Saturday, April 20, 2013

my new article on dalit other caste relations


ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం
చరవాణి. 9440493604

విలోమవివాహాలు - విధ్వంసమయ్యే కులాలు
పెద్దమ్మ కథ సామాజిక దురన్యాయం

సూరుల జన్మంబు సురల జన్మంబు ఏఱుల జన్మంబు ఎరుగనగునె అని ఒక చాటు పద్య శకలం మనకు చాలా సందర్భాలలో ఎదురవుతుంది. దీనికి రెండర్థాలు చెప్పవచ్చు. సూరులుఅంటే పండితులు (కవులు కూడా అని సందర్భాన్ని బట్టి చెప్పవచ్చు) సురలు అంటే దేవతలు  ఇంకా ఏఱుల జన్మాలని తెలుసుకోలేము అని ఒక అర్థం వస్తుంది. అంతే కాదు. ఎఱుగనగునె అనే ప్రశ్నార్థక పదానికి ఎరుగవచ్చునా అంటే తెలుసుకోవాలని ప్రయత్నించవచ్చునా అని మరొక అర్థం వస్తుంది. కులం గురించి అడగ వద్దు అని చెప్పే ఇలాంటి మాటలు ఇంకా మనకు చాలా కనిపిస్తాయి. కాని వర్ణసంకరం గురించి కుల సంకరం గురించి గగ్గోలు పెట్టే కథలు పురాణ కాలం నుండి కనిపిస్తాయి. విలోమ వివాహాల గురించి అనులోమ వివాహాల గురించి మనుస్మృతి బాగా చెబుతుంది. ఏ ఏ కులాలు సంకరం అయినప్పుడు దాని ఫలితంగా మరే కులాలు పుడతాయి అని వివరంగా చెబుతుంది మనుస్మృతి. ఈ వర్గీకరణంలో నేడు కనిపించే చాలా కులాలు తీవ్రమైన అవమానానికి గురి కావలసి వస్తుంది కూడా వాటి ఉదాహరణలు కూడా ఇక్కడ ఇవ్వడం భావ్యం కాదు. అందుకే మనుస్మృతిని తగల బెట్టే ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది.
అనులోమ వివాహం అంటే పురుషుడు పెద్దకులానికి చెందిన వాడై ఉండి లేదావర్ణక్రమంలో పైవర్ణానికి చెంది ఉండి కింది వర్ణం స్త్రీని కాని కింది కులం స్త్రీని కాని పెండ్లాడితే అది అనులోమవివాహం అవుతుంది. అంటే బ్రాహ్మణ వర్ణం పురుషడు తనకు కింది వర్ణాలైన, క్షత్రియ, వైశ్య, శూద్ర కన్యలను వివాహం ఆడితే అది అనులోమ వివాహం అవుతుంది. అలా కాక కింది వర్ణం నుండి కాని కింది కులాలనుండి కాని పురుషుడు పై వర్ణం నుండి లేదా పై కులం నుండి స్త్రీని వివాహం ఆడితే అది విలోమ వివాహం అని అంటారు. దీన్నే ప్రతిలోమ వివాహం అనికూడా అనడం ఉంది. ఈ పేరును బట్టే దీనికి వ్యతిరేక గుణాన్ని లేదా నీచలక్షణాన్ని ఆపాదించడాన్ని చూడవచ్చు. అంటే విలోమ వివాహాలను అంగీకరించక ఈసడించిన సమాజం పురాణ కాలంనుండి ఉండడాన్ని పురాణ కథల్లోను దేవత కథల్లోను చూడవచ్చు. దీనివల్ల వచ్చే అనర్థాలను కూడా మనుస్మృతి పేర్కొంది. విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు నవలలో ధర్మారావు తండ్రి బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు కింది మూడు వర్ణాల స్త్రీలను పెండ్లిచేసుకోవడం పెద్దకథా విస్తృతిలో వర్ణించాడు. దీన్ని ఆనందంగా అంగీకరించే ఆయన విలోమ వివాహాలను ఎక్కడా ఆయన సానుకూలంగా వర్ణించడు.
