Tuesday, June 23, 2020

తెలంగాణ తల్లి ప్రార్థనాగీతం


గీతరచన: ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి, సంగీతదర్శకత్వం: డా. బిరాధ, గాయనీగాయకులు: శ్రీమతి కల్పన, శ్రీమతి హరిణి, శ్రీ సాయిచరణ్, శ్రీ కృష్ణచైతన్య, అర్కెస్ట్రా నిర్వహణ, కీబోర్డు: శ్రీ గురుప్రసాద్, తబల: శ్రీ జయకుమారాచార్యులు, సౌండ్ ఇంజీనీర్ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీ నందీశ్వరరావు. దీనికి తెలంగాణ చరిత్ర సంస్కృతిని తెలిపే వీడియోలు సమకూర్చినది శ్రీ దూలం సత్యనారాయణగారు. 
తెలంగాణ అమాత్యులు శ్రీ కల్వకుంట తారక రామారావుగారు దీన్ని 12-6-2020న ఆవిష్కరించారు.

వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ
వరదాయని సుమధారిణి వఱలు కల్పవల్లీ                /వందనమిదె/

శృంఖలాలు ఛేదించిన శూర ధీర నీవమ్మా
పంటసిరుల పొంగించే బతుకమ్మవు నీవమ్మా
కృష్ణమ్మను కొంగువేసి గోదావరి నడికట్టుగ
మంజీరగ మానేరుగ మమ్ము గాచు మా తల్లీ                            /వందనమిదె/

శాతవాహన రాజ్య సిరిపొలము నీ చీర
కాకతీయ వైభవమది ఘనమైన మకుటమ్ము
అమరవీ
రుల రుధిరమె అలరారే పారాణి 

ఆది తెలుగుల చరిత అవతారమె నీవూ                                    /వందనమిదె/

సోమనాథుని జానుతెనుగు తేనెల జాలు
పోతన్న భాగవత పూదేనె మధురిమలు
మల్లినాథయ
వ్యాఖ్య యశోభూషణ యశము
కావ్యాలు శాస్త్రాలు కళలు విరిసిన గడ్డ                                      /వందనమిదె/

యాదాద్రి నరసన్న  ఏడుపాయల దుర్గ

రాజరాజేశ్వరుడూ రాజిలుసతి జోగులమ్మ
భద్రాద్రీ రామయ్య  బాసరలో చదువులమ్మ

కొండగట్టు అంజన్న కొరివిలోన వీరభద్ర
కోరి కొలుచు దేవుళ్ళు కొలువుందురు నీలోనే                           /వందనమిదె/

రామప్ప ఉలి కళలు రాగ రాగిణి చెలువు
వేయి స్తంభాల గుడి ఏకశిల నగర సిరి
చార్మినారు భాగ్యలక్ష్మి చేయిచేయి కలుపు
నేల
పరిఢవిల్లె నీగడ్డన  బౌద్ధజైనఇస్లాములు

శిల్పకళ వాస్తు  కళ చెలువొందిన దీనేల                                    /వందనమిదె/

 

ఆ చరిత ఆ ఘనత ఆ స్ఫూర్తి ఆ కీర్తి
ఆ కళల అనురక్తి ఆ అక్షర ఘనశక్తి
ఆ పంట సిరులన్ని అమరి చెలువొందగా
పాలు పొంగిన రీతి మమ్ముల నడుపవె తల్లి                               /వందనమిదె/
 సమాప్తం.

ఈ పాటని ఆచార్య పులికొండ సుబ్బాచారి దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం రచించిచారు. ఆ తర్వాత రెండుమూడు నెలలకు డా. బి. రాధగారు సంగీతం సమకూర్చి తనొక్కరే ఏ వాద్య సహకారం లేకుండా పాడారు. దాన్ని ఆరోజుల్లోనే యూట్యూబ్ లోనికి పంపారు. దాన్ని చాలా మంది వింటూ వచ్చారు. కాని ఇటీవల అంటే జనవరిలో ఈ పాటకు సంగీతం వాద్యాల సహకారంతో రికార్డింగు చేయించమని ఆచార్య సుబ్బాచారి రాధగారిని కోరారు. ఆమె పైన చెప్పిన వారి సహకారం తీసుకొని దీన్ని రికార్డింగు చేయించారు. తర్వాత జూన్ రెండవ తేదీన 2020 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పాటని కేటీఆర్ చేత ఆవిష్కరింపజేయాలని ఆచార్య సుబ్బాచారి ప్రయత్నం చేశారు. కాని ఆరోజున వారు అందుబాటులో లేకపోవడం వల్ల కార్యక్రమం వాయిదా పడింది. జూన్ 12 వ తేదీన ప్రగతి భవన్ లో కల్వకుంట్ల తారక రామారావు గారు ఈ పాటను ఆవిష్కరించారు. ఈ పాటకు తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా దూలం సత్యనారాయణగారు వీడియోలు సమకార్చారు. కావ్య గారు దీన్ని ఎడిట్ చేశారు. యూట్యూబ్ లో ఈ పాటను చూడవచ్చు వినవచ్చు. లింకు ఇక్కడ ఉంది. https://www.youtube.com/watch?v=tSa7skN1ICo

Comments

No comments: