్రకటిస్తూ ఒక పుస్తకం పేరును చెప్పినా ఒక కవిగాని సాహిత్యకారునికి గాని ఈ పురస్కారం ఇచ్చే సందర్భంలో అతను చేసిన మొత్తం సాహిత్య కృషిని దృష్టిలో పెట్టుకునే ఈ అవార్డు ఇస్తారు. ఆ విధంగా చూచినా భరద్వాజ సాహిత్యం అత్యధికం వచన సాహిత్యం కావడాన్ని కూడా అందరూ గమనించాలి. తెలుగు ఆధునిక వచన సాహిత్యానికి శిఖరప్రాయమైన గౌరవాన్ని తెచ్చిన వ్యక్తిగా ఇలా భరద్వాజ చిరస్థాయిగా నిలుస్తున్నాడు.
భరద్వాజకు జ్ఞాన పీఠ పురస్కారం వచ్చిన సందర్భంగా ఆయన జీవితాన్ని గురించి ఆయన రచనల పట్టికల గురించి ఇప్పటికే చాలా మంది చెప్పారు. వాటిని తిరిగి ఇక్కడ చెప్పవలసిన పని లేదు. మరికొన్ని ప్రత్యేకతలని ఇక్కడ చెప్పాలి. మనకు తెలుగులో స్మృతి కావ్యాలు చాలా వచ్చాయి. సతీ వియోగంతో మిత్రవియోగంతో పుత్రవియోగంతో చాలామంది గొప్ప సాహిత్య కారులు స్మృతికావ్యాలు రాశారు. అవి అన్నీ కవిత ప్రక్రియలు కావడం గమనించాలి. కాని సతీ స్మృతిని వచనంగా రాసిన వ్యక్తి భరద్వాజ ఒక్కడే. ఈయన 1956 నుండి డైరీ రాశాడు. ఈయనను అత్యంతం ప్రేమించి ‍ఒక చిన్న బాలుడిగా పెంచిన ప్రేమ కురింపిన భార్య కాంతం జీవన గమనంలో మధ్యలోనే 1986 లో తనను విడిచి పోయింది. ఈ బాధ భరద్వాజ తట్టుకోలేక పోయాడు. ఈ గాయం నేటికీ మానలేదు. ఆగాయపు పులుపులనే అయిదు కావ్యాలుగా రచించాడు. భరద్వాజ నాలోని నీవు, ఒకింత వేకువ కోసం, అంతరంగిణి వంటి పేర్లతో ఆయిదు పుస్తకాలను సతీ స్మృతిలో వెలువరించాడు భరద్వాజ. నిజానికి ఆయన రాసిన వచనం పాకుడు రాళ్ళు నవలలో పొడి పొడిగా ఉంటంది. కాని అత్యంత మధురమైన వచనం చిక్కటి తియ్యటి తేటైన వచనం ఈ స్మతి కావ్యాలలనే  రాశాడు భరద్వాజ. కవితలో లాగా గుండెను తాకేలా చప్పున, గుప్పున గుండెను ఆవరించేలా వచనం రాయడం సులువు కాదు. చాలా కష్టం. కాని భరద్వాజ ఈ స్మృతి కావ్యాలను పట్టుకుంటే, ఒక్కొక్క శకలం ఇలా గుండెను పట్టుకుంటుంది. సతీ స్మృతి ఇంత గాఢంగా ఉంటుందా ఆ ప్రేమ ఇంత హృదయ దఘ్నంగా ఉంటుందా ఆ బాధ ఇంత తీవ్రంగా ఉంటుందా అని కదిలి పోతాం, కరిగి పోతాం. రెండు వాక్యాలు ఇక్కడ చూద్దాం. ప్రభూ ఈ శరీరం నాకు ఇరుకుగా ఉంది. ఈ పరిసరాలు నాకు అననుకూలంగా ఉన్నాయి. వీటిల్లోంచి నన్ను తప్పించు. నన్ను విముక్తం చేయి:… “ఆకాశం నిండా విషాదం ఆవరించింది. వాయు తరంగా లు వెక్కి వెక్కి పడుతున్నాయి. గిరిశిఖరాలనుండి శోకగీతికలు జాలు వారుతున్నాయి. ఉషస్సుందరి దుఃఖ తప్త హృదయంతో వివశయై పడిఉంది. తూరుపు తలుపులింకా మూతపడే ఉన్నాయి. నీ గురించి తలచుకొని....  భూదేవి శిరస్సున దోసిళ్ళకొద్దీ వెండి ముత్యాలు తలంబ్రాలు పోస్తున్నాడు చంద్రుడు. ఆ ముత్యాల మెరుపులన్నీ వెన్నెల గామారి జారిపోతున్నాయి. కొండలమీద బండలమీదా పురాలమీదా గోపురాల మీద, తోటల మీద బాటలమీదా మొగ్గలమీద చిన్నారి బుగ్గలమీదా, పూలమీద పచ్చని నేలమీదా చివరికి నామీద కూడా”…కాంతం స్మృతి ఇలా ఉంటుంది.