విలోమ వివాహాల్లో వచ్చే సామాజిక సమస్యను గురించి ఆధునిక సాహిత్యంలో  కూడా చాలా విస్తృతంగానే వివరించి చిత్రించారు. రంగనాయకమ్మగారి బలిపీఠం నవలలో (సినిమాలోను) దళిత కులానికి చెందిన వ్యక్తి అగ్రకులానికి చెందిన (బ్రాహ్మణ) స్త్రీని పెండ్లి చేసుకుంటే వచ్చే సమస్య ఎలా ఉంటుంది అని చాలా విస్తృతంగా చెప్పింది. ఈ సమస్యలను సినిమాలు కూడా వివరంగా చూపాయి. ఇదే సామాజిక సమస్యను అంటే కింది కులాలకు చెందిన పురుషులు పైకులాల వారి స్త్రీలను విశేషించి బ్రాహ్మణ వర్ణానికి చెందిన స్త్రీలను పెండ్లి చేసుకుంటే వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి. ముఖ్యంగా దళిత కులం పురుషులు బ్రాహ్మణ స్త్రీలను పెండ్లి చేసుకుంటే పరిస్థితులు ఎక్కడకు దారితీస్తాయి. అనే సమస్యను వర్ణించిన జానపద కథలు చాలా దొరుకుతాయి. మౌఖిక సాహిత్యం అంటే జానపద సాహిత్యం దీన్ని బాగా విస్తృతంగానే వర్ణించింది. ఇది గ్రామదేవతల కథల్లో కూడా వస్తుంది. పెద్దమ్మ అనే గ్రామ దేవత ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల్లో ఉన్న గ్రామ దేవతలలో బాగా వ్యాప్తిలో ఉన్న గ్రామదేవత.  ఈ పెద్దమ్మ కథని  ఈ దేవతకి కొలుపులు కొలిచే టప్పుడు చెబుతారు. దళిత కులాకు చెందిన బైండ్లవారు, ఆసాది వారు, కొమ్ముల వారు, పంబలవారు వారి జానపద కళారూపాలైన బైండ్లకథ ఆసాదికథ, పంకథల్లో ఈ కథలను చాలా సుదీర్ఘంగా చెబుతారు. పెద్దమ్మ కథ వీరి కళారూపాల్లో బాగా విస్తృతంగా ఉంది. అంతే కాదు పెద్దమ్మ కథని చాలా కులాలవారు విడిగా కథగా చెప్పుకోవడం కూడా ఉంది. పెద్దమ్మకథని బ్రాహ్మణ కుటుంబాలలో కూడా అందునా స్త్రీలలో కూడా పిల్లలకి చెప్పే కథల్లాగా చెప్పుకోవడం ఉంది.  ఈ కథని నేను మూడు తావుల్లో సేకరించాను. ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఈ కథను చెప్పగా విన్నాను. ఈ కథలో ఒక క్లిష్టమైన సామాజిక సమస్యను వర్ణించడం చూడవచ్చు. ముందు కథను చదివి తర్వాత దాని విశ్లేషణలోనికి పోదాం.
పెద్దమ్మ కథ: అనగనగా ఒక ఊళ్ళొ ఒక బ్రామ్మణాయన ఉన్నడు. ఆయనకి పొలం యగసాయం కూడా ఉంది. ఆ సంవత్సరం పొలంలో  జొన్న పంట వేశిండు బాపనాయన. ఆయన పొలాన్ని పాలికిచ్చినా ఆ ఇంటి వాళ్లే దానికి కాపలా కాసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పాలు మూడొంతులు. పాలి రైతు కూడా అప్పుడప్పుడు కాపలాకి వత్తడు.
ఆయనకి ఈడుకు వచ్చిన కూతురు ఉంది. ఈ కూతురునే పగటి పూట చేను కాపలాకి పంపిస్తూ ఉంటడు. చేనుకి తూర్పు  నడాన ఒక మంచె ఉంది.  ఆ మంచె మీద కూసోని బాపనాయన కూతురు వడిసాల తిప్పి తిప్పి రాళ్ళు కొడతా పిచికలు వాల కుండా కాపలా కాస్తది.