ఇలాంటి వచనం మనకు ఆయన పాకుడు రాళ్ళు నవలలో కనిపించదు. అక్కడ వచనం చాలా పొడిగా పొడిగా ఉంటుంది. అక్కడి వచనం ఒక వీడియో కెమేరా లాగా పనిచేస్తుంది. పాకుడు రాళ్ళు నవల చదవడం  అంటే ఒక సినిమాను చూసిన అనుభూతి పొంది పుస్తకం అనే థియేటర్ నుండి బయటికి రావడమే. కాని ఆయన స్మృతి కావ్యాలలోని వచనం పాఠకుడిని ఏవేవో తీరాలలోనికి ఏవేవో అంతరంగ ప్రపంచాలలోనికి ఏవేవో  ప్రేమ మహళ్ళలోనికి లాక్కుపోతుంది. ఆవచనం చదవడం ఒక విశేషమైన అనుభూతి.
భరద్వాజ సాహితీ ప్రస్థానం చాలా విస్తృతమైంది. మొత్తం 160 పుస్తకాలు రాస్తే ఇందులో నవలలు, కథా సంకలనాలు బాలలకు ఉద్దేశించిన కథా సంకలనాలు గల్పికలు వ్యాసాలు ఇలా చాలా చాలా రకాల వచన ప్రక్రియలున్నాయి. అయితే వీటన్నింటికన్నా విలక్షణమైన పుస్తకం మరొకటి ఉంది. అది జీవన సమరం. నగరంలో వీధిలోనికి పోయి తోపుడు బండ్ల దగ్గరనుండి ఫుట్ పాత్ పై చెప్పులు కుట్టుకునే వ్యక్తి దగ్గరనుండి, రిక్షా తొక్కే వారి దగ్గరనుండి రకరకాల వృత్తులు చేస్తూ జీవన పోరాటం చేస్తున్న వ్యక్తుల వ్యథార్త జీవితాలను వారినుండే సేకరించి రాసిన పుస్తకం జీవన సమరం. తెలుగులో ఇలాంటిది లేదు. భరద్వాజ సాహిత్యం అంతా ఇంత విస్తృతంగా వైవిధ్యభరితంగా ఉంది. కథకుడుగా నవలా కారుడుగా చిరస్థాయిగా తెలుగులో నిలిచే సాహిత్య శిఖరం భరద్వాజ. కాగా ఆయనకు అజరామరమైన కీర్తినితేగలిగే నవలలు రెండు ఒకటి పాకుడు రాళ్ళు అయితే మరొకటి కాదంబరి. ఈ వ్యాసం ఉద్దేశం సాహిత్యం అంతటిని గురించి పరిచయం చేయడం కాదు. భరద్వాజ ప్రత్యేకతని గురించి నాలుగు ముక్కలు ఇలా చెప్పి అసలు పురస్కారాన్ని ప్రకటించిన నవల గురించి ఇక్కడ మరికొంత రాయడమే. మిగతా వాటిని గురించి మరొక సారి రాస్తాను.