ఒక నాడు. అట్ల కాపలా కాస్త ఉండగా ఆ పొలం పక్కన దారెమ్మడి ఒక ఈడు కొచ్చిన కుర్రవాడు పోతుంటడు. అక్కడ ఈ అమ్మాయి కేకలు పెట్టుకుంటా వడిశాల తిప్పుకుంటా ఉంటే చూస్తడు ఆ కుర్రవాడు. ఈ బాపనాయన కూతురు బాగా ఎర్రగా బుర్రగా ఉండటాన ఆ పిల్లగాడు చూపు తిప్పుకోలేక అట్లనే చూశి చూశి దారిలో పోతడు. తిరిగి మాపిటేలకి ఆ దారి గుంటా వత్తా వత్తా ఆ యమ్మాయిని మళ్ళీ చూశిండు. ఈ అమ్మాయి కూడా ఆ పిల్లగాడిని చూశింది. పిల్లగాడు కూడా బాగా ఎర్రగా బుర్రగా ఉన్నడు. ఎవురా మన ఊరి అబ్బాయేనా అని అనుకుంది.
ఆ పిల్లగాడు ఇంటికి పోయినంక కూడా ఆ పిల్లని మరిశి పోలేక పోయిండు. కళ్ళలోనే కనపడతది. మళ్ళీ ఆ దారిలోకే వచ్చి ఆ పొలం కాడికి వచ్చి  చూశిండు. ఆ యమ్మాయి మంచె మీదే ఉండి పిచికలని తోలతా ఉంది. ఈ పిల్లగాడు ఆ దారి దాకా వచ్చి. అక్కడక్కడే తిరుగుతా ఈ పిల్లని చూస్తా ఉన్నడు. కాసేపటికి ఆ యమ్మాయి ఈ పిల్లగాడిని చూచి నిన్నకనపడిన అతను ఇతనే కదా అని అనుకుంది.  అట్ల రెండు మూడు రోజులు చూశిండు. ఆ పిల్లగాడు అట్ల చూడడాన్ని ఈ పిల్ల గమనించి తననే చూడడానికి వస్తన్నడు అని తెలుసుకుంది.  అయిన తనను ఏమీ అన లేదు కదా అని ఊరుకుంది.
అట్ల అయినంక ఒక రోజున ఆ పిల్లగాడు మంచె దగ్గరికి వచ్చి ఆ యమ్మాయి దగ్గిరి కి వచ్చి కాస్త మంచినీళ్ళు పోస్తావా దప్పికగా ఉంది అని అంటడు. ఆ యమ్మాయి కూడా మంచె దిగి బుర్రకాయ తీసింది. ఆ పిల్లగాడు గొంతుగా కూర్చోని దోసిలి పట్టిండు. ఆయమ్మాయి. బుర్రకాయ ఎత్తి అతనికి మంచి నీళ్లు పోసింది. కాసేపు అక్కడే కూర్చున్నాడు. ఆయమ్మాయిని చూసుకుంటా. ఆయమ్మాయి కాసేపు చూచి తిరిగి మంచె ఎక్కింది.
ఇక ఆయమ్మాయి ఇంటికి పోయి. పిల్లగాడు బాగా ఉన్నడు. బాగా ఎర్రగా బుర్రగా ఉన్నడు. బాగా మాట్లాడతన్నడు బ్రామ్మల పిలగాడే గావచ్చు అని అనుకుంది. మళ్ళీ తెల్లారి రోజున పొలానికి పోయింది. మద్యానం వేళకి మంచి రెండు జాముల ఎండలోకూడా ఆ పిల్లగాడు మళ్లీ వచ్చి కాసేపు దూరంనుండే చూశి. తర్వాత దగ్గరికి వచ్చి మంచి నీళ్ళు అడిగిండు. ఆయమ్మాయి మంచె దిగి బుర్రకాయతో మంచినీళ్ళు పోసింది. అతను తాగిన తర్వాత వెళ్ళి పోయిండు.
అట్ల నాలుగైదు సార్లు ఆ పిల్లగాడు మంచినీళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు కాసేపు మాట్లాడు కుంటరు.  అట్లా నాలుగైదు సార్లు మాట్లాడు కున్నంక వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా నచ్చుకుంటరు. ఇక కొద్ది రోజులకే పెళ్ళి చేసుకుందామని అనుకుంటారు. ఇక ఒక నాడు పొద్దు పోయినంక ఆళ్ళిద్దరు ఇంటికి పోకుండా మూట ముల్లెతో రాత్రి పూట వేరే ఊరికి ఎవురికి చెప్పకుండా లేచి పోతారు.
ఆ బ్రామ్మణాయన కూతురు ఇంటికి రాలేదేమా అని పోలానికి వచ్చి చూచి ఊరంతా తిరిగి తిరిగి ఏడుసుకుంట ఇంటికి పోతాడు.
ఇక వీళ్ళు ఇద్దరూ వేరే ఊరికి పోయి. కాపురం పెట్టుకుంటారు. ఆ పిల్లగాడు కూలీనాలి చేసుకుని ఏదో సంపాదించుకొని వస్తుంటడు. ఈమె వండి పెటతాఉంటది.  అట్ల కాలం గడుస్తా ఉంటది. ఐదేళ్ళు గడిసినయ్. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
ఇట్లా ఉండంగ ఉండంగ. ఆ ఊళ్ళో ఆ బాపనాయనని కూతురు ఎక్కడికో లేచి పోయిందని పిల్ల తల్లి బాయిలో దూకి చచ్చిపోద్ది. తండ్రిని కుటుంబాన్ని ఆ ఊరి బ్రామ్మలు కులంనుండి ఎలేస్తారు. 
అయితే ఒక నాడు ఈ పిల్లగాడి తల్లి దండ్రులు ఊరు ఊరు వాళ్ళ కొడుకు కోసం తిరిగి తిరిగి ఆ ఊరికి వచ్చి తమ పిలగాడు అక్కడున్నాడని తెలుసుకుంటారు. పిలగాడి తండ్రి పిలగాడిలాగే ఎర్రగా ఉన్నాడు. కాని చాలా మోటుగా ఉండడాన్ని వాళ్ళ కోడలు చూచింది. ఆతని తల్లి అంటే ఆమె అత్త అయితే బాగా నల్లగా ఉంది. ఆ మాట తీరు బట్టి కూడా వాళ్ళది ఏకులం అని తెలుసుకోలేక పోయింది. అయిన అంతా అయినాంక ఇప్పుడు తెలిసి ఏం లాభం అనిఅనుకుంటది.
అయితే ఒకనాడు. ఆయమ్మాయి అప్పాలుచేసింది.  అంటే బొబ్బట్లు చేసింది అన్నమాట. చేసి అత్తకి వడ్డించింది. ఇదేంటి బర్రె నాలికలాగా ఉంది. అని అడిగింది. అప్పడు ఆయమ్మాయికి బాగా తెలిసి వచ్చింది. తాను చేసుకున్నది ఒక మాదిగ వాళ్ళ అబ్బాయిని అని, బాగా తెలిసింది. తాను మోసపోయానని అనుకున్నది. అయినా తప్పు నాదే అని తాను ఏనాడు అతని కులం గురించి అడగలేదని మనిషిని చూచి తనకులమే అని అనుకున్నా కాబట్టి  తప్పు తనదే అని తెలుసుకుంది. తన భర్త ఇంటికి రాగానే అతడిని చూచింది. పిల్లలని బాగా చూచుకో మని చెప్పింది. బాయికాడికి నీళ్ళకి పోతానని చెప్పి ఇంట్లో చెప్పకుండా తన ఊరికి పోతది. తన తండ్రి ఇంటికి పోతది. తన తల్లి చచ్చిపోయిందని తెలిసి ఏడుస్తది. ఇంటికి రాగానే తండ్రి తన మొకం చూడలేదు. ఇంటిలోనికి రానియ్యలేదు. దూరంగా నిలబడ్డాడు. అప్పుడు ఆయమ్మాయి. తండ్రిని ఒక మాట అడిగింది. నానా నానా కుక్కు ముట్టిన కుండని ఏమి చేయాలి అనిఅడుగుతది.