భరద్వాజ తన 17 వ ఏటినుండే కథలు రాయడం మొదలేసాడు. అప్పట్లో చలం ప్రభావంతో కాస్తంత అశ్లీలం ధ్వనించే కథలు కూడా రాసాడని జనం దవళ్ళు నొక్కుకున్న మాట వాస్తవం. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కునే క్రమంలో అన్నం కోసం యుద్ధం చేయవలసిన దారిలో భరద్వాజ తన జీవితాన్ని మద్రాసుకు మార్చుకున్నాడు. అక్కడే అతనికి సినిమాయాలోకంతో గాఢమైన పరిచయం ఏర్పడింది. ఇదే ఒక సుదీర్ఘమైన సీరియల్ రాయడానికి దారివేసింది. యాబైయవ దశకంలో కృష్ణాపత్రికలో మాయజలతారు పేరుతో ఒక సీరియల్ రాశాడు భరద్వాజ. ఆరోజుల్లో దాన్ని దగ్గరగా చూచిన మరొక సాహిత్య కారుడు సంపాదకవర్గంలోని వాడు శీలావీర్రాజు దీనికి పాకుడు రాళ్ళు అని పేరుపెట్టాడు. ఆపేరుతోనే నవలగా వచ్చింది. ఇది ఇప్పటికి ఆరు ముద్రణలు పొందింది. చివరి ముద్రణ 2008లో వచ్చింది. అయిదు వందల పుటల చాలా పెద్ద నవల పాకుడు రాళ్ళు. ఈ నవల 1960లో తొలి ముద్రణ పొందింది. అంటే యాబైఆరు సంవత్సరాల క్రితం సినిమా పరిశ్రమ ఎలాంటి స్థితిలో ఉందో అత్యంత ప్రతిభావంతంగా కళ్ళకు కట్టినట్టు చూపిన నవలగా ఇది నిలబడింది. రాసిన 56 సంవత్సరాల తర్వాత ఈ నవలకు అత్యంత ఉన్నత పురస్కారం లభించడం ఇక్కడి మరొక విశేషం. ఈనాటికీ వస్తు రీత్యా ఇది నేటి సినీ ప్రపంచానికి కూడా చాలా వరకు వర్తించేలా ఉండండం దీని మరొక ప్రత్యేకత.
నవలా రచనలో దాని నిర్మాణంలో ఒక కొత్త పుంత తొక్కాడు భరద్వాజ ఆనాటికి ఆధునిక నవలా సాహిత్యం ఇంత స్థాయికి రాలేదు. ఒక వ్యక్తి జీవితాన్ని కాకుండా ఒక విస్తృతమైన ప్రపంచాన్ని మన కళ్ళముందుంచాడు రచయిత. నవలలో ప్రధాన పాత్ర మంజరి అనబడే మంగమ్మ. ఆమె నాటకాలలో స్త్రీపాత్రలు నటించే స్థితినుండి సినిమా ప్రపంచానికి పరిచయమై ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అత్యంత ఉన్నత స్థాయి కథానాయికగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందింది. కాని జీవితంలో నోట్లకట్టలనే హంసతూలికా తల్పంగా చేసుకోగలిగే స్థితిలో కూడా మనశ్శాంతి లేక నిజమైన ప్రేమను పంచే వారు లేక ఎందరో చేసే మానసిక హింసకు గురవుతూ ఆ క్రమంలోనే దీనంగా తనను తాను అంతం చేసుకున్న వ్యక్తిగా మంజరి పాత్రను తీర్చి దిద్దిన తీరు ఒక వాస్తవానికి పట్టిన అద్దం.
నవలా రచనా శిల్పం విషయానికి వస్తే ఆనాటికి అదొక నవ్యమార్గం. కథలోని ఒక పాత్ర మాధవరావు కథను చెప్పడంతో ప్రారంభమై కొద్ది దూరం పోగానే అతను ఆపిన తర్వాత ఉత్తమ పురుష కథనాన్ని వీడి రచయిత చేసే ప్రథమ పురుష వర్ణనలోనికి వచ్చి, తిరిగి నవల అంతంలో మాధవరావు చేసే కథనంలోనికి ప్రయాణించడం నవలలోని నిర్మాణ వైవిధ్యం.