అప్పుడా తండ్రి అయితే పగల కొట్టు లేకుంటా తగల పెట్టు అని అంటాడు. ఇక ఇంట్లోకి ఏమాత్రం పోవాలనే ఆలోచన చేయకుండా తాను  వెనుదిరిగి తన ఊరికి పోయింది.  అప్పటికి తన అత్త మామలు వాళ్ళ ఊరికి పోయారు.
ఇక ఆమె తన ఇంట్లోకి పోయింది. భర్త వచ్చిన దాకా ఆగింది. తన ఇద్దరు పిల్లలు కూడా ఇంటికి వచ్చిందాకా ఆగింది. మాపిటేలకి పిల్లలు వస్తారు. పిల్లలని భర్తని ఇంట్లో ఉంచుకుంది. కాసేపు పిల్లలని చూచుకింది. ముద్దాడింది. ఆమెకు ఒళ్ళంతా మంటలు పుట్టినట్టు అప్పుడు అనిపించింది. ఇంటికి అన్ని వైపులా గడులు పెట్టి. పోయిలోంచి కొరకాసు తీసుకొని ఇంటికి నిప్పు పెట్టింది. తాను తన భర్త ఇద్దరు మగపిల్లలు మంటల్లో కాలి చచ్చి పోతారు.
పొద్దుగూకే వేళకి ఇల్లు తగలబడి పోవడం చూచి ఊళ్ళోవాళ్ళు అందరూ అక్కడికి వస్తారు. ఇల్లు తగల బడి పోవడం చూచి ఆర్పడానికి చూస్తారు. కాని అప్పటికే పూర్తిగా కాలింది. లోపల నాలుగు శవాలు మాడిపోయి కనిపించినాయి.
చచ్చి పోయినతర్వాత ఆ బ్రామ్మణ ఆమే ఆ ఇంటి దగ్గరే దేవతలా ఆకాశంలో కనిపించింది. తాను దేవతనని తనను పెద్దమ్మ దేవత అని పిలిచి గుడి కట్టండి అని ఊరి వాళ్ళని కోరుతుంది. ఊరి జనం అంతా ఆమె మహిమ చూచి భయపడి గుడికడతాం అని అంటారు. నా భర్త నన్ను మోసం చేసి పెళ్ళి చేసుకున్నాడు. నాతో పిల్లల్ని కన్నాడు.  వాడు దున్నపోతై పుడతాడు. నా  ఇద్దరు కొడుకులు గావు గొర్రెలై పుడతారు. అందుకని ఏడాదికి ఒక సారి కొలుపు చేయండి. నాకు ఒక దున్నపోతును బలి  ఇవ్వాలి రెండు గావు గొర్రెలని  బలి ఇవ్వాలి. ఏడాదికి ఒక సారి ఇట్లా కొలుపు కొలిస్తే నేను మిమ్మల్ని సల్లంగా చూస్తా. లేకుంటే మీ ఊరికి అరిష్టం జరుగుద్ది అనిచెబుతుంది. అక్కడనుండి ఆమె అక్కడే పెద్దమ్మ తల్లై వెలిసింది. ఊరి వారు అక్కడే గుడి కట్టి కొలుపులు చేస్తున్నారు.

పైన చెప్పిన  పెద్దమ్మ కథ చాలా ప్రచారం ఉన్న గ్రామదేవతల కథలలో ఒకటి. దీన్ని ఇతర పరిశోధకులు కూడా సేకరించారు. అయితే వారి సామాజిక నేపథ్యం కారణంగా వారి పద్ధతిలో వారు విశ్లేషించారు. ఈ కథ అటు దళిత కుటుంబాలలో కనిపిస్తుంది. అంతే కాదు విపరీతంగా ఇటు బ్రాహ్మణ కుటుంబాలలో కూడా ఈ కథ తెలిసిన వారు చాలా మంది ఉన్నారు.  నేను కలిసి మాట్లాడిన వారిలో కూడా చాలామంది ఈ కథ గురించి వివరించి చెప్పారు. ఈ కథను ఎక్కువ సందర్భాలలో అమ్మాయిలకు చెప్పే నీతికథలాగా చెబుతారు. అంటే అమ్మాయిలు కులం తప్పి పెళ్ళి చేసుకుంటే లేదా తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా స్వతంత్రించి పెళ్ళి చేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఉదాహరణగా కూడా  ఈ కథను చెబుతారు.