నవలలోని వచన రచన అబ్బుర పరిచేలా ఉంటుంది. ప్రతి పాత్ర సజీవంగా దానికి వచ్చిన భాషలో అది మాట్లాడుతుంది. పాత్ర చిత్రణకాని సంభాషణ కాని వర్ణన కాని అత్యంత సహజంగా కదిలే జీవన గమనాన్ని ఒక వీడియో తీసి చూపించే పద్ధతిలో కొనసాగింపజేయడం ఇక్కడి విశేషం పుస్తకం మొదలు పెట్టిన దగ్గర నుండి చివరి వరకు పుస్తకం చదువుతున్న అనుభూతి కాక ఒక సామాజిక ప్రపంచంలో మనం ప్రత్యక్షంగా చూచి బయటికి వచ్చిన అనుభూతి కలిగించడం దీని ప్రత్యేకత. ఇక్కడి ఉద్దేశం నవలను ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి సమీక్ష చేయడం కాదు. భరద్వాజకున్న సామాజిక చింతనను గురించి చెప్పడమే. ఈ నవల అంతా ఆర్త జీవుల గురించి రాసిన ఉదంతమే. నాటకాలు ఆడే స్త్రీలు సినిమాలలో వేషాలకోసం ప్రయత్నించే స్త్రీలు తమ శరీరాలను ఎలా పెట్టుబడిగా పెట్టుకోవాలి అత్యంత దీనంగా బతకాలో వివరించే నవలగా దీన్ని చూస్తే భరద్వాజ సామాజిక చింతన మనకు తెలుస్తుంది. ఇందులో మంజరి అనబడే మంగమ్మ, మంజరి మాత్రమే కాదు, ఆమె గమనంలో వచ్చిన వసంత, రాజ్యం, కల్యాణి (కన్నమ్మ), మంగతాయారు (సినిమా నాయిక కావాలని వచ్చి చివరికి పనిమనిషిగా మిగిలిన వ్యక్తి), విజయ ఈ వ్యక్తులు అందరూ తొలుత ఆహారం కోసం, బ్రతకడం కోసం ఎలా ఒళ్ళు అమ్ముకోవలసి వచ్చింది. మజరి నాయికగా ఎదిగే క్రమంలో అవసరాలకు ఎందరికి తన శరీరాన్ని విందు చేసింది. అత్యంత జుగుప్సావహంగా ఉండే జీవితాన్ని దైనందిన క్రమంలో చూపిన ప్రతిభ అబ్బురపరుస్తుంది. ఇందులో పాత్రలేవీ మూసపోసినట్లుండవు. సినిమాకు ఫైనాన్స్ చేసే వ్యక్తులు మొదలియార్ వంటి వారు కాని, పాత్రలు ఇప్పిస్తామని తిరేగే బ్రోకర్లు కాని చలపతి వంటి కింగ్ మేకర్లు కాని శర్మ వంటి సినీమా పత్రికా రచయితలు కాని రాజన్ వంటి పారిశ్రామిక వేత్తలు కాని స్త్రీ శరీరాన్ని ఎలా వాడుకుంటారు అని చెప్పడమే కాదు, స్త్రీ తన శరీరాన్ని తను వెళ్ళే ఉన్నత మార్గంలో తనను తాను అర్పించుకునే ఒక వ్యాపార వస్తువుగా ఎలా మలచుకుంటుంది ఇందులో చెప్పిన తీరు సినీ ప్రపంచంలో స్త్రీల హైన్యస్థితిని బట్టబయలు చేస్తుంది. మంజరికి ఉన్న లౌక్యం ఒక ఎత్తైతే మగవాడి బలహీనత ఆడదాని శరీరాన్ని పొందడంలోనే ఉంది అని తెలుసుకున్న మంజరి తాను ఎదిగే క్రమంలో ఎంతటి సంపన్నుడినైనా ఎంతటి మగధీరుడినైనా చివరికి ఋషిని అనుకునే వాడినైనా తన పదునైన మాటలతో హావభావాలతో పడవేసి తను కసిగా మగవాడిని కాలికింద తొక్కుకున్న వైనం, ఒక స్త్రీ తన ఆడతనంతో పురుష ప్రపంచాన్ని జయించిన పద్ధతిలో ఆమెను చిత్రీకరించడం భరద్వాజ చూపిన నైపుణ్యం. మంజరి పురుషులతో వ్యవహరించే సందర్భాలను భరద్వాజ వర్ణించే పద్ధతి చాలా గమ్మత్తుగా ఉంటుంది. వాక్యాలను సగంలోనే ముగిస్తాడు. అంటే కొద్దిగా చెబుతాడు. మిగతాది పాఠకుడికి అక్కడ ఏం జరిగిందే ఇట్టే అర్థమై పోతుంది. కవిత్వంలో ధ్వని ద్వారా భావాలను వ్యక్తం చేయడం వేరు. కాని వచనంలో అదీ నవలలో ధ్వనిని అధ్యాహారాన్ని ప్రయోగించి జుగుప్సాకరమైన శృంగారాన్ని పైకి ఏమీ తెలియకుండా అత్యంత సుదంరంగా రాయడం ఇతని శైలిలో పరాకాష్ట. పులిలా దూకి దీన్ని చంపుతాను దీన్ని అష్టకష్టాలు పెడతాను అని బీరాలు పలికిన హీరోలను, ఫైనాన్షియర్లను, నిర్మాతలను దర్శకులను, పారిశ్రామిక వేత్తలను మంజరి పిల్లిలా చేసి బొమ్మల్లా ఆడిస్తుంది. స్త్రీ తలచుకుంటే తన శరీరాన్ని తనకున్న శృంగార శక్తిని పదునైన  ఖడ్గంగా దూస్తే ఏం జరుగుతుందో చెప్పిన తీరు ఇలా మరొక నవలలో కనిపించదు.  అంతే కాదు ఇంతటి జాణ అయిన మంజరిలో ఎంతో ఉన్నతమైన మానవతా మూర్తిని చూపుతాడు భరద్వాజ. మంజరి తాను తన పరిశ్రమలో తన శరీరాన్ని పెట్టుబడిగా చేసి అందరి ముందు పరిచానని తెలుసు కాని తనలాగా అతి కింది స్థాయిలో జీవన పోరాటంలో నాటకాలలో ఉండి కాని సినిమాలలో చేరాలని కాని ఆ క్రమంలో ఒళ్ళు అమ్మకుని బ్రతికే మరికొందరికి అండగా నిలబడుతుంది. వాళ్ళ వేదనను పంచుకుంటుంది. వారిని పరిశ్రమలో పైకి తేవాలనుకోవడమే కాదు వారికి డబ్బుతో సహా అన్ని విధాలా తోడుపడుతుంది. ఈ విషయంలో బ్రోకర్లు తన చుట్టుతిరిగే చలపతి వంటి వ్యక్తులు ఏమి చెప్పినా వినదు. వారికి అండగా నిలవడం మానదు. ఇలా పాకుడు రాళ్ళ నవలలో వర్ణించింది నిజంగా మాయజలతారునే. ఈ మాయలో నలిగి మసై పోయేది కింది వర్గం వారు, స్త్రీలే. శ్రీశ్రీ కన్యాశుల్కం నాటకాన్ని భీభత్సప్రధానమైంది అని చెప్పాడు.  కాని పాకుడు రాళ్ళు నవల బాగా లోతుగా ఆలోచించి చూస్తే దాన్నిఅనుభవించి చదివితే ఇందులో స్త్రీ జీవితం ఎంత భీభత్సంగా ఉంటుందో తెలుస్తుంది. దీన్ని భీభత్స రస ప్రధానమైన నవల అనాలి. ముగించిన తర్వాత కలిగే అనుభూతి అత్యం భీభత్స దృశ్యాలను చూచి మనసు కలచివేసిన స్థితి కలుగుతుంది.