ఈ పెద్దమ్మ గ్రామదేవత కథ లాగే పెద్దమ్మ దేవాలయాలు ఆంధ్రదేశంలో చాలా చోట్ల ఉన్నాయి. పెద్దమ్మకి ఏడాదికి ఒకసారి జాతరలు జరిగే టప్పుడు బైండ్లవారు పంబాల వారు కొమ్ముల వారు ఈ కథని ప్రదర్శించి చెబుతారు.  పెద్దమ్మ గుడులు కొన్ని చోట్ల చిన్నగా ఉంటాయి. మరికొన్ని చోట్ల రాతి కట్టడంతో చాలా పెద్దగా ఉన్న గుడులు కూడా ఉన్నాయి.
పైన చెప్పినకథలో జరిగింది ఒక అసాధారణమైన విలోమ వివాహం. అంటే కింది వర్ణం వాడు అసలు వర్ణమే లేని పంచముడైన పురుషుడు అన్నింటికన్నా పై వరుసలో ఉన్న వర్ణంలోని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. అతను తన కులాన్ని చెప్పలేదు. ఆమె అడగలేదు. కాని ఇద్దరి ఇష్టంతో పెళ్ళి జరిగింది. పిల్లలూ పుట్టారు. కాని అతని అసలు కులం తెలుసుకున్నంతనే అప్పటిదాకా తనువుకు తనువు అయిన భర్త స్పర్శ అగ్నితో సమానం అయింది. తనను తాను తగల బెట్టుకోవడమే కాకుండా భర్తని చివరికి కన్నపిల్లల్ని కూడా తగులబెట్టి నిలువునా చంపేసింది. అంతే కాదు ఈ పగ ఎంత దూరం పోయిందంటే తరతరాల పాటు ఆమె భర్తని పిల్లలని బలిపశువుల్లా బలిచేయమని కోరింది.  పెళ్ళి చేసుకోవడం వర్ణాంతరంగా చేసుకోవడం ఒక వేళ తప్పు అని భావిస్తే ఆ తప్పు చేసి ఆత్మ బలిదానం జరిగినప్పుడు అగ్రవర్ణానికి చెందిన ఆమె దేవతగా వెలసి పూజలు అందుకుంటూ ఉంది. కాని అదే తప్పు కారణంగా ఆ దళితకులానికి చెందిన భర్త పిల్లలు తరతరాలుగా బలిపశువులుగా బలి ఇవ్వబడుతున్నారు.
భార్య భర్తల సంబంధంలో భర్త భార్య కన్నా ఎత్తుగా ఉండాలి. భార్యకన్నా ఎక్కువ చదువుకున్నవాడు అయి ఉండాలి. అన్ని విషయాలలోను భార్యకన్నా అధికంగానే ఉండాలి. ఇవన్నీ పురుష ప్రపంచం నిర్ణయించి తరాలుగా శతాబ్దాలుగా అమలు చేస్తున్నవే. అలాగే కులాంతర వివాహాలు జరిగినప్పుడు, వర్ణాంతర వివాహాలు జరిగినప్పుడు కూడా భర్త ఉన్నత కులానికి ఉన్నత వర్ణానికి చెందిన వాడుగానే ఉండాలి. అందుకే అది అనులోమ వివాహం అని సానుకూలంగా వర్గీకరించి చెప్పినది కూడా పితృస్వామ్యవిలువలను స్థిరంగా ఉంచే ప్రయత్నంలో జరిగిన పనే. విశ్వనాథవారి వేయి పడగలలో కథానాయకుడి తండ్రి బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాడు మిగతా క్షత్రియ, వైశ్య, శూద్ర కాంతలను పెళ్ళి చేసుకున్న తీరును  ఆ ఉపాఖ్యానాలను చెప్పి నతీరు ఈ అనులోమ వివాహాలను ఆమోదించి ఉన్నతలక్షణంగా తీర్చి చెప్పడం. పై వర్ణాలకు కింది వర్ణాలపై ఉన్న అధికార స్వామ్యాన్ని చెప్పే విషయమే.  వేయిపడగలలో క్షత్రియకాంత సంతానం, వైశ్యాకాంత సంతానం, చివరికి శూద్రకాంత సంతానం సంగతి ఏమైందో చదివిన వారికి అంతా తెలిసిన విషయమే. మనుస్మృతిలోన అమరకోశంలోను ఉన్న వర్ణసంకర సంతానాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారో చదివితే వివిధ కులాల పైన అవి కక్కే విషం గురించి తెలుస్తుంది. 
పెద్దమ్మకథలో మరొక భరించలేని విషాదం ఏమంటే విలోమ వివాహంలో బలిపశువు అయిన దళితుడు అతని పిల్లలు ప్రతి సంవత్సరం దున్నపోతు రూపంలో గావు గొర్రెల రూపంలో బలి అవుతున్నారు. ఈ బలులు ఎందుకు చేస్తున్నారో తెలియక ప్రజలందరూ చూస్తునే ఉంటారు. దేవతను ఎందుకు సంతోష పెట్టడానికి బలులు ఇస్తున్నారో ఇచ్చే వారికి చాలామందికి తెలియక పోవచ్చు. ఇంకా తెలుసుకోవలసిన మరొక విషయం ఏమంటే ఈ బలులను సంప్రదాయికంగా బలి ఇవ్వవలసినవారు, కత్తితో నరికి బలి ఇచ్చేది దళిత కులాలకు చెందినవారే. గొర్రె పిల్లల్ని మాత్రం కొన్ని గ్రామదేవతల గుడులలో గావు పట్టేది కొన్ని వెనుక బడిన కులాల వారు చేస్తారు. కాని దున్నలను నరికేది కొన్ని చోట్ల గొర్రెలను డొక్కచీల్చేది మాత్రం దళిత కులాలవారే.
అనులోమ వివాహాలు పితృస్వామిక విలువలు చిరస్థాయిగా కొనసాగేలా చేసే తీరులోనే ఇంకా ఉన్నాయి. విలోమ వివాహాలు చేసుకుంటే కింది కులాలవారు కింది వర్ణాల వారు ఏవిధమైన సాంఘిక దురన్యాయానికి గురవుతారో పెద్దమ్మకథలోనే కాక నేటికీ నిజజీవితంలో చాలా సందర్భాలలో ఈనాటికి ఎదురౌతున్న విషయం. పితృస్వామిక విలువలు ఒకవైపున కుల వర్ణ అసమానతల దురన్యాయం మరొక వైపున దాడిచేసే చట్రంలో విలోమ వివాహాలలో దళిత బహుజనులు ఎలా బలౌతారో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం పెద్దమ్మకథ. ఇది మన గ్రామ దేవత కథ కూడా.  మన సమాజంలో వర్ణధర్మాలు కుల ధర్మాలను నిరంతరం కొనసాగించేలా చేస్తున్న ఆచారాలను మనకు తెలియకుండానే కొన సాగిస్తున్నాం. విలువలను నమ్ముతున్నాం. ఇదే ఇంకా కొన్ని శతాబ్దాలదాకా సాగబోయే విషాదం.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి.

1 comment:

Nrahamthulla said...

అగ్రవర్ణానికి చెందిన ఆమె దేవతగా వెలసి పూజలు అందుకుంటూ ఉంది. కాని అదే తప్పు కారణంగా ఆ దళితకులానికి చెందిన భర్త పిల్లలు తరతరాలుగా బలిపశువులుగా బలి ఇవ్వబడుతున్నారు.