యాబై ఆరు సంవత్సరాల క్రితం సినిమా ప్రపంచం ఎలా ఉందో అందులో స్త్రీలు ఎలా ఉన్నారో చూచి నేటి సినిమా ప్రపంచాన్ని చూస్తే ఎన్నో మార్పులకు గురై సాంకేతిక పరిణామాలలో ఎదిగినా కూడా సినిమా ప్రపంలో అధో జగత్ నేటికీ అలాగే ఉండడాన్ని చూచినప్పుడు స్త్రీలు కనీసం ఒక స్థాయి వారైనా అత్యంత దీన స్థితిలో ఉండే పరిస్థితిని గమనించి నప్పుడు భరద్వాజ దర్శించజేసిన వర్ణించిన సాహిత్య శక్తి మనకు అవగతం అవుతుంది. భరద్వాజ అధోజగత్ సోదరుల పక్కన అత్యంత భయానక వేదనా భరితమైన జీవితాన్ని సాగించిన స్త్రీల పట్ల నిలిచిన తీరు తెలుస్తుంది. ఆయన నిజజీవితంలో అత్యంత దీన స్థితిలో పొట్టకోసం చేసిన పోరాటాలలో పొందిన అనుభవం ఇలా అధోజగత్ ప్రపంచం కోసం రక్తాన్ని అక్షరాలుగా చేయడానికి భూమికగా నిలిచింది. 
భరద్వాజ తొలిరోజుల్లో కమ్యూనిస్టు భావాలు కలిగిన వాడు అంతే కాదు తర్వాత కూడా తాను వివిధ వ్యక్తులతో కూడిన కమ్యూనిస్టు సంస్థలకు దూరంగా ఉన్నా తాను కష్టజీవుల పక్కన దీనహీన స్థితిలోని స్త్రీల పక్కన నిలిచాడు వాళ్ళకోసం ఆరాటపడ్డాడు వాళ్ళకోసం అక్షరాన్ని అమ్ముల పొదిగా చేశాడు. విద్యకు విద్యాలయాలకు దూరంగా ఉండడం వల్ల తనను తాను అన్ లెర్న్ చేసుకోగలగడం వల్ల తనను తాను అపండితీకరించుకోవడం వల్ల ఇది సాధించగలిగాడు భరద్వాజ. కళ్ళముందే పోయిన ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, చేయి విడిచి ముందే స్వర్గానికి పోయిన సహధర్మచారిణి మానని పచ్చి గాయాలుగా ఆయన ఒంటి మీద కాదు గుండె మీద మిగిలారు. సరిగ్గా ఠాగూర్ కి కూడా అత్మీయులుచేసిన గాయాలు ఒంటినిండా ఉన్నాయి. కాని భరద్వాజ గాయాలు ఆయన అక్షరాలు అన్నింటిలో పరుచుకున్నాయి. ఆ గాయాలతో పుష్పించిన మందార చెట్టుకే నేడు జ్ఞానపీఠం వరించింది. అది తనను తాను అలంకరించుకుంది. తెలుగు వచనానికి ఇది వజ్రకిరీటం. దొరికిన చిరయశస్సు.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.

1 comment:

Saatyaki S / o Seshendra Sharma said...

Dr. Ravuri Bharadwaja is an eminent Indian Novelist who rose to great heights from humble beginnings. He as a person and as a litterateur is trained in the school of adversary. His stories and novels portray the life of a common man in its total grandeur and vicissitude. Dr. Bharadwaja has won Bharateey Gyanpith Award
( Indian Nobel for literature) for the year 2012. His Magnum Opus
" Paakudu Raallu" ( Slippery Stones ) has been selected for this highest honor in Indian Literature.
This would have salutary and lasting impact on our literary field. All mafias, groups and pairavikaars are done away with at one go. Jai Ho Bharadwaja. Million Salutes to him.